జెట్ స్పీడ్ తో తిరుమల ప్రక్షాళన
posted on Jul 24, 2024 @ 10:16AM
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల పవిత్రత జగన్ హయాంలో మంటగలిసింది. తిరుమల దేవుని సన్నిధిలో పారిశుద్ధం నుంచి ప్రతి విషయంలోనూ పూర్తి నిర్లక్ష్యం తాండవించింది. శ్రీవారి కల్యాణ కట్టలో పరిశుభ్రత కనుమరుగైంది. స్వామివారికి తలనీలాలు సమర్పించే భక్తులకు నిరంతరాయంగా వేడి నీరు అందే వసతి కూడా మృగ్యమైంది. తిరుమల కొండపై హోటళ్లు నాణ్యతకు, పరిశుభ్రతకు తిలోదకాలిచ్చేశారు. ఇక తిరుమలేశుని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పన విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం చేతులెత్తేసింది. అన్న ప్రసాద నాణ్యత నుంచి, తిరుమల దేవుని ప్రసాదమైన లడ్డూ నాణ్యత కూడా నాసిరకంగా మారిపోయింది. ఇక తిరుమల కొండపై అన్యమత ప్రచారం, టీటీడీలో అన్యమతస్థులకు కొలువుల సంగతి సరే సరి. ఈ పరిస్థితులన్నీ గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు కావాలని అన్నారు. అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే తిరుమల ప్రక్షాళనపై దృష్టి సారించారు.
దీంతో తిరుమల ప్రక్షాళన శరవేగంగా సాగుతోంది. ముందుగా ఆహార, ఆరోగ్య భద్రతపై దృష్టి సారించిన టీటీడీ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. కౌస్తుభం సమీపంలోని బాలాజీ భవన్ లో నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఆహార పదార్థాలు లేవని గుర్తించిన అధికారులు ఆ హోటల్ ను సీజ్ చేశారు. అంతే కాకుండా ఈవో తిరుమల కొడపై పారిశుద్ధ్యం, పరిశుభ్రత, హోటళ్లలో నాణ్యతా లోపాలు, భక్తులకు సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగానే తిరుమలలోని ప్రధాన కల్యాణ కట్టను ఈవో, జేఈవో ఆకస్మిక తనిఖీ చేశారు. శ్రీవారి కల్యాణ కట్టలో పరిశుభ్రత ఇంకా మెరుగుపరచాలని, తలనీలాలు సమర్పించే భక్తులకు నిరంతరాయంగా వేడి నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఈవో జె.శ్యామలరావు ఆదేశించారు.
కళ్యాణ కట్టలో తల వెంట్రుకలను ఎప్పటికప్పుడు తీసివేసి ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. బాత్ రూంలు, ఇతర హాల్స్ ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచడం ద్వారా భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. కళ్యాణ కట్టలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి డిటిఎస్ ఏజెన్సీ వారు నాణ్యమైన శానిటరీ పరికరాలు, వస్తువులు ఎప్పటికప్పుడు సరఫరా చేసేటట్లు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కళ్యాణ కట్టలోని అత్యంత పాత గీజర్లు, పగిలిన టైల్స్ ను గమనించి వాటిని వెంటనే మార్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే విరిగిన నీటి కొళాయిలు, పనిచేయని ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డులు స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న సివిల్, ఎలక్ట్రికల్, ఇతర ఇంజనీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
ఆ తరువాత మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని ఈవో తనిఖీ చేశారు. టిటిడి అందిస్తున్న అన్న ప్రసాదాలలో అన్నం బాగా ఉడికిందా, కూరలు ఎలా ఉన్నాయని భక్తులను అడిగి తెలుసుకున్నారు. అన్నప్రసాదాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. త రువాత చేతులు కడుగుకునే కుళాయిలు కొన్ని పనిచేయడం లేదని, వాటిని మార్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.