జగన్ కి వైసీపీ ఎంపీల రాజీ ‘నామాలు’?
posted on Aug 1, 2024 @ 2:24PM
వైసీపీ పతనం కొనసాగుతోంది. ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత ఆ పార్టీ పయనం పతనం నుంచి పతనం దిశగా వేగంగా సాగుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ వైసీపీ అధినేత ఢిల్లీ ధర్నా నవ్వుల పాలైంది. అలాగే విపక్ష హోదా కోరుతూ జగన్ కోర్టును ఆశ్రయించడం, హోదా ఇస్తే తప్ప సభకు హాజరు కాబోమనడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తెలుగుదేశం పార్టీకి సమయం ఇవ్వకుండా విమర్శల దాడికి దిగడాన్ని వైసీపీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. కేతిరెడ్డి వంటి వారైతే ఈ విషయాన్ని బాహాటంగానే చెబుతూ పార్టీకి దూరమైతే.. బొత్స వంటి వారు మీడియా సమావేశాలలో పరోక్షంగా జగన్ తప్పిదాలను ఎత్తి చూపుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా జగన్ హస్తిన వేదికగా చేపట్టిన ధర్నాకు ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టి మండలి సమావేశాలకు హాజరై తన ధిక్కారాన్ని వ్యక్తం చేశారు.
ఇవన్నీ చాలవన్నట్లు జగన్ ధీమాను, ధైర్యాన్ని నీరుగార్చే విధంగా ఏకంగా ఆరుగురు వైసీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామాస్త్రం ప్రయోగించడానికి రెడీ అయిపోయారు. వైసీపీకి రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉన్నారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ కు రాజ్యసభలో పూర్తి బలం లేకపోవడంతో తన పదకొండు మంది రాజ్యసభ సభ్యుల అవసరం మోడీ ప్రభుత్వానికి ఉంటుందన్న ధీమా జగన్ లో ఉంది. ఇప్పుడా ధీమా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. రాజ్యసభ సభ్యుల బలంతోనే ఆయన ఇండియా కూటమి వైపు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆ బలమే లేకపోతే అటు ఎన్డీయే, ఇటు ఇండియా కూటమి జగన్ ను పట్టించుకునే పరిస్థితి ఉండదు. అందుకే వైసీపీ రాజ్యసభ సభ్యుల రాజీనామా బాట జగన్ ను భయపెడుతోంది. ఆందోళనకు గురి చేస్తున్నది. ఇంతకీ వైసీపీ రాజ్యసభ సభ్యుల రాజీనామాల ప్రచారానికి తెరలేపిందెవరంటే స్వయంగా జగన్ సొంత పత్రికే.
ఆ పత్రికలో వైసీపీకి చెందిన ఆరుగురు రాజ్యసభ సభ్యలు రాజీనామా చేయనున్నారని పేర్కొంది. రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీకీ రాజీనామా చేసి తెలుగుదేశం గూటికి చేరనున్నారనీ పేర్కొంది. అలా రాజీనామా చేసిన వారికి టీడీపీ మళ్లీ అదే రాజ్యసభ సభ్యత్వం ఇస్తుందని జోస్యం కూడా చెప్పింది. తొలి నుంచీ అంటే సార్వత్రిక ఎన్నికలలో ఓటమి తరువాత నుంచీ వైసీపీ నుంచి వలసలపై రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పుడు వైసీపీ ఎంపీల రాజీనామాల వార్తతో ఆ వలసల ఒరవడి ఆరుగురితో ఆగే అవకాశాలు లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.