ఏయూలో అగ్నిప్రమాదం.. కీలక ఫైళ్ల దగ్ధంపై వెల్లువెత్తుతున్న అనుమానాలు
posted on Jul 15, 2024 @ 10:27AM
జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఐదేళ్ల పాటు నలిగిపోయింది. జగన్ పాలన కాదేదీ దోపిడీకి అనర్హం అన్న రీతిలో సాగింది. సహజనరులు, భూములు ఇలా ఒకటనేమిటి అన్నీ విధ్వంసానికి, దోపిడీకి గురయ్యాయి. ఆఖరికి సరస్వతీ నిలయాలైన విద్యాలయాలనూ జగన్ సర్కార్ వదలలేదు. విశ్వవిద్యాలయాలనూ అక్రమాలకు కేంద్రాలుగా మార్చేసింది.
తాజాగా ఆంధ్రవిశ్వవిద్యాలయంలో జరిగిన అక్రమాలకు ఆధారాలను ధ్వంసం చేసిన సంగతి ఆల స్యంగా వెలుగులోకి వచ్చింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీగా ప్రసాదరెడ్డి చేసిన అక్రమాలకు సంబంధించి కొత్త ప్రభుత్వం విచారణ చేపడుతుందన్న భయంతో ఆధారాలు మాయం చేశారన్న సంగతి ఆలస్యంగా బయటకు వచ్చింది. గత నెల 18న సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలు ఫైళ్లు, కంప్యూటర్ల అగ్నికి ఆహుతి అయ్యాయి. అయితే ఈ అగ్ని ప్రమాదంలో అప్పట్లో ఎవరూ ఫిర్యాదు చేయలేదు. పైగా అగ్ని ప్రమాదం జరిగిందన్న విషయం ఎవరికీ తెలియకుండా ఉంచేందుకు ప్రయత్నాలు జరిగాయి. ప్రిన్సిపాల్ కార్యాలమంలో రంగులు వేసి మాయ చేసి పబ్బం గడుపుకుందామని ప్రయత్నించారు.
పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం, వర్సిటీ ఉన్నతాధికారుల నుంచి విచారణకు ఆదేశాలు రాకపో వడంతో అక్రమాల ఆధారాల ధ్వంసం కోసమే అగ్నిప్రమాదం పేరుతో ఫైళ్లు, కంప్యూటర్లను ఉద్దేశపూర్వకంగానే దగ్ధం చేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. జగన్ హయాంలో ఆంధ్రా వర్సిటీని రాజకీయాలకు నిలయంగా మార్చేసిన ప్రసాదరెడ్డి అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. కూటమి విజయం తర్వాత చర్యలు తప్పవనే భయంతో జూన్ మొదటి వారంలో వర్సిటీలోని కీలక దస్త్రాలను మాయం చేసేందుకు ప్రయత్నించారు. వీసీ కారులోనే దస్త్రాలను కార్యాలయం నుంచి హడావుడిగా ఇంటికి తరలించారని ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు అగ్ని ప్రమాదం అంటూ చెబుతున్న కబుర్లు కూడా నమ్మశక్యంగా లేవని విద్యార్థలు ఆరోపిస్తున్నారు. ప్రసాదరెడ్డి అక్రమాలపైనా, అగ్నిప్రమాదంపైనా సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.