వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం.. ఇంతకీ ఎక్కడున్నాడు?
posted on Aug 2, 2024 @ 1:53PM
గన్నవరంలోని తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఆ కేసుకు సంబంధించి ఇప్పటికే 18 మందిని అరెస్టు చేసిన పోలీసులు వంశీ కోసం గాలిస్తున్నారు.
వంశీని అరెస్టు చేయడానికి మూడు పోలీసు బృందాలు హైదరాబాద్ చేరుకున్నాయని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ పేరు 71వ ముద్దాయిగా ఉంది. ఈ దాడిలో వంశీ నేరుగా పాల్గొనపోయినా దాడికి వైసీపీ కార్యకర్తలను ప్రేరేపించింది వంశీయేనని పోలీసులు చెబుతున్నారు. వైసీపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నంత కాలం పోలీసులు వంశీ సొంత మనుషుల్లా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఆ కారణంగానే దాడి తరువాత పోలీసులు ఎలాంటి చర్యా తీసుకోలేదు. వైసీపీ సర్కార్ పతనమై.. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రమే పోలీసులు కేసును సీరియస్ గా పట్టించుకుంటున్నారు. గన్నవరంలోని తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో గత నెల 9న పోలీసులు 15 మందిని అరెస్టు చేశారు. వారిలో వంశీకి అత్యంత సన్నిహితులైన బాపులపాడు ఎంపీపీ నగేష్, మరో ముగ్గురు ఉన్నారు. ఇంకా పలువురు పరారీలో ఉన్నారు.
అయితే తెలుగుదేశం శ్రేణులు మాత్రం పోలీసులు వంశీ సహా కీలక నిందితులను వదిలేశారని ఆరోపిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా వంశీ నియోజకర్గంలోని తెలుగుదేశం కార్యకర్తలను తీవ్రంగా వేధింపులకు గురి చేయడమే కాకుండా, నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా తమ పార్టీ కార్యకర్తలు, నాయకులపై పలు అక్రమకేసులు కూడా పెట్టించారని తెలుగుదేశం శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కృష్ణా జిల్లా ఎస్పీగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన గంగాధరరావు వంశీ అరాచకాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత వంశీ విజయవాడ వదిలిన కుటుంబంతో సహాక హైదరాబాద్ కు మకాం మార్చేశారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో అడుగు పెట్టింది కూడా లేదు. దీంతో వంశీ కోసం మూడు పోలీసు బృందాలు గురువారం (ఆగస్టు 1) హైదరాబాద్ చేరుకున్నాయి. అయితే పోలీసులు చాలా తాపీగా స్పందించారనీ, వంశీ ఇప్పటికే దేశం దాటేశారన్న వార్తలు వినవస్తున్నాయి.
పులవర్తి నానిపై దాడి కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్లే చేసి వదిలివేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో వంశీ అరెస్టు వారిని ఒకింత శాంత పరిచే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై మొట్టమొదట అనుచిత వ్యాఖ్యలు చేసింది వల్లభనేని వంశీయే అన్న సంగతి తెలిసిందే. దీంతో తెలుగుదేశం శ్రేణుల్లో వంశీ పట్ల తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. వంశీని ఎలాగైనా అరెస్టు చేయాలన్న ఎస్పీ విస్పష్ట ఆదేశాలతో ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అవసరమైతే లుక్ ఔట్ నోటీసు కూడా జారీ చేయాలని భావిస్తున్నారు.