జీవీఎల్ మళ్లీ మొదలెట్టేశారు!
posted on Aug 1, 2024 @ 10:13AM
జీవీఎల్ నరసింహారావు తన జగన్ భక్తిని చాటుకోవడానికి తెగ ఉత్సాహపడుతున్నారు. పేరుకు బీజేపీ ఎంపీ అయినా జగన్ ఏపీలో అధికారంలో ఉన్నంత కాలం, అంతకు ముందు వైసీపీ విపక్షంలో ఉన్న సమయంలో కూడా జీవీఎల్ వైసీపీకి స్టార్ క్యాంపెయినర్ గానే వ్యవహరించారు. ఆయన తీరుకు అప్పట్లో బీజేపీ రాష్ట్ర నాయకులే అసహనం వ్యక్తం చేశారు. జీవీఎల్ తీరు పై రాష్ట్ర బీజేపీ నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదులు కూడా చేశారు. అంతెందుకు జనసేనాని పవన్ కల్యాణ్ కూడా జీవీఎల్ తీరుపై విమర్శలు గుప్పించారు. జగన్ అండతో విశాఖపట్నం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి సునాయాసంగా ఎంపీగా ఎన్నికైపోవచ్చని భావించి.. జగన్ పైనా, జగన్ పార్టీపైనా జీవీఎల్ రాజును మించిన రాజభక్తి ప్రదర్శించారు.
సరే ఆయనకు బీజేపీ ఎన్నికలలో పోటీ చేసేందుకు అవకాశమే ఇవ్వలేదు. చేసింది చాలు.. ఇక మౌనంగా ఉండండి అన్న స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికారంలో ఉంది. ఆ కూటమిలో బీజేపీ కూడా భాగస్వామ్య పక్షంగా ఉంది. దీంతో జీవీఎల్ కు తత్వం బోధపడి ఇక నోరెత్తే సాహసం చేయరని అంతా అనుకున్నారు. అయితే ఓ నెలా పదిహేను రోజులు నోరు కట్టేసుకుని మౌనంగా ఉన్న ఆయన మళ్లీ జగన్ కు మద్దతుగా తన డ్యూటీని ప్రారంభించేశారు.
అమరావతిపై విషం చిమ్మడం మొదలెట్టేశారు. అమరావతికి కేంద్రం ఇచ్చింది ముమ్మాటికీ అప్పేనని, ఎవరూ అడగకుండానే జగన్ గొంతు అరువు తీసుకుని మరీ రోడ్డెక్కేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి అమరావతి నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన 15 వేల కోట్ల రూపాయలూ అప్పేనని చెప్పారు. అయితే ఆ అప్పును కేంద్రం చెల్లిస్తుందా? రాష్ట్రం చెల్లిస్తుందా అనే దానిపై క్లారిటీ లేదుని.. ఈ అప్పు తీర్చేందుకు కనీసం 30 ఏళ్లు పడుతుందని చెప్పుకొచ్చారు.
బీజేపీ నేతగా జీవీఎల్ అన్న ఈ మాటల్ని పట్టుకుని వైసీపీ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం అంటూ గగ్గోలు పెట్టేయడం మొదలైంది. వాస్తవానికి కేంద్రం గ్యారంటీగా ఉండి ఇప్పించే అప్పులు కేంద్రం ఖాతాలోనే ఉంటాయి. రాష్ట్రం ఓ పది శాతం కట్టాల్సి ఉంటుంది. ఆ పది శాతం కూడా రాష్ట్రం కట్టలేకపోతే.. అదీ కేంద్రమే కడుతుంది. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు. అభివృద్ధి పనులు జరిగితే ఆటోమేటిక్‌గా పెట్టుబడి అంతా తిరిగి వస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. అయినా జీవీఎల్ ఎందుకు పనిగట్టుకుని కేంద్రం అమరావతికి ఇచ్చింది అప్పు అంటూ వైసీపీ వాదనకు మద్దతు పలకడానికి మీడియా ముందుకు వచ్చి జగన్ పట్ల తన స్వామి భక్తిని చాటుకోవడానికి తహతహలాడుతున్నారు. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తున్న చందంగా.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నానని చెబుతూనే.. బడ్జెట్ లో ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందనే అర్ధం వచ్చే మాటలు మాట్లాడుతూ.. జగన్ భక్తిని చాటుకున్నారు. జీవీఎల్ బీజేపీలో ఉన్న జగన్ కోవర్టు అన్న విషయంలో బీజేపీకి స్పష్టత ఉంది. కాషాయ కండువా కప్పుకుని ఫ్యాన్ గాలి పీలుస్తానంటున్న జీవీఎల్ కు శృంగభంగం తప్పదని బీజేపీ, తెలుగుదేశం శ్రేణులు చెబుతున్నాయి.