ప్రత్యేక హోదా అడగకపోవడం చంద్రబాబు ముందు చూపుకు తార్కాణం!
posted on Jul 24, 2024 @ 10:47AM
ప్రత్యేక హోదా బీహార్ కు ఇవ్వడం సాధ్యంకాదని లోక్ సభలో కేంద్రం స్పష్టం చేసింది.ఎన్డీసీ పెట్టిన ఐదు నిబంధనలు హోదాకు అడ్డుగా ఉన్నాయన్నాయని కేంద్ర ఆర్ధిక మంత్రి పంకజ్ చౌదరి చెప్పడం గమనార్హం. దీనిని బట్టి ఏపీకీ హోదా హుళక్కే నని అర్ధమవుతున్నది.చంద్రబాబుకు ఆవిషయం తెలిసీ లేదు అనిపించుకోవడం ఇష్టంలేక అడగడంలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హోదా బదులు ప్రత్యక నిధులు అంశాల వారీగా కేంద్రం నుంచి రాబట్టాలని నిర్ణయించడం ద్వారా చంద్రబాబు తన ముందు చూపును చాటారని అంటున్నారు.
అంశాల వారీగా కేంద్రం నుంచి నిథులు రాబట్టే అంశాన్ని ఎంపీలకు అప్పగించారు. అందులో భాగంగానే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పోలవరం అంశాన్ని బడ్జెట్ కు ముందు రోజు అంటే సోమవారం (జులై 22) సభలో ప్రస్తావించారు. కేశినేని నాని ప్రతిపాదనకు సభలో కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. ఆ స్పందన ప్రభావం బడ్జెట్ లో ప్రస్ఫుటంగా కనిపించింది. అమరావతి రాజధాని,విశాఖ ఉక్కు ప్లాంట్, పోలవరం, రైల్వే ప్రాజెక్టుల విషయం పార్లమెంట్ లో తెలుగుదేశం ఎంపీలు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే ప్రస్తావించారు. పారిశ్రామిక ప్రగతి విషయంలో ఏపీకి కేంద్రం ఇతోధిక సహాయం, సహకారం అవసరమని కూడా సభలో ఎంపీలు కోరారు. ఒక రైల్వే ప్రాజెక్టుల విషయం మినహాయిస్తే లోక్ సభలో తెలుగుదేశం ఎంపీలు ప్రస్తావించిన ప్రతి అంశానికీ విత్త మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో సముచిత కేటాయింపులు జరిపారు.
ఆ సంగతి పక్కన పెడితే వినుకొండ ఘటన సాకుతో రాజకీయ లబ్ధి కోసం హస్తినలో ధర్నా అంటూ జగన్ చేస్తున్న హడావుడికి కాంగ్రెస్ మద్దతు లభిస్తుందని ఆ పార్టీ నేతలు ఆశించారు. అయితే ఆ విషయంలో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు చంద్రబాబు కు మద్దతు పలికారు. వినుకొండ ఘటన పాత కక్షల కారణంగా జరిగిందని చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు షర్మిల కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయి నుంచి అందిన సమాచారం మేరకు ఇద్దరు క్రిమినల్స్ మధ్య ఉన్న పాతకక్షలే వినుకొండ ఘటనకు కారణమని షర్మిల కుండబద్లలు కొట్టేశారు. దీంతో హస్తినలో ధర్నాకు కాంగ్రెస్ మద్దతుపై జగన్ పెట్టుకున్న ఆశలు ఆవిరి అయిపోయాయనే చెప్పాలి. జగన్ మాటలను ఆయన పార్టీ నేతలే నమ్మడం లేదన్న వార్తలకు ఊతం ఇచ్చే విధంగా జగన్ ఢిల్లీ ధర్నాకు ఆయన పార్టీకే చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, వంకా రవీంద్రలు గైర్హాజరయ్యారు. దీని ద్వారా జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని వారు చెప్పకనే చెప్పినట్లైంది. రాష్ట్రం వరదలతో అతలాకుతలమౌతున్న సమయంలో అసెంబ్లీలో ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా జగన్ ఢిల్లీలో ధర్నా అంటూ హడావుడి చేయడాన్ని ఆమె తప్పు పట్టారు.