అరెస్టు భయంతో అజ్ణాతంలో వల్లభనేని వంశీ?

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ  పీకల్లోతు చిక్కుల్లో కూరుకుపోయారా? నియోజకవర్గంలోని ఆయన ముఖ్య అనుచరులపై కేసులు, అరెస్టులే ఇందుకు తార్కానమా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.  వంశీ ఇప్పుడు దాదాపు అజ్ణాతంలో ఉన్నారు. ఆయన ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు అన్నది ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడుతున్నారు.  అయితే గతంలో ఆయన చేసిన అక్రమాలు, వ్యవహరించిన తీరు పట్ల నియోజకవర్గంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రజాగ్రహాన్ని ముందే గమనించిన వంశీ ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించేసినట్లుగా మాట్లాడి సానుభూతి దండుకుందామని ప్రయత్నించారు. ఆ ప్రయత్నం ఫలించే అవకాశం లేదని అర్ధమైన పిమ్మట, వైసీపీలో తనను వ్యతిరేకించే వర్గం వారిని మంచి చేసుకోవడానికి ఇవే తన చివరి ఎన్నికలంటూ ఓ విధంగా బతిమలాడారు. మద్దతు ఇవ్వమని ప్రాధేయపడ్డారు. అవన్నీ విఫలమయ్యాయి. గన్నవరం ప్రజలు ఆయనను ఘోరంగా ఓడించారు.  అయితే ఓటమితో వంశీ తప్పులు ప్రక్షాళన కాలేదు.  ఓటమి తరువాత వంశీ తప్పులన్నీ ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి.  తెలుగుదేశం తరఫున రెండు సార్లు గవన్నవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వంశీ   మూడోసారి వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగి పరాజయం పాలైన సంగతి తెలిసిందే. రెండో సారి అంటే 2019 ఎన్నికలలో విజయం తరువాత వంశీ తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ గూటికి చేరారు. అలా చేరిన క్షణం నుంచీ ఆయన తెలుగుదేశం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ లక్ష్యంగా విమర్శలు, అనుచిత వ్యాఖ్యలతో చెలరేగిపోయారు.  తెలుగుదేశం శ్రేణులు లక్ష్యంగా దాడులూ, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై వంశీ ప్రత్యక్ష పర్య వేక్షణలో జరిగిన దాడి కేసులో ఇప్పుడు వంశీపై కేసు నమోదైంది.   అలాగే గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాదర్బార్ లో కూడా వంశీ అరాచకాలు, దౌర్జన్యాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. మట్టి తవ్వకాలలో అక్రమాల నుంచి ఎస్సీ భూముల ఆక్రమణ, నకిలీ పత్రాలతో ఇతరుల భూముల రిజిస్ట్రేషన్ లు ఇలా వంశీ పాల్పడిన అక్రమాలపై ప్రజాదర్బార్ లో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో  వాటన్నిటినీ పరిశీలించి కేసుల నమోదుకు అధికారులు రెడీ అవుతున్నారు.   ఈ నేపథ్యంలోనే తన అరెస్టు తథ్యమన్న భయంతోనే  వంశీ నియోజకవర్గానికి దూరంగా అజ్ణాతంలో గడుపుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

రేపటి నుంచి జనసేన సభ్యత్వ నమోదు 

ఎపిలో గత సార్వత్రిక ఎన్నికల్లో వందశాతం స్ట్రయిక్ రేట్ తో  గెలిచిన పార్టీ జనసేన. పోటీ చేసిన అన్ని అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో జనసేన గెలిచింది. జనసేన గెలుపు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీకి ప్రస్తుతం 6.47 లక్షల మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారు. తాజాగా, 9 లక్షల క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేయడమే లక్ష్యంగా రేపటి నుంచి కొత్త సభ్యత్వాల నమోదు చేపట్టనున్నారు. జులై 18 నుంచి 28 వరకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగనుంది.  క్రియాశీలక సభ్యత్వం పొందే ప్రతి ఒక్కరికీ ప్రమాద, జీవిత బీమా కూడా అందించనున్నారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో... కొత్త సభ్యులను చేర్చుకోవడంతో పాటు, పాత సభ్యత్వాల రెన్యువల్ కూడా చేపట్టనున్నారు.గతంలో సభ్యత్వాల నమోదుకు 15 మంది జనసేన పార్టీ వాలంటీర్లకు మాత్రమే లాగిన్ ఐడీ ఇచ్చేవాళ్లు. ఈసారి 50 మంది జనసేన పార్టీ వాలంటీర్లకు లాగిన్ ఐడీ ఇస్తున్నారు.

ఆర్ నారాయణమూర్తి కి అస్వస్థత

పీపుల్‌ స్టార్‌ ఆర్‌.నారాయణమూర్తి బుధవారం అస్వస్థతకు గురయ్యారు. దాంతో.. ఆయన్ని వెంటనే హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొంత కాలంగా ఆర్‌.నారాయణమూర్తి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాగా.. నారాయణమూర్తి ఉన్నట్లుండి అస్వస్థతకు గురై.. ఆస్పత్రిలో చేరడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా ఆర్.నారాయణమూర్తి ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు కాగా, తన గురించి అభిమానులు ఆందోళన చెందుతున్న విషయం తెలుసుకున్న ఆర్.నారాయణమూర్తి స్పందించారు.  ప్రస్తుతం నిమ్స్ లో చికిత్స పొందుతున్నానని, దేవుడి దయతో వేగంగా కోలుకుంటున్నానని తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. అభిమానులు ఆందోళన చెందవద్దని, పూర్తిగా కోలుకున్న తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తానని ఆర్.నారాయణమూర్తి తెలిపారు.

మహరాష్ట్రలో భారీ ఎన్ కౌంటర్ ...12 మంది నక్సల్స్ హతం

ఇటీవల చత్తీస్ గడ్ లో వరుస ఎన్ కౌంటర్లు జరిగాయి. ఎక్కువ శాతం నక్సల్స్ చనిపోయారు. తాజాగా మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మహారాష్ట్ర-చత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని వందోలి అటవీప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎదురుకాల్పుల ఘటనలో 12 మంది నక్సల్స్ మృతి చెందారు.  ఈ ఎన్ కౌంటర్  లో పాల్గొన్న పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ సతీశ్ పాటిల్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన స్థలం నుంచి అనేక ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఎన్ కౌంటర్ లో హతులైన మావోయిస్టుల్లో ఇద్దరు తెలుగు వాళ్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మధ్యాహ్నం 7 సీ60 కమాండో దళాలు వందోలి గ్రామం వద్ద నక్సల్స్ సమావేశం అయ్యారన్న సమాచారంతో కూంబింగ్ కు బయల్దేరాయి. ఈ సందర్భంగా సీ60 కమాండో బలగాలకు, మావోయిస్టులకు మధ్య దాదాపు ఆరు గంటలకు పైగా భీకర కాల్పులు జరిగాయి. కాగా, మృతి చెందిన వారిలో సీనియర్ డివిజనల్ కమిటీ మెంబర్ కూడా ఉన్నట్టు గుర్తించారు.

చంద్ర‌బాబు విజన్.. జితేంద్ర శ‌ర్మ ఆవిష్కరణ.. మెడ్‌టెక్ జోన్‌ సృష్టి

చిన్న ప్ర‌య‌త్నం నేడు చ‌రిత్ర సృష్టించింది.  కొవిడ్ స‌మ‌యంలో దేశానికి వెన్నుద‌న్నుగా నిలిచింది.   వైద్య ప‌రిక‌రాల ఉత్ప‌త్తిలో ప్రంప‌చానికే దిక్సూచిలా మారేందుకు అడుగులు వేస్తోంది. అదే విశాఖప‌ట్ట‌ణంలోని మెడ్‌టెక్ జోన్‌. విశాఖ‌లో పురుడు పోసుకున్న ఈ మెడ్‌టెక్ జోన్.. ప్రారంభ‌మైన కొద్దిరోజుల నుంచే అనేక క‌ష్టాలను చ‌విచూస్తూ వ‌చ్చింది. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  సీఎంగా ఉన్న ఐదేళ్లూ  పూర్తి నిర్ల‌క్ష్యానికి గురైంది. కానీ,  ప‌ట్టుద‌ల‌, కృషితో మెట్‌టెక్ జోన్‌ను దినదినాభివృద్ధి చేస్తూ ప్ర‌పంచం మొత్తం త‌మ‌వైపు చూసేలా చేయ‌గ‌లిగారు మెడ్‌టెక్ జోన్‌ సీఈఓ జితేంద‌ర్ శ‌ర్మ‌. సీఎం చంద్రబాబు నాయుడు ఏరికోరి తెచ్చుకున్న వ్య‌క్తే జితేంద‌ర్ శ‌ర్మ‌. 2014లో చంద్ర‌బాబు సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత విశాఖ‌లో మెడ్‌టెక్ జోన్ ఏర్పాటుకు జితేంద్ర శ‌ర్మ‌కు అన్నివిధాల అండ‌గా నిలిచారు. రాష్ట్రం అభివృద్ధికోసం చంద్ర‌బాబు దూర‌దృష్టి.. ప్ర‌పంచ స్థాయిలో వైద్య ప‌రిక‌రాలు ఉత్ప‌త్తి చేయాల‌న్న జితేంద్ర శ‌ర్మ ప‌ట్టుదల.. వెర‌సి నేడు ప్ర‌పంచ వైద్య రంగంలో దేశానికే గ‌ర్వ‌కార‌ణంగా మెడ్‌టెన్ జోన్ మార‌ుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద వైద్య పరికరాల తయారీ క్లస్టర్లు కేంద్రంగా ఉన్న ఈ మెడ్‌టెక్ జోన్‌లో ప్ర‌స్తుతం 145కిపైగా కంపెనీల‌తోపాటు పెద్ద ఎత్తున యువ‌త‌కు ఉద్యోగ అవ‌కాశాల‌ను క‌ల్పిస్తోంది. అతేకాదు.. రూ.30వేల కోట్ల పెట్టుబ‌డులు ల‌క్ష్యంగా  మెడ్‌టెక్ జోన్ ప‌రుగులు తీస్తోంది.    మెడ్‌టెక్ జోన్ ఏర్పాటు వెనుక పెద్ద క‌థే ఉంది. 2014లో ఏపీ సీఎంగా చంద్ర‌బాబు నాయుడు బాధ్య‌త‌లు చేప‌ట్టారు. కేంద్ర ప్ర‌భుత్వం నుంచి 2015లో ఓ ఆడిట్ కు జితేంద‌ర్ శ‌ర్మ‌, మ‌రికొంద‌రు అధికారులు ఏపీకి వ‌చ్చారు. ఆడిట్ నివేదిక స‌మ‌ర్పించే స‌మ‌యంలో జితేంద్ర శ‌ర్మ త‌న ప్ర‌త్యేక‌ను చాటుకున్నారు. ఆడిట్ నివేదిక‌లో జ‌రిగిన త‌ప్పుల‌తో పాటు.. వాటి ప‌రిష్కారానికి సూచ‌న‌లు సైతం చేశారు. దీంతో శ‌ర్మ నివేదిక‌ను చూసి చంద్ర‌బాబు ఇంప్రెస్ అయ్యారు. జితేంద్ర‌శ‌ర్మ‌ లాంటి వ్య‌క్తి సేవ‌లు రాష్ట్రానికి అవ‌స‌ర‌మ‌ని భావించిన చంద్ర‌బాబు.. ఫోన్ చేసి త‌మ రాష్ట్రంలో హెల్త్ క‌మిష‌న‌ర్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టాల‌ని కోరారు. అందుకు జితేంద్ర శ‌ర్మ తొలుత ఒప్పుకోలేదు. చంద్ర‌బాబు చొర‌వ తీసుకొని.. వారానికి రెండు రోజులు రాష్ట్రంలో ప‌నిచేయండ‌ని కోరారు. దీనికి ఆయ‌న ఒప్పుకోవ‌టంతో వైద్య ఆరోగ్య‌శాఖ స‌ల‌హాదారుగా అప్పట్లో జితేంద్ర శర్మను చంద్రబాబు నియమించారు. అప్ప‌టికే మెడ్‌టెక్ జోన్ ప్లాన్‌ను చంద్ర‌బాబు దృష్టికి జితేంద‌ర్ శ‌ర్మ తీసుకెళ్లారు. ఆ త‌రువాత కాలంలో చంద్ర‌బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. మెడ్‌టెక్ జోన్ కోసం విశాఖ‌లో దాదాపు 270 ఎక‌రాల స్థ‌లాన్ని ప్ర‌భుత్వం కేటాయించింది.  2016 జూన్ 7న మెడ్‌టెక్ జోన్ తొలి ఎండీ, సీఈవోగా జితేంద‌ర్ శ‌ర్మ‌ను చంద్ర‌బాబు నియ‌మించారు. 2018 జ‌న‌వ‌రిలో క‌న‌స్ట్ర‌క్ష‌న్ ప్రారంభ‌మైంది. అదే ఏడాది డిసెంబ‌ర్ నెల‌లో మెడ్‌టెక్ జోన్ ను ప్రారంభించారు.  ఈ మెడ్‌టెక్ జోన్ విశాఖ‌లోనే ఏర్పాటు చేయ‌డానికి కూడా ఓ కార‌ణం ఉంది. మెడ్‌టెక్ జోన్ లో త‌యార‌య్యే వైద్య ప‌రిక‌రాల ర‌వాణాకు పోర్ట్  అందుబాటులో ఉండాలి.  దేశంలో గుజ‌రాత్‌, ముంబై, కోల్‌క‌తా, వైజాగ్ తోపాటు ప‌లు రాష్ట్రాల్లో పోర్టు స‌దుపాయం అందుబాటులో ఉంది. అయితే, చంద్ర‌బాబు నాయుడు చొర‌వ‌తో  మెడ్‌టెక్ జోన్‌ను విశాఖ‌లోనే ఏర్పాటు చేశారు. మెడ్‌టెక్ జోన్ కార్య‌క‌లాపాలు ప్రారంభ‌మైన కొద్దిరోజుల‌కే  2019లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అధికారం కోల్పోయింది. సీఎంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టారు. దేశానికి, ప్ర‌పంచానికి ఉప‌యోగ‌ప‌డే జోన్‌ను అభివృద్ధి చేయాల్సిన జ‌గ‌న్‌,  రాజ‌కీయ కార‌ణాల‌తో మెడ్‌టెక్ జోన్ ను నిర్వీర్యం చేశారు.  దాదాపు 270 ఎక‌రాల స్థ‌లంలో రూ. 30వేల కోట్ల పెట్టుబ‌డులు, 25వేల మంది నిరుద్యోగుల‌కు ఉద్యోగాల క‌ల్ప‌న ల‌క్ష్యంతో ప్రారంభ‌మైన  మెడ్ టెక్ జోన్ ప్రాజెక్ట్ జ‌గ‌న్ అనాలోచిత నిర్ణ‌యాల కార‌ణంగా అనుకున్న స్థాయిలో ఫ‌లితాల‌ను రాబ‌ట్ట‌లేక పోయింది. మెడ్‌టెక్ జోన్ అభివృద్ధిలో కీల‌క‌మైన బోర్డు స‌రిగా వ్య‌వ‌హ‌రించ‌క‌పోవ‌డంతో ప్రాజెక్టు నిర్వీర్య‌మైంది. బోర్డులో ఉన్న అధికారుల‌ను చూసి పెట్టుబ‌డులు పెట్టేందుకు ఎవ‌రూ ముందుకు రాలేదు. ప‌లు కార‌ణాల‌తో  2019 సెప్టెంబ‌ర్ లో మెడ్‌టెక్ ఎండీ, సీఈఓ బాధ్య‌త‌ల నుంచి జితేంద‌ర్ శ‌ర్మ‌ను తొల‌గించారు. కొద్దికాలం తరువాత ఆయనను మ‌ళ్లీ నియ‌మించిన‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి స‌హ‌కారం లేక‌పోవ‌టంతో జితేంద్ర శ‌ర్మ ఆశ‌యానికి కొంత విఘాతం ఏర్ప‌డింది. దీనికి తోడు పెట్టుబ‌డు పెట్టేందుకు ముందుకొచ్చిన వారినికూడా వైసీపీ హ‌యాంలో త‌రిమేసిన ప‌రిస్థితి. ఓ మెడిక‌ల్ కంపెనీ మెడ్‌టెక్ జోన్‌లో భారీ మొత్తంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకొచ్చింది. స‌ద‌రు కంపెనీ మౌలిక స‌దుపాయాలు సిద్ధం చేసుకొని, సిబ్బందిని నియ‌మించుకుంది. ఉత్ప‌త్తిని ప్రారంభించే స‌మ‌యంలో స‌మ‌స్య‌లు ఎదుర‌య్యాయి. మెడ్‌టెక్ జోన్ లో వైసీపీ ప్ర‌భుత్వం నియ‌మించిన ఓ వ్య‌క్తి  రూ.15కోట్లు పెట్టుబ‌డి పెట్టిన కంపెనీకి రూ. 33 కోట్లు ఫెనాల్టీ విధించారు. ఇదేమ‌ని ప్ర‌శ్నిస్తే.. ఉంటే ఉండండి, లేదంటే వెళ్లిపోండి అంటూ బెదిరింపుల‌కు దిగారు. వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో కొంద‌రు వ్య‌క్తుల వ్య‌వ‌హార‌శైలి కార‌ణంగా పెట్టుబ‌డులు పెట్టేందుకు చాలా మంది ఆస‌క్తి చూప‌లేదు. అయినా, ప‌ట్ట‌వ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా జితేంద్ర శ‌ర్మ‌ త‌న ప్ర‌య‌త్నాన్ని ముందుకు కొన‌సాగిస్తూ వెళ్లారు. కొవిడ్ స‌మ‌యంలో మెడ్‌టెక్ జోన్‌లో త‌యారైన వైద్య ప‌రిక‌రాల‌ను దేశంలోని 20కిపైగా రాష్ట్రాలు వినియోగించ‌గా.. ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం మాత్రం వాటిని కొనుగోలు చేయ‌లేదు. ప్ర‌భుత్వ స‌హ‌కారం లేక‌పోయినా మెడ్‌టెక్ జోన్ లో ప్ర‌పంచ దేశాల్లోని మెడిక‌ల్ ఉత్ప‌త్తుల త‌యారీ కంపెనీల ఏర్పాటుకు జితేంద్ర శ‌ర్మ ఎన‌లేని కృషి చేశారు.  ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో భారీ మెజార్టీతో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటు కావ‌డం, చంద్ర‌బాబు సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డంతో జితేంద్ర శ‌ర్మ ఊపిరి పీల్చుకున్నారు. ప్ర‌భుత్వ అండ‌దండ‌లు పుష్క‌లంగా ఉండ‌టంతో ప్ర‌పంచంలోని ప్ర‌ముఖ కంపెనీలు మెడ్‌టెక్ జోన్ లో పెట్టుబ‌డులు పెట్టేలా కృషిచేస్తున్నారు. ఇటీవ‌ల మెడిజోన్‌లో త‌యారైన వైద్య ప‌రిక‌రాల ప్ర‌ద‌ర్శ‌న‌ను సీఎం చంద్ర‌బాబు తిల‌కించారు. అక్క‌డ జ‌రిగిన కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు, జితేంద్ర శ‌ర్మ‌లు మాట్లాడుతూ భావోద్వేగానికి గుర‌య్యారు. మెడ్‌టెక్ జోన్ అభివృద్ధిలో ఎన్నో ఎదురుదెబ్బ‌లు త‌గిలాయ‌ని జితేంద్ర శ‌ర్మ గుర్తు చేసుకున్నారు. చంద్ర‌బాబు లాంటి వ్య‌క్తులు ఎంతో దైర్య‌మిస్తారు.  మాకు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ లా అండ‌గా ఉంటారు. మీరుంటే ఎన్నో కొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌తో స‌మాజం బాగుంటుంది అంటూ చంద్ర‌బాబు అందించిన ప్రోత్సాహాన్ని జితేంద్ర శ‌ర్మ కొనియాడారు. చంద్ర‌బాబు సైతం.. జితేంద్ర శ‌ర్మ ప‌ట్టుద‌ల‌ను కొనియాడారు. నేడు మెడ్‌టెక్ జోన్ ఈ స్థాయిలో ఉండ‌టానికి ప్ర‌ధాన కార‌ణం జితేంద్ర శ‌ర్మ అంటూ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ప్ర‌స్తుతం జితేంద‌ర్ శ‌ర్మ‌ గోల్ ఒక్క‌టే. మెడిక‌ల్ టెక్నాల‌జీ అంటే ఇండియా పేరు వినిపించాలి. మెడ్‌టెక్ జోన్ కేంద్రంగా త‌యారైన ప‌రిక‌రాలు ప్ర‌పంచ దేశాల‌కు ర‌వాణా అవ్వాల‌న్న ప‌ట్టుద‌ల‌తో జితేంద్ర శ‌ర్మ త‌న ప‌నిలో వేగాన్ని పెంచారు.

ఆల్మట్టి గేట్లు ఎత్తివేత.. నారాయణపూర్ డ్యామ్ కు వరద నీరు

కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వానలకు ఆల్మట్టి డ్యామ్ కు భారీగా వరద పోటెత్తుతోంది.  కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరగడంతో ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తివేశారు. అల్మట్టి డ్యామ్ నుంచి మొత్తం 65 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో దిగువన ఉన్న నారాయణపూర్‌ డ్యామ్‌లోకి వరద చేరుకుంటోంది.దీంతో దిగువన ఉన్న నారాయణ పూర్ జలాశయంలోకి వరద చేరుకుంటోంది. బుధవారం (జులై 17)  సాయంత్రానికి  నారాయణపూర్ డ్యామ్ గరిష్ఠ స్థాయికి చేరుకోనుంది. దీంతో డ్యామ్ గేట్లు ఎత్తి దిగువన జూరాలకు నీటిని విడుదల చేయనున్నారు. మరో రెండు రోజుల్లో జూరాల కూడా నిండుతుందని అధికారులు చెబుతున్నారు. ఆ తరువాత శ్రీశైలం డ్యాంకు నీటిని వదులుతామని చెబుతున్నారు.  మరోవైపు తుంగభద్రలో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది.  

నీతి ఆయోగ్ ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్ర మంత్రి కింజారపు

శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడికి అరుదైన గౌరవం దక్కింది. ఆయనను నీతి ఆయోగ్ ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్రం నియమించింది. కేంద్రంలో మోడీ సర్కార్ ముచ్చటగా మూడో సారి కొలువుదీరిన తరువాత నీతి ఆయోగ్ కూర్పును మార్చింది. ఆ మార్పులో భాగంగా కేంద్ర మంత్రి, తెలుగుదేశం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడిని నియమించింది.  అలాగే ఎక్స్‌అఫీషియో సభ్యుల కేటగిరిలో   వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను చేర్చారు. ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో  కింజారపు రామ్మోహన్ నాయుడితో పాటు  మంత్రులు జేపీ నడ్డా, హెచ్‌డీ కుమారస్వామి, జితన్‌రాం మాంఝీ,  రాజీవ్‌ రంజన్‌ సింగ్‌, జూయెల్‌ ఓరం, అన్నపూర్ణాదేవి., చిరాగ్‌ పాస్వాన్‌  ను నియమించారు.

తెలంగాణలో కాంగ్రెస్ మేనిఫెస్టో ఖచ్చితంగా అమలు చేస్తాం: డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క 

తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటించింది. విపక్షాలు ఈ ఆరు గ్యారెంటీలు అమలు కావడం లేదని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. దీంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఒక టీవీచానెల్  ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్ హయాంలో గ్రూప్ 2ను మూడుసార్లు వాయిదా వేశారన్నారు. కానీ తాము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 30 వేల నియామకాలు చేపట్టామని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు గత బీఆర్ఎస్ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. కానీ పదేళ్ల పాటు డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదని విమర్శించారు.తాము అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే చాలామంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చామని, డీఎస్సీ నిర్వహిస్తున్నామనీ అన్నారు. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఇస్తామన్నారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇక ఇస్తూనే ఉంటామని వ్యాఖ్యానించారు. టీజీపీఎస్సీ ద్వారా 13,321 పోస్టులను భర్తీ చేసినట్లు చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. తమ హామీలపై విపక్షాలవి అడ్డగోలు మాటలని మండిపడ్డారు.హామీలపై తాము మాట తప్పేది లేదు... మడమ తిప్పేది లేదన్నారు. రైతు రుణమాఫీపై విపక్షాలు అర్థంలేని మాటలు మాట్లాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చామన్నారు. అసలు, వడ్డీ కలిపి గరిష్ఠంగా రూ.2 లక్షలు మాఫీ చేస్తామన్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై కమిషన్ వద్దని కేసీఆర్ వాదిస్తున్నారని ఆరోపించారు.

తెలుగుదేశం గూటికి నలుగురు వైసీపీ ఎంపీలు?

వైసీపీ రాజ్యసభలో జీరో కాబోతోందా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఔననే సమాధానమే వస్తోంది. సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నా, రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉన్నారు అంటూ ధీమా వ్యక్తం చేసిన జగన్ కు ఆ ధీమా మిగిలే అవకాశం ఇసుమంతైనా కనిపించడం లేదు. ఆ పార్టీ సభ్యులు గంపగుత్తగా కాషాయ కండువా కప్పుకుంటారన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే వైసీపీ రాజ్యసభ సభ్యులలో  ఓ నలుగురు తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారని ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అదెలాగంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం (జులై 16) కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీ గంటకు పైగా సాగింది. సరిగ్గా కేంద్రం వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి రోజుల ముందు  జరిగిన ఈ భేటీలో విభజన హామీలు, ఐదేళ్ల వైకాపా పాలనలో అస్తవ్యస్థమైన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, కేంద్రం సహకారం వంటి విషయాలు ప్రస్తావనకు వచ్చి ఉంటాయని అందరూ భావించారు. అయితే వీటితో పాటు ఆశ్చర్యకరంగా రాజ్యసభలో ఎన్డీయే బలం పెంచుకోవడం ఎలా? అన్న దానిపై కూడా అమిత్ షా, చంద్రబాబుల మధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది. కేంద్రం ప్రవేశ పెట్టే బిల్లులు రాజ్యసభ ఆమోదం ముద్ర పడేందుకు అవసరమైన బలం ఎన్డీయేకు లేదు. బిల్లుల ఆమోదానికి అడ్డంకులు లేకుండా ఉండాలంటే ఎన్డీయే కూటమికి మరో 12 మంది సభ్యులు అవసరం ఉంది. దీంతో ఈ విషయంపై చంద్రబాబు, అమిత్ షాలు చర్చించారని విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి బీజేపీకి బేషరతుగా మద్దతు ఇవ్వడానికి తెలుగు రాష్ట్రాలలో ఇటీవలి ఎన్నికలలో పరా జయాన్ని మూటగట్టుకున్న వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. ఒక వేళ అందుకు బీజేపీ అంగీకరించకుంటే   వైసీపీ, బీఆర్బఎస్  పార్టీలకు రాజీనామా చేసి కాషాయి కండువా కప్పుకోవడానికి ఆ రెండు పార్టీల ఎంపీలూ సిద్ధంగా ఉన్నారు. వాస్తవానికి బయట నుంచి   మద్దతు పొందడం కంటే వారిని చేర్చుకుని సొంతంగా బలం పెంచుకోవడమే మంచిదన్న అభిప్రాయంతో అమిత్ షా ఉన్నారు. అంటే బయట నుంచి మద్దతు పొందడం కంటే ఆ సభ్యులను బీజేపీలో లేదా తెలుగుదేశంలో చేర్చుకుని సొంతంగా బలం పెంచుకోవడం మేలని అమిత్ షా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ రాజ్యసభ సభ్యులకు గంపగుత్తగా కాషాయ కండువా కప్పే  విషయంపైనే చంద్రబాబు, అమిత్ షాల మధ్య చర్చ జరిగిందని చెబుతున్నారు. వైసీపీకి రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉన్నారు. బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వారంతా కూడా కమలం గూటికి చేరిపోవడానికి సిద్ధంగా ఉన్నారన్నది వైసీపీ వర్గాల నుంచే వినిపిస్తోంది.  రాజ్యసభలో మనకు బలం ఉంది. బీజేపీకి మన అవసరం ఉంది కనుక గట్టిగా నిలబడండి అని వైసీపీ అధినేత జగన్ తన పార్టీ రాజ్యసభ సభ్యులకు నచ్చచెప్పడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. దాంతో ఏం చేయాలో తోచని నిస్సహాయతలో పడిన జగన్  ప్రజాదర్బార్ ను కూడా రద్దు చేసుకుని బెంగళూరు వెళ్లిపోయారని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఆయన అక్కడ నుంచి ఎప్పుడు తాడేపల్లి తిరిగి వస్తారు. పార్టీపై ఎప్పుడు దృష్టి పెడతారు అన్న విషయంలో క్లారిటీ లేక వైసీపీ శ్రేణులు అయోమయంలో ఉన్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. వైసీపీ సభ్యులను గంపగుత్తగా బీజేపీలో చేర్చుకునే విషయంపై చంద్రబాబు, అమిత్ షాల చర్చల్లో భాగంగా ఓ నలుగురు వైసీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో కాకుండా తెలుగుదేశం గూటికి చేరడానికి సిద్ధంగా ఉన్నారన్న సంగతి బయటపడింది.  అలా తెలుగుదేశం గూటికి చేరడానికి రెడీగా ఉన్న వైసీపీ రాజ్యసభ సభ్యులలో ఆర్.కృష్ణయ్య, పిల్లి సుభాష్ చంద్రబోస్, బీద మస్తాన్ రావు ఉన్నట్లు తెలుస్తోంది. వీరు ముగ్గురే కాకుండా మరో  సభ్యుడు కూడా తెలుగుదేశం గూటికి చేరాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. వీరిలో బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్యలు 2019లో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.  మొత్తం మీద  మీద రాజ్యసభలో వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. 

పారిశుద్య కార్మికులతో  రోజా షాకింగ్ వీడియో నెట్టింట హల్ చల్ 

ఒకప్పుడు  దక్షిణాది సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన రోజా రాజకీయాల్లో వచ్చాక సినిమాలకు దూరమయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో అంటే వైకాపాలో చేరిన తర్వాత ప్రజలకు  ఆమె మరింత దూరమయ్యారు. పర్యవసానం వల్ల గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేసిన నగరి నియోజకవర్గం నుంచి  ఘోర పరాజయం చెందారు.  ఆమె పుట్టినిల్లైన ఆంధ్ర ప్రదేశ్ ను వదిలేసి మెట్టినిల్లు అయిన తమిళనాడుకు పారిపోయారు. . ఒకప్పుడు ప్రముఖ సినీ దర్శకుడైన సెల్వమణి కూడా సినిమాల్లో అవకాశాలు రాక తెరమరుగయ్యారు. ఇటు రోజా, అటు సెల్వమణి ఆయా రంగాల్లో  దూరమైనప్పటికీ ఫ్యూడల్ భావ జాలంతో  ఉన్న రోజా తమిళనాడులో కూడా తన అహంకారాన్ని, నిమ్న జాతుల పట్ల ఉన్న వివక్ష  మరో మారు చూపించారు.  మాజీ మంత్రి, నటి రోజాతో సెల్ఫీ తీసుకోవడానికి యత్నించిన పారిశుద్ధ్య కార్మికులను ఆమె దూరంగా నిల్చోమన్నట్లు చెప్పిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తమిళనాడులోని తిరుచ్చెందూర్‌ సుబ్రమణియస్వామి ఆలయంలో సోమవారం వరుషాభిషేకం జరిగింది. ఈ వేడుకల్లో పాల్గొన్న రోజా, ఆమె భర్త సెల్వమణి స్వామి దర్శనం చేసుకున్నారు. అక్కడున్న చాలామంది వారితో సెల్ఫీ తీసుకున్నారు. అదే సమయంలో కొందరు పారిశుద్ధ్య కార్మికులు వెళ్లగా వెంటనే ఆమె వారిని దూరం జరిగి నిల్చోవాలంటూ చేతులు చూపినట్లు వీడియోలో ఉంది. వారు పక్కకు జరిగి సెల్ఫీ తీసుకున్నట్లు ఉంది. నెటిజన్లు ఆమె తీరును విమర్శిస్తున్నారు.

తెలంగాణను ముంచెత్తనున్న భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తనున్నాయివ. వాతావరణ శాఖ ఈ మేరకు హెచ్చరిక జారీ చేసింది. బుధవారం (జులై 17) నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురువారం (జులై 18)న భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంవలోనే పలు జిల్లాలలకు ఆరెంజ్ అలర్ట్, మరి కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.  కుమురంభీం ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, ఖమ్మం, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశా లున్నాయనీ,  నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్, ఆదిలాబాద్, నిర్మల్,  నల్గొండ, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ  వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని ప్రజలకు సూచించింది.  ఆదిలాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంకుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో  పలు చోట్ల 11 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

గుడివాడ వైసీపీ కార్యాలయం ఖాళీ.. కొడాలి కబ్జా నుంచి శరత్ థియోటర్ కు విముక్తి

ఆంధ్రప్రదేశ్ లో 2019 నుంచి ఐదేళ్ల పాటు రాష్ట్రంలో  అధికారంలో ఉన్న జగన్ పాలన అంతా అరాచకమే. అధికారం అండ చూసుకుని ముఖ్యమంత్రి జగన్ సహా ఆ పార్టీ నేతలు రాష్ట్రంలో చేయని దారుణం లేదు. అధికారం ఉన్నది దోచుకోవడానికి, దాచుకోవడానికేనన్నట్లుగా వ్యవహరించారు. అదేమని ప్రశ్నిస్తే కక్ష సాధింపులకు పాల్పడ్డారు. జగన్ పాలనలో జనం నోరెత్తాలంటేనే భయపడే పరిస్థితి కల్పించారు. ఐదేళ్ల పాటు పంటి బిగువున ఆగ్రహన్ని అదిమి పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2024 ఎన్నికలలో జగన్ ను గద్దె దింపారు. అత్యంత ఘోర పరాజయాన్ని జగన్ ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారు. సుపరిపాలన అందిస్తారన్న నమ్మకంతో తెలుగుదేశం కూటమికి అధికారం అప్పగించారు.   చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గత ఐదేళ్లలో జగన్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను బయటపెడుతోంది. అదే సమయంలో గత ప్రభుత్వంలో వైసీపీ నేతల అరాచకత్వం, అహంకారం కారణంగా నష్టపోయిన బాధితులను ఆదుకుంటోంది.  వైసీపీ నేతలు దౌర్జన్యంగా చేసిన కబ్జాల నుంచి ప్రజల ఆస్తులు, భూములకు విముక్తి కలిగించి వాటిని వాటివాటి సొంతదారులకు అప్పగిస్తోంది. రాష్ట్రం నలు చెరగులా వైసీపీ దాడులూ, దౌర్జన్యాలూ, ఆక్రమణ బాధితులు కోకొల్లలుగా ఉన్నారు. చిత్తశుద్ధి, సంకల్పం ఉంటే.. కబ్జాల  ఆస్తులను విముక్తి చేసి సొంతదారులకు అప్పగించవచ్చని గుడివాడ తెలుగుదేశం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చేసి చూపించారు. ఔను  గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని కబ్జా నుంచి గుడివాడలోని శరత్ థియోటర్ కు విముక్తి కలిగించి దానిని దాని సొంత దారులకు అప్పగించారు ఆ నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే వెనిగండ్ల రాము.  వివరాల్లోకి వెడితే..  మాజీ మంత్రి  కొడాలి నాని  అక్రమంగా  గుడివాడలోని  శరత్ థియేటర్ ను అక్రమంగా కబ్జా చేశారు. ఆ థియేటర్ యజమానులను బెదరించి  శరత్ థియోటర్ ను వైసీపీ కార్యాలయంగా మార్చేశారు. అదేమని అడిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరించి  నోరు మూయించారు.  ఇప్పుడు ప్రభుత్వం మారిన తరువాత గుడివాడ ప్రస్తుత ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రత్యేక చొరవ తీసుకుని శరత్ థియేటర్ ను దాని సొంత దారులకు అప్పగించారు. ఆ థియేటర్ లో కొనసాగుతున్న  వైసీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయించారు. ఆ సందర్భంగా గుడివాడ మునిసిపల్ మాజీ చైర్మన్,   శరత్ ధియేటర్ యజమానుల్లో ఒకరు అయిన  ఎలవర్తి శ్రీనివాసరావు ఆ థియోటర్ లో ఇచ్చిన తేనీటి విందుకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హాజరయ్యారు. ఆ సందర్భంగా  మాట్లాడిన వెనిగండ్ల రాము శరత్ థియేటర్ యాజమాన్యం తమకు జరిగిన అన్యాయాన్ని వివరించిన వెంటనే స్పందించానని చెప్పారు. గుడివాడలో వైసీపీ కార్యాలయం అవినీతి, అరాచకాలకు కేంద్రంగా ఏళ్ల తరబడి కొనసాగిందని వివరించారు.  ఆయన చెప్పినది నిజమే.. శరత్ థియోటర్ వైసీపీ కార్యాలయంగా ఉన్న సమయంలో ఆ థియేటర్ పక్క నుంచి వెళ్లాలంటే కూడా జనం భయపడేవారు. గుడివాడ ప్రజలందరూ కూడా వైసీపీ అరాచకాల కారణంగా బాధితులైన వారే.  ఒక శరత్ థియేటర్  మాత్రమే కాదు.. అధికారం అండ చూసుకుని కొడాలి నాని అండ్ గ్యాంగ్ గుడి వాడలో  పలు భూములను కబ్జా చేసింది. అలా అక్రమంగా కబ్జా చేసిన భూములన్నిటినీ వాటి వాటి సొంత దారులకు అప్పగించాల్సిన అవసరం ఉంది.కొడాలి నాని అక్రమంగా కబ్జా చేసిన 9 ఎకరాల స్థలం తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే దాని సొంతదారులకు అప్పగించింది.  దీంతో ఇప్పుడిప్పుడే గుడివాడలో కొడాలి నాని బాధితులు ఒక్కరొక్కరుగా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయంపై ధైర్యంగా ఫిర్యాదు చేస్తున్నారు. వారి ఫిర్యాదులతో గత ఐదేళ్లుగా గుడివాడలో కొడాలి నాని సాగించిన దౌర్జనం, దాష్టికం ఏ స్థాయిలో ఉందో వెల్లడౌతోంది. 

నిరసనల మధ్యే  రేపట్నుంచి డిఎస్సీ రిక్రూట్మెంట్ పరీక్షలు  ప్రారంభం

ఓ వైపు పరీక్షల వాయిదా కోరుతూ విద్యార్థుల నిరసనలు చేపడుతుంటే షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపింది.జులై 18 నుంచి ఆగస్టు 5 వరకూ  పరీక్షలు జరగనున్నాయని వెల్లడించింది. తెలంగాణలో గురువారం నుంచి డీఎస్సీ రిక్రూట్‌మెంట్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి.  ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారమే పరీక్షల నిర్వహణకు మొగ్గు చూపింది. టెట్ నిర్వహణ, డీఎస్సీ ప్రిపరేషన్ కోసం మరికొంత సమయం కావాలంటూ అభ్యర్థులు పరీక్షల వాయిదా వేయాలని గత కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. అయితే, ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం, పరీక్ష నిర్వహించేందుకు రెడీ అయ్యింది.  ఇక పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకూ 11,062 పోస్టుల భర్తీకి 2.79 లక్షల దరఖాస్తులు అందినట్లుగా అధికారులు తెలిపారు. మంగళవారం సాయంత్రానికి 2,40,727 మంది హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకూ పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. డీఎస్సీ పరీక్షలు రోజుకు రెండు విడతల్లో నిర్వహించనున్నారు. హాల్ టిక్కెట్లలో తప్పులు దొర్లాయంటూ పెద్ద సంఖ్యలో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి విద్యార్థులు రావడంతో వాటిని సరి చేసి ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. 

పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం.. 26 మంది దుర్మరణం

దక్షిణ అమెరికాలోని పెరూలో  జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 26 మంది దుర్మరణం పాలయ్యారు. పెరూ రాజధాని లిమా నుంచి 40 మందికి పైగా ప్రయాణికుల తో వెళ్తున్న బస్సు అదుపుతప్పి 200 మీటర్ల లోతులో ఉన్న లోయలో పడిపోయింది.     ఈ దుర్ఘటనలో 26మంది మరణించారు. మరో 14 మంది తీవ్రంగా గాయ పడ్డారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో  మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.  అక్కడి   కాలమాన ప్రకారం బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.  సమాచారం అందిన వెంటనే   అధికారులు ఘటనాస్థలా నికి చేరుకున్ని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ  వారిని ఆస్పత్రికి తరలించారు.  ఘాట్ రోడ్డుపై అతివేగంగా వెళ్లడమే ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.  

తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసు.. పలువురు వైసీపీ నేతల పరార్!

మంగళగిరిలోని తెలుగుదేశం ప్రధాన కార్యాలయంపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దాడి కేసు విషయంలో పోలీసులు స్పీడ్ పెంచారు. దీంతో నాడు అధికారం అండతో ఇష్టారీతిగా రెచ్చిపోయిన నాటి దాడి కీలక సూత్రధారులు అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పరారయ్యారు.  నాడు తెలుగుదేశం కార్యాలయంపై నాడు జరిగిన దాడిలో  కీలకంగా వ్యవహరించిన వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఇల్లూ, వాకిలీ వదిలి ఊరు దాటేశారు. వారి ఆచూకీ ఎవరికీ తెలియని విధంగా అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇంత వరకూ 12 మందిని అరెస్టు చేశారు. ఈ  12 మందిలో ఆరోగ్య కారణాలతో ఒకరికి బెయిలు లభించింది. ఇప్పటి వరకూ ఈ కేసులో 72 మందిని నిందితులుగా పోలీసులు గుర్తించారు. ముందు ముందు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా ఈ కేసుకు సంబంధించి 12 మంది గుంటూరు జిల్లా కోర్టులో యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఈ దాడిలో కీలక సూత్రధారులుగా ఉన్న 8 మంది హైకోర్టులో ముందస్తు బెయిలు పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. ఈ బెయిలు పిటిషన్లపై ఈ నెల 23న కోర్టు తీర్పు వెలువరించనుంది.     మొత్తం మీద తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పలువురు వైసీపీ ముఖ్యనేతలు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసుల దర్యాప్తులో తెలింది. రానున్న రోజులలో ఈ కేసులో కీలక నిందితుల అరెస్టు దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. 

చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం... ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు నిర్ణయం 

ఏపీ కేబినెట్ మంగళవారం  జరిగింది. కూటమి ప్రభుత్వం అమలు చేయబోయే యాక్ట్ లకు సంబంధించి ఆమోదం లభించాయి.  ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్, ఉచిత ఇసుక విధానం, రబీ సీజన్‌లో ధాన్యం సేకరణపై  చర్చ సాగింది.  కేబినెట్ నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో పంచుకున్నారు.   ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం చేసిన ఇసుక పాలసీని, వివిధ సంస్ధలతో చేసుకున్న అగ్రిమెంట్లు రద్దు చేయాలని  కేబినెట్ నిర్ణయం తీసుకుంది.  ధాన్యం కోనుగోలు ఒక మండలంలోనిది ఇంకో మండలానికి ట్యాగ్ చేయడం.. రైతులకు ఇవ్వాల్సిన సోమ్మును 90 రోజులు వరకూ ఆపడం వారిని ఇబ్బందులు గురిచేయడం ఇలా గతంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. వచ్చే సీజన్‌లో రైతులకు ఇబ్బంది లేకుండా 3200 కోట్లు బుణం పొదేందుకు వ్యవసాయ సహకార శాఖకు ఆమోదం తెలిపారు. సరైన క్రాప్ ఇన్సూరెన్స్ విధానం లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీనికి ముగ్గురు మంత్రుల తో కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. కౌలు రైతులకు పూర్తిగా బ్యాంకుల నుంచి రావడం లేదనే విషయంపై కౌలు రైతు కార్డు ఇచ్చే విషయంపైనా కేబినెట్‌లో చర్చించాం అని కొలుసు పార్థ సారథి తెలిపారు. 

కెసీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు... కమిషన్ చైర్మన్ మార్చాలని ప్రభుత్వానికి ఆదేశం

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణం అంశాల్లో జరిగిన అవకతవకలపై విచారించేందుకు తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ నరసిహారెడ్డి ఛైర్మన్ గా కమిషన్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కమిషన్ ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును కేసీఆర్ ఆశ్రయించారు.  కేసీఆర్ పిటిషన్ ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. కేసీఆర్ పిటిషన్ ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. కమిషన్ విచారణ కొనసాగించాలని తెలిపింది. కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. దీనిని జ్యుడీషియల్ ఎంక్వైరీ అనకుండా... ఎంక్వైరీ కమిషన్ గా వ్యవహరించాలని తెలిపింది. మరోవైపు, కమిషన్ ఛైర్మన్ గా నరసింహారెడ్డి స్థానంలో మరొకరిని నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో, కమిషన్ ఛైర్మన్ ను మారుస్తామని సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. రిటైర్డ్ జడ్జిలతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని, కొత్త ఛైర్మన్ పేరును తెలిపేందుకు సమయం కావాలని... సోమవారం కొత్త ఛైర్మన్ పేరును తెలియజేస్తామని కోర్టుకు తెలిపింది. ఇప్పటికే హైకోర్టులో కెసీఆర్ కు చుక్కెదురైంది. కమిషన్ రద్దు చేయాలని కెసీఆర్ వేసిన పిటిషన్  కొట్టి వేసింది.