శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు భారీగా వరద నీరు!

కృష్ణ నదీ పరివాహక ప్రాంతాలలో భారీగా కురుస్తున్న వర్షాలతో వరద నీరు పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం గేట్లు ఎత్తి కిందకు నీరు విడుదల చేయడానికి అధికారులు సమాయత్తం అవుతున్నారు. మంగళవారం (జులై 30) శ్రీశైలం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు నీటి కళ రానుంది. శ్రీశైలం నుంచి వరద జలాలు సాగర్ కు చేరనున్నాయి. కర్నాటక నుంచి భారీగా వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతుండటంతో.. వచ్చిన నీటిని వచ్చినట్లుగానే దిగువకు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు.  శనివారం(జులై 27)  జూరాల నుంచి 3 లక్షల 12 వేల 544 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 99 వేల 736 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. దీంతో శ్రీశైలం జలాశయానికి వదర పోటెత్తింది. శ్రీశైలం జలాశయం   శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 866.40 అడుగులకు చేరింది. శ్రీశైలం నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీంఎంసీలు కాగా, ప్రస్తుతం 127.5950 టీఎంసీల నీరు నిల్వ ఉంది.  ఎడమ గట్టు జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ 18,480 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.   వరద ఇలాగే కొనసాగితే మంగళవారం (జులై 30) శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం ఉందని డ్యాం ఇంజనీర్లు చెబుతున్నారు.  

జగన్ అడ్డగోలు విమర్శలు.. విస్తుపోతున్న వైసీపీ శ్రేణులు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరోగమనంలో ఉందని మాజీ సీఎం జగన్ తెలుగుదేశం కూటమి సర్కార్ పై ఆరోపణలు గుప్పిస్తున్నారు. అందుకు ప్రతిగా సీఎం చంద్రబాబు జగన్ ప్రస్తావించిన అంశాలను ఒక్కొక్కటిగా తీసుకుని వాటన్నిటినీ  అసెంబ్లీ వేదికగా వివరించారు. జగన్ ఆరోపణలన్నీ అవాస్తవాలని తేల్చేశారు. అసెంబ్లీ సమావేశాలకు డుమ్మాకొట్టి బయట ఆరోపణలు చేయడం పిరికిపంద లక్షణమనీ, అసెంబ్లీకి హాజరై.. ఆ ఆరోపణలు చేసి ఉంటే నిజాలు నిగ్గు తేల్చేవాళ్లమని చంద్రబాబు పేర్కొన్నారు. ఆ ధైర్యం లేకే, నిజాలను విని తట్టుకునే దమ్ము లేకపోవడం వల్లే జగన్ అసెంబ్లీ నుంచి పారిపోయారని చంద్రబాబు విమర్శించారు.  జగన్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా.. తెలుగుదేశం కూటమి అధికారం చేపట్టిన తరువాతనే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్దికి బాటలు పరుచుకున్నాయి, జగన్ ఐదేళ్ల పాలనలో జరిగిన విధ్వంసాన్ని చూసిన జనం.. చంద్రబాబు రాష్ట్రం అభివృద్ధి కోసం వేస్తున్న అడుగులను స్వాగతిస్తున్నారు. జగన్ శాంతి భద్రతల పరిస్థితిపై చేస్తున్న విమర్శలను పట్టించుకోవడం లేదు. 52రోజుల కూటమి పాలన దాడులు,అత్యాచారాలు,హింసాకాండ నడుస్తోందంటూ జగన్ హస్తిన వెళ్లి ధర్నా చేయడాన్ని చూసి నవ్వుకుంటున్నారు.   మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారం టూ జగన్ చేస్తున్న ఆరోపణలను ప్రజలే తిప్పి కొడుతున్నారు.  మదనపల్లి సబ్ కలక్టరేట్ లో   కీలక ఫైళ్ల దగ్ధం వెనుక ఉన్నది ఎవరని నిలదీస్తున్నారు.  రషీద్ హత్యపై జగన్ చేస్తున్న ఆరోపణలను సొంత పార్టీ వారే నమ్మడం లేదు.  హంతకుడూ, హతుడూ కూడా నిన్నమొన్నటి వరకూ వైసీపీలోనే ఉన్న సంగతిని వైసీపీ వర్గాలే గుర్తు చేసుకుంటున్నారు.   చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల చేస్తే, అసెంబ్లీలో వాటిపై మాట్లాడాల్సింది పోయి, సభకు డుమ్మా కొట్టి బయట నుంచి విమర్శలేమిటని నిలదీస్తున్నారు.  తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకూ 36హత్యలు  జరిగాయంటూ విమర్శలు చేస్తున్న జగన్.. హతుల పేర్లు ఎందుకు చెప్పడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 36 మంది హత్యకు గురైతే ఒక్క రషీద్ కుటుంబాన్నే పరామర్శించడానికి కారణమేమిటన్న భావన వైసీపీ వర్గాల్లోనే వ్యక్తం అవుతోంది.  మొత్తం మీద జగన్ తీరు పట్ల వైసీపీలోనే అసహనం వ్యక్తం అవుతోంది. ఇంత అడ్డగోలుగా ఎలా మాట్లాడతారన్న విస్మయం వ్యక్తం అవుతోంది.

చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి అరెస్ట్!

వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించిన అనేకమంది మంచివాళ్ళలో ఒక మంచివాడు, జగన్మోహన్‌రెడ్డి సర్టిఫికెట్ ఇచ్చిన చాలామంది సౌమ్యులలో ఒక సౌమ్యుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతను మరెవరో కాదు, మంచివాళ్ళకే మంచివాడు, సౌమ్యులకే సౌమ్యుడైన చంద్రగిరి మాజీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి పుత్రరత్నం. ఎన్నికల అనంతరం చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి చేసిన మోహిత్‌రెడ్డి గ్యాంగ్ ఆయన్ను చంపే ప్రయత్నం చేసింది. మోహిత్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన తిరుపతి పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. 

ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ!

పాతబస్తీ అంటే ఓల్డ్ సిటీ కాదని... ఒరిజినల్ సిటీ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పాత బస్తీలో మెట్రో నిర్మాణం అంశం మీద  ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ, ‘‘పాతబస్తీ అంటే ఓల్డ్ సిటీ కాదు.. అది ఒరిజినల్ సిటీ’’ అన్నారు. పాతబస్తీ మెట్రో నిర్మాణాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని  ఆయన చెప్పారు. ఎస్. జైపాల్ రెడ్డి కేంద్ర అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రిగా వయబుల్ గ్యాప్ ఫండ్ తీసుకువచ్చి హైదరాబాద్ మెట్రో నిర్మాణానికి కృషి చేశారని తెలిపారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఓల్డ్ సిటీకి మెట్రో రైల్ అందుబాటులోకి తీసుకురాలేదని రేవంత్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపన చేశామని చెప్పారు. మెట్రో రెండో దశలో 78 కిలోమీటర్ల మెట్రో ప్రాజెక్టు కోసం కేంద్రానికి నివేదిక సమర్పించామన్నారు. నాలుగేళ్లలో ఓల్డ్ సిటీ... అంటే ఒరిజినల్ సిటీలో మెట్రో పనులు పూర్తి చేసే బాధ్యత తనదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

చంద్రబాబుకు టాప్ ప్రయారిటీ.. అలిగిన దీదీ..నీతి ఆయోగ్ నుంచి వాకౌట్!

ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లోని కల్చరర్ సెంటర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్   గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం  నుంచి తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాకౌట్ చేశారు.    ఎన్డీఏ కీలక భాగస్వామిగా ఉన్న బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్.. ఆ సమావేశానికి రాకుండా డిప్యూటీ సీఎంలను పంపించారు. మరోవైపు.. బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రాలపై వివక్ష చూపిస్తోందని ఆరోపిస్తూ ఇండియా కూటమిలోని పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల సీఎంలు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాకుండా బహిష్కరించాయి. అయితే ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ సమావేశాలనికి హాజయర్యారు. అయితే సమావేశం మధ్యలోనే ఆమె వాకౌట్ చేశారు. వాకౌట్ చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సమావేశంలో  తనకు మాట్లాడే అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి మైక్ కట్ చేశారనీ ఆరోపించారు.  తమ రాష్ట్రానికి నిధుల కేటాయింపు గురించి తాను మాట్లాడటం ప్రారంభించగానే.. తన మైక్‌ ఆఫ్ చేశారని ఆమె ఆరోపించారు. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పశ్చిమ బెంగాల్‌పై వివక్ష చూపారని.. రాష్ట్రానికి నిధులు కేటాయించాలంటూ తాను మాట్లాడగానే తన మైక్ ఆపేసి.. మాట్లాడకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు.  సమావేశంలో పాల్గొన్న మిగతా సభ్యుల మాదిరిగానే మాట్లాడేందుకు తనకు తగిన సమయం ఇవ్వకుండా  అవమానించారనీ,  ముఖ్యంగా  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడేందుకు 20 నిమిషాల సమయం ఇచ్చారని.. కానీ తనకు మాత్రం కేవలం ఐదు నిముషాలు మాత్రమే సమయం ఇచ్చారనీ, ఈ వివక్షకు నిరసనగా తాను సమావేశం నుంచి వాకౌట్ చేసినట్లు మమత చెప్పారు.  భవిష్యత్తులో ఇంకెప్పుడూ తాను నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకానని మమత శపథం చేశారు. అయితే మమతా బెనర్జీ ఆరోపణలను   బీజేపీ తీవ్రంగా ఖండించింది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు నేతలు బాయ్‌కాట్‌ చేసేందుకు నీతి ఆయోగ్‌ సమావేశాన్ని ఒక వేదికగా చేసుకున్నారని పేర్కొంది. 

అగ్గిపెట్టె మచ్చా నోటికొచ్చిన లెక్కలు!

తెలంగాణలో టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వుండగా ఏం చేసేవారంటే, కేసీఆర్ కుటుంబం తెలంగాణని అద్భుతంగా పరిపాలించేది. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు...  వీళ్ళ నుంచి వందలమంది పుట్టుకొచ్చేవాళ్ళు. వాళ్ళు తెలంగాణ మొత్తం తిరుగుతూ వుండేవాళ్ళు. ఎక్కడ ఏ నేరం జరగబోతున్నా ఆ నేరాన్ని జరక్కుండా ఆపేవాళ్ళు. అలాగే ఇంత గొప్ప పాలనలో పోలీసులు కూడా అద్భుతంగా పనిచేసేవాళ్ళు రాష్ట్రంలో ప్రతి వీధిలోనూ ఒక్కో పోలీసు వుండేవాడు. పోలీసులు జరుగుతున్న నేరాలను ఆపడం మాత్రమే కాదు... జరగబోయే నేరాలను కూడా పసిగట్టేసి ఆపేసేవాళ్ళు. ఆపడానికి పోలీసుల వల్ల కూడా కాని నేరాలను కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు సూపర్ మ్యాన్, స్పైడర్ మాన్ తరహాలో క్షణాల్లో అక్కడ ప్రత్యక్షమైపోయి వాటిని ఆపేసేవారు. దాంతో కేసీఆర్ పరిపాలనలో తెలంగాణలో నేరాలే జరిగేవి కావు. కానీ, గత ఎనిమిది నెలలుగా కేసీఆర్ ప్రభుత్వం లేకపోవడంతో తెలంగాణలో ఎక్కడ చూసినా నేరాలే నేరాలు.. నేరాల మీద నేరాలు.. ఈ సోది అంతా ఏంటి అనుకుంటున్నారా? తెలంగాణలో శాంతిభద్రతల పరిస్థితి మీద బీఆర్ఎస్ నాయకుడు, అగ్గిపెట్టె మచ్చా హరీష్ రావు మాట్లాడుతున్న తీరు కూడా ఇలాగే వుంది మరి! బీఆర్ఎస్ లాంటి గొప్ప పార్టీ అధికారంలో లేకపోవడంతో ఈ ఎనిమిది నెలల కాలంలో నేరాల సంఖ్య బాగా పెరిగిపోయిందట. కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు కదా అని, నేరస్తులు రెచ్చిపోయి నేరాలు చేసేస్తున్నారట. కేవలం ఈ ఎనిమిది నెలల కాలంలోనే రాష్ట్రంలో లక్ష కంటే ఎక్కువ నేరాలు జరిగాయట. వాటిలో 5 వందలు హత్యలు, 1800 రేప్‌లు, 60 డెకాయిటీస్, 400 రాబరీలు, 10 వేల దొంగతనాలు వున్నాయట. కాబట్టి, ఈ అగ్గిపెట్టె మచ్చా ఉద్దేశమేంటి? అర్జెంటుగా తమ పార్టీకి అధికారం ఇచ్చేస్తే, కేసీఆర్ అండ్ కో తెలంగాణలో నేరాలేవీ జరక్కుండా చూస్తారు. అదీ విషయం. బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నాడట ఎవడో హరీష్‌రావు లాంటివాడే. అసెంబ్లీ సాక్షిగా ఆయన పోలిగాడి కంటే దారుణమైన అబద్ధాలు చెబుతున్నారు. ఉదాహరణకి 80 రోజుల్లో 1800 రేప్‌లు జరిగాయని ఆయన సెలవిస్తున్నారు. అంటే రోజుకు 20కి పైగానే మానభంగాలు జరుగుతున్నట్టు ఆయన చెబుతున్నారు. నా నోటికొచ్చింది నేను చెప్తా మీ చావు మీరు చావండి. నా చేతికొచ్చిన బురద మీ మీద జల్లుగా కడుక్కుంటారో చస్తారో మీ ఇష్టం. మాకు మాత్రం అర్జెంటుగా అధికారం కావాలి అన్నట్టుగా వుంది హరీష్ రావు వ్యవహారం.  తెలంగాణలో బీఆర్ఎస్ వాళ్ళ వ్యవహారం, ఆంధ్రప్రదేశ్‌లో జగన్ వ్యవహారం ఒకేలా వున్నాయి. చవటాయని నేను అని ఒకళ్ళు అంటే, నీకంటే పెద్ద చవటాయని నేను అని మరొకరు అంటున్నారు. జగనేమో ఢిల్లీ వెళ్ళి 36 హత్యలు జరిగాయని మొత్తుకున్నాడు. ఆ హత్యకు గురైనవాళ్ళ పేర్లు చెప్పవయ్యా మగడా అని మీడియావాళ్ళు, హోంమంత్రి, ముఖ్యమంత్రి అడుగుతుంటే ‘టాపిక్ డైవర్ట్ చేయొద్దు’, నేను ఇచ్చిన ఫొటోలు చూసి తెలుసుకోండి అని చెబుతున్నాడు. నా నోటికి వచ్చింది నేను చెబుతా, మీరు విని ఊరుకోండి.. ఎదురు ప్రశ్నలు వేయొద్దు అంటున్నాడు. తెలంగాణలో కేసీఆర్ అండ్ కో, ఆంధ్రలో జగన్ అండ్ కో ఇలాంటి నీచమైన రాజకీయాలు చేశారు కాబట్టే వీళ్ళని జనం పక్కన పెట్టారు. అయినప్పటికీ వీళ్ళలో ఎలాంటి మార్పు రాలేదు. 

గుడుంబా తర్వాత గంజాయికి అడ్డా ధూల్ పేట

ధూల్ పేట ఒకప్పుడు గుడుంబా తయారీకి అడ్డా... నేడు గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు అడ్డా గా మారింది.  హైదరాబాద్‌లోని దూల్‌పేట ప్రాంతం గంజాయి హబ్‌గా మారిందని, ఎక్కడ గంజాయి పట్టుబడినా మూలాలు ఇక్కడే కనిపిస్తున్నాయని అబ్కారీ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కమలాసన్ రెడ్డి తెలిపారు. శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో డ్రగ్స్ నియంత్రణకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. కొన్నిరోజులుగా మాదక ద్రవ్యాల నిరోధానికి స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆపరేషన్‌లో భాగంగా పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దూల్‌పేటలో గతంలో నాటుసారాను నియంత్రించామని, ఇప్పుడు ఆ ప్రాంతంలో గంజాయి విచ్చలవిడిగా లభిస్తోందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ గంజాయి దొరికినా తీగలాగితే దూల్‌పేట పేరు వస్తోందన్నారు. మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రత్యేకంగా వెయ్యి మంది పోలీసులకు శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. పట్టుబడిన నిందితులకు శిక్షలు పడేవిధంగా కేసులను విచారిస్తున్నట్లు చెప్పారు. ఆగస్ట్ 31 లోపు దూల్‌పేటను గంజాయిరహిత ప్రాంతంగా చేస్తామని శపథం చేశారు. అన్ని ప్రాంతాలపై దృష్టి సారించినట్లు చెప్పారు. నిందితులు శివారు ప్రాంతాల్లో గంజాయిని నిల్వ చేస్తున్నారని, వాటిని దూల్‌పేటకు తీసుకువచ్చి విక్రయిస్తున్నారని తెలిపారు. ఈ రెండు మూడు రోజుల్లోనే 66 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు తెలిపారు.

చిత్తూరులో వైసీపీ చిత్తుకాగితం!?

చిత్తూరు జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోతోంది. ఇప్పటికే ఆ పార్టీ సగం ఖాళీ అయిపోతే.. జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఆ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోవడానికి ఎక్కువ రోజులు పట్టదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటే క్యాడర్ లో నమ్మకాన్ని పాదుకొల్పడానికి జగన్ అండ్ కో చేసిన ప్రయత్నాలు రాష్ట్రంలో మిగిలిన జిల్లాలలో  ఏ మేరకు ప్రభావం చూపాయన్నది పక్కన పెడితే.. చిత్తూరు జిల్లాలో మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో మాత్రం ఘోరంగా బెడిసికొట్టాయి. పుంగనూరు వినా మరెక్కడా వైసీపీ అభ్యర్థులు విజయం సాధించలేదు. భారీ తేడాతో పరాజయం మూటగట్టుకున్నారు. కుప్పంలో పాగా వేస్తామంటూ నియోజకవర్గ బాధ్యతలు తీసుకుని పని చేసిన పుంగనూరు పుడింగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తన సొంత నియోజకవర్గంలో చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా విజయం సాధించినా.. పుంగనూరులోకి అడుగుపెట్టాలంటేనే భయపడుతున్నారు.  జిల్లాలోని వైసీపీ నేతలందరిదీ దాదాపు ఇదే పరిస్థితి. తమ మాటలు నమ్మి పార్టీ కోసం పని చేసిన క్యాడర్ ను గాలికొదిలేసి.. బతుకు జీవుడా అంటూ జిల్లా దాటి పారిపోతున్నారు.  అందుకే జిల్లాలో పుంగనూరు వినా మిగిలిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ వైసీపీ అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు. అది పక్కన పెడితే ఎన్నికల ఫలితాల తరువాత జిల్లాలో వైసీపీ నాయకులంతా సైలెంట్ అయిపోయారు. ఫలితాలు వెల్లడయ్యే వరకూ క్యాడర్ ను రెచ్చగొడుతూ, వారిలో గెలుపు ధీమాను నింపుతూ మాట్లాడిన నేతలంతా ఫలితాల తరువాత క్యాడర్ మానాన క్యాడర్ ను వదిలేసి అజ్ణాతంలోకో లేక జిల్లా దాటి హైదరాబాద్ వంటి ప్రాంతాలకో వెళ్లిపోయారు. జిల్లా కేసి ముఖం తిప్పి కూడా చూడటం లేదు.   తమ మాట నమ్మి జిల్లాలో రాజీనామా చేసిన వాలంటీర్ల అతీగతీ పట్టించుకోవడం లేదు. ఫలితం ఇప్పుడు ఆ వాలంటీర్లే వైసీపీ నేతలపై ఆగ్రహంగా ఉన్నారు.  నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్కే రోజా అయితే చెన్నైకి మకాం మార్చేశారు. ఇక నగరి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలూ సోదిలోకి కూడా కనిపించడం లేదు. వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు తెలుగుదేశం తలుపు తట్టారు. అయితే వారికి ఆ పార్టీలో ప్రవేశం లేదని తేలిపోవడంతో ప్రస్తుతానికి మౌనమే మేలన్న మూడ్ లోకి వెళ్లిపోయారు.   మాజీ ఉపముఖ్యమంత్రి  అడ్రస్ లేకుండా పోయారు. అధికారంలో ఉన్నంత కాలం తెలుగుదేశం నాయకులు, మీడియా అధినేతలపై అమవానకరంగా వ్యాఖ్యలు చేయడం తప్ప మరో పేనే లేదన్నట్లుగా విర్రవీగిన నారాయణ స్వామి ఇప్పుడు పూర్తిగా మౌనం వహించారు. ప్రస్తుతం ఆయన పుత్తూరులో కొన్ని రోజులూ, చెన్నైలో కొన్ని రోజులూ గడుపుతూ కాలం వెళ్ల దీస్తున్నారు.  కుప్పం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన భరత్ అయితే ఫలితాలు వచ్చిన వారం రోజుల వరకూ స్థానికంగానే నివసించినా ఇప్పుడు మాత్రం కుప్పం వదిలేసి హైదరాబాద్ కు మకాం మార్చేశారు.   కనీసం వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనలేదు.  ఇక జిల్లాలోని వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులైతే తెలుగుదేశం గూటికి చేరడానికి డిస్పరేట్ గా ప్రయత్నిస్తున్నారు. చిత్తూరు మునిసిపల్ చైర్మన్ సుధీర్ అమరావతి వెళ్లి తెలుగుదేశం గూటికి చేరే ప్రయత్నాలు ప్రారంభించారు. తటస్థులకు పార్టీ తలుపులు తెరిచే ఉంటాయన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి మాటల మేరకు తాను తెలుగుదేశం గూటికి చేరేందుకు సిద్ధమని సన్నిహితుల వద్ద చెబుతున్నారు. దీనిని బట్టి చూస్తే సుధీర్ నేడో రేపో సైకిలెక్కేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఇక పూతల పాడు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన డాక్టర్ సునీల్ కుమార్ అయితే ప్రస్తుతం రాజకీయాల ఊసెత్తకుండా పలమనేరులోని తన ఆసుపత్రిలో వైద్య వృత్తి సాగిస్తున్నారు.  కుప్పంలో చంద్రబాబును ఓడిస్తాం అంటూ ప్రగల్భాలు పలికిన నేతలు ఇప్పుడు జిల్లాలోని సొంత నియోజకవర్గంలోకే అడుగుపెట్టడానికి భయపడుతున్నారు. మొత్తం మీద ఇప్పటికే చిత్తూరు జిల్లాలో వైసీపీ సగం ఖాళీ అయిపోయింది. రానున్న రోజుల్లో పార్టీ మెత్తం ఖాళీ అయిపోయినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు అంటున్నారు. 

ఇలాంటి అజ్ఞానిని మనం భరించాం!

ప్రపంచ ప్రఖ్యాత గ్యాంగ్‌స్టర్, డ్రగ్స్ వ్యాపారి, క్రిమినల్ ఎస్కోబార్ గురించి తెలియకపోవడం పెద్ద తప్పేమీ కాదు. ఈ ప్రపంచంలోని అందరు వ్యక్తులూ అందరికీ తెలియాలని రూలేమీ లేదు. విజయవాడలో హోటల్ నడుపుకునే వ్యక్తిని ‘నీకు పాబ్లో ఎస్కోబార్ తెలుసా?’ అని అడిగితే అతను తెలియదని అనడం తప్పేమీ కాదు. మన్యంలో కూలీపని చేసుకునే వ్యక్తిని ఈ ప్రశ్న అడిగితే, అతను ‘తెలియదు’ అని సమాధానం ఇస్తే తప్పు కానే కాదు. సంసార బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక అక్కనో, చెల్లినో ఈ ప్రశ్న అడిగితే ఆమె ‘తెలియదు’ అని సమాధానం చెబితే అది తప్పు కానే కాదు. అంతెందుకు? రీసెంట్‌గా బీటెక్ పాసై, భారీ జీతానికి సాఫ్ట్.వేర్ ఉద్యోగం చేస్తున్న యూత్‌ కూడా ఈ ప్రశ్నకు ‘తెలియదు’ అని సమాధానం ఇస్తే, అదీ తప్పు కాదు. కానీ, మొన్నటి వరకు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి పాబ్లో ఎస్కోబార్ పేరు తెలియకపోతే  మాత్రం క్షమించరాని తప్పు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ప్రకటించినప్పుడు జగన్ని అంతర్జాతీయంగా చెడ్డ పేరు వున్న డ్రగ్స్ వ్యాపారి, హంతకుడు, క్రిమినల్ పాబ్లో ఎస్కోబార్‌తో పోల్చారు. అంతే, ఈ పాయింట్‌ని నేషనల్ మీడియా అందుకుంది. జగన్‌ని చంద్రబాబు నాయుడు ఎస్కోబార్‌తో పోల్చారని, జగన్ ఈజ్ ఆంధ్రా ఎస్కోబార్ అని భారీ స్థాయిలో కథనాలు ప్రసారం చేసింది. జగన్‌కి ఇవన్నీ ఆయన భజనపరులు చెప్పరో, చెప్పినా తెలియనట్టు నటిస్తారో గానీ, జర్నలిస్టులు జగన్ దగ్గర ఎస్కోబార్ ప్రస్తావన తెచ్చినప్పుడు జగన్ పాబ్లో ఎస్కోబార్ పేరుని పలకడానికే తికమకపడిపోయినట్లు, ఆ పేరు జీవితంలో ఏనాడూ విననట్టు వ్యవహరించాడు. జగన్ ఈ విషయంలో తన అమోఘమైన నటన ప్రదర్శించాడని అనుకోవడం లేదు. ఎందుకంటే, ఈ మొహానికి నిజంగానే ఎస్కోబార్ ఎవరో తెలిసి వుండదు. తండ్రి, తాత సంపాదించిన డబ్బు, తండ్రి పేరుని అడ్డు పెట్టుకుని తాను తాను సంపాదించిన డబ్బు, వెంట వుండే క్రిమినల్ బ్యాచ్, చెప్పినట్టు చేసే రాయలసీమ గ్యాంగ్‌లు.. వీటి సహాయంతోనే జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు తప్ప, అయ్యగారికి చదువు లేదు, సంస్కారం లేదు, పరిజ్ఞానం లేదు, విచక్షణా జ్ఞానం అంతకన్నా లేదు. అందినచోటల్లా అప్పు చేయడం, బటన్లు నొక్కడం తప్ప ఏమీ తెలియదు. ఐదేళ్ళ పదవీ కాలంలో అప్పులు చేయడం తప్ప, సొంతగా ప్లాన్ చేసి రాష్ట్రం కోసం ఒక్క రూపాయి కూడా సంపాదించని ఏకైక ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే, మన జగనయ్య.  ఇలాంటి వ్యక్తికి శరీరంలో సిగ్గు ఎంతమాత్రం లేకపోవడం బాగా కలిసొచ్చిన అంశం. ఎవరు ఏమైనా అనుకోనీ, నా బిహేవియర్ నాదే, నా అబద్ధాలు నావే, నా అహంకారం నాదే, నా అజ్ఞానం నాదే అన్నట్టుగా వ్యవహరిస్తున్న ఇలాంటి మనిషినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా భరించింది అని మనమీద మనకే జాలి కలుగుతోంది. 

ఆర్ఎస్ఎస్ ప్రాపకం కోసం మోడీ తంటాలు!

సార్వత్రిక ఎన్నికలకు ముందు, తర్వాతా కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మోడీ విధానాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉందన్న వార్తలు గట్టిగా వినిపించాయి. ఎన్నికల ముందు అయితే బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వచ్చే అవకాశాలు ఇసుమంతైనా కనిపించడం లేదని ఆర్ఎస్ఎస్ పెద్దలే అన్నారు. ప్రధానిగా మోడీకి ప్రత్యామ్నాయాన్ని బీజేపీ చూసుకోవాలన్న బలమైన సంకేతాలు కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీకి పంపింది.  ప్రధానిగా రెండో సారి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత నుంచీ, అంటే 2019 ఎన్నికలలో బీజేపీ సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ ను అధిగమించిన నాటి నుంచీ... కమలం పార్టీలో ప్రాధాన్యతలు మారిపోయాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ బీజేపీ ప్రభుత్వాలే ఉండాలన్న లక్ష్యంగా అడుగులు వేయడం ప్రారంభమైంది. ఆ క్రమంలో మిత్రపక్షాలలో సైతం చీలికలను ప్రోత్సహించింది. ఈ క్రమంలో పార్టీకి రాజకీయ మెంటార్ అయిన బీజేపీని ఖాతరు చేయడం మానేసింది. ఇందుకు కారణం.. పార్టీలో, ప్రభుత్వంలో ప్రధాని మోడీ తిరుగులేని ఆధిపత్యం చెలాయించడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో ఆర్ఎస్ఎస్, బీజేపీ మధ్య గ్యాప్ పెరిగింది. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్, ప్రధాని మోడీ మధ్య అగాధం రోజు రోజుకూ పెరుగుతూ వచ్చింది. పర్యవశానంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు పరస్పర విమర్శలకు దిగిన సందర్భాలు కూడా చోటు చేసుకున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పని తీరు మీద తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎన్నికలకు ముందు బీజేపీ అధ్యక్షుడు జె.పి. నడ్డా ఆరెస్సెస్‌ విమర్శలు గుప్పించారు.   బీజేపీ ఒక స్వతంత్రమైన పార్టీ అనీ, దాని వ్యవహారాలను అది నిర్వహించుకోగలదని నడ్డా వ్యాఖ్యానించడం జరిగింది. అదంతా పక్కన పెడితే.. 2024 ఎన్నికలలో బీజేపీకి చావు దెబ్బ తగిలింది. గత రెండు ఎన్నికలలో ఘన విజయాలు సాధించిన ఆ పార్టీ ఇప్పుడు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థానాలను గెలుచుకోవడంలో విఫలమైంది. దీంతో అనివార్యంగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మద్దతు, దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలోలా ఏకపక్ష నిర్ణాయాలు తీసుకునే సావకాశం కానీ అవకాశం కానీ మోడీకి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే ఇంత కాలం పార్టీపైనా, ప్రభుత్వంపైనా తిరుగులేని ఆధిపత్యం వహించిన మోడీకి ఇప్పుడు ఒక్కో అడుగూ ఆచి తూచి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. భాగస్వామ్య పక్షాల డిమాండ్లకు తలొగ్గక తప్పని సరి కావడమే కాకుండా, ఆర్ఎస్ఎస్ తో గ్యాప్ లేకుండా చూసుకోవలసిన అగత్యం ఏర్పడింది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అండ లేకుండా పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు పొందడం సాధ్యం కాదు. అదీ లోక్ సభలో సంపూర్ణ మెజారిటీ లేని స్థితిలో  అలాంటి మద్దతు లభించడం దాదాపు అసంభవం. ఎందుకంటే బీజేపీలో అత్యధికులు ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నవారే. అందుకే ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ అనివార్యంగా ఆర్ఎస్ఎస్ తో గ్యాప్ పూడ్చుకునే ప్రయత్నాలు ఆరంభించారు. అందులో భాగమే  ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో కేంద్ర ప్రభుత్వోద్యోగులు పాల్గనకుండా ఉన్న నిషేధాన్నితొలగించడం.  గత ఐదు దశాబ్దాలుగా అమలులో ఉన్న ఈ నిషేధాన్ని ఎత్తివేయడం కోసం మోడీ గత పదేళ్లలో ఒక్కటంటే ఒక్క ప్రయత్నం చేయలేదు.   ఇప్పుడు హడావుడిగా నిషేధాన్ని ఎత్తివేయడంతో సర్వత్రా మోడీ ఆర్ఎస్ఎస్ పట్ల తన విధేయతను  చాటు కోవడం కోసమేనని అంటున్నారు. ఆరెస్సెస్‌, జమాతే ఇస్లామీ వంటి సంస్థల కార్యకలాపాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకుండా నిషేధం విధిస్తూ 1966, 1970, 1980 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.    ఆ నిషేధాన్ని  జూలై 9న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.  ప్రభుత్వ వ్యవహారాల నుంచి రాజకీయ వ్యవహారాలను దూరంగా ఉంచాలన్న సదుద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగు లను పార్టీలు, పార్టీల అనుబంధ సంస్థల కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిషేధించడం జరిగింది. ఇప్పుడు మోడీ తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆ నిషేధాన్ని తొలగించడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతున్నది.

హైదరాబాద్ లో మరో కొత్త వైరస్....నోరో వైరస్ తో అప్రమత్తం  

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికించి. కరోనా మహమ్మారి వల్ల లక్షలాదిమంది మృత్యువాత పడ్డారు. అందరూ ఊపిరి పీల్చుకుంటున్న వేళ తెలంగాణ రాజధాని వాసులపై బాంబు పడ్డంత పనైంది.  హైదరాబాద్ నగరంలో మరో వైరస్ విజృంభిస్తోంది. వేగంగా వ్యాపించే నోరో వైరస్‌పై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ నగరవాసులను అప్రమత్తం చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా జీహెచ్ఎంసీ పలు సూచనలు జారీ చేసింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భాగ్యనగరవాసులకు సూచనలు చేసింది. 'నోరో వైరస్ వ్యాధితో జాగ్రత్త!! కలుషిత నీరు, ఆహారం కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.' అని పేర్కొంది. చలిజ్వరం, వాంతులు, విరేచనాలు, నీరసం, కడుపు నొప్పి, డీహైడ్రేషన్ ఈ నోరో వైరస్ లక్షణాలు అని పేర్కొంది. ప్రస్తుతం నోరో వైరస్ కేసులు నగరంలోని యాకుత్‌పురా, మలక్ పేట, డబీర్‌పురా, పురానాహవేలీ, మొఘల్‌పురలతో పాటు పలు ప్రాంతాల్లో నమోదయ్యాయి. నోరో వైరస్ బారిన పడినవారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చేతులను సబ్బుతో శుభ్రంగా కడగాలి. కాచి చల్లార్చిన, వడపోసిన నీటిని తాగాలి.  ఇంటిని, పరిసరాలను క్రిమిసంహారక మందులతో శుభ్రం చేసుకోవాలి.

పసిప్రాణాన్ని మింగిన జగన్ నిర్లక్ష్యం!

జగన్ అధికారాన్ని చెలాయించిన రోజుల్లో చూపించిన నిర్లక్ష్య ధోరణి ఇప్పుడు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. జగన్ ప్రభుత్వం నాడు-నేడు పేరుతో పాఠశాలలకు అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని ప్రారంభించి అసంపూర్తిగా మధ్యలో వదిలేసింది. ఇలా మధ్యలో ఆగిపోయిన తరగతి గది లింటెల్, దాని మీద వున్న గోడ కూలి నెల్లూరు భక్తవత్సల నగర్‌ కేఎన్ఆర్ నగరపాలక పాఠశాలలో గురుమహేంద్ర అనే విద్యార్థి మరణించాడు. ఈ పాఠశాలలో 12 గదులను నిర్మించాలని పనులు ప్రారంభించారు. కానీ, ఆ పనులన్నీ రెండేళ్ళ క్రితం ఆగిపోయాయి. ప్రమాదకరంగా వున్న ఈ గదుల్లో విద్యార్థులు ఆటలు ఆడుకుంటున్నారు. ఊహించని విధంగా లెంటెల్, గోడ కూలిపోవడంతో గురుమహేంద్ర మరణించాడు. భవిష్యత్తు మీద ఎన్నో కలలతో చదువుకుంటున్న తమ కుమారుడు మరణించడంతో గురుమహేంద్ర తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ భవనాలు ప్రమాదకరంగా వున్నాయని గతంలో ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని ప్రధానోపాధ్యాయుడు చెబుతున్నారు.  విద్యార్థి మరణానికి దారితీసిన నిర్మాణంలో వున్న తరగతి గదులు, మొండి గోడలను డీఈఓ పరిశీలించి, ప్రమాదానికి దారితీసిన కారణాలను కలెక్టర్, పాఠశాల విద్యా కమిషనర్, విద్యాశాఖ మంత్రి, ఎమ్మెల్యే, ఉన్నతాధికారులకు వివరించారు. దుర్ఘటన మీద స్పందించిన కలెక్టర్ విద్యార్థి కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ సంఘటన మీద మంత్రి నారాయణ దిగ్బ్రాంతి వ్యక్తం చేసి, విచారణకు ఆదేశించారు. విద్యార్థి తల్లిదండ్రులకు అండగా వుంటామని హామీ ఇచ్చారు.

కల్వకుంట్ల కవితకు తప్పని తీహారు వాసం!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జైలు కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన కవిత బెయిలు కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కవిత బెయిలు పిటిషన్ ను మరో సారి తిరస్కరించింది. ఈ నెలాఖరు వరకూ ఆమె జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. ఇదే కేసులో ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలకు కూడా బెయిలు దక్కని సంగతి తెలిసిందే.  కవిత దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ ను విచారించిన కోర్టు, తదుపరి విచారణను ఆగస్టు 5కు వాయిదా వేసింది. అంతకు ముందు సీబీఐ గత నెల 7న దాఖలు చేసిన చార్జిషీట్ ను పరిగణనలోనికి తీసుకున్న కోర్టు.. కవితను శుక్రవారం (జులై 26) కోర్టులో హాజరు పరచాల్సిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే.  కోర్టు ఆదేశాల మేరకు కవిత, కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు.  వాదనల అనంతరం కోర్టు ముగ్గురికీ కూడా బెయిలు నిరాకరించింది. ఇక సీబీఐ కేసుకు సంబంధించి కవిత బెయిలు పిటిషన్ ను కోర్టు గురువారం (జులై 24) నిరాకరించిన సంగతి విదితమే.  ఇక కేజ్రీవాల్, మనీష్ సిసోడియాల కస్టడీని కోర్టు ఆగస్టు 8 వరకూ వాయిదా వేసింది.  దీనిని బట్టి కవిత మరో రెండు వారాల పాటు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి.  కవిత అరెస్టై నాలుగు నెలలు దాటిపోయింది. ఆమె  మార్చి 15న  ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన సంగతి విదితమే. 

ఒలింపిక్స్‌కి బిహార్ లేడీ ఎమ్మెల్యే!

బిహార్ లేడీ ఎమ్మెల్యే శ్రేయసి సింగ్ ఒలింపిక్స్‌ కోసం ప్యారిస్‌కి వెళ్ళారు. ఒక ఎమ్మెల్యే ఒలింపిక్స్‌కి వెళ్తే పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమిటనే సందేహం రావచ్చు.. ఈ ఎమ్మెల్యే ప్యారిస్‌కి వెళ్ళింది ఒలింపిక్స్ చూడ్డానికి కాదు.. ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి. మనదేశం నుంచి ఒలింపిక్స్‌లో మొత్తం 117 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. వారిలో శ్రేయసి సింగ్ కూడా ఒకరు. శ్రేయసి సింగ్ షూటింగ్ క్రీడాకారిణి. అర్జున్ అవార్డు గ్రహీత కూడా. డబుల్ ట్రాప్ విభాగంలో 2014లో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకాన్ని, 2018లో గోల్డ్ కోస్ట్.లో జరిగిన పోటీలో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. శ్రేయసి 2020లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో బిహార్‌లోని గిదౌర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. శ్రేయసి రాజకీయ నేపథ్యం వున్న కుటుంబం నుంచే వచ్చారు. ఆమె తండ్రి దిగ్విజయ్ సింగ్ మాజీ ఎంపీ, తల్లి పుతుల్ సింగ్ బంకా నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎంపీ. రాజకీయ కుటుంబం అయినప్పటికీ, క్రీడల్లో కూడా శ్రేయసి రాణించారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా వుండి కూడా,  ఒలింపిక్స్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

జగన్ పై షర్మిల మరోసారి మాటల దాడి

దేశరాజధానిలో తన ధర్నాకు కాంగ్రెస్ ఎందుకు సంఘీభావం ప్రకటించలేదన్న మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఎక్స్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా? వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా? విభజన హక్కులు, ప్రత్యేక హోదాను గాలికి వదిలేసినందుకా? మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీ నుంచి సంఘీభావం వచ్చిందా? మీ నిరసనలో నిజం లేదని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది’’ అని షర్మిల తెలిపారు.

కేసీఆర్ ఆ ఏడుపేదో అసెంబ్లీలో ఏడ్వచ్చు కదా?

తాను జీవించి వున్నంతకాలం తెలంగాణ రాష్ట్రానికి తానే ముఖ్యమంత్రి అనే భ్రమల్లో బతికిన కేసీఆర్ అహంకారపూరిత పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారు. అందుకే, తెలంగాణ ప్రజలు కేసీఆర్ భ్రమల్ని వదిలించారు. కేసీఆర్ అధికారాన్ని ఊడబెరికి, కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చారు. దాంతో అధికార వైరాగ్యంలో పడిపోయిన కేసీఆర్ ఇంతకాలం అసెంబ్లీ ముఖాన్ని చూడకుండా ఫామ్‌హౌస్ రాజకీయాలు చేస్తూ ఏడునెలలపాటు టైమ్‌పాస్ చేశారు. దాదాపు పదేళ్ళపాటు అధికారాన్ని వెలగబెట్టిన కేసీఆర్‌కి ఇంతకాలం ఒక్కరోజు కూడా ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతాయుతంగా వ్యవహరించలేదన్న విమర్శలు భారీ స్థాయిలో వినిపిస్తున్నాయి. అందుకేనేమో, ‘కేసీఆర్ ఒక్కరోజు కూడా అసెంబ్లీకి వెళ్ళలేదు’ అనే మాట వినిపించకుండా చేయడం కోసమేమో, ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీకి వచ్చి వెళ్ళారు. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమర్పిస్తున్న సమయంలో కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ సమయంలో ఆయన ముఖంలో ఏదో చిరాకు. తన సొంత ఆస్తిని ఎవరో అనుభవించేస్తున్నారన్న బాధ. తాను కష్టపడి, చెమటోడ్చి సంపాదించిన ఆస్తిని తనకు కాకుండా చేశారన్న ఆవేదన ఆయన ముఖంలో కనిపించాయి. కొద్దిసేపు అసెంబ్లీలో కూర్చున్న ఆయన బయటకి వచ్చి, మీడియా ముందు తనదైన శైలిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, బడ్జెట్ మీద ఏడ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్‌ని చులకన చేస్తూ మాట్లాడారు. ఈ సందర్భంలో కేసీఆర్ పక్కనే వున్న వెకిలి బ్యాచ్ వెకిలి నవ్వుల సంప్రదాయాన్ని కొనసాగించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్ మీద ఏడ్చిన కేసీఆర్, ఆ తర్వాత బడ్జెట్ మీద చర్చ జరుగుతున్న సమయంలో అసెంబ్లీకి రాకుండా ఫామ్‌హౌస్‌లోనే సెటిలైపో్యారు. కేసీఆర్ ఒక్కరోజు... అది కూడా కొద్దిసేపు అసెంబ్లీకి వచ్చింది ఎవర్ని ఉద్ధరించడానికి? అలా మొక్కబడిగా అసెంబ్లీకి వచ్చి పోవడానికేనా ప్రజలు ఆయనకి ప్రతిపక్ష నాయకుడి హోదా ఇచ్చింది? బడ్జెట్ జరుగుతున్న సమయంలో అసెంబ్లీకి వచ్చింది, బడ్జెట్ మీద మీడియా ముందు ఏడ్చిన కేసీఆర్, ఇప్పుడు బడ్జెట్ మీద చర్చ జరుగుతున్న సమయంలో కూడా అసెంబ్లీకి వచ్చి, మీడియా ముందు ఏడ్చిన ఏడుపేదో అసెంబ్లీలో కూడా ఏడ్వచ్చు కదా? ఆ ఏడుపు విని, బడ్జెట్ ప్రతిపాదనల్లో ఏవైనా పొరపాట్లు వుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరిదిద్దుకుంటుంది కదా? ఏడ్వాల్సిన చోట ఏడ్వకుండా, ఏడ్వాల్సినప్పుడు ఏడ్వకుండా వుండటం ఎంతవరకు కరెక్ట్?