ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్!
posted on Aug 1, 2024 @ 2:01PM
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అంశం మీద గురువారం నాడు సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్.కి కేటాయించిన రిజర్వేషన్లలను ఉప వర్గీకరణచేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు వుంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు 2004లో అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు విస్తృత ధర్మాసనం పక్కన పెట్టింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 6:1 మెజారిటీతో తీర్పును వెలువరించింది. ఈ తీర్పును అనుసరించి ప్రభుత్వాలు దీనిపై తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.
‘వ్యవస్థాగతంగా ఏర్పడిన వివక్ష కారణంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు అభివృద్ధిలోకి రాలేకపోతున్నారు. ఒక కులంలో ఉపవర్గాలను చేసేందుకు రాజ్యాంగంలోని 14వ అధికరణ అనుమతి ఇస్తుంది. అందుకే 2004లో వెలువరించిన ఇ.వి.చిన్నయ్య తీర్పునే వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్రాలు ఉప వర్గీకరణ చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నాం’ అని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. అణగారిన వర్గాల వారికి మరిన్ని ప్రయోజనాలు కల్పించేందుకు రిజర్వ్.డ్ కేటగిరీలో రాష్ట్రాలు ఉప వర్గీకరణ చేసుకోవచ్చని కోర్టు వెల్లడించింది. ధర్మాసనంలోని ఆరుగురు న్యాయమూర్తులు దీనికి అనుకూలంగా తీర్పు చెప్పగా, జస్టిల్ బేలా ఎం. త్రివేది మాత్రం ఎస్టీ, ఎస్పీ ఉప వర్గీకరణ సాధ్యం కాదంటూ వ్యతిరేకించారు.