అన్న క్యాంటిన్లకు కోటి విరాళం
posted on Jul 13, 2024 @ 11:53AM
గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రంలో నిర్వహించిన అనంతశేష స్థాపన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఇస్కాన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యలమంచిలి వెంకట కృష్ణమోహన్, విజయలక్ష్మి దంపతులు ఇస్కాన్‌కి కోటి రూపాయల విరాళంగా ఇచ్చారు. అలాగే అన్న క్యాంటిన్ల నిర్వహణ కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం వల్ల తన ఆస్తి వంద కోట్ల రూపాయలు పెరిగిందని, ఆ సంతోషంలోనే ఈ విరాళాలు ఇస్తున్నానని యలమంచిలి వెంకట కృష్ణమోహన్, విజయలక్ష్మి దంపతులు చెప్పారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, తాను ఇంకా అభివృద్ధి ప్రారంభించకుండానే భూముల విలువ పెరిగిందని, దీనివల్ల సమాజం ఆర్థికంగా ముందుకు వెళ్తుందని అన్నారు. యలమంచిలి వెంకట కృష్ణమోహన్, విజయలక్ష్మి దంపతులు వంద పేద కుటుంబాలను పైకి తీసుకురావాలని చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు. దానికి ఆ దంపతులు సంతోషంగా అంగీకరించారు.