ఏపీలో .జాతీయ రహదారులకు కేటాయించిన నిధులెన్ని?
posted on Aug 1, 2024 @ 10:51PM
ఆంధ్రప్రదేశ్ లో జాతీయ రహదారుల కోసం గత ఐదేళ్లలో కేటాయించిన నిధుల వివరాలు తెలపాలంటూ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ప్రశ్నించారు. లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన సంధించిన ప్రశ్నకు నితిన్ గడ్కరీ సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలోని విజయవాడ, అనంతపురం, ఏలూరు జిల్లాల్లో గత ఐదేళ్లుగా జాతీయ రహదారుల పనుల కోసం కేటాయించిన నిధులు, విడుదల చేసిన నిధులు, వాటి వినియోగం పై విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్, హిందూపురం ఎంపి బి.కె. పార్ధసారథి, అనంతపురం ఎంపి అంబికా జి లక్ష్మీనారాయణ, ఏలూరు ఎంపి పుట్టా మహేష్ కుమార్, చిత్తూరు ఎంపి దగ్గుమళ్ళ ప్రసాదరావులు సమాధానం కోరారు. వా విజయవాడ, అనంతపురం జిల్లాలలో జాతీయ రహదారుల లైన్ల సంఖ్యను పెంచడానికి ఎన్‌హెచ్ లను అప్‌గ్రేడ్ చేయడానికి ఎంచుకున్న వివరాలు? ఆంధ్రప్రదేశ్‌లో ఈ పనులను పూర్తి చేయడానికి గడువు తెలియజేయాలని కోరారు.
ఈ ప్రశ్నలకు కేంద్ర రోడ్డు, రవాణా రహాదారుల మంత్రి నితిన్ గడ్కరీ బదులిస్తూ ఎపిలో రహదారులను మెరుగుపరచడానికి అప్‌గ్రేడ్ చేయడానికి నిరంతరం డిపిఆర్ తయారు చేస్తుంటారని తెలిపారు. అలాగే గత 5 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్‌లో జాతీయరహదారుల అభివృద్ధి , నిర్వహణ పనుల కోసం 2019-20 ఏడాది గాను రూ.6,341 కోట్ల రూపాయలు, 2020-21 ఏడాది గాను రూ.4, 288 కోట్ల రూపాయలు, 2021-22 ఏడాది గాను రూ.5,913 కోట్ల రూపాయలు, 2022-23 ఏడాది గాను రూ. 6,957 కోట్ల రూపాయలు, 2023-24 ఏడాది గాను రూ.11, 780 కోట్ల రూపాయల నిధులు కేటాయించి వినియోగించినట్లు వివరించారు.
ఇక ఆంధ్రప్రదేశ్ లో జాతీయ రహదారుల నిర్మాణం 2,380 కిలోమీటర్ల జరుగుతుండగా, 92 లైన్ల పెంపు కోసం రు.51,429 కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఎపిలో అనుమతి పొందాల్సిన జాతీయ రహదారుల ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రూ.15,674 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇందులో 789 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం, 25 లైన్ల పెంపు వుందన్నారు.