Read more!

ఇవి నేర్పిస్తే చాలు.. పిల్లలలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది!

పిల్లలు ఆత్మవిశ్వాసంతో ఉండటం ఎంతో అవసరం. వేగవంతమైన ప్రపంచంలో సక్సెన్ ను అందుకోవాలంటే ఆత్మవిశ్వాసంతో ఉండటం తప్పనిసరి. కానీ కొందరు పిల్లలు లక్ష్యాలను చేరుకోవడంలోనూ, చదువులోనూ, ఇతర కార్యకలాపాలలోనూ వెనుకబడి ఉంటారు. ఆత్మవిశ్వాసం లేకపోతేనే ఇలా జరుగుతుంది. అందుకే తల్లిదండ్రులే పిల్లలో ఆత్మవిశ్వాసం పెంచాలి. పిల్లలో ఆత్మవిశ్వాసం పెరిగితే వారి భవిష్యత్తు కూడా చాలా గొప్పగా ఉంటుంది. అందుకోసం ఈ కీంది విషయాలు పిల్లలకు నేర్పించాలి.


పిల్లలు ఏదైనా ప్రయత్నం చేసి ఓడిపోతే ఓటమి గురించి వారిని తిట్టకండి. ఓడిపోవడం సాధారణ విషయమని, ఓటమి నుండి  పాఠాలు నేర్చుకుని తరువాత మళ్లీ ప్రయత్నం చెయ్యాలని పిల్లలకు చెప్పాలి. దీంతో ఓటమితో అంతా ముగిసిపోలేదు అనే భావన, తరువాత ప్రయత్నాలకోసం తగినంత ఆత్మవిశ్వాసం వారిలో పెరుగుతుంది.

సంకల్పబలం గురించి పిల్లలకు వివరించాలి. ఏదైనా పని మొదలుపెడితే దాన్ని సాధించేవరకు వెనకడుగు వేయకూడదని, పనిని మధ్యలో వదిలేయడం లాంటివి చెయ్యకూడదని వారికి చెప్పాలి. ఇలా చేస్తే ప్రతి పనిని వారు పూర్తీ నిబద్దతతో పూర్తీ చేస్తారు.


ఏకాగ్రత లేకపోతే ఏ పనీ చెయ్యలేరు. పిల్లలకు అదే విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలి. ఏకాగ్రత పెంచడానికి ధ్యానం,  యోగా  వంటివి అలవాటు చెయ్యాలి.

ఏ పని చేసినా అందులో తాము గెలిచితీరాలని పెద్దల నుండ పిల్లల వరకు అందరూ కోరుకుంటారు. పిల్లలు అయితే చాలా డిజప్పాయింట్ అవుతారు. కానీ గెలుపు ఎలాగో ఓటమి కూడా అలాగే వస్తుందని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. దీంతో గెలుపోటములను సమానంగా యాక్సెప్ట్ చేస్తారు.

పిల్లలు పెద్దయ్యే కొద్దీ తాము స్పెషల్ అనే ఫీలింగ్ కు లోనవుతారు. వారు తమకు గౌరవం కావాలని, అందరూ తమను గౌరవించాలని అనుకుంటారు. ఈ విషయాలను కూడా పిల్లలకు అర్థమయ్యేలా వివరించాలి. గౌరవం లభించాలంటే వారు కూడా ఇతరుల పట్ల గౌరవంగా ఉండటం ఎంత ముఖ్యమో వారికి వివరించాలి.

పిల్లలు బేలగా ముఖం పెట్టగానే తల్లిదండ్రులు కగిరిపోయి పిల్లల పనిని తాము చేసేస్తారు. దీని వల్ల పిల్లలు నేర్చుకునే సామర్ద్యం కోల్పోతున్నారు. అందుకే ప్రతి పనిని పిల్లలు స్వయంగా చేసేటట్టు చూడాలి. అవసరమైతేనే తల్లిదండ్రులు సహాయం చెయ్యాలి.


                                        *నిశ్శబ్ద.