జగన్ ప్రచార పిచ్చి కుదిరింది!
posted on Aug 1, 2024 @ 5:42PM
(శుభకర్ మేడసాని, ఇన్‌పుట్ ఎడిటర్, తెలుగువన్)
జగన్ ఫొటోలున్న పాసుపుస్తకాల జారీని ఎన్నికల కోడ్ కారణంగా ఎన్నికల కమిషన్ నిలిపివేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పుస్తకాలను వెనక్కి తీసుకుంటామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో రైతులకు కొత్తగా రాజముద్రతో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలు అందించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పాసు పుస్తకాలపై రైతుల సమగ్ర వివరాలు తెలియజేసే క్యూఆర్ కోడ్‌ని ముద్రించాలని చంద్రబాబు సూచన చేశారు. రైతులు ఆ కోడ్‌ని స్కాన్ చేస్తే తమ భూమి వివరాలు, సరిహద్దులు, లోకేషన్, ఇతర వివరాల తెలుసుకోగలుగుతారు. జగన్ బొమ్మలున్న పుస్తకాలను రీకాల్ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. వైసీపీ అధినేత జగన్‌కి ఉన్న ప్రచార పిచ్చి రాష్ట్ర ఖజానాను గుల్లచేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. "కోటి రూపాయలో, పది కోట్లో కాదు... 700 కోట్ల రూపాయల మేర ప్రజాధనాన్ని జగన్ తన పేరు, ఫొటోల పిచ్చి కోసం తగలేశారు. భూముల సమగ్ర సర్వే పేరిట కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా సర్వేకోసం గ్రానైట్ రాళ్లను తీసుకొచ్చి వాటిపై తన తండ్రి పేరు, తన పేరు చెక్కించుకున్నారు. ఈ సరదా తీర్చుకునేందుకు జగన్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. పాత సామెత రాజుల సొమ్ము రాళ్లపాలు..! జగన్ సామెత ప్రజల సొమ్ము జగన్ రాళ్లపాలు…!
ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలోని తన కార్యాలయంలో రెవెన్యూశాఖ కార్యకలాపాలపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సర్వే రాళ్లు, పాసుపుస్తకాలు తదితర అంశాలపై కీలక చర్చ జరిగింది. “భూములను రీ సర్వే చేయాలని కేంద్రం నిధులు ఇస్తే జగన్ ఏం చేశారు? సరిహద్దులను నిర్దేశించేందుకు సాధారణ రాళ్లను వాడతారు. కానీ జగన్ కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా 77 లక్షల ఖరీదైన గ్రానైట్ రాళ్లను కొన్నారు. వాటిపై తన పేరును ముద్రించుకున్నారు. పాసుపుస్తకాలపై తనపేరు, ఫొటోలు అచ్చు వేయించుకున్నారు. కేంద్రం చెప్పినదానికి భిన్నంగా రీ సర్వేను తన ప్రచార పిచ్చికోసం వాడుకున్నారు. ఆయన పిచ్చి పనులకు 700 కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయింది. పాసుపుస్తకాలపై జగన్ ఫొటోల ముద్రణ కోసం 15 కోట్లపైనే ఖర్చుపెట్టారు. ఆయన ఫొటోలున్న భూమి పత్రాలను రైతులు చించివేస్తున్నారు. జగన్ పేరున్న గ్రానైట్ రాళ్లను తమ గ్రామానికి తీసుకురావొద్దని ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఇప్పుడు వాటిని ఏం చేయాలి? రాళ్లపై జగన్ పేరు తొలగించాలంటే మరో 15 కోట్లు ఖర్చుపెట్టాలి. ఇంతాచేసి రైతులకు వివాదాలతో కూడిన సర్వే ఫలితాలు ఇచ్చారు" అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. జగన్ ప్రచార పిచ్చికి అధికారులు సహకరించారని, నిధుల ఖర్చు విష యంలో ఏమాత్రం అడ్డుచెప్పలేకపోయారని ఆయన తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. కేంద్ర మార్గదర్శకాలను ఆచరించాల్సిన వారే, ఫొటోల పిచ్చికి సహకరిస్తే ఎలా? వృథా అయిన ప్రజాధనానికి ఎవరిని బాధ్యులను చేయాలని ప్రశ్నించినట్లు తెలిసింది. “సరి హద్దులను నిర్దేశించేందుకు ఎవరైనా ఖరీదైన గ్రానైట్ రాళ్లు వినియోగిస్తారా? దీన్ని ఎలా అనుమతించారు? ఎలా సమర్థించారు? ఆ రాళ్లను ఎలా ఉపయోగించుకోవచ్చు... వాటిని ఏం చేయవచ్చో ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి" అని ఆదేశించినట్లు తెలిసింది. జగన్ పేరున్న భాగాన్ని తిప్పి భూమిలోకి పాతేస్తే పేరు కనబడకుండా కొంతవరకు ఉపయోగకరంగా వుండొచ్చు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చివరికి జగన్ రాళ్లు చెక్కిన గ్రానైట్ కంపెనీ ఓనర్స్ బాధితులుగా మిగిలారు .