సంకటాల్లో వెంకటరెడ్డి.. నేడో రేపో సస్పెన్షన్ వేటు?
posted on Aug 1, 2024 @ 3:05PM
జగన్ హయాంలో నిబంధనలను గాలికొదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విషయంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత జగన్ తో అంటకాగి నిబంధనలకు తిలోదకాలిచ్చినట్లుగా భావించిన కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా హోల్డ్ లో ఉంచింది. అలా ఉంచిన వారిలో ఒకరైన ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ఇంకా ఏడేళ్ల సర్వీసు ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. అంటే జగన్ హయాంలో తాను నిబంధనలకు తిలోదకాలిచ్చి తప్పిదాలకు పాల్పడినట్లు పరోక్షంగా అంగీకరించేశారు.
మునిసిపల్ ఎడ్మినిస్ట్రేటన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి, రెవెన్యూ (ఎక్సైజ్) స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజిత్ భార్గవలకు కూడా చంద్రబాబు సర్కార్ ఎలాంటి పోస్టింగు ఇవ్వకుండా జీఏడీలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది. ఇంకా పలువురు అధికారులకు కూడా చంద్రబాబు సర్కార్ ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా హోల్డ్ లో పెట్టింది. అలాంటి వారిలో ఒకరైన జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) మేనేజింగ్ డైరెక్టర్ గా పని చేసిన ఐఏఎస్ అధికారి వెంకటరెడ్డి ఒకరు. వెంకటరెడ్డిపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. జగన్ హయాంలో ఎపీఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా ఆయన భారీ స్థాయిలో అవకతవకలు, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే మైన్స్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఆ విచారణలో వెంకటరెడ్డి అక్రమాలు, అవకతవకలకు పాల్పడినట్లు రుజువవ్వడంతో వెంకటరెడ్డిని సస్పెండ్ చేసి కేసు నమోదు చేయాల్సిందిగా సీఎం చంద్రబాబుకు సిఫారసు చేశారు. ఈ మేరకు వెంకటరెడ్డిని సస్పెండ్ చేస్తూ నేడో రేపో ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. కోస్ట్ గార్డ్స్ లో పని చేస్తున్న వెంకటరెడ్డిని జగన్ సర్కార్ కావాలని రాష్ట్రానికి డెప్యూటేషన్ పై పిలిపించుకుని ఎపీ ఎండిసి మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలకు కట్టబెట్టింది. అదలా ఉంచితే తెలుగుదేశం కూటమి అధికారం చేపట్టిన తరువాత ఏపీఎండీసీని సీజ్ చేసి, ప్రభుత్వ రికార్డులు ఏవీ బయటకు తరలి పోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. మైన్స్ శాఖకు చెందిన సీనియర్ అధికారులు జగన్ సర్కా ర్ హయాంలో తీసుకున్న కీలక నిర్ణయాలను కూలంకషంగా పరిశీలించి ఒక నివేదిక రూపొందించి చంద్రబాబుకు అందజేశారు. ఆ నివేదిక మేరకే వెంకటరెడ్డిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేయనుంది.