వినుకొండ క్రైమ్ స్టోరీలో రాజకీయ జోకర్ జగన్
ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్లు అరాచక పాలన సాగించిన జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు దిమ్మతిరిగే షాకిచ్చారు. ప్రతిపక్ష హోదా కూడా దండగేనని గట్టిగా గడ్డి పెట్టారు. అయినా, జగన్ ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదు. నిత్యం కొట్లాటలు, హత్యలకు ఏపీ నిలయంగా ఉండాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులూ ఏపీని రావణ కాష్టంలా మార్చిన జగన్ తెలుగుదేశం పాలనలో కూడా రాష్ట్రం అలాగే ఉండాలన్నట్లుగా భావిస్తున్నారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నెలరోజులకే జగన్నాటకాన్ని మొదలు పెట్టారు.
చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి రాష్ట్రంలో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘర్షణలకు దూరంగా ఉంటూ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. దీంతో గత ఐదేళ్ల జగన్ కక్షపూరిత పాలనకు ఇబ్బందులు పడిన ప్రజలు చంద్రబాబు పాలన పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు వైసీపీ నేతలు సైతం చంద్రబాబు పాలనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడకే ప్రమాదం అన్న ఆందోళన జగన్ లో ఆరంభమైంది. దీంతో ఆయన రాష్ట్రంలో శాంతి భద్రతలు అధ్వానం అని ప్రచారం చేయడానికి కొత్త జగన్నాటకానికి తెరతీశారు.
జగన్ మోహన్ రెడ్డికి అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పబ్జీ గేమ్ తరహాలో రాష్ట్రంలో నిత్యం ఘర్షణలు, కోట్లాటలు జరగాలని భావిస్తుంటారు. 2019లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జగన్ అదే పనిచేశారు. ఐదేళ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడులు చేయించడం, పోలీసులతో కొట్టించడం, హత్యలు వంటి ఘటనలు వేల సంఖ్యలో చోటుచేసుకున్నాయి. తెలుగుదేశం జెండా పట్టినా, ఆ పార్టీకి మద్దతుగా నిలిచినా సహించలేక.. వారిపై తప్పుడు కేసులు బనాయించారు. దీంతో ఏపీలో ఎన్నికల ముందు వరకు తెలుగుదేశం బ్యానర్ కట్టేందుకు టీడీపీ నేతలు సైతం సాహసం చేయలేని పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత.. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలు కలిసిమెలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిస్తూ ముందుకు సాగుతున్నారు. కానీ, కక్షపూరిత రాజకీయాలకు అలవాటు పడిన జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు అధికార తెలుగుదేశం కూటమి నేతలు, కార్యకర్తలను రెచ్చగొట్టి ఘర్షణలు జరిగేలా ప్రణాళికలు రచిస్తున్నారు.
అలా వైసీపీ మూకల రెచ్చగొట్టే ధోరణి కారణంగా జరుగుతున్న ఘర్షణలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని, తమ అనుకూల మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేయిస్తున్నారు. అందులో భాగంగానే వినుకొండ ఘటనను రాజకీయంగా వాడుకొనేందుకు జగన్ పడరాని పాట్లు పడుతున్నారు.
వినుకొండలో జరిగిన హత్య ఘటనను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించిన జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో ఓ జోకర్‌గా మారారు. వినుకొండ ఘటనపై జగన్ వ్యవహరిస్తున్న తీరును చూస్తే రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకు ఎంతకైనా తెగించడానికి సిద్ధపడు తున్నా రని ప్రజలకు స్పష్టంగా అర్ధమైంది. పోలీసుల విచారణలో, జిలానీ, రషీద్‌లు చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఇళ్లు కూడా పక్కపక్కనే. రెండేళ్ల క్రితం వారిద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. ఆ గొడవతో ఇద్దరి మధ్య దాడులు జరిగాయి. వారి కుటుంబాల మధ్య కూడా వైరం పెరిగింది. ఆ తరువాత రషీద్ ఫిర్యాదుతో జిలానీ జైలు కెళ్లాడు. దీంతో రషీద్ పై జిలానీ కక్ష పెంచుకున్నాడు. ఇటీవల రషీద్ షాపులో పని ముగించుకొని వస్తుండగా జిలానీ కాపు కాసి దాడిచేసి హతమార్చాడు. ఈ ఘటనలపై జిలానీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి రషీద్, జిలానీ ఇద్దరికీ వైసీపీ, తెలుగుదేశం అన్న రాజకీయ తేడాలు లేవు. ఇరు పార్టీల నేతలతో వారు ఫొటోలు దిగారు. కానీ, జగన్ మోహన్ రెడ్డి, ఆయన గ్యాంగ్ రషీద్ హత్యను తెలుగుదేశం పార్టీకి అపాదించి, తెలుగుదేశం కూటమి హయాంలో ఏపీలో హత్యలు పెరిగిపోయాయని చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
మరో విచిత్రమైన విషయం ఏమిటంటే జగన్ రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. ఆ సందర్భంగా ఆయన కొడుకును కోల్పోయి పుట్టెడు శోకంలో ఉన్న మృతుడి తల్లిని ఓదార్ఛాల్సింది పోయి రాజకీయం మొదలుపెట్టారు. ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేస్తూ కూటమి సర్కార్ ను బద్నాం చేసేందుకు జగన్ అధిక ప్రాధాన్యతనిచ్చారు.
కూటమి అధికారంలోకి వస్తే అమ్మఒడి ఇస్తా అన్నారు.. తల్లికి వందనం అన్నారంటూ.. చంద్రబాబు హామీలను జగన్ గుర్తు చేయడం అందర్నీ విస్తుపోయేలా చేసింది. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్ధి వైఫల్యాలను గుర్తు చేసినట్టుగా పరామర్శలోనూ రాజకీయ అంశాలనే లేవనెత్తారు. జగన్ తీరునుచూసి పరామర్శకు వచ్చారా..? రాజకీయాలు చేసేందుకు వచ్చారా..? అని స్థానిక వైసీపీ నేతలే చర్చించుకోవటం కనిపించింది. రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని చెప్పుకొచ్చిన జగన్.. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేయడం వైసీపీ శ్రేణులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలరోజులే అయ్యింది. అప్పుడే రాష్ట్రపతి పాలన అంటూ జగన్ అనడాన్ని కొందరు వైసీపీ నేతలు తప్పుపట్టారు. దీనికితోడు.. ఏపీలో జరుగుతున్న దాడులపై ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తామని జగన్ సంచలన ప్రకటన చేశారు. అంతే కాదు.. ఏపీ పరిస్థితులపై బుధవారం ఢిల్లీలో ధర్నా చేస్తామని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ధర్నాకు దిగుతామని జగన్ అన్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ ను గమనించిన ఏపీ ప్రజలు జగన్ తీరుపట్ల ఆశ్చర్యపోతున్నారు. ఏపీ అభివృద్ధి చెందుతుంటే జగన్‌కు ఎందుకంత కడుపు మంట అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద వినుకొండ క్రైం స్టోరీలో జగన్ ఓ పొలిటికల్ జోకర్ పాత్ర పోషిస్తున్నారని నెటిజనులు ఎద్దేవా చేస్తున్నారు.