అమరావతి నిర్మాణం ఇక పరుగులు.. యాక్షన్ ప్లాన్ రెడీ చేసిన చంద్రబాబు!
posted on Aug 2, 2024 @ 10:29AM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఇక పరుగులు పెట్టనుంది. గత ఐదేళ్ల జగన్ హయాంలో మూడు రాజధానులంటూ అమరావతిని నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత అమరావతిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నిర్ణీత కాల వ్యవధిలో అమరావతి నిర్మాణం పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. దీంతో అమరావతి నిర్మాణం పరుగులు పెట్టించేందకు చంద్రబాబు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు.
అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలు ఏవీ, ఏ పనులు ఏంత మేర పూర్తి అయ్యాయి, నిలిచిపోయిన భవనాల సామర్ధ్యం ఇప్పుడు ఎలా ఉంది. మరమ్మతులు చేసి వినియోగించుకోవడానికి అవకాశం ఉందా అన్న అంశాలపై సీఆర్డీయే దృష్టి సారించింది. ఇప్పటికే అమరావతికి సంబంధించి అన్ని నివేదికలు తెప్పించుకున్న సీఎం… కీలక సీఆర్డీయే సమావేశం ఏర్పాటు చేశారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సీఆర్డీఏ సమావేశం జరగడం ఇదే తొలిసారి. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబుతో పాటు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సహా 11మంది సభ్యులు హజరుకానున్నారు.
ఆగిపోయిన నిర్మాణాలు పనికొస్తాయా? అన్న విషయాన్ని నిర్ధారించేందుకు అమరావతికి ఐఐటీ నిపుణులు రానున్నారు. అలాగే గతంలో నిలిచిపోయిన భూసేకరణ, కొత్తగా దరఖాస్తు చేసుకున్న కంపెనీలకు భూ కేటాయింపులు, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 15వేల కోట్ల నిధుల వ్యయం , అందుకు విధి విధానాలతో పాటు ఈ సమావేశంలో విధానపరమైన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
నిర్మాణాల విషయంలో సీఎం అక్కడికక్కడే సూచనలు చేసే వీలుందని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి నుండే అన్ని కార్యకలాపాలు జరిగేలా చూడాలని చంద్రబాబు భావిస్తున్నారు. అలాగే శాశ్వత నిర్మాణాలను నిర్దుష్ట గడువులోగా పూర్తి చేయాలని సీఎం ఇప్పటికే సీఆర్డీఏకు సూచించారు. అవసరం అయితే సీఆర్డీఏలో ఉద్యోగుల సంఖ్యను పెంచుతామని కూడా ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.