జగన్ జిమ్మిక్కులు.. నవ్వుకుంటున్న జనం!
posted on Aug 1, 2024 @ 11:17PM
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా ఆయన ఆలోచనల్లో మార్పు రావడం లేదు. ఎంత సేపటికీ చంద్రబాబును గద్దె దించాలి.. చంద్రబాబుకు బీజేపీకి దూరం చేయాలి.. తాను కేసుల నుంచి తప్పించుకోవాలనే ఆలోచనే తప్ప.. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలన్న భావన ఇసుమంతైనా కనిపించడం లేదు. ఈ క్రమంలో చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు, వైసీపీ ఉనికి కోసం జగన్ వేస్తున్న ఎత్తులు అంతే వేగంగా వికటిస్తున్నాయి. ఎన్నికల్లో దారుణ ఓటమి తరువాత కూడా జగన్ వైఖరిలో మార్పు రాకపోవడంతో వైసీపీని వీడేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్ జయంతి రోజున ఇడుపులపాయకు వెళ్లిన జగన్‌కు అక్కడ వైసీపీ నేతలను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాపాలకు కూటమి ప్రభుత్వం నట్లు బిగిస్తుండటంతో వైసీపీ హయాంలో రెచ్చిపోయిన బడా నాయకులు వణికిపోతున్నారు. అంబటి రాంబాబు మినహా వైసీపీ పెద్దలు ఇచ్చిన స్క్రిప్టు చదివేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. తెలుగుదేశం, జనసేన పార్టీల గేట్లు ఎప్పుడు తెరుచుకుంటాయి... వైసీపీని ఎప్పుడు వీడుదామా అని ఆ పార్టీ నేతలు ఎదురు చూస్తున్నారు. ఏపీలో వైసీపీ పరిస్థితి ఇలా ఉంటే.. జగన్ మోహన్ రెడ్డి సలహాదారులు మాత్రం మా అంత మేధావులు ఎవరూ లేరన్నట్లు వ్యవహరిస్తూ.. బీజేపీ, చంద్రబాబు మధ్య కయ్యాలు పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ సలహాదారులు జగన్ మోహన్ రెడ్డికి అద్బుతమైన ఐడియాలు ఇచ్చి అడ్డంగా ముంచేశారు. ముఖ్యంగా వైనాట్ 175 అనే పెద్దపెద్ద ఫ్లెక్సీల మధ్య జగన్ చేత ర్యాంప్ వాక్ చెయ్యిస్తే.. జనాలు జేజేలు పలుకుతారని భావించారు. బస్సు యాత్ర, మధ్యలో బ్యాండేజీ డ్రామా చేయించారు. నిజంగా వేరే రాష్ట్రంలో అయ్యుంటే జగన్ నాటకాలు మళ్లీ ఫలించేవి. ఏపీ ప్రజలు చైతన్యవంతులు కావడంతో ఒక్కఛాన్స్ ఇస్తే ఐదేళ్ల నరకం చూపించిన జగన్‌కు.. సైలెంటుగానే ఓటు ద్వారా వయలెంటుగా రియాక్ట్ అయ్యారు. తద్వారా కేవలం 11 స్థానాలకే వైసీపీని పరిమితం చేశారు. ప్రజలే అలా ఆలోచిస్తే.. ఐదేళ్లపాటు ఇబ్బందులు ఎదుర్కొన్న చంద్రబాబు నాయుడు, మూడోసారి కూడా దేశంలో అధికారాన్ని నిలబెట్టుకున్న బీజేపీ అగ్రనేతలు ఏ స్థాయిలో ఆలోచిస్తారనే కనీస ఆలోచన జగన్ కు లేకపోవటంతో వారి ముందు కుప్పిగంతులేస్తూ బొక్కబోర్లా పడుతున్నాడు. జగన్ సలహా దారుల వ్యూహాలు ఎంత సిల్లీగా ఉన్నాయంటే.. రాజకీయ విశ్లేషకులేకాదు.. ప్రజలకూ నవ్వుకుంటున్నారు.
కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీలు కనీసం ఆరు నెలలైనా సమయం ఇస్తాయి. అప్పటికీ ఇచ్చిన హామీలను పరిష్కరించకుంటే ప్రభుత్వాన్ని నిలదీస్తాయి. కానీ, జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఎన్నికల్లో ఓడిపోయిన మరుసటి రోజు నుంచి కేంద్రంలోని బీజేపీని, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాన్ని బెదిరింపులతో హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఓడిన వెంటనే మాకు రాజ్యసభలో 11 మంది, లోక్ సభలో నలుగురు మొత్తం కలిపి 15 మంది ఎంపీల బలం ఉంది.. ఎన్‌డీఏ కూటమికి రాజ్యసభలో బలం లేదు.. మా మీద ఆధారపడాల్సిందే, మేము రాష్ట్ర ప్రయోజనాలకోసం మద్దతు ఇస్తాం అంటూ బీజేపీ అడకముందే ఏ2 విజయసాయి రెడ్డి చేత మీడియా ద్వారా జగన్ మోహన్ రెడ్డి చెప్పించాడు. తద్వారా బీజేపీకి టచ్‌లోకి వెళ్లి ఏపీలో చంద్రబాబును ఇబ్బంది పెట్టాలనే వ్యూహాన్ని అమలు చేశారు. కానీ, బీజేపీ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఆ తరువాత విజయసాయి రెడ్డిని అమిత్ షా వద్దకు పంపించాడు. అక్కడా ఫలితం లేకపోవడంతో.. నేరుగా బీజేపీని బ్లాక్‌మెయిల్ చెయ్యడానికి డిల్లీలో ధర్నాకు కూర్చున్నారు. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయి.. వైసీపీ కార్యకర్తలను హత్యలు చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేశారు. శాంతిభద్రతలు అదుపు తప్పాయి ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ ఆ ధర్నా వేదికగా జగన్ సహా, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు ఇండియా కూటమిలోని ఓ మూడునాలుగు పార్టీల నుండి ఒక్కో ఎంపీని రప్పించి తమకు మద్దతు చెప్పించుకున్నారు. వారితో రౌండ్ టేబుల్ ముచ్చట్లు పెట్టి.. నవ్వుతూ కబుర్లు చెప్పిన దృశ్యాలను జాతీయ మీడియా ద్వారా బీజేపీకి తెలిసేలా చేశారు. తద్వారా బీజేపీకి మాకు సహకరించకపోతే.. ఇండియా కూటమివైపు వెళ్తామని బెదిరించే ప్రయత్నం చేశారు. బీజేపీ పెద్దలు మాత్రం జగన్ ధర్నా గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. అయినా, బీజేపీ పెద్దలు, చంద్రబాబు మధ్య విద్వేషాలు సృష్టించే ప్రయత్నాలను జగన్ విరమించుకోలేదు.
జగన్‌తో పాటు తాడేపల్లి ప్యాలెస్‌లో విందు ఆరగించిన రాజ్‍దీప్ సర్దేశాయి దేశంలో పవర్‌ఫుల్ లీడర్ నరేంద్ర మోడీ అయితే.. రెండో పవర్ ఫుల్ వ్యక్తి అమిత్ షా కాదు.. చంద్రబాబు నాయుడు అంటూ చెప్పుకొచ్చాడు. అవును ఇది నిజం అంటూ.. మోడీ, చంద్రబాబుల ఫ్లాష్ బ్యాక్, వివరిస్తూ ఒక డ్రామా పండించాడు. దీని వెనుక జగన్ కుట్రకోణం ఉందని అంటున్నారు. అమిత్ షా దృష్టిలో చంద్రబాబును విలన్‌గా చేయడానికి జగన్ అండ్ కో ఆడిన ఆటలో భాగమే ఇదంతాని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఓ వైపు ఇండియా కూటమి.. లోక్‌సభలో స్పీకర్ ఎన్నిక నుండి చంద్రబాబుకు గాలం వెయ్యడానికి ప్రయత్నిస్తూనే వుంది. మరో వైపు బడ్జెట్లో ఆంధ్రా పేరు ఎత్తితే.. బీజేపీని పార్లమెంటులో ర్యాగింగ్ చేస్తోంది. అదే సమయంలో ఆంధ్రాకు బీజేపీకి బడ్జెట్లో చెప్పింది ఇవ్వడానికి ఖజానాలో ఏమీ పెట్టలేదు అంటూ కాంగ్రెస్ నేత జయరాం రమేశే తెలివి తేటలు ఒలకబోస్తున్నాడు. బీజేపీ నుంచి చంద్రబాబును దూరంచేయడానికి ఇండియా కూటమి నేతలు చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు. రాజకీయాల్లో తలపండిపోయిన బీజేపీ పెద్దలు, చంద్రబాబు ఇండియా కూటమి నేతల డ్రామాలను లైట్‌గా తీసుకుంటున్నారు. మధ్యలో జగన్ కుప్పిగంతులను చూసి కేంద్రంలోని బీజేపీ పెద్దలు నవ్వుకుంటున్నారు.
ఇదంతా ఒకలెక్క అయితే.. త్వరలో చంద్రబాబు ఆడబోయే ఆటకు జగన్ దిమ్మతిరగడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్లు ఎగురుతున్న వైసీపీ నేతలకు త్వరలో గట్టి షాకిచ్చేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారని తెలుగుదేశం శ్రేణులు చెబుతున్నాయి. ప్రస్తుతం చంద్రబాబు పాలనపై దృష్టిపెట్టారు. కలెక్టర్లు, ఎస్పీలు, డిఎస్పీల వరకు ప్రక్షాళన పూర్తయింది. ఇక వైసీపీ అవినీతి హయాంలో ఆ పార్టీ నేతల అవినీతి గుట్టు బయటపెట్టడానికి రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు. అటు రాజ్యసభ సభ్యులుకూడా వైసీపీని వీడబోతున్నారని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులు చేజారితే వైసీపీ గేమ్ క్లోజ్ కావడం ఖాయంగా కనిపిస్తున్నది. తద్వారా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ముందు జగన్ కుప్పిగంతులకు కూడా ఎండ్ కార్డ్ పడటం ఖాయం.