టీటీడీ పాలక మండలి రద్దు
posted on Jul 24, 2024 @ 11:16AM
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి రద్దైంది. పాలక మండలిలోని మొత్తం 24 మంది సభ్యులు రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను ఆమోదించిన ప్రభుత్వం టీటీడీ బోర్డును రద్దు చేసింది. కాగా ఇప్పటికే ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త ఛైర్మన్, బోర్డు సభ్యులను నియమించనుంది.
ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో రాజకీయ నియామకాలు జరిగాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల పవిత్రతను పాలకమండలి పట్టించుకోలేదనీ, కొండపై యథేచ్ఛగా అన్యమత ప్రచారం జరిగినా చూసీ చూడనట్లు వ్యవహరించిందనీ, శ్రీవారి బ్రేక్ దర్శనాల నుంచి కొండపై ప్రతి విషయంలోనూ వైసీపీ నేతల పెత్తనం పెరిగిపోయిందనీ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న చంద్రబాబు.. ప్రక్షాళనను తిరమల నుంచే ప్రారంభిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆయన చెప్పినట్లుగానే పాత ఈవో ధర్మారెడ్డి స్థానంలో జె. శ్యామల రావు టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన తరువాత తిరుమల కొండపై అరాచకాలకు అడ్డుకట్ట వేసే కార్యక్రమం చేపట్టారు. కొండపై అపచారాలకు, అక్రమాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. తిరుమల కొండపై పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు రద్దు కావడంతో త్వరలో కొత్త పాలక మండలి నియామకం జరిగనుంది.