మూడుదశాబ్దాల వర్గీకరణ పోరాటానికి శుభం కార్డు!
posted on Aug 2, 2024 @ 11:07AM
ఎస్సీ వర్గీకరణకోసం మూడుదశాబ్దాల పోరాటానికి సుప్రీంకోర్టు తీర్పుతో శుభం కార్డు పడింది.సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల ప్రధాన ధర్మాసనం గురువారం (ఆగస్టు 1) వర్గీకరణకు అనుకూలంగా చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఏడుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ బేలా త్రివేది వినా మిగిలిన ఆరుగురు న్యాయమూర్తులు వర్గీకరణను సమర్ధిస్తూ తీర్పు వెలువరించారు. సమానత్వహక్కుకు వర్గీకరణ భంగం కాదని తీర్పు పేర్కొంది.
అలాగే ఆర్టికల్ 341/2కు భంగంకలగకూడదనీ, ఆర్టికల్ 15,16 లలో వర్గీకరణను వతిరేకించే అంశాలు లేవని ఆ తీర్పులో పేర్కొన్నారు. దీనివల్ల ఉప వర్గాలకు న్యాయం చేకూరుతుందని, రాష్ట్రాలకు ఉప వర్గీకరణ లో అవకాశం ఇవ్వాలని, ఎస్సీల్లో క్రిమీలేయర్ గుర్తించడానికి అవకాశం ఇస్తూ తీర్పు చెప్పడం చారిత్రాత్మకం. మాదిగలకు గుర్తింపు తెచ్చిన మందకృష్ణ మాదిగ 1972 నుంచి ఉమ్మడి ఏపీలోమారిన ప్రతి సీఎం వద్దకు వెళ్లి మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు.వర్గీకరణకు సహకరించాలని కోరేవారు.
2011జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ల జనాభా 1.38 కోట్లమంది ఉన్నారు. వారిలో మాలలు 55.70లక్షలు, మాదిగలు67.02 లక్షల మంది ఉన్నారు.అంటే 11లక్షలమంది మాదిగలు ఎక్కువ ఉన్నారు.మాలమాదిగలు 80 శాతంగా ఉండగా,మిగిలిన 20 శాతంగాఉన్న 57 ఉపకులాల్లోఉత్తరాంధ్ర రెల్లి కులానిది మూడో స్థానం.70శాతంగా ఉన్న మాదిగ,దాని ఉపకులాలు రిజర్వేషన్లు 10శాతం పొందుతున్నారు. 30శాతంగా ఉన్న మాలలు వారి ఉపకులాలు 90శాతం రిజర్వేషన్లు పొందుతున్నారని వారి వాదన.
2000-2004మధ్య చంద్రబాబు వర్గీకరణ అమలు చేసారు. కాని మాలమహానాడు వ్యతిరేకించింది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు వర్గీకరణ ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ 2004లో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ ను విచారించిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం హైకోర్ట్ తీర్పు ను సమర్దిస్తూ తీర్పు వెలువరించింది. ఆ తర్వాత ఆనేక పోరాటాలు,ఉద్యమాలు నడిచాయి.చివరికి ఎన్నికల ముందు ప్రధాని మోదీ హైదరాబాద్లో జరిగిన విశావరూప సదస్సుకు హాజరై వర్గీకరణ ను సమర్దిస్తూ మాట్లాడారు. వర్గీకరణకు మద్దతు తెలిపారు. మందకృష్ణ మాదిగ ఈ సందర్భంగా మాట్లాడుతూ ధర్మం గెలిచిందని వ్యాఖ్యానించారు. ఈ విజయాన్ని పోరాటంలో అమరులైన వీరులకు అంకిత మిస్తున్నామన్నారు.
ఈ విజయంలో చంద్రబాబు పాత్ర కీలకమనీ, వర్గీకరణ విజయం క్రెడిట్ ఆయనకే చెందుతుందన్నారు. ప్రధాని మోడీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబులు వర్గీకరణ తీర్పు పై హర్షం వ్యక్తం చేసారు. ఇలా ఉండగా వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును మాలమహానాడు వ్యతిరేకించింది. న్యాయపోరాటం చేస్తామని ప్రకటించింది. ఏది ఏమైనా సుప్రీం ప్రధాన ధర్మాసనం తీర్పుతో వర్గీకరణ వివాదానికి శుభం కార్డు పడినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.