కుప్పంలో వైసీపీ బుడగ పేలిపోయింది!
posted on Aug 1, 2024 @ 11:12AM
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో అంటే 2019 నుంచి 2024 వరకూ ఆ పార్టీ అధినేత జగన్ సహా నేతలంతా కుప్పంలో చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా పావులు కదిపారు. కుప్పం స్థానిక సంస్థల ఎన్నికలలో ధనబలం, అధికార మదంతో దౌర్జన్యాలు చేసి గెలిచారు. ఆ సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు చంద్రబాబు ముఖం చూడాలని ఉందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైనాట్ కుప్పం అంటూ కుప్పంలో చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా ఆ నియోజకవర్గ బాధ్యతలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. ఎన్నికలకు చాలా ముందుగానే కుప్పం వైసీపీ అభ్యర్థిగా భరత్ పేరు ప్రకటించి.. భరత్ ను గెలిపిస్తే మంత్రిని చేస్తానంటూ జగన్ ప్రకటించారు. కుప్పం నియోజకవర్గ పార్టీ బాధ్యతలను పెద్దిరెడ్డికి జగన్ అప్పగించిన క్షణం నుంచీ కుప్పంలో ఫ్యాక్షన్ తరహా రాజకీయాలకు తెరలేచింది. తెలుగుదేశం కార్యకర్తలు, సానుభూతి పరులు లక్ష్యంగా వేధింపులు ఆరంభమయ్యాయి. బెదిరింపులతో తెలుగుదేశం శ్రేణులను భయభ్రాంతులకు గురి చేశారు. బలవంతంగా పార్టీ కండువా మార్పించారు. ఇంకే ముంది కుప్పంలో ఏదో జరిగిపోతోంది. చంద్రబాబుకు నియోజకవర్గంలో వ్యతిరేకత పెరిగిపోయింది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రశాంతతకు మారుపేరు అయిన కుప్పం నియోజవకర్గం భయానక వాతావరణాన్ని సృష్టించారు. తన సొంత నియోజకవర్గ పర్యటనలకు కూడా చంద్రబాబును అడ్డుకుని దాడులకు తెగబడే పరిస్థితిని పెద్దిరెడ్డి పర్యవేక్షణలో వైసీపీ సృష్టించింది.
అయితే ప్రజలు కుప్పం నుంచి చంద్రబాబునాయుడిని భారీ మెజారిటీతో గెలిపించుకున్నారు. చంద్రబాబుకు ప్రత్యర్థిగా పోటీ చేసిన భరత్ ఎన్నికల ఫలితాల తరువాత కుప్పంలో కనిపించడమే మానేశారు. ఎన్నికల ఫలితాల తరువాత కుప్పంలో వైసీపీ బుడగ పేలిపోయింది. ఎన్నికల ఫలితాలు వచ్చి, రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి 50 రోజులు అయ్యిందో లేదో.. కుప్పంలో బలవంతపు పార్టీ మార్పిళ్ల బండారం బట్టబయలైంది. వైసీపీ ఖాళీ అయిపోయింది. ఆ పార్టీ కార్యాలయానికి తాళం పడిపోయింది.
ఎన్నికల ముందు వరకూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ కుప్పం అభ్యర్థి ఎన్నికల ఫలితాల తరువాత నిశ్శబ్దంగా కుప్పం వదిలి వెళ్లిపోయారు. పార్టీ క్యాడర్ కు అస్సలు అందుబాటులోకి రావడం లేదు. ఇక కుప్పంలో భరత్ ను గెలిపిస్తాను, చంద్రబాబును నియోజకవర్గంలో అడుగుపెట్టనీయను అంటూ ప్రగల్భాలు పలికిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సొంత నియోజకవర్గం పుంగనూరులో అడుగుపెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. పలువురు వైసీపీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు తెలుగుదేశం గూటికి చేరిపోయారు. ఇంకా వైసీపీలో ఎవరైనా మిగిలి ఉంటే వారు కూడా రానున్న రోజులలో సైకిల్ ఎక్కేయడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కుప్పం మునిసిపల్ చైర్మర్ డాక్టర్ సుధీర్ కూడా తెలుగుదేశం గూటికి చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే తెలుగుదేశం క్యాడర్ నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకత కారణంగా అది జరగలేదు.
కాగా ఎన్నికల ముందు కుప్పం తెలుగుదేశం వ్యవహారాల బాధ్యతను పార్టీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కు చంద్రబాబు అప్పగించింది. ఎన్నికల ప్రచారం నుంచి, పార్టీ నేతలు, కార్యకర్తలు, కూటమి భాగస్వామ్య పక్షాల క్యాడర్ ను సమన్వయ పరుచుకుంటూ శ్రీకాంత్ ముందుకు సాగారు. ఇక ఇప్పుడు ఆయన కుప్పంలో వైసీపీని ఖాళీ చేయడంపై దృష్టి పెట్టారు. గత ఏడాది మార్చి లో జ రిగిన తూర్పు రాయ లసీమ గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికలలో శ్రీకాంత్ సంచలన విజయం.. అప్పట్లోనే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి ఘోర పరాజయం తప్పదన్న సంకేతాలు ఇచ్చింది. అయితే మా ఓటర్లు వేరే ఉన్నారు అంటూ అప్పట్లో వైసీపీ పట్టించుకోలేదు. అయితే శ్రీకాంగ్ ప్రతిభను గుర్తించిన చంద్రబాబు ఆయనకు వెంటనే కుప్పం బాధ్యతలను అప్పగించారు. చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టిన శ్రీకాంత్ ఇప్పుడు కుప్పంలో వైసీపీ జెండా పట్టుకోవడానికి కూడా ఎవరూ ఉండకుండా ఖాళీ చేయించే పనిలో ఉన్నారు.