తెలుగువన్ ముందే చెప్పింది.. జగన్ అడుగు కాంగ్రెస్ వైపే పడింది!
posted on Jul 24, 2024 @ 12:29PM
వైసీపీ వ్యూహం మార్చింది. ఇండియా కూటమికి అంటే కాంగ్రెస్ కు దగ్గరౌతోంది. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న ఐదేళ్లూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు అడుగులకు మడుగులొత్తుతూ రాష్ట్ర ప్రయోజనాల ఊసే లేకుండా గడిపేసిన వైసీపీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారం కోల్పోగానే బీజేపీకి దూరం జరిగి కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కు దగ్గర అవ్వడానికి అడుగులు వేస్తున్నది. కాంగ్రెస్‌తో దోస్తీ.. మారిన జగన్ వ్యూహం !? శీర్షికన జగన్ అడుగులు ఏ దిశగా పడనున్నాయన్న విషయాన్ని తెలుగువన్ మూడు రోజుల ముందే చెప్పింది. ఏపీలో చంద్రబాబు సర్కార్ ను ఇరకాటంలో పెట్టడమే లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ కు దగ్గరౌతున్నారని విస్పష్టంగా చెప్పింది. ఇందుకు కాంగ్రెస్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని పేర్కొంది. ఇప్పుడు తాజాగా వైసీపీ లోక్ సభ డిప్యూటీ స్పీకర్ విషయంలో కాంగ్రెస్ వాదనకు మద్దతు పలకడం ద్వారా తన అడుగులు ఎటుపడుతున్నాయన్నది చెప్పకనే చెప్పేసింది. జగన్ కాంగ్రెస్ కు మద్దతుగా నిలిస్తే అందుకు ప్రతిగా జాతీయ రాజకీయాల్లో జగన్ మోహన్ను హైలేట్ చేసేందుకు కాంగ్రెస్ పెద్దలు అంగీకరించారనీ, ఈ మేరకు వైసీపీ, కాంగ్రెస్ ల మధ్య డీల్ కుదిరిందని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఏపీలో వైసీపీ ఘోర పరాజయం తరువాత, ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రెండు సార్లు బెంగళూరు పర్యటనకు వెళ్లారు. ఆ రెండు సందర్భాలలోనూ ఆయన కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. ఆ సందర్భంగానే జగన్ తన ప్రతిపాదనలను ఆయన ద్వారా కాంగ్రెస్ హై కమాండ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా వైసీపీ మద్దతు, ఫండింగ్ ఉంటుందని జగన్ చెప్పారని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే అప్పట్లో జగన్ తో తన భేటీ వార్తలను డీకే శివకుమార్ ఖండించారు. కానీ తాజా పరిణామాలను గమనిస్తే.. జగన్, కాంగ్రెస్ ల మధ్య ఏదో స్థాయిలో సఖ్యత ఏర్పడిందని స్పష్టమౌతోంది.
వైసీపీ గత పదేళ్లుగా ఎన్డీయే కూటమికి మద్దతుగా ఉంటూ వచ్చింది. ఇందుకు ప్రధాన కారణం ఆ పార్టీ అధినేత జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసులేనని తెలిసిందే. ఇప్పుడు కూడా అక్రమాస్తుల కేసులు జగన్ మెడపై కత్తిగా వేలాడుతున్నప్పటికీ కాంగ్రెస్ కు వైసీపీ మద్దతుగా నిలుస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు. కాంగ్రెస్ కు లోక్ సభలో మద్దతుగా నిలిచినా.. రాజ్యసభలో వైసీపీకి ఉన్న 11 మంది ఎంపీల మద్దతు కోసం మోడీ సర్కార్ తన జోలికి రాదని జగన్ ధీమాగా ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ విషయంలో వైసీపీ బాహాటంగా కాంగ్రెస్ వాదనకు మద్దతు ప్రకటించింది. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ఇండియా కూటమికి కేటాయించాలంటూ గళమెత్తింది. ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలనే విషయాన్ని ఇటీవల నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో విజయసాయిరెడ్డి డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంటోందని, దీన్ని ప్రతిపక్షాల ఉమ్మడి కూటమికి దక్కాలని ఆయన డిమాండ్ చేశారు.