పింఛన్ల కోసం రూ.2,737.41 కోట్లు విడుదల

ఎన్టీఆర్ భరోసా పించన్ల పంపిణీకి తెలుగుదేశం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. ఆగస్టు నెల పెన్షన్ల పంపిణీ కోసం ప్రభుత్వం 2 వేల 737. 41 కోట్ల రూపాయలు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 54.82లక్షల మంది పింఛన్ లబ్ధిదారులకు గురువారం (ఆగస్టు 1)  ఉదయం ఆరు గంటల నుంచి పెన్షన్ల పంపిణీ ఆరంభమౌతుంది. ఇందు కోసం గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేస్తారని సీఎస్ నీరభ్ కుమార్ తెలిపారు. గురువారం అంటే ఆగస్టు 1న 99 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి అవుతుందనీ, ఆ మరుసటి రోజు అంటు ఆగస్టు 2తో వంద శాతం పింఛన్ల పంపిణీ పూర్తవుతుందని వివరించారు.  ఎన్టీఆర్ భరోసా కింద వృద్ధులు వితంతువులకు నాలుగు వేల రూపాయలు, దివ్యాంగులకు ఆరు వేల రూపాయల చొప్పున అందుతాయి.  

మహా విలయం.. మాటలకందని విషాదం!

కేరళ వయనాడ్ జిల్లాలో మంగళవారం (జులై 30) తెల్లవారుజామున భారీవర్షాలతో కొండచరియలు విరిగి పడిన ఘటనలో భారీ ప్రాణ నష్టం సంభవించింది.  ఇది మహా విలయం.. మాటలకందని విషాదం. గ్రామాలకు గ్రామాలు ఆనవాలు లేకుండా పోయాయి 130మందికి పైగా మృతి చెందారు. ఇంకా వందల మంది ఆచూకీ తెలియడం లేదు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వందలాది మంది గాయపడ్డారు. గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మెప్పోడి ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. మెప్పోడ ప్రాంతం లోని నాలుగు గ్రామాలు శవాల దిబ్బగా మారాయి.ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.ప్రధాని మోడీ వెంటనే స్పందించి మృతుల కుటుంబాలకు రెండులక్షలరూపాయలు, క్షతగాత్రులను 50వేలరూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ సహాయచర్యలకు రూ. 5కోట్లు విడుదల చేసారు.హెలికాప్టర్ సహాయంతో బాధితులను తరలిస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది.    కేరళకు చెందిన ఇద్దరు కేంద్రమంత్రులు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు  వలంటీర్లుగా సహాయచర్యలు చేపట్టేలా చూడాలని మోడీ నడ్డాని ఆదేశించారు. నిరంతర వర్షాల వల్ల నేల తడిగా తయారై బలం కోల్పోయి  నీరు,బురద,రాళ్లు వేగంగా జారిపోతాయనీ, ప్రస్తుత విలయానికి అదే కారణమని అంటున్నారు.  అడవుల నరికివేత వల్ల కూడా ఇలాంటి విపత్తులు సంభవిస్తాయి.  ఏదిఏమైనా వరద బాధితులను అదుకోవడానికీ అన్ని రాష్ట్రాలు ముందుకు రావాలి. బాధితులకు అండగా నిలవాలి. ప్రకృతి విధ్వంసానికి కారణమయ్యే చర్యలను అరికట్టే విషయంపై ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. 

తిరుమలలో ఫుడ్ సేఫ్టీకి ప్రాధాన్యత

తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తిరుమలలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. గత ఐదేళ్ల అధ్వాన స్థితి నుంచి వేగంగా పూర్వ వైభవం సంతరించుకునే దిశగా టీటీడీ అడుగులు వేస్తున్నది. ముఖ్యంగా తిరుమల పవిత్రతకు, పారిశుద్ధ్యానికి గత ఐదేళ్లలో ఇసుమంతైనా ప్రాధాన్యత ఇవ్వని పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ధర్మారెడ్డి స్థానంలో వచ్చిన ఈవో శ్యామలరావు తిరుమల పవిత్రత, పారిశుద్ధ్యం, పరిశుభ్రతతో పాటుగా.. భక్తుల సౌకర్యాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు.  తిరుమలకు వచ్చే భక్తులకు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో పెద్ద, చిన్న హోటళ్లతో సహా అన్ని తినుబండారాల విక్రయ ప్రాంతాలలో వ్యర్థాలను తొలగించేందుకు రెండు డస్ట్ బిన్ల వ్యవస్థను తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మేరకు  పరిశుభ్రత విషయంలో ఎటువంటి రాజీ ఉండదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.  అలాగే అన్ని తినుబండారాల విక్రయ ప్రాంతాలలో, చిన్న పెద్ద హోటళ్లలో భక్తుల ఫిర్యాదులు, సలహాలకు ఒక బాక్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.  అంతే కాకుండా శ్రీపద్మావతి విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో పెద్ద, జనతా క్యాంటీన్లు, ఏపీటీడీసీ హోటళ్లపై    సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా    తిరుమలలోని అన్ని హోటళ్లలో చెత్తను తడిచెత్త, పొడి చెత్తగా వేరువేరుగా సేకరించాలని.  హోటల్‌ ఆవరణలో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు తరలించాలని స్పష్టం చేశారు. హోటళ్ళు  ఆహార పదార్థాల ధరలతో ప్రదర్శన బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు ఆహార పదార్ధాలలో సింథటిక్ రంగులు/నిషేధించబడిన రంగులు ఉపయోగించలేదు. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు టేస్ట్ ఎంహేన్సర్ తో చేసిన పదార్థాలు తినరాదు.  హోటల్ లైసెన్స్ పొందిన వారు వాటిని ఎటువంటి సబ్ లీజుకు ఇవ్వలేదు. అన్న వివరాలతో బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా పెద్ద మరియు జనతా క్యాంటీన్లు తప్పనిసరిగా తమ హోటళ్ల పేర్లను ప్రదర్శించాలని ఆదేశించారు. సవరించిన ధరలను  రెవెన్యూ విభాగానికి సమర్పించాలన్నారు.   తిరుమలలోని అన్ని క్యాంటీన్‌ల వారికి ఆగస్టు 5 తర్వాత ఫుడ్‌ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌ శిక్షణ ఇస్తుందని, ఆ తర్వాత క్యాంటీన్లు, తినుబండారాలను తనిఖీ చేస్తామని తెలియజేశారు. వాటర్‌ బాటిళ్లు కూడా రూ.20కి మించి అమ్మకూడదని, తనిఖీ సమయంలో నిర్దేశించిన మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు తేలితే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.అనంతరం అన్నప్రసాదం, దాతల విభాగం, ఆరోగ్య శాఖకు సంబంధించిన కార్యకలాపాలు, సమస్యలను కూడా ఈవో సమీక్షించారు. 

ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకు.. జనంలో మరింత మసకబారిన జగన్ ప్రతిష్ఠ!?

ఇటీవలిఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. అసలీ స్థాయి ఓటమి చవిచూడాల్సి వస్తుందని వైసీపీ ఊహించలేదు. ప్రజలు మాత్రం ఎప్పుడు ఎన్నికలు వస్తాయా? వైసీపీ అరాచకపాలనకు చరమగీతం పాడుదామా అని ఎదురు చూశారు. ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న జనం అంటూ తెలుగువన్ కూడా వరుస కథనాలు ఇచ్చింది. జగన్ తప్ప, వైసీపీ సీనియర్లు కూడా ఓటమిని ముందే కనిపెట్టేశారు.  ఏది ఏమైనప్పటికీ ఈ స్థాయి పరాజయంతో వైసీపీ ఉనికే ప్రమాదంలో పడిందని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు. ఐదేళ్ల పాటు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీకి ప్రస్తుత పరిస్థితి జీర్ణించుకోవడం కష్టమే. 2019 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీకి వచ్చిన ఓట్ల శాతమే 2024లో వైసీపీకి కూడా లభించింది. కాకపోతే అప్పుడు తెలుగుదేశం పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా దక్కింది.  ఇప్పుడు అంటే 2024 ఎన్నికలలో పరాజయం స్థాయి ఎంత తీవ్రంగా ఉందంటే.. వైసీపీ  కనీసం ప్రతిపక్ష హోదా లభించేందుకు అవసరమైనన్ని స్థానాలు  కూడా గెలుచుకోలేకపోయింది.  ఇలాంటి సందర్భంలో సాంప్రదాయంగా వస్తున్న నిబంధనలను అనుసరించి వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని స్పీకర్ అయ్యన్నపాత్రుడు, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ వైసీపీ అభ్యర్థనను తిరస్కరించడం సమంజసమే.    అయితే  తమ పార్టీకి   ప్రతిపక్ష హోదా కావాలని, తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ఆయన రాజకీయ అజ్ణానాన్ని తేటతెల్లం చేస్తున్నది.   అసెంబ్లీలో జరిగే వ్యవహారాలలో న్యాయస్థానాలు జోక్యం చేసుకో వని ఒక మాజీ ముఖ్యమంత్రి కి తెలియకపోవడం నిజంగా విడ్డూరమే. ప్రతిపక్ష హోదా లేదా అధికారం ఈ రెండింటిలోనూ ఏదైనా సరే ప్రజలే ఇవ్వాలి. వారు అలా ఇవ్వలేదంటే  జనాలకు ఆ పార్టీపై సదభిప్రాయం లేదని అర్థం. ఈ విషయాన్ని మరిచిపోయి దీనిని ఒక రాజకీయ అంశంగా మార్చుకొని లబ్ది పొందాలనుకోవడం జగన్ రాజకీయ తప్పిదంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో  తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో   చేసిన తప్పిదాలే ఇప్పటి పరిస్థితికి కారణమని జగన్ గ్రహించినట్లు కనిపించదు. తన ఓటమికి ప్రజలనే తప్పుపడుతున్న ఆయన అహంకారమే.. ప్రతిపక్ష హోదా కోసం కోర్టు మెట్లేక్కేలా చేసిందని అంటున్నారు.  పార్టీ ఘోర పరాజయానికి కారణాలపై  ఆత్మ విమర్శ చేసుకోకుండా ప్రజలను,  ఎన్నికల వ్యవస్థను నిందిస్తూ, తాను చాలా గొప్పగా పాలన సాగించానని జగన్ ఆత్మ స్థుతి చేసుకుంటున్నారు. ఇది ఆత్మవంచన తప్ప మరొకటి కాదు. ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా అసెంబ్లీకి వెళ్లి తమ అభిప్రాయాలను చెప్పుకునవకాశం ఉంటుంది. ఆ  అవకాశం అధికార పార్టీ ఇవ్వకపోతే అదే విషయాన్ని అసెంబ్లీ బయట మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు వివరించాలి. అంతే కాకుండా.. ప్రజలు ఇవ్వని హోదాను న్యాయస్థానాలను ఆశ్రయించి దక్కించుకుందామనుకోవడం.. ప్రజల దృష్టిలో మరింత పలుచన  అవ్వడానికి దోహద పడుతుంది తప్ప మరో ప్రయోజనం సిద్ధించదు.     శాసనసభకు హాజరై ప్రజా సమస్యలపై అవకాశం ఉన్నంత మేరకు ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే శాసనసభ్యుని ప్రాథమిక బాధ్యత.  ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికైనా  తాను పులివెందుల శాసనసభ్యుడిని మాత్రమేననీ, అంతకు మించి మరే ప్రత్యేకతా తనకు లేవనీ గ్రహించి అందుకు అనుగుణంగా వ్యవహరిస్తే మేలు. 

గ‌ద్వాల్ ఎమ్మెల్యే వ్యవహారం.. కాంగ్రెస్ జోరుకు బ్రేకేనా?

తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి గ‌ద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ‌మోహ‌న్ రెడ్డి ఝ‌ల‌క్ ఇచ్చారు. ఇటీవ‌ల బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయ‌న‌.. తిరిగి మ‌ళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అసెంబ్లీలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ నేత‌ల‌తో ఆయ‌న క‌లిసి ఉండ‌టంతో ఆయ‌న మ‌ళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరుతున్న‌ట్లు వ‌చ్చిన వార్త‌ల‌కు బ‌లం చేకూరిన‌ట్ల‌యింది. గ‌ద్వాల్ ఎమ్మెల్యేతో పాటు ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీలో చేరిన మిగిలిన ఎమ్మెల్యేలుసైతం తిరిగి సొంత‌గూటికి వెళ్తార‌ని విస్తృత ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ వార్త‌ల‌ను కాంగ్రెస్ నేత‌లు ఖండించారు. అయితే తాజా ప‌రిణామాలు కాంగ్రెస్ శ్రేణుల‌ను కొంత ఆందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి ప్ర‌తిప‌క్ష హోదా కూడా లేకుండా చేస్తామ‌ని చెప్పిన కాంగ్రెస్ పార్టీకి తాజా ప‌రిణామం పెద్ద ఎదురుదెబ్బేన‌ని చెప్పొచ్చు. అయితే, త్వ‌ర‌లోనే మ‌రికొంద‌రు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ గూటికి చేర‌బోతున్నార‌ని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. రాష్ట్రంలో తాజా రాజ‌కీయ ప‌రిణామాలు కాంగ్రెస్ పార్టీని ఏమేర‌కు ఇబ్బందికి గురిచేశాయనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ నేత‌లు చెబుతున్న‌ట్లు మ‌రికొంద‌రు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి రాబోతున్నారా.. గ‌ద్వాల్ ఎమ్మెల్యే తిరిగి బీఆర్ఎస్ గూటికి చేర‌డానికి బ‌ల‌మైన కార‌ణం ఏమిటి అనే అంశాల‌పై రాష్ట్ర రాకీయాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్య జ‌రుగ‌తున్నది.  అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థులు కేవలం 39స్థానాల్లో మాత్రమే గెలుపొంద‌డంతో.. ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డంతో.. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో దాదాపు తొమ్మిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరారు. ఆషాఢమాసం అయిపోయిన తరువాత రేవంత్ రెడ్డి సమక్షంలోనే చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని, త‌ద్వారా బీఆర్ఎస్‌కు విప‌క్ష హోదాకూడా ఉండ‌ద‌ని హస్తం పార్టీ నేతలు జోరుగా ప్రచారం చేశారు. కానీ, వారి ప్ర‌చారానికి విరుద్దంగా కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ త‌గిలింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌లో గ‌ద్వాల నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహ‌న్ రెడ్డి కూడా ఒక‌రు. ప్ర‌స్తుతం ఆయ‌న మ‌ళ్లీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌య్యారు. గ‌ద్వాల ఎమ్మెల్యేతోపాటు ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మరికొందరు ఎమ్మెల్యేలుసైతం తిరిగి సొంత గూటికి చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, కాలె యాదయ్య కూడా తిరిగి బీఆర్ఎస్‌లో చేరుతారని గులాబీ పార్టీ అగ్రనేతలు చెబుతున్నారు. కానీ, వారు బీఆర్ఎస్ నేత‌ల ప్ర‌చారాన్ని ఖండించారు. తాము కాంగ్రెస్ లోనే ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు.  తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌పై మంత్రులు స్పందించారు. బీఆర్ఎస్ నుంచి వ‌చ్చిన‌ ఎమ్మెల్యేలు తిరిగి ఆ పార్టీవైపు వెళ్లడం లేదని.. అదంతా గులాబీ నేతలు చేసుకుంటున్న ప్రచారమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఛాంబర్ కు వెళ్లినంత మాత్రాన పార్టీ లో చేరినట్లా.. కేటీఆర్ కూడా నా ఛైర్ దగ్గర కు వచ్చి మాట్లాడారు.. ఆయన కాంగ్రెస్ లో చేరినట్లేనా అంటూ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి అన్నారు. బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అలాగే కలిసి ఉంటారు. ఆయన ఎక్కడికి వెళ్లడు అంటూ కోమ‌టిరెడ్డి పేర్కొన్నాడు. అయితే, బండ్ల కృష్ణ మోహ‌న్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ గూటికి తిరిగి చేరేందుకు సిద్ధ‌ప‌డ‌టానికి ప‌లు కార‌ణాలు ఉన్నాయి. ముఖ్యంగా గ‌ద్వాల్ నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా స‌రిత‌ తిరుప‌తియ్య బ‌రిలో నిలిచారు. బండ్ల కృష్ణ‌మోహ‌న్ రెడ్డిపై ఓడిపోయారు. బండ్ల కృష్ణ‌మోహ‌న్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న‌ట్లు వార్త‌లు రావ‌డంతో స‌రిత తిర‌ప‌త‌య్య వ‌ర్గం తీవ్ర స్థాయిలో అభ్యంత‌రం తెలిపింది. నియోజ‌క‌వ‌ర్గంలోని కాంగ్రెస్ ముఖ్య‌నేత‌లు సైతం బండ్ల కృష్ణ మోహ‌న్ రెడ్డి కాంగ్రెస్ లోకి రావ‌డాన్ని అభ్యంత‌రం తెలిపారు. అధిష్టానం పెద్ద‌లు రంగంలోకి దిగి వారికి స‌ర్దిచెప్పి కృష్ణ మోహ‌న్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయ‌న‌కు పార్టీ కండువా క‌ప్పారు.  బండ్ల కృష్ణ‌మోహ‌న్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్న క్ర‌మంలో కొన్ని కండీష‌న్లు పెట్టిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ విష‌యంపై యెన్నం  శ్రీ‌నివాస్ రెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్యే  కృష్ణ మోహన్ రెడ్డికి ఓపిక లేదు. అక్కడ ఆయన చెప్పినట్లు పార్టీ లో ప్రయార్టీ ఇచ్చాము. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన మనుషులకు అవకాశాలు ఉండాలని అడిగాడు. దానికీ   సరే అన్నాము. జిల్లాలో బీసీ మహిళ అయిన జెడ్పీ చైర్మన్ స‌రిత తిరుప‌త‌య్య‌ను ఎక్కడికి రావొద్దు, ఆమెను అధికార కార్యక్రమాలకు పిలవద్దు అని చెప్ప‌డంతో కాంగ్రెస్ అధిష్టానం ఇది సాధ్యం కాద‌ని చెప్పింద‌ని యెన్నం క్లారిటీ ఇచ్చారు. ఆ త‌ర‌వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే, గ‌ద్వాల్ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఆయ‌న ప‌ట్ల‌ వ్య‌తిరేక‌త‌తో ఉండ‌టంతో.. కాంగ్రెస్‌లో ఉంటే నియోజ‌క‌వ‌ర్గంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని భావించిన బండ్ల‌...తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరేందుకు నిర్ణ‌యించుకున్నార‌ని తెలుస్తోంది. మ‌రోవైపు తన ఎన్నిక చెల్లదని హైకోర్టులో పడిన పిటిషన్లపై విచారణలో లాయర్ ను గతంలో బీఆర్ఆర్ ఏర్పాటు చేసింది. పార్టీ మారడంతో లాయర్ ను తీసేశారు. ఇప్పుుడు లాయర్ ను కొనసాగించాలని కేటీఆర్ ను కోరానని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అంటున్నారు. అంత మాత్రానే ఆయన రివర్స్ అయ్యే అవకాశం లేదని.. ఆయన ఏదో తీర్చలేని కోరిక కోరి ఉంటారని.. పట్టించుకోకపోవడంతో.. బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కొంత మంది బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. మొత్తానికి బండ్ల కృష్ణ వ్య‌వ‌హారం తెలంగాణ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం రేపింది. 

ఇ-నామ్ ప్లాట్‌ఫామ్ వినియోగం పై ప్ర‌శ్నించిన ఎంపీ కేశినేని చిన్ని

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో గ‌త ఐదేళ్లుగా నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఇ-నామ్) ప్లాట్ ఫామ్ లో న‌మోదైన  ప్ర‌తి మండీలో ఎంత పంట అమ్ముడుపోయింది? ఎంత వ్యాపారం జ‌రిగిందనే అంశంపై విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ స‌హాయ మంత్రి రామనాథ్ ఠాకూర్ ను ప్ర‌శ్నించారు. ఎంపి కేశినేని శివ‌నాథ్ ఈ ప్ర‌శ్న‌ను కర్నూలు ఎంపి బస్తిపాటి నాగరాజు తో క‌లిసి అడిగారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఇ-నామ్) కింద నమోదైన లబ్ధిదారులు,  మండీలు, వివ‌రాలు జిల్లాల వారీగా ఇవ్వాల‌ని కోరారు... అలాగే ఎపిలో ఇ-నామ్ ప్లాట్‌ఫాం ద్వారా జిల్లాల వారిగా ఏ ఏడాది ఎంత మంది  రైతులు వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించారో ఆ సంఖ్య  తెలియ‌జేయాల‌ని అడిగారు. అదే విధంగా  ఎపిలో   రైతులు ఇ-నామ్ ప్లాట్‌ఫామ్‌ను ఎక్కువగా ఉపయోగించిన ప్రధాన పంటల వివ‌రాలు జిల్లాల వారీగా తెలియ‌జేయాల‌ కోరారు. దీనికి  కేంద్ర‌ వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ  మంత్రి రామ్ నాథ్ ఠాకూర్  ఇచ్చిన లిఖిత పూర్వ‌క సమాధానం మేరకు  ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా వారీగా రైతులు ఇ-నామ్ ప్లాట్‌ఫామ్‌ను ఎక్కువగా ఉపయోగించిన ప్రధాన పంటలు జిల్లాల వారీగా  చూస్తే క‌ర్నూలు ఎక్కువ‌గా ఉప‌యోగించింది.  కర్నూలు-పత్తి, పల్లీలు, ఆముదం గింజలు, పొద్దుతిరుగుడు గింజ‌లు, మిరప, వాము,  ఉల్లిపాయ, టమోటా, మొక్కజొన్న పంట‌లు వేయ‌టం జ‌రిగింది.  అనకాపల్లి-  బెల్లం, అనంతపురము-బ‌త్తాయి, తరబూజ, చింతపండు, గుంటూరు-పసుపు, మిరప, పత్తి, నిమ్మకాయ,  ఎన్.టి.ఆర్-మిర‌ప పంట‌ల కోసం  ఇ-నామ్ ప్లాట్‌ఫామ్ కోసం ఉప‌యోగించిన‌ట్లు తెలిపారు. అలాగే మిగిలిన జిల్లాలు కూడా ఉప‌యోగించిన‌ట్లు వివ‌రించారు.  అలాగే గత ఐదేళ్లలో  రాష్ట్రంలో  ఇ-నామ్ ప్లాట్ ఫామ్ ద్వారా  ప్రతి మండీలో విక్రయించిన పంటల వివ‌రాలు, జ‌రిగిన వ్యాపారం విలువ జిల్లాల వారీగా వివ‌రించారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 5,76,70,992.46 క్వింటాళ్ల  అమ్మ‌కం జ‌ర‌గ్గా  41,70,825.01 లక్షల రుపాయలు వ్యాపారం జ‌రిగింద‌ని వివ‌రించారు.

చంద్రబాబుకి భువనేశ్వరి దిష్టి తీయాలి!

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటానికి కీలకమైన వ్యక్తిగా నిలిచిన నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు దేశవ్యాప్తంగా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబుకు ఏర్పడిన పలుకుబడిని చూసి జగన్ అండ్ దండుపాళ్యం బ్యాచ్ కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు. మెటికలు విరుస్తూ దిష్టి పెడుతున్నారు. లోకల్‌గా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా చాలామంది ఆయనకు దిష్టిపెడుతున్నారు. నరుడి దృష్టికి నాపరాళ్లే పగులుతాయి.. నారా వారు కూడా అందుకు మినహాయింపేమీ కాదు.. అందువల్ల చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆయనకు అప్పుడప్పుడు దిష్టి తీయాల్సిన అవసరం వుంది. దిష్టి తీసేటప్పుడు ఆమె ఏమని అంటూ దిష్టి తీయాలంటే.... ‘‘ఇరుగు దిష్టి.. పొరుగు దిష్టి.. ఊళ్లోవాళ్ళ దిష్టి.. జగన్ దిష్టి, జగన్ దండుపాళ్యం బ్యాచ్ దిష్టి.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దిష్టి, కేసీఆర్ దిష్టి, కేసీఆర్ ఫ్యామిలీ దిష్టి, కాంగ్రెస్ వాళ్ళ దిష్టి, రాష్ట్రంలో, కేంద్రంలో కొంతమంది బీజేపీ వాళ్ళ దిష్టి, మమతా బెనర్జీ దిష్టి, నితీష్ కుమార్ దిష్టి, కొంతమంది ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల దిష్టి’’ అంటూ దిష్టి తీయాలి. ఎందుకంటే, చంద్రబాబు క్షేమంగా వుండాలి. ఆయన కోసం కాదు.. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం!

ఫసల్ బీమా పథకంపై జగన్ సర్కార్ నిర్లక్ష్యం.. కేశినేని చిన్ని ప్రశ్నకు కేంద్ర మంత్రి జవాబు

ఆంధ్రప్రదేశ్ లో 2020 నుంచి 2022 వరకూ ఫసల్ బీమా పథకం అమలు కాలేదు, అప్పటి జగన్ సర్కార్ ఈ పథకాన్ని అమలు చేయకూడదని నిర్ణయించింది. కేంద్రం ప్ర‌భుత్వం చేసిన ప్ర‌య‌త్నాల వ‌ల్ల ఏపీ ప్ర‌భుత్వం 2022 ఏడాది ఖ‌రీఫ్ సీజ‌న్ నుంచి  రాష్ట్రంలో మ‌ళ్లీ   పీఎంఎఫ్‌బీవై పథకం అమ‌ల్లోకి తీసుకువ‌చ్చింది.  లోక్ సభలో మంగళవారం (జులై 30) ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో  విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్   ఫసల్ బీమాపై అడిగిన ప్రశ్నకు కేంద్ర‌ వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ స‌హాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లిఖిత పూర్వక సమాధానంలో ఈ వివరాలు తెలిపారు.  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి అర్హులైన ల‌బ్ధిదారుల వివ‌రాలు జిల్లాల ప‌రంగా కావాల‌ని, ల‌బ్ధి దారుల్లో స్త్రీ, పురుష‌ల సంఖ్య కూడా చెప్పాల‌ని ఎంపి కేశినేని శివనాథ్ అడిగారు. అలాగే  పీఎంఎఫ్‌బీవై పథకం కింద రాష్ట్రంలో ఎంత‌మందికి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ చెల్లింపులు జ‌రిగాయి.ఎన్ని తిర‌స్కరించారు. పెండింగ్ లో వున్న ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ వివ‌రాలు సంఖ్య జిల్లాల వారీగా కావాల‌ని అడిగారు.? అంతే కాదు తిర‌స్క‌రించిన‌ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ను తిరస్కరించ‌టానికి కార‌ణాలు ఇవ్వాల‌ని అడిగారు?  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద రూపొందించిన ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ,  విడుదల చేసిన సొమ్ము సగటు  జిల్లాల‌ వారీగా చెప్పాల‌ని కోర‌టం జ‌రిగింది.   ఆంధ్రప్రదేశ్‌లో  పీఎంఎఫ్‌బీవై  కింద నమోదైన రైతుల వినతుల  వివ‌రాలు జిల్లా వారీగా చూస్తే కృష్ణ జిల్లా ఎక్కువ వ‌చ్చాయి.  2022-23 ఏడాదిలో 8,21,804 రాగా,  2023-24  ఏడాదికి గాను 7,55,848 వ‌చ్చాయి. అత్య‌ల్పంగా విశాఖ‌ప‌ట్ట‌ణం నుంచి వ‌చ్చాయి. 2022-23 ఏడాదికి 38,464, 2023-24 ఏడాదికి గాను    36,971వ‌చ్చాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప‌రంగా 2022-23 ఏడాదికి వ‌చ్చిన విన‌తుల సంఖ్య 1,23,16,188 వుండ‌గా, 2023-24 ఏడాదికి గాను వ‌చ్చిన విన‌తుల సంఖ్య 1,31,59,483 గా వుంద‌ని వివ‌రించారు.  ఇక 2022-23 సంబంధించి పీఎంఎఫ్‌బీవై ల‌బ్ధిదారులు సంఖ్య మొత్తం 1,23,16,188 వుండ‌గా వీరిలో 91,49,296 మంది పురుషులు, 31,64,175 మంది స్త్రీలు వున్నార‌ని చెప్పుకొచ్చారు. అలాగే 2023-24 ఏడాదికి పీఎంఎఫ్‌బీవై ల‌బ్ధిదారులు సంఖ్య మొత్తం 1,31,59,483 వుండ‌గా, వీరిలో 98,35,523 మంది పురుషులు, 33,21,756 మంది స్త్రీలు వున్న‌ట్లు తెలిపారు.  అలాగే 2022-23 సంవత్సరానికి గాను ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 3,49,633 మందికి రైతుల‌కి  ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కింద 5,63,36,49,134 కోట్ల రూపాయ‌లు చెల్లించిన‌ట్లు తెలియ‌జేశారు. అలాగే ఒక్కో రైతుకి స‌గ‌టున ఇన్సూరెన్స్ క్లెయిమ్స్  చెల్లింపు కింద‌  16,113 రూపాయ‌లు చెల్లింపు చేసిన‌ట్లు వివ‌రించారు.

మోహిత్ రెడ్డిని అలా ఎలా వదిలేశారు?

హత్యాయత్నం కేసులో అరెస్టు చేసిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు 41ఏ నోటీసు ఇచ్చి వదిలేయడంపై హైకోర్టు విస్తుపోయింది. పోలీసులను తప్పుపట్టింది. అయితే పోలీసులకు మద్దతుగా ప్రభుత్వ లాయర్ వాదించారు.  అసలు రాష్ట్రంలో అధకారంలో ఉన్నది తెలుగుదేశం కూటమి ప్రభుత్వమా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యేలా పోలీసుల తీరు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యవహారం ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  జగన్ అరాచపాలనను భరించలేక జనం ఆయన ప్రభుత్వానికి చరమగీతం పాడుతూ అఖండ మెజారిటీ ఇచ్చి మరీ తెలుగుదేశం కూటమికి పట్టం కట్టారు. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరి కూడా రెండు నెలలు కావస్తున్నది. అయినా ఇంకా క్షేత్ర స్థాయిలో మరీ ముఖ్యంగా పోలీసు వ్యవస్థలో జగన్ పార్టీ నేతల మాటే చెల్లుబాటు అవుతోందా అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. అందుకు చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడి అరెస్టు విడుదల ఉదంతమే తాజా ఉదాహరణ.  పులివర్తి నానిపై  హత్య యత్నం కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనపై లుక్ ఔట్ నోటీసు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే దుబాయ్ చెక్కేయడానికి రెడీగా ఉన్న మోహిత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే జైలుకు మాత్రం తరలించలేదు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు అదుపులోనికి తీసుకుంటున్న సమయంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా పక్కనే ఉన్నారు. అందుకే ఏం మతలబు చేశారో తెలియదు కానీ పోలీసులు మాత్రం మోహిత్ రెడ్డికి 41ఏ కింద నోటీసులు ఇచ్చి విడిచిపెట్టేశారు. మోహిత్ రెడ్డిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలించడం జరగాల్సి ఉండగా పోలీసులు అందుకు భిన్నంగా వ్యవహరించారు. దీంతో పోలీసులను కోర్టు నిలదీసింది. హత్యయత్నం కేసులో నిందితుడికి 41ఏ నోటీసులు ఇచ్చి వదిలేసిన  సంఘటన గతంలో ఎన్నడైనా ఉందా అని ప్రశ్నించింది. కోర్టు ప్రశ్నించిన సంగతిని పక్కన పెడితే మోహిత్ రెడ్డి పట్ల పోలీసులు చూపిన ఔదార్యం తెలుగుదేశం శ్రేణులలో తీవ్ర ఆగ్రహానికి  కారణమౌతోంది. ఇటువంటి తీరు తెలుగుదేశం కూటమి శ్రేణుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుందని అంటున్నారు.  జగన్ హయాంలో 41ఏ నోటీసులు ఇవ్వాల్సిన కేసుల్లో కూడా అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా తెలుగుదేశం నేతలు, శ్రేణులను అరెస్టులు చేశారు. అదే తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో కూడా అరెస్టు చేసి జైలుకు తరలించాల్సిన కేసుల్లో కూడా వైసీపీ నేతలకు 41ఏ నోటీసులు ఇచ్చి విడిచిపెట్టేస్తున్నారు.  సోషల్ మీడియా కేసుల్లోనే తలుపులు బద్దలుకొట్టి మరీ తెలుగుదేశం నేతలు, కార్యకర్తలను అరెస్టు చేసిన ఉదంతాలను గుర్తు చేస్తూ  ఇప్పుడు పోలీసులు మోహిత్ రెడ్డిపై అంతులేని ఔదార్యాన్ని ప్రదర్శించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. 

 విద్యుత్ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మదన్ బి లోకూర్ నియామకం 

విద్యుత్ కమిషన్ చైర్మన్ నియమకానికి చట్టబద్దత లేని ఆరోపిస్తూ న్యాయపోరాటం చేస్తున్న బిఆర్ఎస్ కు సుప్రీంలో చుక్కెదురైంది. విద్యుత్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నర్సింహారెడ్డిని మార్చాలని సుప్రీం ఆదేశాలు ఇవ్వడాన్ని తెలంగాణ ప్రభుత్వం స్వాగతించి నూతన చైర్మన్ నియామకం చేసింది. తెలంగాణ విద్యుత్ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ మదన్ బి లోకూర్‌ను ప్రభుత్వం నియమించింది. లోకూర్ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. విద్యుత్ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో మదన్ బి లోకూర్ వ్యవహరిస్తారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై ఆయన విచారణ జరపనున్నారు.విద్యుత్‌పై ఒప్పందాలపై విచారణ జరపడం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలుత జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను నియమించింది. అయితే ఆయన ఈ అంశానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ తర్వాత విచారణకు హాజరు కావాలని కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారు. ఈ అంశంపై కేసీఆర్ కోర్టుకు వెళ్లారు. జస్టిస్ నరసింహారెడ్డిని కమిషన్ నుంచి తప్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఆయన స్థానంలో లోకూర్‌ను నియమించారు.

గద్దర్ అవార్డులపై స్పందనేదీ.. టాలీవుడ్ పై రేవంత్ అసంతృప్తి! 

తెలుగు సినీ పరిశ్రమపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రముఖ తమిళరచయత, ఉద్యమకారుడు శివశంకరికి విశ్వంభర డాక్టర్ సి. నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కార ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ సందర్భంగా ప్రసంగిస్తూ తెలుగు చలన చిత్ర పరిశ్రమ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం సినీ పరిశ్రమ పట్ల సానుకూలంగానే ఉన్నప్పటికీ పరిశ్రమ నుంచి మాత్రం సరైన స్పందన కరవైందని అన్నారు. సాధారణంగా అధికారంలో ఏ పార్టీ ఉన్నదన్న దానితో సంబంధం లేకుండా చిత్రపరిశ్రమ, ప్రభుత్వం మధ్య మంచి అనుబంధమే ఉంటుంది. రాష్ట్రంలో ఏదైనా విప్తు  సంభవించినపుడు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు స్పందిస్తారు. అలాగే చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినపుడు సంబంధిత శాఖ కూడా సానుకూలంగానే స్పందించి ఆ సమస్య పరిష్కారంలో సహకారం అందిస్తుంది.  ప్రస్తుతం  అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమ పట్ల సానుకూలంగానే ఉంది. అయితే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలుగు చలనచిత్ర పరిశ్రమపై తన అసంతృప్తిని వ్యక్తం చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ రేవంత్ రెడ్డి అసంతృప్తికి కారణమేమిటంటే..  ప్రతిష్ఠాత్మక నంది అవార్డులను గద్దర్‌ అవార్డులతో భర్తీ చెయ్యాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ కొత్త కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేయడానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని, గద్దర్ అవార్డులపై అభిప్రాయాలను తెలియజేయాలని  ముఖ్యమంత్రి చిత్ర పరిశ్రమను కోరారు. అయితే అం దుకు పరిశ్రమ నుంచి ఎలాంటి  స్పందన లేదు. దీంతో రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.  గద్దర్‌ అవార్డులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు తెలుగు చిత్ర పరిశ్రమ స్పందన లేకపోవడం సరికాదని ఆయన అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో చేసిన కృషికి, విజయాలకు గౌరవంగా గద్దర్‌ అవార్డులను ప్రకటించామని, దీనిపై సినీ పరిశ్రమలోని పెద్దలు స్పందించకపోవడం బాధాకరమని అన్నారు.  

ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి బ్యాక్ టు బిఆర్ఎస్

పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పదిమంది చేరిన సంగతి తెలిసిందే. వీరిలో  బిఆర్ ఎస్ నుంచి గద్వాల  ఎమ్మెల్యేగా గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా ఉన్నారు. బండ్ల చేరికతో బిఆర్ఎస్ నాయకత్వం జబ్బలు ఎగరేస్తుంది.  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది! బీఆర్ఎస్ నుంచి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన ఓ ఎమ్మెల్యే తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే ఇరవై రోజుల క్రితం ఆయన బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి అధికార పార్టీలో చేరారు. హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరుల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.అయితే నెల రోజులు కూడా కాలేదు... ఆ ఎమ్మెల్యే తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంగళవారం ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. తాను పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు పదిమంది వరకు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొంతమంది తమ పార్టీలోకి వస్తారని అధికార పార్టీ చెబుతోంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే తిరిగి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లడం గమనార్హం. ఇది బీఆర్ఎస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. కేటీఆర్‌ను గద్వాల ఎమ్మెల్యే కలిసిన సమయంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డి, పద్మారావు గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు. కృష్ణమోహన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో సమీప కాంగ్రెస్ అభ్యర్థి సరితా తిరుపతయ్యపై 7 వేల పైచిలుకు మెజార్టీతో గెలిచారు. 'ఇప్పుడు రాస్కోండి.. బీఆర్ఎస్ దెబ్బకు కాంగ్రెస్ అబ్బా అని. తిరిగి సొంత గూటికి చేరుకున్న గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కలిసి పార్టీలో కొనసాగుతా అని తెలిపిన ఎమ్మెల్యే' అంటూ బీఆర్ఎస్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది

విజయసాయిరెడ్డి కుమార్తెకు హైకోర్టులో ఎదురు దెబ్బ

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విశాఖ జిల్లా  భీమిలి బీచ్​ వద్ద సముద్రానికి అతి సమీపంలో నిర్మించిన కాంక్రీట్ ప్రహారీగోడ కూల్చివేత విషయంలో స్టేటస్​ కో ఇవ్వాలంటూ ఆమె  దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది.  ఈ దశలో మధ్యంత ర ఉత్తర్వులివ్వలేమని తేల్చిచెప్పింది. అక్కడి నిర్మాణాలను నిలుపుదల చేస్తూ, అక్రమ కట్టడాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులు అమల్లో ఉన్నంత కాలం తాము మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సాధ్యం కాదని సింగిల్‌ జడ్జి స్పష్టం చేశారు. అవసరమైతే సీజే బెంచ్‌ వద్ద ఉన్న పిల్‌లో ప్రతివాదిగా చేరి గత ఉత్తర్వుల సవరణ కోసం అభ్యర్థన చేయవచ్చని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది.  మరోవైపు విజయసాయి కుమార్తె నేహారెడ్డి వేసిన వ్యాజ్యంలో విశాఖ జనసేన కార్పొరేటర్‌ మూర్తియాదవ్‌ ప్రతివాదిగా చేరేందుకు అనుమతి ఇచ్చి  కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు వారం రోజులు వాయిదా వేసింద.  హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి. కృష్ణమోహన్‌ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. భీమిలి (భీమునిపట్నం) బీచ్‌ వద్ద సముద్రానికి సమీపంలో సీఆర్‌జడ్‌ (కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌) నిబంధనలను ఉల్లంఘించి శాశ్వత నిర్మాణం చేపట్టడాన్ని సవాలు చేస్తూ మూర్తియాదవ్‌ సీజే ధర్మాసనం ముందు గతంలో పిల్‌ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు.. తక్షణం నిర్మాణ పనులను నిలిపి వేయాలని ఉత్తర్వులిచ్చింది. యంత్రాలను సీజ్‌ చేయాలని అధికారులను ఆదేశించింది. కట్టడాల విషయంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది. దీంతో భీమిలి బీచ్​కు సమీపంలో నిర్మించిన ప్రహరీగోడ కూల్చివేతకు విశాఖ జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్‌(జోన్‌-1) ఈ నెల 18న తుది ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ నేహారెడ్డి హైకోర్టు సింగిల్‌ జడ్జి వద్ద ఇటీవల వ్యాజ్యం వేశారు. సింగిల్‌ జడ్జి ఈ వ్యాజ్యాన్ని ఇదే వ్యవహారంతో ముడిపడి ఉన్న సీజే బెంచ్‌ వద్ద ఉన్న పిల్‌తో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఈ నేపథ్యంలో నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యం, మూర్తియాదవ్‌ దాఖలు చేసిన పిల్​పై సీజే బెంచ్‌ విచారణ జరిపింది. నేహారెడ్డి వేసిన వ్యాజ్యాన్ని సింగిల్‌ జడ్జి విచారించడమే సబబు అని అభిప్రాయపడింది. వ్యాజ్యాన్ని సింగిల్‌ జడ్జి వద్దకు పంపింది. దీంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి. కృష్ణమోహన్‌   ఈ వ్యాజ్యంపై విచారణ జరిపారు.

ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్-చిరాగ్!

ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భార‌త బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టిలు అద‌ర‌గొడుతున్నారు. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి మన అమలాపురం కుర్రాడేనండోయ్! ఒలింపిక్స్ చ‌రిత్ర‌లోనే క్వార్టర్ ఫైనల్స్.కి చేరిన తొలి భార‌త బ్యాడ్మింటన్ జోడీగా చ‌రిత్ర సృష్టించారు. గ్రూప్ దశలో కూడా వీరిద్దరూ అద్భుత ప్రదర్శన చేసి టాప్‌-8లో నిలిచారు. జ‌ర్మనీ జోడీ మార్క్-మెర్విన్‌తో జరగాల్సిన డబుల్స్ మ్యాచ్ ర‌ద్దైంది. జ‌ర్మ‌న్ ప్లేయర్ మార్క్‌కు మోకాలికి గాయం కావడంతో అతను టోర్నీ నుంచి తప్పుకున్నాడు. దాంతో ఈ మ్యాచ్ రద్దయింది. గ్రూప్ ‘సి’లో ఆర్టియాంటో-ఆల్పియన్ (ఇండోనేషియా) చేతిలో 21-13, 13-10 తేడాతో ఫ్రెంచ్ జోడీ లాబార్-కోర్వీ ఓడిపోవడంతో సాత్విక్-చిరాగ్ జోడీ క్వార్ట‌ర్ ఫైన‌ల్‌కు అర్హత సాధించింది. ఈ జోడీ స్వర్ణాన్ని సాధించే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పి.ఎం పోష‌ణ్ , నిధుల కేటాయింపుపై లోక్ సభలో కేశినేని చిన్ని ప్రశ్న

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌త ఐదేళ్లుగా పి.ఎం.పోష‌ణ్ ప‌థ‌కం కింద ఎన్ని పాఠ‌శాల‌లు క‌వ‌రైయ్యాయి? ఎంత మంది పాఠ‌శాల విధ్యార్ధుల‌కి ల‌బ్ధి చేకూరింది? ఎన్ని నిధుల కేటాయింపు జ‌రిగింది.?  వాటి వినియోగం ఎలా జ‌రిగింది? ఏ ఏడాది ఎన్ని నిధులు విడుద‌ల చేశారు? ఏ ఏడాది ఎంత ఖ‌ర్చు పెట్టారు?  ముఖ్యంగా అనంత‌పురం, నంద్యాల‌, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో పి.ఎం.పోష‌ణ్ ప‌థ‌కం ఎలా అమ‌లు జ‌రిగింది?  ఆ వివ‌రాలు తెలియ‌జేయాల‌ని సోమ‌వారం విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్, నంద్యాల ఎంపి  డాక్టర్ బైరెడ్డి శబరి, విజయనగరం ఎంపి అప్పలనాయుడు కలిశెట్టి , కర్నూలు ఎంపి బస్తిపాటి నాగరాజు, అనంతపురం ఎంపి  అంబికా జి లక్ష్మీనారాయణ తో క‌లిసి కేంద్ర పాఠశాల విద్య,  సాక్షరత శాఖ మంత్రి జయంత్ చౌదరి ను ప్ర‌శ్నించారు.  అలాగే పి.ఎమ్ పథకాన్ని పర్యవేక్షించడానికి,  ఆర్థిక ఆడిట్ల నిర్వహణ కోసం జిల్లా స్థాయి స్క్రీనింగ్ కమిటీలను గ‌త ఐదేళ్ల‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిందా? అని ప్ర‌శ్నించ‌గా వాటికి కేంద్ర మంత్రి జయంత్ చౌదరి లిఖిత పూర్వ‌కంగా స‌మాధానం ఇవ్వ‌టం జ‌రిగింది.

పెద్దిరెడ్డి భార్య పేరిట చెరువు భూమి!

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి భార్య స్వర్ణలత అసైన్డ్ పట్టా కింద ఐదెకరాల చెరువు భూమి పొందినట్లు ప్రభుత్వ రికార్డులలో వివరాలు సమగ్రంగా వున్నాయి. స్వర్ణలత స్వగ్రామం అన్నమయ్య జిల్లా వీరబల్లి. ఈ రెవెన్యూ గ్రామంలో సర్వే నంబరు 2139 కింద ఆమె పేరిట 5 ఎకరాల విస్తీర్ణంలో భూమి ఉంది. దీనిని భూమి వివరణ కింద చెరువుగా చూపిస్తోంది. ఈ వర్షాధార భూమిని 2023లో ఫ్రీ హోల్డ్ చేసినట్లుగా రికార్డులలో నమోదు చేశారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి ప్రభుత్వ భూములను అసైన్డ్ పట్టాల రూపంలో భూమి ఇస్తారు. ఇలాంటి భూమి 20 ఏళ్ల పాటు వారి అధీనంలోనే ఉన్నట్లయితే క్రయవిక్రయాలకు వీలుగా ఫ్రీ హోల్డ్ చేస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ ఘటన అనంతరం ఫ్రీ హోల్డ్ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 20 ఏళ్ల పాటు అధీనంలో లేని భూమిని సైతం ఫ్రీ హోల్డు పెట్టేసినట్లు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. దీనిపై విచారణతోపాటు పూర్తి అధ్యయనానికి ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో వీరబల్లిలో అసైన్డ్ భూమి వ్యవహారం తెరపైకి వచ్చింది. స్వర్ణలత పేరిట మదనపల్లె మండలం వలసపల్లె, బండమీద కమ్మపల్లెలో పెద్దఎత్తున పొలాలున్నాయి. మదనపల్లెతో ఎలాంటి సంబంధం లేకున్నా అక్కడ భూములు కలిగి ఉండడం, ల్యాండ్ కన్వర్షన్‌కి దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

కమ్మ కులంపై ‘రోత’ సాయిరెడ్డి దాడి ఎవరికి నష్టం?

(శుభకర్ మేడసాని, ఇన్‌పుట్ ఎడిటర్, తెలుగువన్) కమ్మ కులం.. కమ్మకులం.. అని చెవులు కోసిన మేకలా అరుస్తున్న విజయసాయిరెడ్డి కులమేంటి? పేరు చివర ‘రెడ్డి’ అని తగిలించుకున్న ప్రతి ఒక్కరూ రెడ్డి కాదు అనేదానికి చారిత్రక సజీవ సాక్ష్యాలు, కోటి ఉదాహరణలు వున్నాయి. గడచిన పది సంవత్సరాలుగా కమ్మకులంపై కాలకూట విషప్రచారం చేసి, 2019 ఎన్నికలలో లబ్దిపొందిన జగన్ రెడ్డి గడచిన ఐదు సంవత్సరాల జగన్ పాలనలో అదే విష ప్రచారం పెద్ద ఎత్తున ఒక ప్రణాళికాబద్ధంగా చేశారు. ఎంత విషప్రచారం చేసినా, నిజం అనేది ఒకటి వుంటుంది. ఆంధ్రులు ఆ నిజం గ్రహించారు. అంతకుముందు ఎన్నడూ అఖండ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నడూ జరగని మార్పు, తీర్పు ప్రజలు ఏకపక్షంగా ఇచ్చేశారు. కులంలేదు, మతం లేదు, ప్రాంతం లేదు.. అందరూ ఒక్కటై నాడు బ్రిటీష్ బానిస సంకెళ్లు తెంచడానికి ఉద్యమించిన దేశ ప్రజల మాదిరి ఆంధ్రప్రదేశ్ స్వేచ్ఛ, స్వతంత్రం కోసం తెలుగునాడు ఏకమయింది. మళ్ళీ అదే తప్పుడు పని ఏ2 విజయసాయిరెడ్డి ఎందుకు చేస్తున్నారు? తన జైల్ మేట్ ఏ1 జగన్ రెడ్డిని రాజకీయంగా నష్టపరచాలని సాయిరెడ్డి కోరుకుంటున్నారా? కమ్మ కులం మీద అదే ఏకపక్ష దాడిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? రాజకీయ పరిశీలకులు మాత్రం స్పష్టంగా చెబుతున్నారు. గడచిన ఐదు సంవత్సరాలలో తిరుమల నుంచి తాడేపల్లి వరకు కేవలం రెడ్లతో నింపేసిన జగన్ పాలనను మళ్ళీ మళ్ళీ గుర్తుచేయడానికి, సజ్జలకు, సాయిరెడ్డికి మధ్య యుద్ధం వల్ల సాయిరెడ్డి రాంగ్ రూట్ ప్రయాణం అంతిమంగా జగన్‌ని నష్టం చేస్తుందని పరిశీలకులకు అభిప్రాయపడుతున్నారు.  ఈమధ్యకాలంలో సాయిరెడ్డి రోతపనుల ఆరోపణల వెనుక తన పార్టీవారి హస్తం వుందని సాయిరెడ్డి ఆరోపించారు. పత్రికా సమావేశాల్లో కల్లుతాగిన కోతిలాగా చిందులు వేశారు. సజ్జలకి సాయిరెడ్డి మీద, భారతిరెడ్డి మీద వున్న అంతులేని కోపం జగన్ రెడ్డిని ముంచేస్తుందని, పదేపదే కమ్మ కులంపై దాడి జగన్ రెడ్డికి రాజకీయ నష్టంతోపాటు మా రెడ్డి సామాజికవర్గానికి తీవ్ర నష్టం చేస్తుందని తలపండిన ఒక రెడ్డి వ్యాఖ్యానించారు. సాయిరెడ్డి, జగన్ రెడ్డి మా రెడ్డి కులానికి ప్రతినిధులు ఎలా అవుతారు? వారు రాజకీయ నాయకులు మాత్రమే. మహా అయితే జగన్ పాలనలో ఒక వెయ్యి మంది రెడ్లు లాభపడి వుండొచ్చు. కానీ, యావత్ రెడ్డి సమాజం నష్టపోయింది అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు కూడా తలపండిన రాజకీయ నాయకుడే కదా.. చంద్రబాబుకు కులపిచ్చి ఎందుకు వుంటుంది? అందునా భయస్తుడు. తాను పంచుకునే వేదిక మీద కూడా ఇతర కులాల వాళ్ళు వుండేలా చంద్రబాబు జాగ్రత్తపడతారు. జగన్ పాలనలో చుట్టూ రెడ్లతో నింపేసి, నేడు టీటీడీలో ఒక అధికారిని నియమించినందుకు సాయిరెడ్డి చేసిన రచ్చ కుట్రపూరితం అనేది సుస్పష్టం. నష్టం మాత్రం కచ్చితంగా జగన్మోహన్‌రెడ్డికే.  రాజకీయాలు ఎంత వికృతంగా వుంటాయి అనేది తెలుసుకుందాం. రాజకీయ నాయకుల కులం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. గతం నుంచి నేటి వరకు వైసీపీ చేస్తున్న, చేసిన ఆరోపణల్లో ఊతపదం ‘చంద్రబాబు సామాజికవర్గం’ అని మొదలుపెడతారు. అంటే, మొత్తం కులానికి ఆపాదించడం అన్నమాట. ఒక సామాజికవర్గాన్ని నిందించడం. అలాంటి ఉదాహరణలు చరిత్రలో ఒకటి, రెండు చూద్దాం. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం కారణంగా మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగుజాతి విడిపోయి ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. పొట్టి శ్రీరాములు వైశ్య సామాజికవర్గానికి చెందినవారు. మరి, రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి వైశ్యుడు అవ్వాలి కదా? అయ్యారా? ప్రకాశం పంతుల్ని పదవి నుంచి దింపేవరకు నిద్రపోలేదు నాటి రాజకీయ రెడ్లు. 70 సంవత్సరాల క్రితం బెజవాడ - గుంటూరు మధ్య రావలసిన ఆంధ్రప్రదేశ్ రాజధానిని కర్నూలు గుడారాల్లోకి ఎవరు తీసుకెళ్ళారు? అక్కడ్నుంచి అదే రెడ్లు హైదరాబాద్‌కి ఎందుకు తీసుకెళ్ళారు? ఏ రాజకీయ రెడ్లు నడిపే పార్టీ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసింది? ప్రాంతీయ విద్వేషాలకు కారణమైన రెడ్ల పార్టీ ఏది? 1983 వరకు రెడ్లే అధికారం చెలాయించారు. ఒకరిద్దరు తప్ప దాదాపు ముఖ్యమంత్రులందరూ రెడ్లే. 60 మంది మంత్రుల్లో 45 మంది రెడ్లు. ఆరోజు ఎవరికీ కులసమస్య గుర్తుకు రాలేదు. వచ్చినా తెలియదన్నట్టు నటించారు. ఎన్టీఆర్ గెలవగానే ‘కమ్మ కులం’ అని అకస్మాత్తుగా అందరికీ గుర్తుకొచ్చింది. అదేంటీ? రెడ్డి వుండాలిగానీ, మరో కులమా అని అందరూ వాపోయారు. మళ్ళీ ఎన్టీఆర్ ఓడిపోగానే నలుగురు రెడ్లు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడ్డారు. చెన్నారెడ్డి, జనార్దనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి. ముఖ్యమంత్రి పదవి కోసం అష్టాచెమ్మా ఆటలు ఆడినా, లేని మతకలహాలు సృష్టించి అమాయకులను చంపించినా, వికృత రాజకీయాలు చేసినా... అవి చేసింది రాజకీయ రెడ్లే! ప్రజల్లో ఆ నలుగురేనా నాయకులు? వేరే కులాల్లో రాజకీయ నాయకులు లేరా? కాపుల్లో లేరా? కాంగ్రెస్ పార్టీ ఒట్టిపోయిందా? అనే స్పృహ ప్రజల్లో రాకుండా జాగ్రత్తపడ్డారు. ఇక్కడ మనం రెడ్డి కులం మొత్తాన్నీ బాధ్యులను చేద్దామా? జరిగిన చెడును రెడ్డికులం మొత్తానికీ అంటగడదామా?  రెడ్డి కులం వేరు... రాజకీయ రెడ్లు వేరు! అలాగే రాజకీయ కమ్మ వేరు.. కమ్మ కులం వేరు. జగన్‌రెడ్డికి కులపిచ్చి వుందని అనుకోవడం లేదు. కేవలం ఒక వెయ్యి మందికి ప్రజల సొమ్ము పప్పూబెల్లాల్లా పంచినంత మాత్రాన రెడ్డి కులానికి ఒరిగిందేమీ లేదు. జగన్ పాలనలో వాళ్ళు కూడా బాధితులే కదా! నిరుపేద రెడ్లు ఎంతమంది లేరు? రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాలు లేవా? దశాబ్దాలుగా కమ్మకులంపై ఏకపక్ష దాడి జరుగుతుంటే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకూ ఎవరైనా గట్టిగా ప్రశ్నించారా? మా కులంపై ఏమిటీ దాడి అని నిలదీయడం మీరు చూశారా? అది కుదరనిపని. వారు కమ్మ, రెడ్డి, కాపు, మరేదో కాదు.. వారందరికీ ఒకటే కులం... రాజకీయ కులం! పిసుక్కునేది, ఆవేశపడేది, అనారోగ్యం పాలయ్యేది ఆయా కులాల్లో పేదలు, మధ్యతరగతి వర్గాలు మాత్రమే. ఏ కులమైనా ధనవంతులది ఒకటే కులం... ‘ధనకులం’! పరువు హత్యలు పేద, మధ్యతరగతిలోనే వుంటాయి తప్ప ధనరాశులు పోగేసుకున్నవారి మధ్య కులం వుండదు. వారు సంబంధాలు కలుపుకుంటారు. హైక్లాస్ కిట్టీపార్టీలు చేసుకుంటారు. వారందరిదీ ఒకటే క్లాస్.. హైక్లాస్.  టీడీపీ పాలనలో ఎర్రంనాయుడు, లాల్ జాన్ బాషా, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాధవరెడ్డి, సముద్రాల వేణుగోపాలాచారి, ప్రతిభా భారతి, దేవేందర్‌గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కేసీఆర్, బాలయోగి, ఆనందగజపతి.. ఇలా అనేక కులాలకు ప్రాధాన్యత ఇచ్చారు. వారు కూడా పైకి ఎదిగి వచ్చారు. పైన చెప్పిన వారిలో ఏ ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు కులం కాదు. రాజకీయ రెడ్డి జగన్ రెడ్డి రాగానే, అన్నీ ఎవరికి ఏమేం పంచిపెట్టారో ‘రోత’ విజయసాయిరెడ్డి సమాధానం చెప్పాలి.  13 వైస్ ఛాన్సలర్లలో నాటి టీడీపీ ప్రభుత్వం సమతూకంతో  అన్ని కులాలకూ సమానంగా పంచితే, జగన్ 13 మందిలో 11 మంది రెడ్లకు అప్పనంగా కట్టబెట్టి విశ్వవిద్యాలయాల్లో కుల కంపుకు కారణమయ్యారు. పాడిందే పాడరా పాచిపళ్ళ దాసుడా అన్నట్టు ఈ ‘పిచ్చి’ కులరెడ్డి నిత్యం పేదలకు, పెత్తందార్లకు యుద్ధం అని అంతులేని వేదనతో రోదిస్తూ వుంటారు. తండ్రిలేని పిలగాడు. ఆ ముఖం చూడండి.. అంతులేని అమాయకత్వం. ఆ దేవుడు తండ్రికి దూరం చేసి మీ బిడ్డకు అన్యాయం చేశాడు. నాన్న చనిపోయి దేవుడయ్యాడు అనే ఆనందంలో వుండగా తప్పనిసరి పరిస్థితుల్లో మీ బిడ్డ బాబాయ్‌ని కూడా పోగొట్టుకున్నాడు అధ్యక్షా. ఒక కన్నును ఇంకో కన్ను ఎందుకు పొడుచుకుంటుంది అధ్యక్షా?... ఇవి.. నాటి చిలక పలుకులు!  గుర్రం జాషువా ఇలా అన్నారు... ‘గుణం లేనివాడు కులం గొడుగు పడతాడు.. మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడు. పస లేనివాడు ప్రాంతం ఊసెత్తుతాడు. జనులంతా ఒకే కుటుంబం.. జగమంతా ఒక నిలయం’. కులాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం నాటి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య.  వంగవీటి రంగా హత్యకు చంద్రబాబును బాధ్యుణ్ణి చేస్తూ, అందుకు ఆయన్ని వర్గ శత్రువుగా భావిస్తున్నారని, కుప్పం బహిరంగసభలో జగన్ రెడ్డి నాడు మాట్లాడారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో వుండి, ప్రభుత్వ కార్యక్రమంలో ఇలాంటివి మాట్లాడకూడదన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా ఆయనకు లేదు. నిరాధారమైన ఇలాంటి ఆరోపణలు ఎలా చేస్తారు? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కేవలం రాజకీయ లబ్ధి కోసం ఒక సామాజికవర్గాన్ని రెచ్చగొట్టి, రెండు కులాల మధ్య చిచ్చు పెట్టడానికే ఇంతలా దిగజారారు. 1988 మార్చి 10వ తేదీన దేవినేని మురళి హత్య జరిగిన సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వుంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వుండగా జరిగిన మొట్టమొదటి రాజకీయ హత్య దేవినేని మురళిదే కావడం విశేషం. అంతకుముందు జరిగిన హత్యలన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుండగా జరిగిన హత్యలే.  1988 డిసెంబర్ 26న జరిగిన రంగా హత్యను తన రాజకీయ అవసరాల కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి కుట్రపూరితంగా రాజకీయ అస్త్రంగా వాడారు. ఇద్దరు వ్యక్తులు, రెండు ముఠాల మధ్య జరిగిన ఘర్షణలను రెండు కులాలకు ఆపాదించి విధ్వంసం సృష్టించారు. వేల కోట్ల రూపాయల ప్రజల ఆస్తులు ధ్వంసం చేశారు. ఆనాడు తండ్రి సృష్టించిన కులాల కుంపట్లు ఆరిపోకుండా జగన్ రెడ్డి రాజేస్తూ వస్తున్నారు.  తెలుగుదేశం పార్టీయే రంగాను హత్య చేయించి వుంటే... రంగా భార్య, కుమారుడు వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో ఎందుకున్నారు? రాధా సైతం నా తండ్రి హత్యకు తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదని గతంలో స్పష్టం చేశారు కూడా. దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్‌ని పక్కన కూర్చోబెట్టుకుని రంగా హత్య గురించి మాట్లాడ్డం విడ్డూరంగా వుంది. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడుగా పేర్కొంటూ దేవినేని నెహ్రూపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. కాపులపై నిజంగా ప్రేమ వుంటే కాపు కార్పొరేషన్‌కి నిధులు ఎందుకు కేటాయించలేదు జగన్మోహన్‌రెడ్డి? చంద్రబాబు కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించారు. కానీ, జగన్మోహన్‌‌రెడ్డి వాటిని కొనసాగించకుండా నాటకాలు ఆడారు. నిజాలను చెరిపేసి, అబద్ధాలను వండివారుస్తూ ఎదురుదాడి చేయడం జగన్‌రెడ్డికే చెల్లుతుంది. రంగా కేసు గుర్తుకొచ్చినప్పుడు, సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసు ఎందుకు గుర్తుకురావడం లేదు?  వైఎస్ వివేకా రక్త చరిత్రకు ఐదేళ్ళు నిండాయ్. మొదట గుండెపోటు.. కాదు చంద్రబాబే హత్య చేయించాడని ప్రచారం చేశారు.  రంగా హత్యకు రెడ్డిగారి సాక్ష్యం. రంగా హత్య అనే ఒకే ఒక్క కారణంగా జగన్మోహన్ రెడ్డి పుట్టి పెరిగిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రంగా హత్యపై సీబీఐ ఎంక్వయిరీ వేశారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుంది. మరి, హంతకులను ఎందుకు శిక్షించలేదు? తెలుగుదేశం - జనసేన పొత్తు.. కమ్మ, కాపు కలయిక ఇష్టపడని ఏకైక వ్యక్తులు.. రాజకీయ రెడ్లు! రంగా హత్య తర్వాత మొసలి కన్నీరు కార్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి హత్యలో ప్రధాన నిందితుడు నెహ్రూను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని, హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో 2004 సంవత్సరంలో కోట్ల రూపాయల విలువైన స్థలం వైఎస్సార్ కట్టబెట్టారన్న ఆరోపణలు వున్నాయి. నెహ్రూ చంద్రబాబును, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను తిట్టినట్టు ఇప్పటి వరకూ ఎవ్వరూ తిట్టలేదు. ఎన్టీఆర్ సంతానం పంది సంతానం అని, వైఎస్ రాజశేఖరరెడ్డి దేవుడితో సమానమని ఎవరికోసం, ఎందుకు నెహ్రూ అంత తీవ్ర వ్యాఖ్యలు చేశారు? నేడు అతని కుమారుడు అవినాష్ తన రౌడీ మూకలతో టీడీపీ సెంట్రల్ ఆఫీసుపై ఎవరి కోసం దాడి చేయించారు? వంగవీటి రంగాను తాచుపాముతో పోల్చి, కరవడానికి వచ్చి దేవుడి పటాల వెనుక వెళ్ళిదాక్కుంటే చంపకుండా వుంటామా అని తీవ్ర వ్యాఖ్యలు చేసిన జగన్‌రెడ్డి బంధువు పూనూరు గౌతమ్ రెడ్డికి ఏపీ ఫైబర్ ఆప్టిక్ ఛైర్మన్ పదవి కట్టబెట్టి, దోచుకోవడానికి అవకాశం కల్పించిందెవరు? పరిటాల రవి పవన్‌కళ్యాణ్‌కి గుండుకొట్టించాడని రాయలసీమ పెత్తందారు ఎందుకు విషప్రచారం చేశారు? రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో మద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డి నిర్మించిన ‘రక్తచరిత్ర’ సినిమాలో ఒక నటుడికి గుండుకొట్టించే సన్నివేశం ఎందుకు చిత్రీకరించారు? పరిటాల హత్య తర్వాత ఖాదర్ మొహీయుద్దీన్ అనే ఒక సీనియర్ జర్నలిస్టు 20 సంవత్సరాల క్రితం ‘అస్తమించిన రవి... ఒక ఉద్యమ వీరుడి ఊపిరియాత్ర’ పేరుతో పరిటాల రవి జీవిత చరిత్ర రాయడం జరిగింది. ఆ పుస్తకంలో రవి, తన జీవితకాలంలో పవన్ కళ్యాణ్‌ని కనీసం ఒక్కసారి కూడా చూడలేదు. అది ఒక వర్గం కట్టుకథ అని తెలియజేయడం జరిగింది. ఆ పుస్తకాన్ని రవి మొదటి వర్ధంతి రోజున కుటుంబ సభ్యుల సమక్షంలో నాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు చేతుల మీదుగా పుస్తకావిష్కరణ 20 సంవత్సరాల క్రితం జరిగింది. 2019లో పవన్ కళ్యాణ్ పరిటాల రవి ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులతో కలసి భోజనం చేయడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సివస్తోందంటే, నాటి కాంగ్రెస్ పార్టీలో వంగవీటి రంగా ఎదుగుదల చూసి ఓర్వలేని ఒక రాయలసీమ నేత, రంగా బతికి వుండగా నేను ముఖ్యమంత్రిని కాలేను అని భావించిన వ్యక్తి పన్నిన పన్నాగంలో భాగంగా రెండు కుటుంబాల మధ్య గొడవలను కులాలకు ఆపాదిస్తూ ఆనాటి దుర్ఘటనకు రాయలసీమ నుంచి మొదటిసారిగా విజయవాడకు బాంబులు సరఫరా చేసిందెవరు? కాపులను రాజ్యాధికారానికి దూరం చేస్తూ, విభజన సిద్దాంతంతో ఆరితేరిన రాజకీయ కుటుంబం ఏది? ఏ రెండు కులాలు కలిస్తే ఎవరికి నష్టం? కులాలుగా విభజిస్తూ నాటి నుంచి నేటి వరకు ఏ కులం రాజకీయ పార్టీ ముసుగులో ఇంత వికృత రాజకీయ జరుపుతోంది? ఒక కులాన్ని రైళ్ళు తగలబెట్టేదిగా ప్రశాంత కోనసీమలో ‘మంటసీమ’ను చిత్రీకరించడం కోసం జరిగిన దుర్ఘటనలో ఎవరి కుట్ర వుంది? ఆనాడు బెజవాడను తగులబెట్టింది రంగా హత్యకు ముందుగానే రాయలసీమ నుంచి దిగుమతి చేసుకున్న కిరాయి మూకల దమనకాండకు... చెన్నారెడ్డిని పదవి నుంచి దించడానికి హైదరాబాద్‌లో మత కల్లోలాలు సృష్టించి వందలాది మంది ప్రాణాలు పోవడానికి కడప కత్తులే సాక్ష్యం!

వ్యక్తుల ఇమేజ్ కాదు.. రాజముద్రకే ఇంపార్టెన్స్

ఏపీ ప్రభుత్వం పథకాలకు పేర్లు మార్చింది. ఒక లక్ష్యంతో వ్యక్తుల ఇమేజ్ కాకుండా, మహానుభావుల పేర్ల మీదుగా పథకాలు ఉండాలన్న సదుద్దేశంతో ఈ మార్పు చేసింది.  గత ప్రభుత్వం అన్ని పథకాలకు అప్పటి ముఖ్యమంత్రి జగన్ పేర్లు పెట్టింది. పేర్ల మార్పు యోచనలో లోకేష్ ఉన్నట్లు తెలియగానే అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్   మహనీయుల పేర్లను ఆయా పథకాలకు  పెట్టాలని, సూచించారు.    విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆ సూచనను చాలా చాలా పాజిటివ్ గా తీసుకున్నారు.  లోకేష్ విద్యా శాఖలో తనదైన ముద్ర వేసుకోవాలని కృషి చేస్తున్నట్టు కనబడుతోందని విశ్లేషకులు అంటున్నారు. అందుకే ఆయన గత వైసీపీ ప్రభుత్వం తాలూకా గురుతులు అనేవి లేకుండా నిర్వీర్యం చేసే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం అవసరం ఉన్నా లేకున్నా అనేక పధకాలకు 'జగనన్న' అని పేరు తగిలించడంతో పాటుగా ఏకంగా ఆయన ఫోటోని వాటికి తగిలించింది. జగన్ పేరు మారుమోగాలనే తపనతోనే వారు ఇలా చేశారన్నదాంటో ఎటువంటి సందేహం లేదు.   అయితే  జగన్ పేరు, ఫొటో పిచ్చి గీత దాటిపోయి రోత పుట్టేస్థాయికి చేరిందని అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో నే   టీడీపీ కూటమి సర్కార్ జగన్ పేర్లను, ఫోటోలను తొలగించి వాటి స్థానంలో  ఆంధ్ర ప్రదేశ్ రాజ ముద్రని వేస్తున్నది. తెలుగుదేశం కూటమి సర్కార్ కూడా  వైసీపీ లాగా అలోచించి పథకాలకు పేర్లు పెట్టి ఉంటే  రెంటికీ తేడా లేదన్న విమర్శలు వచ్చేవి. కానీ లోకేష్ అలా చేయలేదు.. ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వం లోగోని ఎంచుకోవడం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తు తున్నాయి. మరోవైపు.. ఆయన తన శాఖలో అరడజను పైగా ఉన్న పథకాలకు జగన్ పేర్లని తొలగిస్తూ లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్ పేరు తొలగించి ఆయా పథకాలకు స్ఫూర్తిప్రదాతల పేర్లు పెట్టడం పట్ల సర్వత్రా హర్షామోదాలు వ్యక్తం అవుతున్నాయి.  జగనన్న అమ్మ ఒడి పధకం పేరుని తల్లికి వందనం అని, జగనన్న విద్యా కానుక పధకానికి సర్వేపల్లి రాధాక్రిష్ణన్ విద్యార్ధి మిత్ర అని, జగనన్న గోరుముద్ద పధకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అని, మన బడి నాడు మన బడి నేడు అన్న పధకానికి మన భవిష్యత్తుగానూ, స్వేచ్చ అన్న దానికి బాలికా రక్ష, జగనన్న ఆణిముత్యాలు అన్న పధకానికి అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా పేర్లు మార్చారు.  ఈ మార్పు పట్ల సర్వత్రా హర్షామోదాలు వ్యక్తం అవుతున్నాయి.