ఒంగోలు కార్పొరేషన్ తెలుగుదేశం వశం!?
posted on Jul 15, 2024 @ 2:22PM
వైసీపీ కష్టాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తరువాత ఇక ఆ పార్టీకి స్థానిక సంస్థలపై కూడా పట్టు లేకుండా పోతోంది. పలు కార్పొరేషన్లు, మునిసిపాలిటీలలో వైసీపీ బలహీనం అవుతోంది. పంచాయతీలలో కూడా ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా మారుతోంది. తాజాగా ఒంగోలు కార్పొరేషన్ ను వైసీపీ కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. పలువురు కార్పొరేటర్లు వైసీపీని వీడి తెలుగుదేశం గూటికి చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటీవలి సాధారణ ఎన్నికలకు ముందే ఐదుగురు వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం గూటికి చేరారు. ఇప్పుడు తాజాగా మరో కార్పొరేటర్ శనివారం (జులై13) తెలుగుదేశం గూటికి చేరారు. దీంతో ఒంగోలు కార్పొరేషన్ లో తెలుగుదేశం బలం 13కు పెరిగింది. అయితే మరింత మంది కార్పొరేటర్లు కూడా వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని స్థానికంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ఒంగోలో ఎమ్మెల్యే దామచర్ల జనార్ధనరావు ఒంగోలు కార్పొరేషన్ పై దృష్టి పెట్టి వైసీపీ కార్పొరేటర్లను తెలుగుదేశంలోకి ఆహ్వానిస్తున్నారు. ఒంగొలు కార్పొరేషన్ కు వైసీసీ అధికారంలో ఉన్న సమయంలో ఎన్నికలు జరగడంతో ఆ పార్టీ సామదానభేద దండోపాయాలతో కొర్పొరేషన్ ను కైవసం చేసుకుంది. ఒంగోలు కార్పొరేషన్ లో 50 డివిజన్లు ఉండగా వాటిలో 43 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అప్పటి ఎన్నికలలో తెలుగుదేశం 6 డివిజన్లలోనూ, జనసేన ఒక డివిజన్ లోనూ విజయం సాధించింది.
కార్పొరేషన్ లో మెజారిటీ సాధించాలంటే తెలుగుదేశం పార్టీకి 26 మంది కార్పొరేటర్లు అవసరం. ప్రస్తుతం ఉన్న 13 మంది కార్పొరేటర్లు, ఒంగోలు ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే దామచర్ల, సంతనూతల పాటు ఎమ్మెల్యే విజయ్ కుమార్ ను కార్పొరేషన్ లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా సభ్యత్వం తీసుకోవడానికి రెడీ గా ఉన్నారు. ఈ ముగ్గురూ కూడా తోడైతే ఒంగోలు కార్పొరేషన్ లో తెలుగుదేశం బలం 13కు చేరుతుంది. మరో పది మంది వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం గూటికి చేరితే ఒంగోలు కార్పొరేషన్ తెలుగుదేశం హస్తగతం అవుతుంది. తాజా పరిణామాలను గమనిస్తుంటే పలువురు వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం గూటికి చేరడానికి రెడీగా ఉన్నట్లు అవగతమౌతోంది. అలా చేరడానికి సిద్ధంగా ఉన్న కార్పొరేటర్ల సంఖ్య పది నుంచి 15 వరకూ ఉన్నట్లు వైసీపీ వర్గాలలోనే గట్టిగా వినిపిస్తున్నది.
తెలుగుదేశంలో చేరేందుకు అవకాశం లేని ఒకరిద్దరు జనసేన ద్వారా కూటమికి, తద్వారా తెలుగుదేశంకు దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఒంగోలు మేయర్ గంగాడ సునీత తెలుగేదేశం గూటికి చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆమెతో పాటు పలువురు కార్పొరేటర్లు కూడా చేరే అవకాశాలు మెండుగా ఉన్నప్పటికీ.. తెలుగుదేశం నేతలు మాత్రం ఆమెను పక్కకు పెట్టి నేరుగా కార్పొరేటర్లతోనే సంప్రదింపులు చేస్తున్నారు.
ఈ పరిస్థితిని గమనించిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ కార్పొరేటర్ల వలసన నిరోధానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లు చెబుతున్నారు. ఇటీవలి ఎన్నికలలో ఒంగోలు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలినేని పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఎన్నికలలో ఓటమి తరువాత బాలినేని హైదరాబాద్ కే పరిమితమయ్యారు. కార్పొరేషన్ చేజారకూడదన్న ఉద్దేశంతో ఆయన సోమవారం ఒంగోలు చేరుకున్నారు. అయితే కార్పొరేటర్ల వలసలను నిరోధించడానికి ఆయన ప్రయత్నాలు ఫలించే అవకాశాలు దాదాపు మృగ్యం అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే కార్పొరేటర్ల వలసలను ఆపడానికి ఆయన పెద్దగా ఏమీ ప్రయత్నాలు చేయరని కూడా అంటున్నారు. జగన్ రెండేళ్ల కిందట మంత్రివర్గ విస్తరణలో తన మంత్రిపదవి ఊడబీకడం దగ్గర నుంచీ ఆ తరువాత జగన్ వ్యవహరించిన తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలినేని.. పార్టీ విషయాలు పెద్దగా పట్టించుకోవడం మానేశారు. ఎన్నికలలో పార్టీ ఓటమి, తన ఓటమి తరువాత ఆయన వైసీపీతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఒంగోలు కార్పొరేషన్ వైసీపీ చేజారకుండా ఆయన గట్టిగా ప్రయత్నించే అవకాశాలు లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏదో నామ్ కే వాస్తే కార్పొరేటర్లతో చర్చిస్తారే తప్ప వారిని పార్టీ మారకుండా నిరోధించేందుకు సీరియస్ గా ప్రయత్నించే అవకాశాలు లేవని అంటున్నారు. ఆ విషయం తెలుసు కనుకనే తెలుగుదేశంలో చేరాలని భావిస్తున్న కొందరు కార్పొరేటర్లు బాలినేని చెప్పేది విని ఆ తరువాతే నిర్ణయం తీసుకునే ఉద్దేశంతో ఉన్నారని అంటున్నారు.