చంద్రబాబు చాణక్యం.. జగన్ కు కీలెరిగి వాత!
posted on Jul 23, 2024 @ 6:21PM
ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు క్షీణించాయంటూ అసంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టి మరీ హస్తిన వెళ్లి ధర్నా చేస్తానంటూ బయల్దేరిన జగన్ కానీ, ఆయన పార్టీ నేతలు కానీ.. కేంద్ర బడ్జెట్ పై నోరెత్తడం లేదు. ఐదేళ్ల తరువాత తొలి సారిగా కేంద్ర వార్షిక బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక కేటాయింపులు జరిగాయి. కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ అమరావతికి 15వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అలాగే పోలవరం సత్వర పూర్తికి నిధులు కేటాయిస్తామని చెప్పారు. అదే విధంగా విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్ కు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు. అంతే కాకుండా రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలలో ఎనిమిదింటిని వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించి వాటికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. రాయలసీమ లోని నాలుగు జిల్లాలూ, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలతో పాటుగా ప్రకాశం జిల్లాకు కూడా వెనుకబడిన ప్రాంతంగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ దక్కనుంది.
గతంలో తెలుగుదేశం ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసిన తరువాత ఏపీకి ప్రత్యేక కేటాయింపులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక జగన్ ఐదేళ్ల సుందర ముదనష్ట పాలనలో అసలు కేంద్రం దృష్టిలో ఏపీ అనే రాష్ట్రం ఒకటి ఉందా అన్న పరిస్థితి నెలకొంది. జగన్ రాష్ట్రం కోసం కేంద్రాన్ని అడిగిందీ లేదు.. కేంద్రం రాష్ట్రం వైపుగా దృష్టి పెట్టిందీ లేదు. రాష్ట్రం కోసం నిధులు, విభజన హామీల అమలు అడిగితే బీజేపీ పెద్దలకు ఎక్కడ కోపం వస్తుందో అన్న భయంతోనే జగన్ ఐదేళ్లూ గడిపేశారు. ఎంత సేపూ బటన్ నొక్కడానికి, ఉద్యోగుల వేతనాలు, పించనర్ల పింఛన్లకు సొమ్ముల కోసం అప్పు చేసి పబ్బం గడిపేస్తే, తనపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ, బాబాయ్ హత్య కేసు విచారణ వేగవంతం కాకుండా చూసుకుంటే చాలన్న ధోరణిలోనే ఆయన పాలన సాగింది.
అయితే ఇటీవలి ఎన్నికలలో జగన్ పార్టీని జనం ఘోరంగా ఓడించారు. కనీసం విపక్ష హోదాకు కూడా వైసీపీకి అర్హత లేదని కుండబద్దలు కొట్టినట్లు రాష్ట్రం అంతటా జనం ఓకే విధమైన తీర్పు ఇచ్చారు. దీంతో జగన్ పార్టీ కేవలం 11 స్థానాలతో అసెంబ్లీలో విపక్ష హోదాకు కూడా నోచుకోకుండా పోయింది. జగన్ ఏలుబడిలో అన్ని విధాలుగా అధ్వానంగా మారిన రాష్ట్రాన్ని చంద్రబాబు మాత్రమే గాడిన పెట్టగలరని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మారు. చరిత్ర కనీవినీ ఎరుగని విజయాన్ని కట్టబెట్టారు.
అయితే ఘోర పరాజయం తరువాత కూడా జగన్ తీరు మారలేదు. ప్రజలు తాను పందేరం చేసిన సంక్షేమ సొమ్ములు తీసుకుని కూడా ఓటేయకుండా మోసం చేశారనీ, ఈవీఎంలను ట్యాంపర్ చేయడం ద్వారానే చంద్రబాబు విజయం సాధించారనీ ఇలా ఓటమికి సాకులు వెతుక్కుంటున్నారు. అంతే కాకుండా చంద్రబాబు అధికారంలోకి వచ్చి నెలన్నర అయ్యిందో లేదో.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా మారిందంటూ ఊరూవాడా ఏకం చేసేలా గందరగోళం సృష్టిస్తున్నారు. వ్యక్తిగత కక్ష కారణంగా వినుకొండలో జరిగిన హత్యకు రాజకీయ రంగు పులిమి వైసీపీ కార్యకర్తలను నరికేస్తున్నారని గగ్గోలు పెడుతూ.. హస్తినలో బుధవారం (జులై 24) ధర్నాకు రెడీ అయిపోయారు.
అయితే సీఎం చంద్రబాబు మాత్రం.. అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర అభివృద్ధి పైనే పూర్తిగా దృష్టి సారించారు. జగన్ విమర్శలపై స్పందించి సమయం వృధా చేయడం కంటే కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులపైనే దృష్టి పెట్టారు. రెండు సార్లు హస్తిన పర్యటించి మరీ ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, విత్త మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ అవసరాలు, అవసరమైన కేటాయింపులపై చర్చించారు. ఆయన కృషి ఫలించింది. ఏపీకి కేంద్రం బడ్జెట్ లో సముచిత కేటాయింపులు చేయడమే కాకుండా, విభజన హామీలకు కట్టుబడి ఉన్నామని విస్పష్టంగా చెప్పింది.
ఇక జగన్ విషయానికి వస్తే.. హస్తినలో ధర్నాఅంటూ హడావుడి చేస్తున్నారు.. కానీ బడ్జెట్ పై మాత్రం నోరెత్తడం లేదు. జగన్ సహా వైసీపీ నేతలెవరూ బడ్జెట్ పై స్పందించలేదు. ఏపీ వ్యాప్తంగా చంద్రబాబు కృషి ఫలించి, ఏపీకి బడ్జెట్ లో ప్రాధాన్యత దక్కిందని ఆనందం, హర్షం వ్యక్తం చేస్తుంటే.. ఒక్క వైసీపీ మాత్రం ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటూ హస్తిన వేదికగా ధర్నాకు రెడీ అయ్యింది. దీంతో ఆయన హస్తిన ధర్నాను పట్టించుకునే నాథుడే ఏపీలో కరవయ్యాడు. ఏపీ వ్యాప్తంగా చంద్రబాబు సాధించారు.. ఏపీ అభివృద్ధికి ఇక ఢోకా లేదని మాట్లాడుతుంటే.. వైసీపీ ఎందుకు బడ్జెట్ పై ప్రశంస కానీ, విమర్శ కానీ చేయకుండా మౌనం వహించిదన్న చర్చ జరుగుతోంది. బడ్జెట్ ను విమర్శిస్తే బీజేపీకి కోపం, పొగిడితే తెలుగుదేశంకు లాభం అన్న భయంతో నే వైసీపీ సైలెంట్ అయ్యిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సరే బీజేపీకి కొపం వచ్చినా ఫరవాలేదని ఏపీకి కేటాయింపులపై అసంతృప్తి వ్యక్తం చేస్తే.. గత ఐదేళ్లలో నువ్వు సాధించిందేమిటని జనం నిలదీస్తారన్న జంకుతోనే జగన్ అండ్ కో నోరు కుట్టేసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు తన చాణక్యంతో జగన్ కు కీలెరిగి వాతపెట్టినట్లైందని అంటున్నారు.