ఇక జగన్ అక్రమాస్తుల కేసుల రోజువారీ విచారణ
posted on Jul 24, 2024 @ 11:48AM
జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఇక రోజు వారీ విచారణ జరగనుంది. సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసులు నత్తనడకన నడుస్తున్న సంగతి తెలిసిందే. రోజువారీ విచారణ చేపట్టాలంటూ సీబీఐ కోర్టును మంగళవారం తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను సత్వరం పూర్తిచేసేలా సీబీఐ కోర్టుకు ఆదేశాలివ్వాలని కోరుతూ మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య గత ఏడాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఆ ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు రోజువారీ విచారణను కొనసాగించాలని సీబీఐ కోర్టుకు విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది.
అంతే కాకుండా విచారణ ఏ స్థాయిలో ఉందన్న విషయంపై నివేదిక సమర్పించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను నిందితులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని హరిరామజోగయ్య తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్ కుమార్ లతో కూడిన ధర్మాసనం మంగళవారం(జులై 22న) విచారించింది.తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది. హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు జగన్ అక్రమాస్తుల కేసుల్లో దాఖలైన డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ కొనసాగుతోంది. అరబిందో, హెటిరోలకు భూకేటాయింపులకు సంబంధించి నమోదైన కేసులో రెండో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్ పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. విజయసాయిరెడ్డి తరపు న్యాయవాది జి. అశోక్ రెడ్డి వాదనలు వినిపించగా తదుపరి విచారణ బుధవారానికి వాయిదా పడింది.
ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో ఇక ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని న్యాయనిపుణులు అంటున్నారు. ఇంత కాలం ముఖ్యమంత్రి హోదా కారణంగా కోర్టు హాజరు నుంచి మినహాయింపు పొందిన జగన్ సీఎం పదవి నుంచి దిగిపోవడంతో అనివార్యంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని అంటున్నారు.