‘నీట్’ మళ్ళీ అక్కర్లేదు.. సుప్రీం తీర్పు!
posted on Jul 23, 2024 @ 5:47PM
‘నీట్’ పరీక్షను ఈ సంవత్సరానికి తిరిగి నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. నీట్ క్వశ్చన్ పేపర్ లీకైన మాట వాస్తవమేనని, అయితే ఆ కారణంగా పరీక్షను మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీం అభిప్రాయపడింది. నీట్ అంశంపై విచారణ ముగియడంతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. ‘నీట్’ మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్‌ని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. "క్వశ్చన్ పేపర్లీకేజీతో పరిమిత సంఖ్యలో విద్యార్థులు లాభం పొందారు. లాభం పొందిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలి. మళ్లీ పరీక్ష నిర్వహిస్తే 24 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడతారు. అందువల్ల ‘నీట్’ మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదు" అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఈ సంవత్సరానికి నీట్ ప్రవేశ పరీక్ష మే 5న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో నిర్వహించారు. దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు నీట్ రాశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించారు. హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు మొదటి ర్యాంక్ రావడంతో అనుమానాలు తలెత్తాయి. టాప్ ర్యాంకును ఇంత మంది పంచుకోవడం వెనుక గ్రేస్ మార్కులు కారణమని ఇటీవల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే 'ఫిజిక్స్ వాలా' విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలఖ్ పాండేతో పాటు మరి కొందరు దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది.