‘జల మాంత్రికుడు’ కేఎల్ రావు జయంతి నివాళి!
posted on Jul 15, 2024 @ 12:06PM
అపర భగీరథుడుగా, తెలుగు నేలపై అవతరించిన ఒక మంచినీటి కోనేరుగా అందరూ అభివర్ణించే తెలుగు ఇంజనీర్ కానూరి లక్ష్మణరావు (కె.ఎల్.రావు) జయంతి నేడు (15 జూలై). తెలుగునేలను వరదల నుంచి కాపాడ్డమే కాకుండా, సస్యశ్యామలం చేసిన ఘనత కేఎల్ రావుకు కూడా దక్కుతుంది. తన కృషి ద్వారా ఎన్నో కోట్ల మంది జీవితాలలో వెలుగు నింపిన కేఎల్ రావును ఆయన జయంతి సందర్భంగా స్మరించుకోవడం కృతజ్ఞత అనిపించుకుంటుంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వరదాయినిగా వున్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు సాకారం కావడానికి కారణం కానూరు లక్ష్మణరావు అనే ఒక్క వ్యక్తి పట్టుదలే. ‘‘నీవు లేకుంటే ఈ ప్రాజెక్టు బుట్ట దాఖలయ్యేది’’ అని ఆనాటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూయే ఆయనతో అన్నారు. భారతదేశపు అత్యుత్తమ ఇంజనీర్లలో ఒకరైన ఆయన డాక్టర్ కేఎల్ రావుగా సుప్రసిద్ధులు.
కేఎల్ రావు 1902, జూలై 15న కృష్ణాజిల్లా కంకిపాడులో జన్మించారు. ఆయన తండ్రి గ్రామ కరణం. కేఎల్ రావు తొమ్మిది సంవత్సరాల వయసులో వుండగానే ఆయన తండ్రి మరణించంతో పెదనాన్న, పెద్ద అన్నల సంరక్షణలో కేఎల్ రావు పెరిగారు. చిన్నప్పటి నుంచే ప్రతిభావంతుడైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మొదటి స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు, భాషా సేవకుడు కొమర్రాజు లక్ష్మణరావు, పార్లమెంట్ మాజీ సభ్యురాలు డాక్టర్ అచ్చమాంబ కేఎల్ రావుకు సమీప బంధువులు. పెదనాన్న, పెద్ద అన్న పోత్రాహంతో కేఎల్ రావు సివిల్ ఇంజనీరింగ్‌లో మద్రాసు యూనివర్శిటీ పట్టా పుచ్చుకున్నారు. అనంతరం తమిళనాడులోని గిండి ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్‌గా చేరారు. తన దృష్టిని పరిశోధనల వైపు మళ్ళించి, తాను రాసిన ఒక సిద్ధాంత వ్యాసాన్ని ఇంగ్లాండ్‌కి పంపారు. ఆ వ్యాసానికి మేధావుల నుంచి ప్రశంసలు పొందారు. గిండి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి రీసెర్చ్ డిగ్రీ పొందారు. ఆ తర్వాత విదేశాలకు వెళ్ళి, కాంక్రీట్‌కి సంబంధించిన విద్యలో ప్రావీణ్యం సంపాదించారు.
ఇంజనీరింగ్ పూర్తయ్యాక విశాఖపట్నంలో, విజయనగరం సంస్థానంలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేశారు. ఆ తర్వాత పీడబ్ల్యూడీ ఆధీనంలోని మెట్టూర్ ప్రాజెక్టులో జూనియర్ ఇంజనీర్‌గా విధులను నిర్వర్తించారు. ఆ తర్వాత ఆయన సిమెంట్ కాంక్రీట్‌పై పరిశోధనల వైపు దృష్టిని మళ్ళించారు. తాను రాసిన ఓ సిద్ధాంత వ్యాసాన్ని ఇంగ్లాండుకు పంపి అక్కడి మేధావులతో దానిని చదివించి మరీ రిసెర్చి డిగ్రీ పొందారు. విదేశాలకు వెళ్ళి కాంక్రీటు విద్యలో ప్రావీణ్యం సంపాదించారు. రీ ఇన్ ఫోర్స్‌డ్ కాంక్రీట్ గురించి ఫ్రాన్స్‌లో అధ్యయనానికి వెళ్లి, 1939 నుంచి రెండేళ్లు లండన్‌లో పనిచేశారు. విదేశాలలోనే ‘స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అండ్ రీ ఇన్ఫోడ్ కాంక్రీట్’ అనే ఒక సిద్ధాంత ఓ గ్రంథం రాసి పేరు గడించారు.
అమెరికాలో ప్రొఫెసర్‌గా పనిచేస్తుండగా నాటి మద్రాసు ప్రభుత్వ సలహాదారు సర్ రామమూర్తి కేఎల్ రావును భారతదేశం వచ్చి శ్రీరామపాదసాగర్ (పోలవరం) ప్రాజెక్టు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో 1946లో కేఎల్ రావు స్వదేశానికి తిరిగి వచ్చారు. మద్రాస్ ప్రభుత్వ డిజైన్ ఇంజనీర్‌గా చేరారు. 1947లో స్వాతంత్రానికి పూర్వం కాంక్రీట్ సాయిల్, హైడ్రాలిక్ మోడల్స్‌లో పోలవరం డ్యామ్ డిజైన్లు రూపొందించారు. కానీ రాజకీయ కారణాలతో నాడు పోలవరం ప్రాజెక్టు డిజైన్లు అటకెక్కాయి. ఆ తర్వాత ఢిల్లీలోని కేంద్ర జలవనరుల శాఖ డిజైన్స్ డెరైక్టర్‌గామహానదిపై హీరా కుడ్ డ్యామ్ డిజైన్‌ను రూపొందించారు.
స్వాతంత్య్రానంతరం కృష్ణా, గోదావరి బేసిన్‌ల అభివృద్ధి గురించి కేఎల్‌రావు అధ్యయనం చేశారు. ఈ క్రమంలోనే కృష్ణానదికి ఎడమవైపున ఉన్న నందికొండ వద్ద (నాగార్జునసాగర్) డ్యామ్ కట్టవచ్చని గుర్తించారు. నాటి హైదరాబాద్ రాష్ట్రానికి కూడా ఈ ప్రాజెక్టు ఉపయోకరమని ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుకు చెప్పి ఒప్పించారు. మద్రాసు ప్రభుత్వం అడ్డుకోవాలని చూసినా కేఎల్ రావు కృషి ఫలితంగా ఖోస్లా కమిటీ, ప్రణాళికా సంఘాలు నందికొండ వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి అంగీకారం తెలిపాయి. ఆచార్య నాగార్జునుని అవశేషాలను మ్యూజియం ఏర్పాటు చేసి భద్రపరచేలా పండిట్ నెహ్రూ నుంచి హామీ పొందారు. నాగార్జునసాగర్ పనులకు కేఎల్ రావే స్వయంగా నేతృత్వం వహించారు. 1967లో పూర్తయిన ఆ ప్రాజెక్టు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని 22,00,000 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు, తాగునీరు అందిస్తోంది. 820 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి తోడ్పడుతోంది.
నాగార్జున సాగర్ ఘన విజయం ఆ తర్వాత కృష్ణా నదిపై జల విద్యుత్ ప్రాజెక్టుల రూపకల్పనపై కేఎల్ రావు ప్రత్యేక అధ్యయనం చేశారు. వాటిలో ముఖ్య మైనది శ్రీశైలం ప్రాజెక్టు. ఆయన ప్రతిపాదనకు అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ఆమోదం తెలిపారు. ఆ తర్వాత కేఎల్ రావు ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా పనిచేశారు. 1963లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు.
ఇంజనీరింగ్‌కి సంబంధించిన అనేక విజ్ఞాన దాయకమైన సమాచారాలను సామాన్య ప్రజలకు చేరవేసే ఉపయుక్తమైన ఉపన్యాసాలెన్నో ఇచ్చారాయన. ఇంజనీరింగ్‌ను సాంఘిక అభివృద్ధి విజ్ఞానంగా అభివర్ణించారాయన. నాటి ప్రభుత్వం నాగార్జున సాగర్, భాక్రానంగల్ ప్రాజెక్ట్, హిరాకుడ్ ప్రాజెక్ట్ విషయంలో విదేశీ ఇంజనీర్లను పిలిపిస్తే వారు కూడా రావు గారిని సంప్రదించడం ఈయన ప్రతిభకు నిదర్శనం. ఇంజనీరింగ్ విషయాలకు సంబంధించి కేఎల్ రావు రాసిన "ఇండియాస్ వాటర్ వెల్త్" అనే పుస్తకం నేటి తరాల శాస్త్రవేత్తలకు ప్రామాణిక గ్రంథంగా ఉంది.
ఉద్యోగ విరమణ అనంతరం అప్పటి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు నీలం సంజీవరెడ్డి పిలుపు మేరకు 1962, 1967,1971లో విజయవాడ నుంచి పార్లమెంటుకు పోటీ చేసి గెలిచారు. జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహుదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, నేతృత్వంలోని ప్రభుత్వంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా పనిచేశారాయన. కృష్ణా తీరం వెంబడి కట్టిన కరకట్ట నిర్మాణం, ఇంద్రకీలాద్రి పైకి ఏర్పాటుచేసిన ఘాట్ రోడ్ వంటివి ఈయన నిర్వహణలో జరిగినవే.కేఎల్ రావు స్మృత్యర్ధం పులిచింతల ప్రాజెక్టుకు కె.ఎల్.రావు ప్రాజెక్టు అని నామకరణం చేశారు. ఒక ఇంజనీరు పేరును ప్రాజెక్టుకు పెట్టడం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇదే ప్రథమం.
కేఎల్ రావు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే గంగ, బ్రహ్మపుత్ర నదులలో వర్షాకాలంలో చేరుతున్న నీటిని నిల్వ ఉంచి భారతదేశంలో క్షామ ప్రాంతాలైన మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నీటి సౌకర్యం కల్పించే "నేషనల్ వాటర్ గ్రిడ్" పథకానికి రూపకల్పన చేశారు.
భారత దేశానికి, ఆంధ్ర రాష్ట్రానికి, డెల్టా రైతాంగానికి అమూల్యమైన సేవలు అందించిన భారతదేశ బ్యారేజ్‌లకు మహారాజు, అపర భగీరథుడు భారతీయ జల యాజమాన్య పితామహుడు అయిన డాక్టర్ కేఎల్రావు 1986, మే 18వ తేదీన కన్నుమూశారు. పరిశోధకుడిగా, అధ్యాపకుడిగా, ఇంజనీర్‌గా, కేంద్ర మంత్రిగా సేవలు అందించిన కేఎల్‌రావు భావి ఇంజనీర్లు, విద్యార్థులు, రాజకీయ నాయకులకు ఆదర్శం. సుదీర్ఘ కాలం తన మేధా సంపత్తితో భారతదేశం నీటిపారుదల రంగానికి దిశ, దశను నిర్ణయించిన రావు తెలుగువారు కావడం మనకు గర్వకారణం.