జలగన్న హాలోగ్రామ్స్ కుంభ(త్)కోణం!
(శుభకర్ మేడసాని, ఇన్‌పుట్ ఎడిటర్, తెలుగువన్)
వైసీపీ హయాంలో ఎక్సైజ్ సమావేశానికి సంబంధించిన మినిట్స్ ఫైల్లో లేకుండా గల్లంతు చేశారు. ఎక్సైజ్ శాఖలో జరిగిన కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మద్యం సీసాలపై ముద్రించే సెక్యూరిటీ హాలోగ్రామ్స్ సరఫరా టెండర్ల వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నట్లు విజిలెన్స్ కమిషన్ గుర్తించింది. ముందస్తు కుమ్మక్కు, కుట్ర మేరకే నిబంధనలకు విరుద్ధంగా కుంభత్ హాలోగ్రాఫిక్స్ సంస్థకు టెండర్లు కట్టబెట్టారన్న ఫిర్యాదులపై గతంలో విచారణ జరిపిన విజిలెన్స్ కమిషన్ పలు అవకతవకల్ని నిర్ధారిం చింది. వాటిపై సమగ్ర విచారణ జరిపించాలంటూ గతేడాది సెప్టెంబరులో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించగా జగన్ ప్రభుత్వం దాన్ని తొక్కిపెట్టింది. ఏపీ బేవరేజెస్ ఎండీగా పనిచేసిన వాసుదేవ రెడ్డి ఈ వ్యవహారంలో ప్రధాన పాత్రధారన్న ఫిర్యాదులున్నాయి. మద్యం కుంభకోణంపైన సీఐడీ ద్వారా సమగ్ర విచారణకు కూటమి ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో విజిలెన్స్ కమిషన్ నివేదిక తాజాగా బయటకొచ్చింది. దీనిపై సీఐడీ దృష్టిసారించింది.
మద్యం సీసాలపై ముద్రించే హాలోగ్రామ్స్ తయారీ, సరఫరా కోసం 2020 సెప్టెంబరులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ టెండర్లు పిలిచి చెన్నైకు చెందిన కుంభత్ హాలోగ్రాఫిక్స్ సంస్థను ఎల్1గా ఖరారు చేసింది. నిబంధనలకు విరుద్దంగా ఈ టెండరు కట్టబెట్టారని విజిలెన్స్ కమిషన్ గుర్తించింది. కుంభత్ హాలోగ్రాఫిక్స్, హాలోస్టిక్ ఇండియా లిమిటెడ్, అల్ఫా లేజర్టెక్ LLP సంస్థలు మూడూ ఒక దానితో మరొకటి సంబంధం కలిగినవే. అవి కుమ్మక్కై టెండర్లలో పాల్గొన్నాయి. ఈ సంస్థల మధ్య గతంలో వ్యాపార లావాదేవీలు కొనసాగాయా? జీఎస్టీ డేటా ఏం చెబుతోంది అనేవి పరిశీలించకుండానే అనుమతిచ్చేశారు. హాలోగ్రామ్స్ తయారీ, ప్రింటింగ్, నంబరింగ్, సరఫరాలో కుంభత్ హాలోగ్రాఫిక్స్ సంస్థకు అనుభవం లేదు. ధ్రువీకరణ పత్రాలు నిజమైనవా? కావా? అనేది నిర్ధారించుకోలేదు. వరుసగా మూడేళ్ల పాటు 10 కోట్ల రూపాయల మేర వార్షిక టర్నోవర్ కలిగి ఉన్నామంటూ కుంభత్ సమర్పించిన నివేదికలు అసలైనవా? కావా? అనేది సాంకేతిక మదింపు కమిటీ పరిశీలించలేదు. ఆ సంస్థకు సంబంధించిన జీఎస్టి, ఆదాయపు పన్ను రిటర్న్.లు పరిశీలించలేదు. నిపుణుల కమిటీ చైర్మన్ అయిన ఎక్సైజ్ శాఖ కమిషనర్, సభ్యులైన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, ఆర్ధిక శాఖ ప్రతినిధి సంతకాలు సాంకేతిక మదింపు నివేదికలో లేకుండానే టెండర్లు ఖరారు చేసేశారు. నిపుణుల కమిటీ సమావేశానికి సంబంధించిన మినిట్స్ ఫైల్లో లేకుండా గల్లంతు చేశారు.
నకిలీ మద్యాన్ని నియంత్రించేందుకు వీలుగా టెండర్లలో పాల్గొనే కంపెనీలు... అథంటికేషన్ సొల్యూషన్ ప్రొవైడర్స్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ హాలోగ్రామ్ మాన్యుఫ్యాక్చర్ అసోసియేషన్ (ఐహెచ్ ఎంఏ) సభ్యత్వం కలిగి ఉండాలి. వాటిల్లో సభ్యత్వం కలిగి ఉన్నట్లు టెండర్లలో పాల్గొన్న కంపెనీలు సమర్పించిన సర్టిఫికెట్లు నిజమైనవా కావా అన్నది పరిశీలించలేదు. కుంభత్ సంస్థ హాలోగ్రామ్స్ తయారీ, నంబరింగ్, కోడింగ్, బార్ కోడింగ్ అన్నీ విజయవాడలోనే చేపట్టి అక్కడ నుంచే సరఫరా చేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా చెన్నై నుంచి సరఫరా చేశారు. ప్రభుత్వ దుకాణాల్లో టాక్స్ చెల్లించని మద్యాన్ని విక్రయించేందుకు వీలుగానే ఇలా చేశారని, దీని వెనక నకిలీ హాలోగ్రామ్స్ దందా జరిగిందన్న అనుమానాలున్నాయి. ఛత్తీస్ గఢ్ మద్యం కుంభకోణం, హర్యానాలో వెలుగుచూసిన మద్యం కుంభకోణాల్లోనూ ఇలా నకిలీ హాలోగ్రామ్లతోనే పెద్ద ఎత్తున ఆక్రమాలకు పాల్పడినట్లు తేలింది. ఈ నేపథ్యంలో సీఐడీ దర్యాప్తులో ఇవన్నీ ప్రధాన అంశాలు కానున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వేల కోట్లు పందికొక్కుల్లా దోచుకు తినటానికి పలు రకాల కొత్త కొత్త అక్రమ మార్గాలు కనిపెడితే అభినందించకుండా నేరం అంటారేంటి అని వారి అభిమాన పత్రిక సాక్షిలో ప్రశ్నించవచ్చు! బరితెగింపు వారి జన్మ హక్కు!