హరేకృష్ణ గోకుల క్షేత్రంలో చంద్రబాబు పూజలు!
posted on Jul 13, 2024 @ 11:51AM
గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించి పూజలు చేశారు. గర్భాలయంలో నిర్వహించిన అనంతశేష స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వేంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడ అనంత శేష స్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడితోపాటు సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కూడా పాల్గొన్నారు. అక్షయపాత్ర ఫౌండేషన్ అంతర్జాతీయ అధ్యక్షుడు మధుపండిట్, మంత్రులు నారాయణ, సవిత, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ‘‘మంచి చేసే వారందరికీ ఆంధ్రప్రదేశ్ చిరునామాగా వుంటుంది. మంచి చేసేవారంతా ఏపీలో ముందుకు రావాలి. అక్షయపాత్ర స్ఫూర్తితో రాష్ట్రంలో అతి త్వరలో అన్న క్యాంటిన్లను పునఃప్రారంభిస్తాం. హరేకృష్ణ సంస్థ దైవసేవతోపాటు మానవసేవను సమానంగా చేస్తోంది. ఆధ్యాత్మికత ద్వారా వచ్చే మానసిక ఆనందం లేకపోతే ముందుకు వెళ్ళలేం. దైవత్వాన్ని అందరిలోనూ పెంపొందించడానికి అక్షయపాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధు పండిట్ కృషి చేస్తున్నారు. 50 మంది ఐఐటీ పట్టభద్రులు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వుండటం అభినందనీయం. వేంకటేశ్వరస్వామి దయవల్లనే బాంబు పేలుళ్ళ నుంచి బయటపడ్డాను. ప్రపంచానికి సేవలందించే అవకాశం ఇవ్వడం కోసమే నాకు ఏడుకొండల వాడు ప్రాణభిక్ష పెట్టాడు’’ అన్నారు.
అమరావతి ప్రాంతంలో నూతన ఆధ్యాత్మిక ఒరవడికి శ్రీకారం చుట్టడం శుభసంకేతమని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ‘‘ఆలయాల్లోనూ రాజకీయాలు చొరబడిన ప్రభుత్వాలను మనం చూశాం. గోకుల క్షేత్రం నిర్మాణానికి సీఎం చంద్రబాబు సారథ్యంలో మార్గం సుగమమైంది. ఆధ్యాత్మికతతోపాటు సంస్కృతి, ఆచార వ్యవహారాలను కాపాడటం ముఖ్యం. ఇస్కాన్ సంస్థ ఎంతోమందికి అన్నదానం కూడా చేస్తోంది. అక్షయ పాత్ర ద్వారా గతంలో అన్న క్యాంటిన్లకు ఇస్కాన్ సంస్థ తోడ్పాటునిచ్చింది. ఎవరూ అర్ధాకలితో వుండకూడదనే ఉద్దేశంతో అక్షయపాత్ర అన్నదానం చేస్తోంది’’ అని ఎన్వీ రమణ అన్నారు.