నిర్మలమ్మ పద్దుపై మధ్యతరగతి ఆశలు!

కేంద్ర విత్త మంత్రి నిర్మలాసీతారామన్  మంగళవారం (జులై 23)న లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.  మోదీ 3.0 ప్రభుత్వంలో ఇదే తొలి బడ్జెట్   ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మల వరుసగా ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రసంగిస్తారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.  మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం పూర్తిస్థాయి బడ్జెట్ ను పార్లమెంట్ ముందు ఉంచనుంది. నిత్యావసరాలు సహా అన్నింటి ధరలు మండిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యతరగతి ప్రజలు పన్ను ఉపశమనాలపై పెట్టుకున్న ఆశలను నిర్మలా సీతారామన్ పరిగణనలోకి తీసుకుంటారో లేదో మరి కొద్ది సేపటిలో తేలిపోతుంది. మధ్యతరగతి జనాలు మాత్రం నిర్మలమ్మ పద్దుపై కోటి ఆశలు పెట్టుకున్నారు.  నిర్మలమ్మ బడ్జెట్ లో పారిశ్రామిక వర్గాలకు  ప్రాధాన్యం దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ, అలాగే  ఎంఎస్ఎంఈ లకు ఊరట కలిగించేలా బడ్జెట్  ఉంటుందని ఆర్థిక నిపుణులుచెబుతున్నారు. అభివృద్ధి, సంక్షేమాల మధ్య సమతూకం పాటిస్తూ ద్రవ్యోల్బణం నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్థిక నిపుణులు అంటున్నారు.    సోమవారం ప్రవేశపెట్టిన ఎకనమిక్ సర్వే వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేలా, భారత ఆర్థిక వ్యవస్థకు ప్రతిబింబంలా   ఉందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.  పదేళ్ల ఎన్డీయే పాలనలో తీసుకు వచ్చిన సంస్కరణల ఫలితాలను ఈ సర్వే ప్రతిఫలించిందని అన్నారు. 

బిహార్‌కి స్పెషల్ స్టేటస్సా? అంతలేదు..!

బిహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్రంలో అధికారంలో వున్న ఎన్డీయే కూటమిలో భాగమైన జనతాదళ్ (యు) బిహార్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాలని, లేదా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది. జేడీయూ ఎంపీ రామ్ ప్రీత్ మండల్ బిహార్‌కి ప్రత్యేక హోదా ఇచ్చే అంశమేదైనా కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో వుందా అని పార్లమెంట్‌లో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. బిహార్‌కి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన ఏదీ కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదని వెల్లడించారు.  సాధారణంగా రాష్ట్రాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని అడుగుతూ వుంటాయి. కేంద్రం ఇప్పుడు అలాంటి ఆలోచన ఏదీ లేదని చెబుతూనే వుంటుంది. అయితే, ఇప్పుడు బిహార్ విషయంలో ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ అడగటం అనేది చాలా కీలకమైనది. ప్రత్యేక హోదా ఇవ్వనని కేంద్రం అన్నట్టయితే, బిహార్‌కి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వమని అడిగే అవకాశం వుంది. ఇప్పుడు బిహార్‌కి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే మిగతా రాష్ట్రాలు కూడా ప్రత్యేక ప్యాకేజీ డిమాండ్‌ని కేంద్ర ముందు వుంచే అవకాశం వుంది. అందువల్ల ప్రత్యేక హోదా విషయంలో కూడా కేంద్రం ఆచితూచి స్పందించాల్సిన అవసరం వుంది. ఈ అంశంలో ఏమైనా తేడాలు వస్తే ప్రభుత్వం కూడా కూలిపోయే ప్రమాదం వుంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం జేడీయూ, తెలుగుదేశం మద్దతుతో మనగలుగుతోంది. ఈ వీక్నెస్‌ని ఆధారంగా చేసుకుని, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మోడీ ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. ఇప్పటికి అయితే ఈ వ్యవహారం బిహార్‌కి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెప్పడం వరకు అయితే వచ్చింది. ముందుకు ముందు ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

పోలవరంపై లోక్ సభలో గళమెత్తిన కేశినేని చిన్ని

 తొలి సారి ఎంపీ అయిన కేశినేని చిన్ని లోక్ సభలో రాష్ట్ర సమస్యలపై గళమెత్తారు. సోమవారం ఆయన లోక్ సభలో రాష్ట్ర సమస్యలపై అనర్గళంగా మాట్లాడారు.  దేశంలో ఆరు రాష్ట్రాల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగే జాతీయ ప్రాజెక్ట్ పోల‌వ‌రం నిర్మాణానికి తగినన్ని నిధులు విడుదల చేయాలని కోరారు. 2019 నాటికి  సివిల్ పనులు 71.93% ,  భూసేకరణ ,  పునరావాసం 18.66%  పూర్తయ్యాయనీ, గ‌త ప్ర‌భుత్వం హ‌యంలో ఐదేళ్ల‌లో జాతీయ ప్రాజెక్ట్ పోల‌వ‌రం నిర్మాణం  3.84% సివిల్ పనులు,  3.89% భూ సేకరణ పనులు మాత్రమే జరిగాయని తెలిపారు.  ఇప్పుడు రాష్ట్ర ప్ర‌భుత్వం మిష‌న్ మోడ్ కింద పోల‌వ‌రం ప్రాజెక్ట్ ను తిరిగి ట్రాక్ లోకి తీసుకురావ‌టానికి చేపట్టనున్న చర్యల గురించి వివరించారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో విజయవాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా తొలి సారిగా పోటీ చేసిన కేశినేని చిన్ని.. రెండు సార్లు ఎంపీ, వైసీపీ అభ్యర్థి, తన సోదరుడు అయిన కేశినేని నానిపై భారీ మెజారిటీతో విజయం సాధించిన సంగతి విదితమే. 

దేశంలో పెరుగుతున్న ‘పొట్ట’భద్రులు!

ప్రతి ఏడాదీ కేంద్ర బడ్జెట్ విడుదలకు ముందు ఆర్థిక సర్వే విడుదల అవుతూ వుంటుంది. ఈసారి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే విడుదల చేశారు. ఈ ఏడాది ఆర్థిక సర్వేలో దేశంలో పెరుగుతున్న స్థూలకాయం మీద ఆందోళన వ్యక్తమైంది. చక్కెర, కొవ్వులతో కూడిన ప్రాసెస్ చేసిన ఆహార పదార్ధాల వినియోగం చాలా పెరిగిపోతోందని, దీని విషయంలో అప్రమత్తత అవసరమని ఆర్థిక సర్వే పేర్కొంది.  భారతదేశంలో స్థూలకాయం ఆందోళనకరంగా మారిందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. ముఖ్యంగా పెద్దల్లో ఒబెసిటీ ఆందోళనకరమని తెలిపింది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదికను ఉటంకిస్తూ, ఈమధ్యకాలంలో చక్కెర, కొవ్వులతో కూడిన ప్రాసెస్ట్ ఫుడ్ వినియోగం బాగా పెరిగిందని, స్థూలకాయులు పెరగడానికి ఇటువంటి ఆహారం కూడా ఒక ప్రధాన కారణమని ఆర్థిక సర్వే చెప్పింది.  స్థూలకాయం విషయంలో వియత్నాం, నమీబియా తర్వాతి స్థానంలో ఇండియా వుందని పేర్కొంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్‌హెచ్ఎస్) నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే, నగర ప్రాంతాల్లోనే స్థూలకాయులు ఎక్కువగా వుంటున్నారు. పురుషులలో స్థూలకాయం సమస్య 18.9 శాతం నుంచి ఈ ఏడాది 22.9 శాతానికి పెరిగింది. అదే మహిళలలో 20.6 శాతం నుంచి 24 శాతానికి పెరిగింది. ఇక రాష్ట్రాల విషయానికి వస్తే, దేశ రాజధాని ఢిల్లీలో 41.3 శాతం మంది స్థూలకాయంతో బాధపడుతున్నారు. ఇది పురుషులలో 38 శాతంగా వుంది. తమిళనాడులో మహిళలు 40.4 శాతం మంది, పురుషులు 27 శాతం మంది స్థూలకాయులుగా వున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే మహిళలలో 36.6 శాతం మంది, పురుషులలో 31.1 శాతం మంది స్థూలకాయం సమస్యను ఎదుర్కొంటున్నారని ఆర్థిక సర్వే పేర్కొంది.

జగనన్న పోరాటంలో పస లేదు!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి శవరాజకీయాలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఐదేళ్లు అధకారంలో ఉండి రాష్ట్రాన్ని సర్వ విధాలా భ్రష్ఠపట్టించిన జగన్ తన హయాంలో జరిగిన హత్యల గురించి ఒక్కసారి కూడా ప్రస్తావించలేదని దుయ్యబట్టింది. ఇప్పుడు వ్యక్తిగత కక్షలలో వినుకొండలో జరిగిన ఒక హత్య ఉదంతంపై తన రాజకీయ లబ్ధి కోసం నానా యాగీ చేస్తున్నారని విమర్శించింది. వినుకొండ ఘటన ద్వారా రాజకీయ లబ్ధి కోసం జగన్ నేల విడిచి సాము చేస్తున్నారు. చివరికి సొంత పార్టీ నేతలు సైతం జగన్ తీరును తప్పుపడుతున్నారు. హస్తినలో ధర్నా ఏ ముఖం పెట్టుకు చేస్తారని అంతర్గత సంభాషణల్లో అంటున్నారు. అధికారంలో ఉన్నంత కాలం రాష్ట్ర సమస్యలను గాలికొదిలేసి, విపక్ష నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపు, వేధింపు చర్యలకే పరిమితమైన జగన్ ఇప్పడు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేయడం నవ్వు పుట్టిస్తోందని అంటున్నారు.  కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు, జగన్ కు స్వయానా సోదరి అయిన షర్మిల సోమవారం(జులై 22)  విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సొంత బాబాయ్ హత్య కేసు దర్యాప్తు నిష్పాక్షికంగా జరగాలని ఏనాడూ డిమాండ్ చేయని జగన్ ఇప్పుడు వినుకొండలో ఒక రౌడీ హత్యను రాజకీయం చేస్తూ హస్తినలో ధర్నా చేస్తానంటున్నారని విమర్శించారు. తానేమీ వైసీపీ, తెలుగుదేశం అనుకూల మీడియా వార్తలను చూసి మాట్లాడటం లేదనీ,  క్షేత్ర స్థాయి నుంచి తమకు అందిన సమాచారం మేరకు వినుకొండలో జరిగిన హత్య వెనుక ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదని షర్మిల కుండబద్దలు కొట్టేశారు. హంతకుడు, హతుడూ ఇద్దరూ కూడా వైసీపీకి చెందిన వారేననీ, వారి మధ్య ఉన్న పాత కక్షల కారణంగానే హత్య జరిగిందని చెప్పారు. అధికారంలో ఉన్నంత కాలం ఏపీకి ప్రత్యేక హోదా కోసం హస్తినలో ధర్నాఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత రాజకీయ ఉనికి కోసం వినుకొండ హత్యను వాడుకుంటున్నారని షర్మిల జగన్ పై విమర్శలు గుప్పించారు.   విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హస్తినలో గళమెత్తని జగన్ ఇప్పుడు వినుకొండ హత్యను రాజకీయం చేయడం కోసం హస్తినలో ధర్నా చేయడానికి సిద్ధమైపోయారని ఎద్దేవా చేశారు. జగన్ పార్టీకి అసెంబ్లీలో ఆయనతో సహా కేవలం 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. కేవలం తన ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే జగన్ హస్తినలో ధర్నా అంటున్నారు. వాస్తవానికి అసెంబ్లీకి హాజరై వివిధ బిల్లులు, ఇతర అంశాలపై మాట్లాడాల్సిన జగన్ అసెంబ్లీకి మొహం చాటేయడానికే హస్తిన పర్యటన పెట్టుకున్నారని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలలో తన హయాంలో జరిగిన తప్పిదాలకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుందన్న భయంతోనే జగన్ అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజర్ అవ్వాలని భావిస్తున్నారని అంటున్నారు.  

వైసీపీ నాయకులూ.. బీ కేర్‌ఫుల్!

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వున్న వైసీపీ నాయకులు... అంటే, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఓ మోస్తరు నాయకులు కావచ్చు, గతంలో జెండా మోసిన, ఇప్పుడు మోస్తున్న కార్యకర్తలు కావచ్చు, వైసీపీ సానుభూతిపరులు కావచ్చు... అందరూ జరభద్రం... బీ కేర్‌ఫుల్. ఎందుకంటే, మీ మీద దాడులు జరగొచ్చు.. పాపము శమించుగాక... ప్రాణాలు కూడా పోవచ్చు. అందుకే బీ కేర్‌ఫుల్. మీ వెంట వుండేవారే, మీ స్నేహితులే మీ మీద దాడి చేయొచ్చు.. అందుకే బీ కేర్‌ఫుల్. మీమీద దాడి చేసేది తెలుగుదేశం కూటమికి సంబంధించిన వాళ్ళు కాదు... మీ పార్టీవాళ్ళే దాడి చేస్తారు.. దాడి సందర్భంగా ఏ స్థాయికైనా వెళ్తారు. అందుకే బీ కేర్‌ఫుల్. మీ నాయకుడు జగన్మోహన్‌రెడ్డికి ఇప్పుడు బోలెడన్ని శవాలు కావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ నాయకుల మీద దాడులు జరుగుతున్నట్టు, మర్డర్లు జరుగుతున్నట్టు క్రియేట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలం అయిపోతున్నట్టు కలరింగ్ కావాలి. జగన్ ఎలాంటివాడో మీకు తెలుసు. అధికారం కోసం ఎంతవరకు వెళ్తాడో మీకు తెలుసు. బాబాయికే వీసా ఇప్పించిన ఘనత జగన్‌ది. అందుకే మీకు మరోసారి గట్టి హెచ్చరిక.. జరభద్రం.. బీ కేర్‌ఫుల్!

బాబు మెతక.. జగన్ ముతక!

తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులపై ఇప్పటికీ మెతకగా వ్యవహరిస్తున్నారన్న అసంతృప్తి తెలుగుదేశం శ్రేణుల్లో బలంగా వ్యక్తం అవుతోంది. ఎందుకు ఇంకా వారిని ఉపేక్షిస్తున్నారంటూ ఒకింత అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. వారి అసంతృప్తి, అసహనం కరక్టే అనేలా వైసీపీ నేతలు, మరీ ముఖ్యంగా జగన్ తీరు ఉంది. ఏపీలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టి 45 రోజులు అయ్యింది. ఇప్పటికీ చంద్రబాబు జగన్ హయాంలో హద్దులు మీరిన అధికారుల పట్ల, ఇష్టారీతిగా చెలరేగి వ్యవహరించిన వైసీపీ నేతలు, క్యాడర్ పట్ల క ఠినంగా వ్యవహరించడం లేదన్న భావన మెజారిటీ తెలుగుదేశం క్యాడర్ లో వ్యక్తం అవుతోంది. అందుకు తగ్గట్టుగానే ఓటమి తరువాత కూడా వైసీపీ నేతలూ మరీ ముఖ్యంగా జగన్ వ్యవహరిస్తున్న తీరు ఉంటోంది. అసెంబ్లీ వద్ద జగన్ సోమవారం (జులై 24) వ్యవహరించిన తీరును చూస్తే తెలుగుదేశం క్యాడర్ లో అసహనానికి అర్ధం ఉందని అనిపించక మానదు.  కేవలం 11 మంది సభ్యుల బలంలో అసెంబ్లీలో విపక్ష హోదా కూడా దక్కని వైసీపీ పట్ల చంద్రబాబు సర్కార్ ఉదారంగా వ్యవహరించింది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ ప్రస్తుత అసెంబ్లీలో ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. ఆయనకు విపక్ష నేత హోదా లేదు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడానికి ఆయన అందరు ఎమ్మెల్యేల్లాగే నాలుగో నంబర్ గేటు వద్ద కారు దిగి నడిచి అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించాలి. కానీ వైసీపీ సభ్యుల వినతి పట్ల సానుకూలంగా స్పందించిన చంద్రబాబు జగన్ కు ఓ మినహాయింపు ఇచ్చారు. ఆయన తన వాహనంలోనే అసెంబ్లీలో కి నాలుగో నంబర్ గేట్ గుండా  ప్రవేశించే వెసులుబాటు కల్పించారు.  అయితే జగన్ వ్యవహరించిన తీరు ఆయనా గౌరవానికి అర్హుడుకాడని మరో సారి రుజువు చేసుకున్నారు. అసెంబ్లీ ప్రధాన ద్వారం గుండానే లోపలకు ప్రవేశిస్తానంటూ పోలీసులతో ఘర్షణకు దిగారు. అయితే ఆయనను వేరే గేటుగుండా రావాల్సిందిగా పోలీసులు సూచించారు. ప్రధాన గేటు గుండా గవర్నర్ వచ్చే సమయం ఆసన్నమైనందున ఆ గేటుగుండా వైసీపీ నేతను అనుమతించే ప్రశక్తే లేదని విస్ఫష్టంగా చెప్పారు. దీంతో జగన్ తన ఎమ్మెల్యేలతో కలిసి నిరసనకు దిగారు. సేవ్ డెమొక్రసీ, పోలీస్ డౌన్ డౌన్ అంటూ  అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అయితే జగన్ ను, వైసీపీ ఎమ్మెల్యేలనూ పోలీసులు ప్రధాన గేటు గుండా అసెంబ్లీలోకి వెళ్లేందుకు అనుమతించలేదు. దీంతో వారు వేరు గేటుగుండా అసెంబ్లీలోకి వెళ్లారు.  ఈ మొత్తం ఎపిసోడ్ లో జగన్ అనవసరపు రాద్ధాంతం చేసి తనలో ఇసుమంతైనా మార్పు రాలేదని చాటుకున్నారు. గౌరవం ఇవ్వడమే కాదు, తీసుకోవడం కూడా ఆయనకు తెలియని రుజువు చేసుకున్నారు. అసెంబ్లీలో కూడా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటూ వైసీపీ నినాదాలతో హోరెత్తించడానికి ప్రయత్నించి విఫలమై సభ నుంచి వాకౌట్ చేసింది.  ఇదిగో జగన్ ఇలాంటి వైఖరిని ఎత్తి చూపుతూనే చంద్రబాబు తన మెతక తనాన్ని వీడి కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. 

పేరు మారినా అధికారుల తీరు మారలేదు!

గతంలో వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా వున్న పేరును నెల రోజుల క్రితం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆ యూనివర్సిటీ పేరు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. యూనివర్సిటీ పేరు అయితే మారిందిగానీ, అధికారుల తీరు మాత్రం మారలేదు. ఎన్టీఆర్ యూనివర్సిటీని ఇప్పటికీ అధికారులు వైఎస్సార్ యూనివర్సిటీగా భావిస్తున్నారు. యూనివర్సిటీ నుంచి విడుదలయ్యే ఆదేశాలు, నోటిఫికేషన్లు, పేపర్లలో ప్రచురించే ప్రకటనలు అన్నీ వైఎస్సార్ యూనివర్సిటీ పేరు మీదే వస్తున్నాయి. జనం దీన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. 

కమలా? మిఛెల్లీనా?

అమెరికా అధ్యక్ష ఎన్నికలు త్వరలో జరిగే నేపథ్యంలో ఒకవైపు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలో వున్నారు. ట్రంప్ అసలే కోతి.. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టుగా ఇటీవలే ఆయన చెవిని బుల్లెట్ ముద్దుపెట్టుకుంది. దాంతో ఈసారి విజయం తనదేనని ఆయన ధీమాగా వున్నాడు. ట్రంప్ దూకుడుని బైడన్ తట్టుకోలేడని భావిస్తూ డెమెక్రటిక్ పార్టీ నాయకులు ఎప్పటి నుంచో బైడన్‌ని తప్పుకోవయ్యా మహాప్రభో అని చెవి దగ్గర జోరీగల్లా మోగుతున్నారు. వారిలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా వున్నారు. అలా అందరూ మొత్తుకోవడం వల్ల అయితేనేమి, తనకు ఈసారి అంత దృశ్యం లేదని తానే అర్థం చేసుకోవడం వల్ల అయితేనేమి బైడన్ అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నారు. ఆయన తప్పుకుంటూ తప్పుకుంటూ.... అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి ఉపాధ్యక్షురాలు, భారత మూలాలున్న కమలా హ్యారీస్‌ని రికమండ్ చేశారు. ఆయన రికమండ్ చేసినంత మాత్రాన అంత ఈజీగా కమలా హ్యారీస్ అభ్యర్థిత్వం ఖరారు అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. కమలా హ్యారిస్‌ని బైడన్ ఇలా రికమండ్ చేశాడో లేదో అలా ట్రంప్ రియాక్ట్ అయ్యాడు. బైడెన్ కంటే కమలాని ఓడించడమే ఈజీ అని ప్రకటించేశాడు.  అదేవిధంగా, నిన్నటి వరకూ బైడెన్ అభ్యర్థిత్వాన్ని బరాక్ ఒబామా వ్యతిరేకిస్తూ వస్తున్నది, ఆయన్ని తప్పుకోవాలంటూ సూచిస్తున్నది పార్టీ క్షేమం కోసం అని అందరూ అనుకుంటూ వచ్చారు. కానీ, ఆయన ఆలోచిస్తున్నది తన భార్య మిఛెల్లీ ఒబామా క్షేమం కోసం అనే విషయం లేటెస్టుగా అర్థమైంది. అధ్యక్ష అభ్యర్థి విషయంలో పార్టీ నుంచి అనూహ్యమైన నిర్ణయం వెలువడబోతోంది అని ఆయన ప్రకటించారు. అంటే, బైడెన్ రికమండ్ చేసిన కమలా హ్యరిస్‌కి గట్టి పోటీనే ఉందన్నమాట. ఒబామా కూడా తక్కువ వాడేమీ కాదు కదా.. తన భార్య అభ్యర్థిత్వాన్ని ఓకే చేయించుకునేందుకు పార్టీ కీలక నాయకులతో మంతనాలు జరుపుతున్నాడు. కమలా హ్యారిస్‌ కూడా ప్రస్తుత ఉపాధ్యక్షురాలి హోదాలో తన లాబీయింగ్ తాను చేస్తున్నారు. అసలు పోటీకి ముందు ఈ కొసరు పోటీలో కమలా గెలుస్తారా? మిఛెల్లీ గెలుస్తారా అనేది వేచి చూడాలి.

చిరకాల సమస్యలు చిటికెలో పరిష్కారం!

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి లోకేష్.. సమస్యలపై వేగంగా స్పందించి పరిష్కరించడంలో తనకు తానే సాటి, పోటీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆయన దృష్టికి వచ్చిన సమస్య చిటికెలో పరిష్కారం అయిపోతోంది. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో లోకేష్ ఏ మాత్రం జాగు లేకుండా స్పందిస్తున్నారు. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో దివ్యాంగుల ప్రవేశానికి అడ్డంకిగా ఉన్న జీవోను సవరించడంలో కానీ, ఎక్కడో గల్ఫ్ దేశంలో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న వ్యక్తిని రోజుల వ్యవధిలో స్వరాష్ట్రానికి చేర్చడంలో కానీ లోకేష్ స్పందించిన తీరు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.  అసలు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచీ లోకేష్ ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో చొరవ తీసుకుంటున్నారు. తన నివాసంలో ప్రతి రోజూ ప్రజాదర్బార్ ఏర్పాటు చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే సామాజిక మాధ్యమాల ద్వారా, ఈమెయిల్ ద్వారా తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారం విషయంలో వేగంగా స్పందిస్తున్నారు.  తాజాగా కర్నూలు జిల్లా  మర్లమాడి గ్రామానికి చెందిన విద్యార్థులు ఒక ఈమెయిల్ ద్వారా తమ గ్రామానికి బస్సులేకపోవడంతో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లడానికి ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అవస్థలను లోకేష్ దృష్టికి తీసుకు వెళ్లారు.  అంతే వెంటనే ఆ గ్రామానికి బస్సు వచ్చేసింది. విద్యార్థుల ఇబ్బందులు తొలగిపోయాయి. అంతే కాదు తన సహాయం కావలసిన వారెవరైనా సరే  hello.lokesh@ap.gov.in అడ్రస్ కు ఈమెయిల్ చేస్తే చాలని లోకేష్ చెబుతున్నారు.   లోకేష్ ఒరవడిని తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు కూటమి మంత్రులు అనుసరిస్తున్నారు. చిటికెలో సమస్యలు పరిష్కరంచేస్తున్న లోకేష్ వేగాన్ని తాము అందుకుంటామని చెబుతున్నారు. ఇలా లోకేష్ సహచర మంత్రులకు ఒక టాస్క్ ఫిక్స్ చేశారనే చెప్పాలి.

జగన్ పుండు.. రఘురామ ఎట‘కారం’!

వైసీపీ ఎమ్మెల్యే జగన్ మీద పంచ్‌లు వేయడంలో రఘురామ కృష్ణంరాజుది ప్రత్యేక శైలి. ఐదేళ్ళ క్రితం జగన్ మీద మొట్టమొదట తిరుగుబాటు చేసిన వ్యక్తి రఘురామ కృష్ణంరాజు. ఆ తర్వాత జగన్ ఆయనని అరెస్టు చేయించడం, చిత్రం హింసలకు గురిచేయడం, చంపినంత పని చేయడం అవన్నీ తెలిసిన విషయాలే. ఆనాటి దారుణాల మీద రఘురామ కేసు పెట్టారు. జగన్‌తోపాటు కొంతమంది పోలీసు అధికారుల మీద హత్యాయత్నం కేసు పెట్టారు. అలాగే ఎప్పటి నుంచో ‘రచ్చబండ’ పేరుతో జగన్‌ని ఉతికి ఆరేసే కార్యక్రమాన్ని రఘురామ నిర్వహిస్తున్నారు. ‘రామా’ అంటేనే బూతుమాటగా భావించే జగన్, రఘురామ చేసే కామెంట్ల విషయంలో ఎలా ఫీలవుతూ వుంటారో ఊహించవచ్చు. జనరల్‌గా రఘురామని చూస్తేనే జగన్‌కి ఎక్కడో సరసరా కాలుతూ వుంటుంది. అలాంటిది పుండు మీద కారం చల్లినట్టుగా, జగన్ దగ్గరకి రఘురామ వెళ్ళి కాస్తంత వెటకారంగా మాట్లాడితే పరిస్థితి ఎలా వుంటుందో కదా! అలాంటి ఆసక్తికరమైన సంఘటన సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో జరిగింది. రాను రాను అంటూనే జగన్ అసెంబ్లీకి వచ్చారు. అక్కడ జగన్, రఘురామ ఎదురుపడే సందర్భం వచ్చింది. సాధారణంగా అయితే ఇద్దరూ ఎడముఖం పెడముఖంగా తప్పుకుని వెళ్ళిపోవాలి. కానీ, రఘురామ వెటకారానికి బ్రాండ్ అంబాసిడర్ కదా, తన ఎదురుగా వున్న జగన్‌తో ‘‘అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులూ మీరు అసెంబ్లీకి తప్పకుండా రావాలి’’ అన్నారు. దానికి జగన్‌కి లోపల భగభగా మండిపోయినా, ముఖానికి నవ్వు పులుముకుంటూ వస్తానని సమాధానం ఇచ్చారు. రఘురామ అక్కడితో వదలకుండా, జగన్‌తో మరికొంతసేపు మాట్లాడారు. దానికి జగన్ కూడా సమాధానం ఇచ్చారు. ఆ సమయంలో తన లోపల బద్దలవుతున్న అగ్నిపర్వతాన్ని కంట్రోల్ చేయడానికి, తన పుండు మీద పడిన కారాన్ని భరించడానికి జగన్ ఎన్ని తంటాలు పడ్డారో ఏమో! అసలు అక్కడ పూర్తి సంభాషణ ఏం జరిగిందో రచ్చబండ ద్వారా రఘురామ వివరిస్తే బాగుంటుంది.

వైసీపీ ఉగ్ర‘వాది’ అరెస్టు!

వైయస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ని పోలీసులు అరెస్టు చేశారు.   బెంగళూరు నుండి వస్తుండగా కుప్పం దగ్గర ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ అధికార ప్రతినిధి హోదాలో దారుణమైన వ్యాఖ్యలు, వాదనలు చేసే ఉగ్ర‘వాది’గా నాగార్జునయాదవ్ గొప్ప పేరు సంపాదించుకున్నాడు.  గత కొంతకాలంగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు. నాగార్జున యాదవ్ ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. కొద్దిరోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కూడా వాడు, వీడు అంటూ డెలివరీ బాయ్స్.తో పోల్చాడు.

విశాఖలో వైసీపీ ఖాళీ!

విశాఖ కార్పొరేషన్ లో వైసీపీ దాదాపుగా ఖాళీ అయిపోయింది. విశాఖ రాజధాని అంటూ ఐదేళ్ల పాటు జగన్ ఆడిన డ్రామాకు విశాఖ ప్రజలు తెర దించేశారు. విశాఖ అభివృద్ధిని భూ స్థాపితం చేసి భూదందాల కోసం రాజధాని అంటూ మభ్యపెట్టేందుకు జగన్ చేసిన ప్రయత్నాన్ని వమ్ము చేశారు. విశాఖ పరిధిలో మొత్తం ఓట్లలో 70 శాతం వరకూ కూటమి అభ్యర్థులకే  పడ్డాయంటే వైసీపీని ప్రజలు ఎలా తిరస్కరించారో అర్థమవుతుంది. అందుకే తమ రాజకీయ భవిష్యత్ ను చూసుకుంటూ.. వైసీపీ కార్పొరేటర్లుఇతర పార్టీలకు వెళ్లిపోతున్నారు. వారు వెళ్లిపోతున్నా ఆపేందుకు వైసీపీ కీలక నేతలు కనీసం ప్రయత్నించడం లేదు. సరే సార్వత్రిక ఎన్నికలలో, అసెంబ్లీ ఎన్నికలలో విశాఖ  ఒక్కటంటే ఒక్క స్థానం కూడా గెలవలేకపోయిన జగన్ పార్టీ ఇప్పుడు విశాఖ కార్పొరేషన్ లోనూ ఖాళీ అయిపోతుంటే చేష్టలుడిగి చూస్తూ ఉండిపోతోంది.  అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే పెద్ద ఎత్తున విశాఖ కార్పొరేషన్ లో వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం, జనసేన పార్టీల్లోకి క్యూకట్టారు.  ఇప్పుడు తాజాగా మరికొందరు తెలుగుదేశం గూటికి చేరారు. ఔను 13 మంది వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. మరో ఇండిపెండెంట్ కార్పొరేటరు కూడా సైకిలెక్కేశారు. మరో పది మంది కార్పొరేటర్లు జనసేన గూటికి చేరడానికి రెడీగా ఉన్నారు. ఈ పది మంది మంగళవారం (జులై 23) జనసేన కండువా కప్పుకోనున్నారు.  ఈ పది మందినీ కూడా కలుపుకుంటే విశాఖ కార్పొరేషన్ లో వైసీపీ కార్పొరేటర్ల బలం 20కి పడిపోతుంది. దీంతో విశాఖ మేయర్  రాజీనామా కోసం తెలుగుదేశం, జనసేన కార్పొరేటర్లు డిమాండ్ చేయడానికి రెడీ అవుతున్నారు.   వైసీపీ ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం నాలుగేళ్ల వరకూ అవిశ్వాస తీర్మానం పెట్టకూడదు. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఆ నిబంధనను సవరించే అవకాశాలే మెండుగా ఉన్నాయి. ఒక్క విశాఖ అనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో పరిస్థితి ఇలాగే ఉంది. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వైసీపీని వీడి కూటమి పార్టీలవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో నాలుగేళ్ల వరకూ అవిశ్వాస తీర్మానం కూడదు అన్న నిబంధనను మార్చే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి.  

జగన్ కు తెలివి లేదు.. చాతకాదు.. మనసులో మాట బయటపెట్టిన మార్గాని భరత్

ఆంధ్రప్రదేశ్ ను తన ఐదేళ్ల అధ్వాన పాలనతో అస్తవ్యస్థంగా మార్చేసిన జగన్ ఓటమి తరువాత కూడా తన తీరు మార్చుకోలేదు. జనం తిరస్కరించారన్న సోయ కూడా లేకుండా.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉందని గగ్గోలు పెడుతున్నారు. తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఎమర్జెన్సీ ఉందా అనిపించేలా పరిస్థితులు ఉన్నాయన్న సంగతి విస్మరించి.. వ్యక్తిగత ఘర్షణలకు సైతం పొలిటికల్ కలర్ ఇస్తూ హస్తినలో ధర్నా అంటూ హడావుడి చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ ను లైట్ తీసుకోవాలంటూ  ఆయన పార్టీకే చెందిన మాజీ ఎంపి మార్గాని భరత్  తెలియకుండానే చెప్పేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యలో తన ఓటమికి కారణాలు వివరిస్తూ జగన్ చాతకాని తనాన్ని బయట పెట్టేశారు.  జగన్ మద్యం విధానం పార్టీని దారుణంగా దెబ్బతీసిందని అంగీకరించేశారు.  ఈ విషయంలో జగన్ తెలివితక్కువగా వ్యవహరించారని మార్గాని భరత్ తన మనసులో మాట చటుక్కున బయటకు చెప్పేశారు. ఒక టూత్ పేస్ట్ కొనే విషయంలోనే మనకు ఏ బ్రాండ్ కావాలన్నది ఆచితూచి ఎంచుకుంటాం. అటువంటిది   మద్యం కొనేవాడు తనకు ఇష్టమైన బ్రాండ్ కొనుక్కోవాలని అనుకోరా అని ప్రశ్నించారు. మేం అమ్మిందే తాగండి అంటే జనం వినరని కూడా భరత్ స్పష్టంగా చెప్పారు. తనకే అర్థమైన ఇంత చిన్న లాజిక్ తమ పార్టీ అధినేత జగన్ కు ఎందుకు అర్ధంకాలేదని పాపం భరత్ ఇప్పుడు బాధ పడుతున్నారు.  జగన్ కు మద్యం అలవాటు లేకపోవడం వల్ల ఈ విషయం ఆయనకు తెలియలేదని కవర్ చేసే ప్రయత్నం చేసి భంగపడ్డారు. మద్యం అలవాటు లేకపోతే మాత్రమేం.. రోజూ బ్రష్ చేసుకుంటారు కాదా? అంటూ నెటిజనులు మార్గాని భరత్ కు ఆయన లాజిక్ తోనే ఎదురు సెటైర్లు  వేస్తున్నారు. 

పెద్ద ఎత్తున పోలీసుల బదలీలకు రంగం సిద్ధం!?

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి  అధికారంలోకి వచ్చిన తరువాత పోలీసు శాఖలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. పెద్ద సంఖ్యలో ఐపీఎస్ అధికారులను బదలీ చేసిన తెలుగుదేశం ప్రభుత్వం.. ఇప్పుడు డీఎస్పీలు, సీఐల బదలీలపై దృష్టి పెట్టింది. జగన్ అధికారంలో ఉన్న సమయంలో పోలీసు శాఖ పూర్తిగా భ్రష్టుపట్టిపోయింది, దాడులు చేసిన వారిని వదిలేసి బాధితులపై కేసులు నమోదు చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో తప్పిదాలకు, అక్రమ కేసుల బనాయింపునకు పాల్పడిన వారిని బదిలీ చేయాలని తెలుగుదేశం ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే బదలీల్లో సమర్థతకు పెద్ద పీట వేస్తే పోలీసు శాఖ స్వతంత్రంగా సమర్థంగా పని చేసేందుకు అవకాశం ఉంటుందని పోలీసు ఉన్నతాధికారుల భావిస్తున్నారు. అలా కాకుండా సిఫారసులకు ప్రాధాన్యత ఇస్తే పరిస్థితిలో మార్పు ఉండేందుకు ఆస్కారం ఉండదన్న అభిప్రాయం పోలీసు ఉన్నతాధికారులతో వ్యక్తం అవుతోంది. విధి నిర్వహణలో చట్ట బద్ధంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చుకున్న అధికా రులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ విషయంలో పైరవీలు, సిఫారసులకు అవకాశం లేకుండా చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ణప్తి చేస్తున్నారు.   

ఇంతకీ శాంతి భర్త ఎవరు?

దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి విషయంలో ఒకదాని తరువాత ఒకటిగా వివాదాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాను ఎప్పుడో 2016లోనే తమ కులాచారం ప్రకారం మదన్ మోహన్ కు విడాకులు ఇచ్చేశానని మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రకటించిన శాంతి.. తాను లాయర్ సుభాష్ రెడ్డిని 2020లో వివాహం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే 2016లోనే విడాకులిచ్చిన మదన్ మోహన్ పేరునే 2020లో దేవాదాయ శాఖలో ఉద్యోగంలో చేరే సమయంలో భర్తగా పేర్కొన్నారు. ఆమె సర్వీస్ రిజిస్టర్ లో కూడా అదే ఉంది.  అంతే కాదు.. గత ఏడాది జనవరిలో మెటర్నటీ లీవ్ కోసం చేసుకున్న దరఖాస్తులో కూడా శాంతి తన భర్త పేరు మదన్ మోహన్ అనే పేర్కొన్నారు. కానీ ఇటీవల అంటే జులై 17న.. ఇంకా వివరంగా చెప్పాలంటే.. మదన్ మోహన్ తన భార్య శాంతికి విజయసాయిరెడ్డితో సంబంధం ఉందనీ, ఆమెకు పుట్టిన మగబిడ్డకు ఆయనే తండ్రి అంటూ ఫిర్యాదు చేసిన తరువాత.. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మదన్ మోహన్ కు తాను ఎప్పుడో విడాకులు ఇచ్చేశాననీ,  పి.సుభాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు.  దీంతో విడాకులు తీసుకోకుండా మరో పెళ్లి చేసుకున్న శాంతి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారు. ఇదే విషయాన్ని పేర్కొంటూ  15 రోజుల్లో సమాధానం చెప్పాలంటూ సస్పెన్షన్ లో ఉన్న సహాయ కమిషనర్ కె.శాంతికి ఆ శాఖ కమిషనర్ సత్యనారాయణ నోటీసు జారీ చేశారు.     అంతే కాకుండా  ఆమెపై కొత్తగా ఆరు అభియోగాలు నమోదు చేశారు.  శాంతి ఇప్పటికే అవినీతి ఆరోపణలతో  సస్పెన్షన్ లో ఉన్నారు. సస్పెన్షన్  ఉన్న శాంతి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రస్తావించిన అంశాలతో పాటు, ఎటువంటి అనుమతీ లేకుండా మీడియాతో మాట్లడటం సహా  పలు ఉల్లంఘనలకు సంబంధించి కొత్తగా ఆమెపై ఆరు అంశాలపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ అయ్యాయి.    తాజాగా వివరణ కోరుతూ జారీ చేసిన నోటీలులో   విధుల్లో చేరినప్పుడు భర్త పేరు మదన్ మోహన్ అని చెప్పి, వేరొకరిని వివాహం చేసుకున్నట్లు వెల్లడించడం,  దేవాదాయశాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించడం,  కమిషనర్ అనుమతి లేకుండా విలేకరుల సమావేశంలో మాట్లడటం అలాగే..  వైసీపీ ఎంపీను ప్రశంసిస్తూ ట్వీట్ చ చేయడం , అలాగే విశాఖలో  ఆమె నివాసం ఉన్న అపార్ట్ మెంట్ లోని వేరే ప్లాట్ వారితో గొడవపడి పోలీసు స్టేషన్ కు ఎక్కడం వంటి అంశాలపై వివరణ కోరుతూ దేవాదాయ శాఖ కమిషనర్ నోటీసు చారీ చేశారు.    

కాంగ్రెస్‌తో దోస్తీ.. మారిన జ‌గ‌న్ వ్యూహం !?

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి   కాంగ్రెస్ పార్టీకి ద‌గ్గ‌ర‌వుతున్నారా..  ఏపీలో చంద్ర‌బాబును ఇర‌కాటంలో పెట్టేందుకు కేంద్ర‌ కాంగ్రెస్ పెద్ద‌లు , వైసీపీ నేత‌లు క‌లిసి ప్లాన్ చేస్తున్నారా..? జాతీయ‌ రాజ‌కీయాల్లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని హైలేట్ చేసేందుకు కాంగ్రెస్ పెద్ద‌లు సుముఖత వ్య‌క్తం చేశారా..?  ఈ ప్ర‌శ్న‌ల‌కు ఢిల్లీ రాజ‌కీయ వ‌ర్గాల్లో అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. ఏపీలో ఘోర ప‌రాభ‌వం త‌రువాత జ‌గ‌న్ త‌న రాజ‌కీయ వ్యూహాల‌ను మార్చిన‌ట్లు కనిపిస్తోంది. గ‌తంలో బీజేపీ ఛీ కొట్టినా కేసుల నుంచి త‌ప్పించుకునేందుకు జ‌గ‌న్ వారికి మ‌ద్ద‌తు ఇస్తూ వ‌చ్చారు. వైసీపీ అధికారంలో ఉన్న‌న్ని రోజులు ఢిల్లీ వెళ్లిన ప్ర‌తీసారి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న‌పై ఉన్న కేసుల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకే ప్రాధాన్య‌త ఇచ్చార‌నేది  ప్ర‌తి ఒక్క‌రికీ తెలిసిన విష‌య‌మే. ప్ర‌స్తుతం ఏపీలోని ఎన్డీఏ ప్ర‌భుత్వానికి వ్యతిరేకంగా జగన్ ఢిల్లీలో ధర్నా చేయాలనుకోవడం వెనుక కేంద్ర కాంగ్రెస్ పెద్ద‌ల హ‌స్తం ఉన్న‌ట్లు తెలుస్తోంది. రాజ్య‌స‌భ‌లో బీజేపీ సంఖ్యాబ‌లం త‌క్కువ‌గా ఉంది. రాజ్య‌స‌భ‌లో బీజేపీ ప్ర‌వేశ‌పెట్టిన బిల్లు పాస్ కావాలంటే త‌ప్ప‌నిస‌రిగా వైసీపీ స‌హ‌కారం అవ‌స‌రం. దీనిని ఆస‌రా చేసుకున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బీజేపీ నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని భావించి.. కాంగ్రెస్ తో దోస్తీకి రెడీ అయ్యార‌ని అంటున్నారు.  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఐదేళ్ల పాల‌న‌తో విసిగిపోయిన ఏపీ ప్ర‌జ‌లు ఓటు ద్వారా ఆయనను గద్దె దింపారు. అసెంబ్లీలో ఆయన పార్టీని  కేవ‌లం 11   స్థానాల‌కే  ప‌రిమితంచేసి.. కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేదు పొమ్మన్నారు. దీంతో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అసెంబ్లీలో కేవ‌లం పులివెందుల ఎమ్మెల్యేగానే అడుగు పెట్టాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. మ‌రోవైపు.. పుండుపై కారం చ‌ల్లిన‌ట్లుగా ఎన్నిక‌ల త‌రువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బ‌లోపేతం చేసేందుకు ఆ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. విజ‌య‌వాడ వేదిక‌గా కాగ్రెస్ ఆధ్వ‌ర్యంలో ఆమె వైఎస్ఆర్ జ‌యంతిని  నిర్వ‌హించారు. వైఎస్  జ‌యంతి స‌భ‌లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ప‌లువురు మంత్రులు, ఏపీలోని కాంగ్రెస్ పెద్ద‌లు పాల్గొన్నారు. ఈ స‌భ విజ‌య‌వంతం ద్వారా కాంగ్రెస్ పార్టీకి త్వ‌ర‌లో పూర్వ‌వైభ‌వం వ‌స్తుంద‌ని ష‌ర్మిల చెప్ప‌క‌నే చెప్పారు. దీనికి తోడు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆస్తి అని, వైఎస్ఆర్ రాజ‌కీయ వార‌స‌త్వాన్ని తానేనని  ష‌ర్మిల ప్ర‌క‌టించుకున్నారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వైఎస్ఆర్ రాజ‌కీయ వార‌సుడు కాద‌ని ష‌ర్మిల చెప్ప‌డం జ‌గ‌న్ శిబిరంలో ఆందోళ‌న రేకెత్తించింది. ష‌ర్మిల దూకుడుకు అడ్డ‌క‌ట్ట వేయ‌కపోతే వైసీపీ మ‌నుగ‌డ‌కే ప్ర‌మాదం ఉంద‌ని భావించిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  కాంగ్రెస్ పెద్ద‌ల ట‌చ్‌లోకి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది.  జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఇటీవ‌ల కేంద్ర కాంగ్రెస్ పెద్ద‌ల‌తో ఫోన్‌లో మాట్లాడిన‌ట్లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. రెండు సార్లు బెంగ‌ళూరు వెళ్లిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత డి.కె. శివ‌కుమార్ తో భేటీ అయిన‌ట్లు స‌మాచారం. కాంగ్రెస్ పార్టీకి రాజ‌కీయంగా త‌న మ‌ద్ద‌తు ఉంటుంద‌ని, ఫండింగ్ విష‌యంలోనూ త‌న స‌హాయ‌స‌హ‌కారాలు ఉంటాయ‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చిన‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతున్నది. గ‌త ప‌దేళ్లుగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  కేంద్రంలో ఎన్డీయే కూట‌మికి మ‌ద్ద‌తుగా ఉంటూ వ‌చ్చారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం త‌న‌పై ఉన్న కేసుల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకేన‌ని అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ప్ర‌స్తుతం కూడా ఎన్డీయే కూట‌మికే వైసీపీ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. అయితే, ఇక్క‌డ గుర్తించాల్సిన విష‌యం ఏమిటంటే.. ప్ర‌స్తుతం   కాంగ్రెస్ కు వైసీపీ మ‌ద్ద‌తుగా నిలిచిన‌ప్ప‌టికీ కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు త‌మ‌ను ఏమీ చేయలేర‌న్న ధీమాతో జ‌గ‌న్ ఉన్న‌ట్లు స‌మాచారం. ఎందుకంటే.. రాజ్య‌స‌భ‌లో వైసీపీకి 11 స్థానాలు ఉన్నాయి. రాజ్య‌స‌భ‌లో ఏదైనా బిల్లు ఆమోదం పొందాలంటే ఎన్డీయేకు పూర్తి మెజార్టీ లేదు. వైసీపీ స‌హ‌కారం త‌ప్ప‌ని స‌రి. దీంతో జ‌గ‌న్ సైతం బీజేపీకి వ్య‌తిరేకంగా త‌న రాజ‌కీయ అడుగులు వేసేందుకు ధైర్యం చేస్తున్నార‌ని తెలుస్తోంది. రాజ్య‌స‌భ‌లో ఎన్డీయేకు మ‌ద్ద‌తు ఇచ్చి.. మిగ‌తా విష‌యాల్లో కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తుగా ఉండాల‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌ధాన ల‌క్ష్యం ఏపీలో చంద్ర‌బాబు నాయుడును ఇర‌కాటంలో పెట్ట‌డ‌మే. అధికారంలో లేక‌పోయినా.. చంద్ర‌బాబుపై ఏపీలో, జాతీయ రాజ‌కీయాల్లో పైచేయి సాధించాల‌న్న‌ది జ‌గ‌న్ ప్రణాళికగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకోసమే.. కాంగ్రెస్ స‌హ‌కారం తీసుకోనున్నారని చెబుతున్నారు‌. ఈ క్ర‌మంలోనే వైసీపీకి మైలేజీ ఇచ్చేందుకు    కాంగ్రెస్‌  అగ్రనేతలు సైతం సై అన్నారని అంటున్నారు.   పార్లమెంట్ సమావేశాల నేపధ్యంలో లోక్ సభ స్పీకర్  ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీహార్ కు ప్రత్యేక ప్యాకేజీ కావాల‌ని జేడీయూ డిమాండ్ చేయ‌గా.. ఏపీకి ప్రత్యేక హోదాను విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఇదే విష‌యాన్ని కాంగ్రెస్ నేత జైరామ్ ర‌మేష్ ట్వీట్ చేశారు. జేడీయూ ప్ర‌త్యేక హోదా అడిగింది, ఏపీలో వైసీపీ మాకు ప్ర‌త్యేక హోదా కావాల‌ని కోరింది. కానీ, తెలుగుదేశం మాత్రం ఆ మాటెత్తలేదని ఆయ‌న ట్వీట్ లో పేర్కొన్నాడు. ఐదేళ్లు అధికారంలో ఉండి ప్ర‌త్యేక హోదా ఊసెత్త‌ని జ‌గ‌న్‌.. ఉన్న‌ట్లుండి ఇప్పుడు ప్ర‌త్యేక హోదా కావాల‌ని గొంతెత్తడంపై ప్ర‌జ‌లు ఆశ్చ‌ర్య పోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి దగ్గ‌ర‌య్యేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నాల‌ను బీజేపీ ఎలా తీసుకుటుందన్నదే రాజ‌కీయ వ‌ర్గాల్లో కీలక అంశంగా మారింది.