జగన్ హయాంలో ఏపీ ఐటీ అధోగతి!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ ఐదేళ్ల పాలన అన్ని విధాలుగానూ అధోగతి పాలు చేసింది. విభజిత రాష్ట్ర ఉజ్వల భవిష్యత్ కోసం విభజిత రాష్ట్ర తొలి ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు వేసిన ప్రగతి బాటలను ఆ తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం విధ్వంసం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీకి సైబరాబాద్ నిర్మాణం ద్వారా చంద్రబాబు బలమైన పునాది వేశారు. దాంతో ఐటీ రంగంలో లక్షలాదిమందికి ఉద్యోగాలు లభించాయి. ఐటి రంగంలో తెలుగు యువత అల్లుకుపోయి ప్రపంచ వ్యాప్తంగా దానిని శాశించే స్థాయికి ఎదిగింది.
చంద్రబాబు వేసిన పునాదిపైనే హైదరాబాద్ అభివృద్ధిని ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు విస్తరిం చాయి. ఇప్పటికీ హైదరాబాద్ అభివృద్ధి గురించిన ప్రస్తావన వస్తే ముందుగా ఎవరైనా చంద్రబాబు పేరే చెబుతారు. అంత మాత్రాన చంద్రబాబు తరువాత అధికారం చేపట్టిన పార్టీలు, ముఖ్యమంత్రులు హైదరాబాద్ ను నిర్వీర్యం చేసి అభివృద్ధి ఆనవాలును తుడిచేయడానికి ప్రయత్నించలేదు. కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్ కోసం అమరావతి రాజధానిగా చంద్రబాబు వేసిన పునాదులను జగన్ సర్కార్ విధ్వంసం చేసింది. కేవలం చంద్రబాబుకు గుర్తింపు వస్తుంది. పేరు వస్తుంది. ఆయన కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది అన్న దుగ్ధతోనే ఏపీని నో డెవలప్ మెంట్ స్టేట్ గా మార్చేశారు. జగన్ నిర్వాకం వలన గత 5 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలోనూ చివరి నుంచి మొదటి స్థానంలోనిలిచింది.
రాజధాని అమరావతిని పూర్తి చేస్తే చంద్రబాబుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గుర్తింపు మరింత పెరుగుతుందని మూడు రాజధానుల నాటకానికి తెరలేపి దానిని నిర్వీర్యం చేసింది జగన్ సర్కార్. అలాగే పోలవరం ప్రాజెక్టు పురోగతిని కూడా నిలిపివేసింది. అదే విధంగా యువతకు అపార ఉపాధి అవకాశాలను కల్పించే ఐటీ రంగాన్ని కూడా నిర్లక్ష్యం చేసింది జగన్ సర్కార్. చంద్రబాబు 2014 నుంచి 2019 వరకూ ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. అనేక కంపెనీలు రాష్ట్రానికి తరలి వచ్చాయి. అయితే జగన్ నిర్వాకంతో గత ఐదేళ్లలో ఏపీ ఐటీ రంగంలో అధమ స్థానానికి పడిపోయింది.
విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి బాటలు పరిచారు. విశాఖపట్నం, మంగళగిరిలు ఐటీ హబ్ లుగా అవతరించాయి. రాష్ట్రంలో స్టార్టప్ లు వెల్లువెత్తాయి. అయితే ఇదంతా మూడున్నరేళ్ల కిందటి మాట. రాష్ట్రంలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కటొక్కటిగా రాష్ట్రం నుంచి తరలిపోయాయి. జగన్ హయాంలో రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ కుదేలైంది.
అవును జగన్ నిర్వాకం వలన ఐటి ఎగుమతులలో దేశంలో అట్టడుగు స్థాయికి ఆంధ్రప్రదేశ్ పడిపోయింది. 2021-2022 ఆర్ధిక సంవత్సరంలో భారత్ నుంచి రూ.11.59 లక్షల కోట్ల విలువల ఐటి ఎగుమతులు జరిగితే వాటిలో ఆంధ్రప్రదేశ్ వంతు కేవలం రూ.1,000 కోట్లు మాత్రమే! బిహార్ ఏపీ కంటే మిన్నగా రూ.2,000 కోట్లు విలువల ఐటి ఎగుమతులు చేసింది. అంటే బీహార్ కంటే దిగువన ఆంధ్రప్రదేశ్ నిలిచింది. రాజస్థాన్, మద్యప్రదేశ్ రాష్ట్రాలు రూ.3,000 కోట్లు, వెనుకబడిన అస్సాం 24,000 కోట్లు, మేఘాలయ రూ. 35,000 కోట్లు, ఝార్ఖండ్ రూ.43,000 కోట్లు, హర్యాన రూ.52,000 కోట్లు, ఉత్తరప్రదేశ్ రూ.55,000 కోట్లుచేశాయి. గోవా రూ.1,57,000 కోట్లు, తమిళనాడు రూ.1,58,000 కోట్లు, తెలంగాణ రూ.1,81,000 కోట్లు, మహారాష్ట్ర రూ.2,37,000 కోట్లు, అత్యధికంగా కర్ణాటక రూ.3,96,000 కోట్లు విలువల ఐటి ఎగుమతులు చేశాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌కి ఎంతో మేలు చేశానని నిసిగ్గుగా చెప్పుకుంటున్న జగన్ పాలనలో కేవలం రూ.1,000 కోట్లు మాత్రమే కావడం సిగ్గుచేటు కాదా? 2021-22 ఆర్థిక సంవత్సరంలో కర్నాటక ఆగ్రస్థానంలోనూ, మహారాష్ట్ర రెండో స్థానంలోనూ నిలిచాయి. తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది. 2021-21 ఆర్ధిక సంవత్సరంలో సాఫ్ట్ వేర్ ఉత్పత్తులలో కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తొలి ఐదు స్థానాలలో నిలిచాయి. మొత్తం ఉత్పత్తుల్లో ఈ ఐదు రాష్ట్రాల వాటా 88.57శాతం అయితే.. మిగిలిన రాష్ట్రాలన్నిటి వాటా 11.43శాతం. ఇందులో ఏపీ వాటా 0.111 శాతం మాత్రమే.