నారా లోకేష్.. వారసుడు కాదు.. నాయకుడు
posted on Aug 2, 2024 @ 4:29PM
ఇంతింతై వటుడింతై అన్నట్లుగా నారా లోకేష్ పరిపూర్ణ నాయకుడిగా వేగంగా ఎదుగుతున్నారు. అందలాన్ని ఎక్కించేది వారసత్వం కాదు... అర్హత అని పెద్దలు ఎప్పుడూ చెబుతూ వుంటారు. ఆ మాటకి నిలువెత్తు తార్కాణంగా నిలిచారు నారా లోకేష్. వారసత్వంతో మాత్రమే కాకుండా.. అర్హతతో అందలాన్ని సాధించుకున్న యువతరం నాయకుడు నారా లోకేష్. వైసీపీ పిశాచాలు నారా లోకేష్ రాజకీయ అడుగులు ప్రారంభించకుందే ఆయనను టార్గెట్ చేసి పప్పు... పప్పు అని విషప్రచారం చేసినా, ఆహార్యాన్ని, ఆహారపు అలవాట్లనూ ఎద్దేవా చేస్తూ బాడీషేమింగ్ కు పాల్పడినా లెక్క చేయకుండా తన కృషితో, పట్టుదలతో తాను పప్పు కాదని... వైసీపీ నాయకుల తుప్పు వదిలించే నిప్పు అని నిరూపించుకున్నారు.
యువగళం పాదయాత్ర సమయంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా లెక్కచేయకుండా ముందుకే సాగారు. ఫలితంగా పార్టీని, వ్యక్తిగత గ్రాఫ్‌ను కూడా పెంచుకున్నారు. అత్యంత కీలకమైన సమయంలో అధికార పార్టీని గద్దె దించడానికి తనవంతు భాగస్వామ్యాన్ని అందించారు. లోకేష్‌లోని కసికి తోడైన అవిరళ కృషి.. ఆయనను పరిణితి చెందిన పెద్ద నాయకుల కోవలోకి చేర్చాయి.
2019 ఎన్నికలలో తాను ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయానని 2024 ఎన్నికలలో యాభై వేల ఓట్లతో గెలుస్తానని ప్రకటించి అంతకు మించి మెజారిటీతో విజయం సాధించి సత్తాచాటారు. అదీ తెలుగుదేశం పార్టీకి పట్టులేని నియోజకవర్గంలో పోటీ చేసి గెలిస్తేనే తాను నాయకుడు అనిపించుకుంటానని చెప్పారు. ఆ ఒక్కమాటతోనే తాను వారసుడు కాదు.. నాయకుడు అనే విషయం ప్రూవ్ చేసుకున్నారు. 2024 ఎన్నికల సందర్భంగా ఆయన కృషిని మెచ్చిన ప్రజలు ఆయనకు 91 వేల మెజారిటీ ఇచ్చారు. అంటే, ప్రజలు ఆయన్ని నమ్మారు.. ఆయన పనితీరును నమ్మారు.. అందుకే పట్టం కట్టారు. ఈ విజయంతో ఇప్పటి వరకు వైసీపీ విమర్శలు, వ్యాఖ్యలు, ఆరోపణలు ఎగతాళి మాటలు అన్నీ గాలిలో కలిసిపోయాయి. వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి అచ్చిరాని స్థానం మంగళగిరి. తెలుగుదేశం ఆవిర్భావం తరువాత మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం రెండంటే రెండు సార్లు మాత్రమే. అటువంటి నియోజకవర్గాన్ని ఎంచుకుని తొలి ప్రయత్నంలో ఓడిపోయిన తరువాత, పార్టీ అగ్రనేతలు, లోకేష్ శ్రేయోభిలాషులు అంతా కూడా ఆయనను మంగళగిరి విడిచి మరో సేఫ్ స్థానం నుంచి పోటీ చేయాలని కోరారు. అయితే లోకేష్ ఓడిన చోటనే గెలిచి చూపుతానని పట్టుబట్టి మరీ మంగళగిరినే ఎంచుకున్నారు. సరే మంగళరి నుంచి లోకేష్ రెండో ప్రయత్నంలో ఘన విజయం సాధించారు. అది అలాంటి ఇలాంటి విజయం కాదు.పార్టీకి పెద్దగా పట్టు లేని నియోజకవర్గం నుంచి లోకేష్ ఏకంగా 90 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అది మామూలు విషయం కాదు.
అది పక్కన పెడితే లోకేష్ లో విజయగర్వం అన్నది ఇసుమంతైనా కనిపించడం లేదు సరికదా గతం కంటే ఎక్కువ వినయం, జవాబుదారీ తనంతో పరిశీలకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా ప్రజా నేతగా జన హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నారు. రాష్ట్ర కేబినెట్ లో కీలక మంత్రిగా ప్రతి విషయంలోనూ జవాబుదారీ తనంతో ఉంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
తాజాగా ఆయన కమ్యూనిస్టు నేతలకు సారీ చెబుతూ చేసిన ట్వీట్ ఆయన పరిణితిని, జవాబుదా రీతనాన్ని, వినయ సంపదనూ ఎత్తి చూపింది. ఇంతకీ ఆయన కమ్యూనిస్టులకు సారీ ఎందుకు చెప్పారూ.. స్వయంగా ఆయన ఏమైనా వామపక్షాలను ఉద్దేశించి విమర్శలు ఏమైనా చేశారా? లేదా వామపక్ష సిద్ధాంతంపై ఏవైనా వ్యాఖ్యలు చేశారా? అంటే అదేం లేదు. మరెందుకంటే..
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం మడకశిరలో పర్యటించారు. ఆ సందర్భంగా అక్కడ పోలీసులు ఓవరేక్షన్ చేశారు. ముఖ్యమంత్రి దృష్టికి వామపక్ష నేతలు ఏవైనా సమస్యలను తీసుకువెడుతూ మెమోరాండం సమర్పించే అవకాశాలున్నాయన్న అనుమానంతో పలువురు కమ్యూనిస్టు నేతలను అదుపులోనికి తీసుకున్నారు. ఇప్పటికే పలు మార్లు ముఖ్యమంత్రి తన పర్యటన సందర్భంగా ఆంక్షలు విధించడం, ముందస్తు అరెస్టులు చేయడం వంటివి తగదని విస్పష్టంగా చెప్పారు. అయితే మడకశిర పర్యటన సందర్భంగా పోలీసులు ఓవరేక్షన్ చేశారు.
దీనికే లోకేష్ కమ్యూనిస్టులకు సారీ చెబుతూ ట్వీట్ చేశారు. భవిష్యత్ లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అసలు ఒక రాజకీయనాయకుడు సారీ చెప్పడం అనేది ఇప్పటి రాజీకీయ వాతావరణంలో ఎవరూ కనీసం ఊహించను కూడా ఊహించలేరు. అటువంటిది నారా లోకేష్ సారీ చెప్పారు. ఆయన పరిణితి, హుందాతనం, వినయం, జవాబుదారీ తనం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. పార్టీలకు అతీతంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఒక రాజకీయ నాయకుడి నుంచి జనం ఆశించే వినయం, జవాబుదారీ తనం నూటికి నూరుపాళ్లూ ఉన్న సంస్కారవంతమైన నేతగా లోకేష్ ప్రశంసలు అందుకుంటున్నారు.