కుప్పంలో వైసీపీ ఖేల్ ఖతం.. దుకాణ్ బంద్!
posted on Aug 1, 2024 @ 9:49AM
వైనాట్ కుప్పం.. వైనాట్ 175.. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ నేతల స్లోగన్ ఇదే. కుప్పంలోనూ వైసీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారంటూ ప్రెస్‌మీట్లు పెట్టి మరీ వైసీపీ నేతలు ఢంకా బజాయించారు. చంద్రబాబు ఓడిపోతున్నారు.. కుప్పంలో తెలుగుదేశం దుకాణం బంద్ కావడం ఖాయమని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బహిరంగ సభల్లో పదేపదే చెప్పారు. అయితే ఎన్నికల ఫలితాలతో సీన్ రివర్స్ అయింది. తాము ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచిందన్నట్లుగా.. వైసీపీ నేతలు ఒకటి తలిస్తే.. కుప్పం ప్రజలు మరొకటి తలిచారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ మెజార్టీతో కూటమి ప్రభుత్వం అధికారంలో వస్తే .. కుప్పంలో చంద్రబాబు నాయుడు గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో భారీ మెజార్టీతో విజయం సాధించాడు. ఒక విధంగా చెప్పాలంటే కుప్పం నియోజ కవర్గంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన అనుచరులు చేసిన అరాచకాలకు కుప్పం ప్రజలు విసిగిపోయి చంద్రబాబును అత్యధిక మెజార్టీతో గెలిపించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కుప్పం నియోజకవర్గంపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన సతీమణి భువనేశ్వరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. దీంతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. గతంలో వైసీపీ నేతల ఒత్తిడితో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన నేతలంతా ఇప్పుడు తమ తప్పును తెలుసుకొని పసుపు కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో చంద్రబాబు సమక్షంలో కుప్పం వైసీపీ నేతలు తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు. కుప్పం మున్సిపాలిటీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు, 15 మంది ఎంపీటీసీలు వైసీపీని వీడి సైకిల్ ఎక్కేశారు. సీఎం చంద్రబాబుతోనే నియోజకవర్గంలో అభివృద్ధి సాధ్యమవుతుందని వారు పేర్కొన్నారు. గతంలో వైసీపీ నేతల ట్రాప్‌లోపడి తాము కంట్రోల్ తప్పామని, కానీ, రాష్ట్రంతో పాటు కుప్పం నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమని స్పష్టంగా అర్థమైందని కొందరు వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలో మిగిలిన వైసీపీ నేతలు సైతం త్వరలో తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కుప్పం నియోజకవర్గం వైసీపీ కార్యాలయాన్ని మూసేసి హోటల్ గా మార్చేశారు. మరోవైపు చంద్రబాబుపై పోటీ చేసిన ఎమ్మెల్సీ భరత్ అధికారం కోల్పోయిన నాటి నుంచి నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారు. కుప్పంలో చంద్రబాబును కాదని నిలబడటం కష్టమని ఆయనకు స్పష్టత రావడంతో నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే కుప్పంలో వైసీపీ పూర్తిగా ఖాళీఅయ్యే పరిస్థితి ఏర్పడింది.
కుప్పం నియోజకవర్గం తమిళనాడు, కర్ణాటకకు అత్యంత సమీపంలో వుంటుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషలు మాట్లాడేవాళ్లు నియోజకవర్గంలో ఎక్కువ. కమ్మ , రెడ్డి, శెట్టిబలిజ, మైనారిటీ, దళితుల ప్రాబల్యం ఎక్కువ. ఈ నియోజకవర్గంలో చంద్రబాబు ఏడు దఫాలుగా వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలోనూ కుప్పంలో చంద్రబాబును ఢీకొట్టేందుకు సాహసం చేయలేదు. కానీ, 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుప్పంపై దృష్టి పెట్టారు. చంద్రబాబును 2024 ఎన్నికల్లో ఓడించే బాధ్యతను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించాడు.
దీంతో పెద్దిరెడ్డి నియోజకవర్గంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు తెర లేపారు. పలుసార్లు చంద్రబాబును సైతం నియోజకవర్గంలో అడుగుపెట్టకుండా పెద్దిరెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ గూండాలు విశ్వప్రయత్నాలు చేశారు. చంద్రబాబుపై రాళ్లదాడికి సైతం దిగారు. పోలీసులు సైతం పెద్దిరెడ్డి చెప్పినట్లుగా వ్యవహరిస్తూ చంద్రబాబుపై, తెలుగుదేశం నేతలపైనే కేసులు పెట్టారు. పెద్దిరెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలతో కుప్పం నియోజకవర్గం ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తెలుగుదేశం పార్టీకి పలువురు ముఖ్య నేతలను బెదిరింపులకు గురిచేసి వైసీపీలో చేర్చుకున్నారు. దీంతో కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారంటూ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జగన్ మోహన్‌రెడ్డి సహా వైసీపీ నేతలు విస్తృత ప్రచారం చేశారు. కానీ, గత ఎన్నికల్లో కుప్పం ప్రజలు మేమంతా చంద్రబాబువైపే అంటూ ఓటు ద్వారా స్పష్టం చేశారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో భయంతో వైసీపీ గూటికి చేరిన తెలుగుదేశం నేతలతో పాటు.. వైసీపీలో మొదటి నుంచి కొనసాగుతున్న అందరూ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కుప్పం మున్సిపాలిటీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు, 15 మంది ఎంపీటీసీలు టీడీపీలో చేరారు. మరి కొద్ది రోజుల్లో మిగిలిన వైసీపీ నేతలు, కార్యకర్తలు సైతం వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారట. ఎన్నికల సమయంలో చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలిన ఎమ్మెల్సీ భరత్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ కార్యకర్తలకు కూడా అందుబాటులో లేకుండా పోయారు. ప్రస్తుతం నియోజకవర్గంలో వైసీపీ కార్యాలయం మూతపడగా.. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఉండదని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. మొత్తానికి కుప్పంలో చంద్రబాబును ఓడించాలని ఫ్యాక్షన్ రాజకీయాలతో రెచ్చిపోయిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ప్రస్తుత పరిణామాలు బిగ్‌షాక్ అనే చెప్పొచ్చు. రాబోయే కాలంలో వైఎస్ జగన్ కుప్పం నియోజకవర్గానికి రావాలంటే వైసీపీ కార్యకర్తలు ఉండని పరిస్థితి కుప్పంలో ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది.