చంద్రబాబు సర్కార్ పై వైసీపీ విమర్శలు.. నవ్విపోతున్న జనం.. నవ్వుల పాలౌతున్న జగన్
posted on Jul 15, 2024 @ 10:06AM
ఆంధ్రప్రదేశ్ లో రాక్షస పాలన అంతమై నెల రొజులు గడిచింది. ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబా బునాయుడు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన సీఎంగా అధికార పగ్గాలు అందుకున్న నెలరోజులలోనే రాష్ట్రంలో సుపరిపాలన దిశగా అడుగులు పడుతున్నాయి. శాఖల వారీ సమీక్షలు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసాన్ని ప్రజల కళ్లకు కడుతూ వరుస శ్వేతపత్రాలు, అదే సమయంలో సంక్షేమం, అభివృద్ధికి బాటలు పరచడంతో బాబు పాలనపై జనంలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా అమరావతి, పోలవరం పనులలో వేగం, గత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగులు, పెన్షనర్లకు ఒకటో తేదీనే వేతనాలు, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, ఉచిత ఇసుక విధానం, జగన్ మద్యం పాలసీ రద్దు, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు వంటి చర్యలతో చంద్రబాబు ప్రజల మనస్సులను గెలుచుకున్నారు.
అయితే తమ అస్తవ్యస్త పాలనతో ప్రజా తిరస్కారానికి గురై ఘోర ఓటమి పాలైన వైసీపీ నేతలు మాత్రం రాష్ట్రంలో పాలనను చూసి కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. చంద్రబాబు హామీ ఇచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మాటేమిటి? పోలవరంపై శ్వేతపత్రం ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటివరకూ ప్రాజెక్టు కు అయిన ఖర్చు ఎంత, ప్రాజెక్టు పూర్తికి ఇంకా ఎంత వ్యయం అవుతుంది వంటి అంశాలను పేర్కొనలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే తల్లికి వందనం పథకం అమలు విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం మోసం చేస్తున్నదని వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఇంటో చదువుకునే ప్రతి బిడ్డకు రూ.15వేలు ఇస్తామని ఇప్పుడు దాన్ని కుదించే ఆలోచన చేస్తున్నదని వైసీపీ ఆరోపి స్తున్నది. ఉచిత ఇసుక అని డబ్బులు వసూలు చేస్తున్నారని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఓ గగ్గోలు పెట్టేస్తోంది. కూటమి ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ కాదు సూపర్ మోసాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించడాన్ని తెలుగుదేశం వర్గాలే తప్పుపడుతున్నాయి. సామాన్య ప్రజలు కూడా అంబటి విమర్శలను కొట్టి పారేస్తున్నారు. నవ్వుకుంటున్నారు.
అదే సమయంలో పరిశీలకులు రాష్ట్ర వాస్తవ పరిస్థితిని వివరిస్తూ వైసీపీ విమర్శలు అధికారం కోల్పో యిన దుగ్ధతో తప్ప వాటిలో వాస్తవం ఇసుమంతైనా లేదని విశ్లేషిస్తున్నారు. 2019లో జగన్ సీఎంగా పదవీ పగ్గాలు చేపట్టేనానికి, అంటే చంద్రబాబు దిగేనాటికి, రాష్ట్రం అప్పు రూ.3.14లక్షల కోట్లు. అది ఇప్పుడు రూ.14లక్షల కోట్లు. అంటే ఐదేళ్ల కాలంలో జగన్ చేసిన అప్పు దాదాపు 11లక్షల కోట్లు. జగన్ చెప్పిన ప్రకారం ప్రజలకు ఇచ్చింది రూ.2.70 లక్షల కోట్లు. మిగిలిన 8లక్షల కోట్లు ఏంచేశారన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. రోడ్లువేయలేదు,రాజధాని కట్టలేదు. ఏ నీటిపారుదల ప్రాజెక్టు చేపట్టలేదు సరికదా నిర్మాణంలో ఉన్న పోలవరం వంటి ప్రాజెక్టుల పనులు నిలిపివేశారు రాష్ట్ర ప్రగతికి ఒక్క ఇటుక కూడా పేర్చకుండానే 11 లక్షల కోట్ల రూపాయలను హారతి కర్పూరంలా కరిగిం చేసింది జగన్ సర్కార్. ఇప్పుడు అలా లేక్కా పత్రం లేకుండా చేసిన అప్పులు, అడ్డగోలుగా ఆర్థిక అరాచకత్వానికి పాల్పడిన జగన్ పార్టీ, ఆ పార్టీ నేతలూ ఇప్పుడు చంద్రబాబు హామీల అమలు ఏమైందని ప్రశ్నిస్తున్నారు.
సామాజిక ఫింఛన్లు రూ. 4వేలకు, వికలాంగుల పింఛన్ 6వేలు పెంచి , అరియర్స్ తో సహా ఇవ్వడం, ఉద్యోగులకు 1వతేదీనే వేతనాలు ఇవ్వడం కనిపించడం లేదా? అని తెలుగుదేశం వైసీపీ విమర్శలను తిప్పి కొడుతోంది. మెగా డిఎస్సీ నోటిఫికేషన్,ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు,ఉచిత ఇసుక విధానం, పట్టిసీమ ద్వారా గోదావరిని కృష్ణా నదికి అనుసంధానం చేసి నీరు వదలడం, నిత్యావసరాలు చౌక ధరలకు రైతుబజార్ల ద్వారా పంపిణీ వంటి వాటిని ప్రస్తావిస్తూ తెలుగుదేశం వర్గాలు వైసీపీ నేతల విమర్శలను తిప్పి కొడుతున్నాయి. అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు, బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత ఇస్తామన్న కేంద్రం హామీల వెనుక చంద్రబాబు రాష్ట్ర పరుగతికి చేస్తున్న కృషిని ప్రస్తావిస్తూ జగన్ హయాంలో ఇలా రాష్ట్ర అభివృద్ధి దిశగా ఒక్క అడుగు పడిందా అని ప్రశ్నిస్తున్నాయి.
ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటిన్లు,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పారంభమవుతాయని తెలుగుదేశం కూటమి సర్కార్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. గత ఐదేళ్లుగా అద్వానంగా ఉన్న రోడ్ల మరమతులు మొదలు కావడం, అమరావతి పనుల ప్రారంభం కావడం అభివృద్ధి కాదా అని ప్రశ్నిస్తున్నాయి. జగన్ దృష్టిలో అభివృద్ధి అంటే వేరే ఏదైనా ఉందా అని ప్రశ్నిస్తున్నాయి. నెలరోజులకే హామీలపై వైసీపి తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం, విరుచుకుపడటంపై జనం నవ్వి పోతున్నారు. పని చేస్తున్న ప్రభుత్వానికి తగినంత సమయం ఇవ్వాలని అంటున్నారు. ఎంతగా గొంతు చించుకున్నా వైసీపీకి మరో చాన్స్ ఇచ్చేందుకు తాము సుముఖంగా లేమని కుండ బద్దలు కొడుతున్నారు. వైసీపీ విమర్శలను తిప్పికొట్టడంలో తెలుగుదేశం శ్రేణుల కంటే సామాన్య జనమే ముందుంటున్నారు.