స్మార్ట్ సిటీస్ మిషన్ కింద ఏపీకి కేటాయించిన నిధులెన్ని?
posted on Aug 2, 2024 6:34AM
స్మార్ట్ సిటీస్ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన నిధులెన్నో తెలపాలంటూ విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిలోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు కేంద్ర గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి తోఖాన్ సాహు బదులిచ్చారు. ఏపీలో స్మార్ట్ సిటీల పురోగతి, ఈ మిషన్ ఎప్పటి వరకూ కొనసాగిస్తారు? ఈ మిషన్ ను ఏమైనా కొత్త కార్యక్రమాలతో భర్తీ చేయాలనుకుంటున్నారా? అంటూ కేశినేని చిన్ని అగిగిన ప్రశ్నలకు సమాధానండా మంత్రి తోఖాన్ సాహు 25 జూన్, 2015వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఎస్.సి.ఎమ్ 2025 మార్చి 31 వరకు అమల్లో వుంటుందని తెలిపారు. ఈ మిషన్ కింద దాదాపు 100నగరాలు వుండగా, అందులో ఎపి నుంచి కాకినాడ, తిరుపతి, అమరావతి వున్నాయని తెలిపారు.
ఎస్.సి.ఎమ్ కింద ఎంపికైన నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టులు, సౌకర్యాల ప్రాధాన్యత నిర్ణయిస్తారని వివరించారు. ప్రస్తుతం ఎస్.సి.ఎమ్ ను ఎలాంటి కొత్త కార్యక్రమంలో భర్తీ చేయాలనే ప్రతిపాదన లేదని వివరించారు. ఇక ఎపిలో ఎస్.సి.ఎమ్ కింద ఎంపికైన అమరావతి లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ.1,048 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయగా, 779.29 కోట్ల రూపాయలు వినియోగించినట్లు చెప్పారు.
అలాగే 20 ప్రాజెక్టులు గాను, 14 ప్రాజెక్టులే పూర్తి చేసినట్లు తెలిపారు. కాకినాడలో రూ.978 కోట్లుకి గాను రూ.783.57 కోట్లు, తిరుపతి లో రూ.578 కోట్లకి గాను రూ.574 కోట్లు, విశాఖపట్టణం లో రూ.986 కోట్లకి గాను, 838.47 రూపాయలు వినియోగించినట్లు తెలియజేశారు. ఎపిలో మొత్తం 281 ప్రాజెక్టులు గాను, 234 ప్రాజెక్టులు మాత్రమే పూర్తి చేసినట్లు వివరించారు. అలాగే ఎపిలో రూ.3,590.80 కోట్ల నిధులు విడుదల చేయగా, రూ.2,975.35 కోట్ల నిధులు మాత్రమే వినియోగించినట్లు తెలిపారు.