కవిత అరెస్ట్ పై నోరు విప్పిన కెసీఆర్
posted on Jul 24, 2024 @ 11:40AM
తీహార్ జైల్లో గత నాలుగు నెలలుగా మగ్గుతున్న తన కూతురు కవిత విషయంలో బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నోరు విప్పారు. కవితకు బెయిల్ వచ్చే విధంగా ఢిల్లీ పెద్దలతో కెటీఆర్, హరీష్ రావు చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ చర్చలు విఫలం కావడంతో పార్టీని విలీనం చేసే ప్రతిపాదన చేయనుందని వార్తలు సోషల్ మీడియాలో గుప్పు మన్నాయి. బిఆర్ఎస్ నేతలు పలువురు ఇప్పటికే బిజెపిలో చేరారు. నలుగురు బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరడానికి సిద్దమయ్యారు. అయినప్పటికీ కవిత విషయంలో ఈడీ కఠినంగా వ్యవహరిస్తోంది. బెయిల్ రాకుండా అడ్డుకుంటోంది. దీంతో బిఆర్ఎస్ అధినేత తీవ్ర ఆందోళనలో పడిపోయారు.
రాజకీయ కక్షతోనే తన కూతురు కవితను జైల్లో పెట్టారని... కూతురు జైల్లో ఉంటే తండ్రిగా తనకు బాధ ఉండదా? అని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తాను అగ్నిపర్వతంలా ఉన్నానన్నారు. తమ పార్టీకి ఎలాంటి క్లిష్ట పరిస్థితులూ లేవన్నారు. ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితులను కూడా తాము ఎదుర్కొన్నామన్నారు. చాలా క్లిష్టపరిస్థితుల్లో తెలంగాణను సాధించుకున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ పాలనపై పట్టు సాధించలేకపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లు పాలనపై దృష్టి సారించకుండా బద్నాం చేసే పనిలో ఉన్నారని విమర్శలు గుప్పించారు.