భాగ్యనగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం
posted on Jul 15, 2024 @ 11:49AM
భాగ్యనగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. నగరంలోని పలు ప్రాంతాలలో కుండపోత వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రజలను కోరారు. మరి కొన్ని గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారీ వర్షం కారణంగా ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా జీహఎచ్ ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు.
అత్యవసర సహాయం కోసం 040-21111111, 9000113667 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. కాగా మారేడ్‌పల్లిలో అత్యధికంగా 75.3 మి.మీ., ఖైరతాబాద్‌లో 74, ముషీరాబాద్‌లో 70, షేక్‌పేటలో 69.3, శేరిలింగంపల్లిలో 68.మి.మీ వర్షపాతం నమోదైంది.
అలాగే మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, బాచుపల్లి, ప్రగతి నగర్, కూకట్‌పల్లి, మూసాపేట, హైదర్‌నగర్, మల్కాజిగిరి, కుషాయిగూడ, దమ్మాయిపేట, చర్లపల్లి, కీసర, నిజాంపేట, నేరేడ్‌మెట్, అమీర్‌పేట్, ఈఎస్‌ఐ, ఎర్రగడ్డ, సనత్‌నగర్, బోరబండ, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్, మేడిపల్లి, పీర్జాదిగూడ, నాంపల్లి, అబిడ్స్, కోఠి, బషీర్‌బాగ్, నారాయణగూడ, హిమాయత్ నగర్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, మేడ్చల్, మల్లంపేట్, గండిమైసమ్మ, దుండిగల్, అంబర్ పేట, కాచిగూడ, నల్లకుంట, గోల్నాక తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
రోడ్లపై వర్షం నీరు చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. వరద ప్రవాహానికి యూసుఫ్‌గూడలోని కృష్ణానగర్‌లో ఓ కారు కొట్టుకుపోయింది. మాదాపూర్ హైటెక్ సిటీ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఎర్రమంజిల్ వద్ద ప్రధాన రహదారిపై భారీగా వరదనీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయమేర్పడింది.