రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదపడేలా కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు!
కేంద్ర విత్త మంత్రి నిర్మలాసీతారామన్ మంగళవారం (జులై 23)న లోక్ సభలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపులపై వైసీపీ ఎంపీ విజయసాయి పెదవి విరిచారు. బడ్జెట్ లో ఏపీకి ఏం దక్కిందని ఎటకారమాడారు. అయితే ఆయన ఉద్దేశపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం వరాల జల్లు కురిపించిందన్న సంగతిని విస్మరిస్తున్నారు.
కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు కీలకమైన కేటాయింపులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి దోహదపడే విధంగా విత్తమంత్రి నిర్మలాసీతారామన్ కేటాయింపులు చేశారు. పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, సామాజిక సంక్షేమం దిశగా ఏపీ అభివృద్ధి చెందడానికి వీలుగా ఈ కేటాయింపులు ఉన్నాయి. బడ్జెట్ లో ఏపీకి దక్కిన ప్రధాన కేటాయింపులు ఇలా ఉన్నాయి.
అమరావతి అభివృద్ధికి కేంద్ర బడ్జెట్ లో 15వేల కోట్ల రూపాయలను కేటాయించారు. ఇది ఆధునిక మౌలిక వసతులు, సౌకర్యాలు, అర్బన్ డెవలప్ మెంట్ కోసం ఉద్దేశించారు. ఇక పోలవరం ప్రాజెక్టు కోసం పది వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు రాష్ట్రంలో తాగు, సాగునీటి సమస్యలను పూర్తిగా దూరం చేస్తుంది. వ్యవసాయ ఉత్పాదకత పెంపునకు పోలవరం ప్రాజెక్టు అత్యంత కీలకం. తన బడ్జెట్ ప్రసంగంలో పోలవరం జాతీయ ప్రాజెక్టు అని గుర్తు చేసిన నిర్మలా సీతారామన్.. ఈ ప్రాజెక్టుకు అయ్యే ప్రతి పైసా కేంద్రమే భరిస్తుందని పునరుద్ఘాటించారు.
అలాగే పీఎం ఆవాజ్ యోజన పథకం కింద ఆంధ్రప్రదేశ్ కు గ్రామీణ, పట్టణ గృహ నిర్మాణం కోసం 12 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ నిధులు పేదలకు గృహవసతి కల్పించడమే కాకుండా వారి జీవన ప్రమాణాలు మెరుగు అయ్యేందుకు దోహదపడుతుంది.
రోడ్ల అభివృద్ధి, నూతన జాతీయ రహదారులు, ఎక్స్ ప్రెస్ వేల నిర్మాణం కోసం 6వేల కోట్ల రూపాయలు కేటాయించారు. దీని వల్ల రోడ్ల అనుసంధానం, సులభతర రవాణ, ప్రయాణ కాలం తగ్గుతుంది. ఇది ఆర్ధిక కార్యకలాపాలు జోరందుకోవడానికి దోహదపడుతుంది.
అదే విధంగా విశాఖపట్నం, చెన్నై కారిడార్ లో భాగంగా కొప్పర్తి నోడ్ అభివృద్ధికి ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని, ఆర్థిక అవకాశాలకు ఎంతగానో దోహదపడుతుంది. విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్ పెట్టుబడుల ఆకర్షణ, వేగవంతమైన పారిశ్రామిక ప్రగతి, ఉద్యోగ కల్పనలకు ఎంతగానో దోహదపడుతుంది.
ఇక పోతే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం గ్రాంట్ రూపంలో రాయలసీమ నాలుగు జిల్లాలు, ప్రకాశం, ఉత్తరాంధ్ర మూడు జిల్లాల సామాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు నిధులు కేటాయించారు. ఈ నిధులను ఆయా జిల్లాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, విద్య, ఆరోగ్య, ఇతక అత్యవసర సేవల అభివృద్ధికి వినియోగిస్తారు.
అలాగే రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలు, ఇతర విద్యాసంస్థల ఏర్పాటుకు 2,500 కోట్ల రూపాయలను నిర్మలాసీతారామన్ బడ్జెట్ లో కేటాయించారు. వీటి ద్వారా రాష్ట్రంలో ఆరోగ్య భద్రత, విద్యాభివృద్ధి జరుగుతుంది.
అలాగే పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల కోసం 3, 500 కోట్ల రూపాయలు కేటాయించారు. రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చేందుకు ఉపయోగిస్తారు. తద్వారా శిలాజ ఇంధనాలపై ఆధారపడే పరిస్థితి గణనీయంగా తగ్గుతుంది.
ఇక జల్ జీవన్ మిషన్ కింద రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ నిధులు నాణ్యమైన, గ్రామీణ ప్రాంతాలలో పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు దోహదపడతాయి. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కేంద్రంలో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇచ్చి నిధులను కేటాయించారని చెప్పడానికి ఇసుమంతైనా సందేహించాల్సిన పని లేదు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి దక్కిన కేటాయింపుల ద్వారా ఆర్థిక వృద్ధి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. తద్వార రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి.