దిక్కూ దివాణం లేని ధర్మాన!
posted on Aug 2, 2024 @ 3:38PM
మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ పొలిటీషియన్ ధర్మాన ప్రసాదరావు రాజకీయ భవితవ్యం ఏమిటి..? తాజా ఎన్నికల్లో ఒక సర్పంచ్ చేతిలో ఏభై వేలకు పైగా ఓట్ల తేడాతో ఘోర ఓటమిని చవి చూసిన అనంతరం ధర్మాన ఆలోచన ఏమిటి..? వైసిపిలోకి వచ్చిన నాటి నుండి రాజకీయాలపై విరక్తి మాటలు మాట్లాడే ధర్మాన.. ఈ ఓటమి తరువాత రాజకీయాల నుండి రిటైర్ అవ్వనున్నారా..? తన తనయుడి రాజకీయ ప్రస్థానం కొనసాగించడానికి వేరొక పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారా..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి..
ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈ రాజకీయ నేత.. స్థానికంగానే కాదు.. రాష్ట్ర రాజకీయాల్లో సైతం ఓ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్.. అసెంబ్లీలో ధర్మాన ప్రసంగాలను చాలామంది ఇప్పటికీ ఫాలో అవుతూ ఉంటారు. మాస్ లీడర్‌గా మంచి ఫాలోయింగ్‌తో పాటు, అంతే స్థాయిలో అవినీతి ఆరోపణలు సైతం మూటగట్టుకున్నారు ధర్మాన ప్రసాదరావు. కాంగ్రెస్ హయంలో, తరువాత వైసిపిలో చేరిన తరువాత సైతం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం, ఉత్తరాంధ్ర పరిధిలో, అందులో ముఖ్యంగా తన సొంత జిల్లా శ్రీకాకుళంలో ప్రతీ నియోజకవర్గంలో తన అనుయాయులను బలపరుచుకుని.. ప్రతీ చోట తన మాట చెల్లుబాటు అయ్యేలా.. తన పనులు, తనవారి పనులు క్షణాల్లో జరిగేలా.. మొత్తం సిస్టం మొత్తం తనకు అనుకూలంగా మార్చుకున్న ప్రొఫెషనల్ పొలిటీషియన్..
అలాంటి ప్రొఫెషనల్ పొలిటీషియన్ ధర్మాన ప్రసాదరావు పొలిటికల్ కెరియర్ గడచిన మూడేళ్ళుగా పూర్తిగా అస్తవ్యస్తంగా నడుస్తోంది. ఆడే మాట తప్పుగా దొర్లుతోంది.. వేసే అడుగు తడబడింది.. అందుకు ఫలితాలుగా నిలచాయి తాజా సాధారణ ఎన్నికలు.. రాష్ట్రం మొత్తం వన్ సైడ్ ఫలితాలు వచ్చినప్పటికీ శ్రీకాకుళం నియోజకవర్గంలో ధర్మాన ఓటమి మాత్రం అందులో భిన్నం.. ఘోరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఈ సీనియర్ పొలిటీషియన్ ను శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన ఓ సర్పంచ్ ఓడించారు. అదికూడా ఏభై వేలకు పైగా ఓట్ల తేడాతో.. దీంతో శ్రీకాకుళం నియోజకవర్గంలో గెలిచిన గోండు శంకర్.. ఇప్పుడు ట్రెండ్ సెట్టర్‌గా మారగా.. ధర్మాన రాజకీయ భవిష్యత్ మాత్రం అయోమయంలో పడింది.
ఇంకోవైపు వైసిపికి వచ్చిన నాటి నుండి పార్టీలో గుర్తింపు కోసం ఆపసోపాలు పడ్డారు ధర్మాన ప్రసాదరావు. ఒక బలమైన వాగ్ధాటి, భారీగా మాస్ ఫాలోయింగ్ ఉన్న ధర్మాన ప్రసాదరావును వైసిపి ప్రభుత్వ పాలనలో తొలి మూడేళ్ళు పూర్తిగా దూరం పెట్టింది. తొలి దఫా మంత్రివర్గ కూర్పులో ధర్మానకు చోటు ఇవ్వకపోవడానికి తోడు, జిల్లాలో కీలక వ్యవహారాల్లో సైతం ఆయననూ దూరం పెడుతూ వచ్చింది. జిల్లాలో ధర్మాన వర్గీయులుగా ముద్ర పడ్డ నాయకులకు గుర్తింపు ఇవ్వకపోవడం, ఆయనను గతంలో విభేదించిన వారికి కీలక పదవులు ఇవ్వడం.. ధర్మాన కోటరీ తట్టుకోలేకపోయింది.
వాస్తవానికి 2024 సాధారణ ఎన్నికల బరిలో తన కుమారుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడును నిలపాలని ధర్మాన ప్రసాదరావు అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఎన్నికలకు రెండేళ్ళ ముందు నుండి ఆయన ప్రసంగాలు కూడా ఉండేవి.. తనకు రాజకీయాల్లో ఆసక్తి తగ్గింది అని, ఇకపై పోటీ చెయ్యనూ అంటూ అనేక వేదికల్లో చెప్పుకోస్తూ ఉండేవారు ధర్మాన ప్రసాదరావు.. అయితే వైసిపి అధినేత జగన్ మాత్రం ఈసారి తప్పక పోటీ చెయ్యాల్సిందే అని తెగేసి చెప్పడంతో అనివార్యంగా బరిలో నిలచారు ధర్మాన ప్రసాదరావు.
అయిష్టంగా బరిలో నిలిచి.. అనూహ్యంగా భారీ ఓటమి పాలైన ధర్మాన ప్రసాదరావు రాజకీయ భవితవ్యంపై ఇప్పుడు నీలినీడలు అలముకున్నాయి. అయితే గడచిన కొన్ని రోజులుగా ధర్మాన ప్రసాదరావుపై వస్తున్న వార్తలు, శ్రీకాకుళం జిల్లా వాసులనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతున్నాయి. ప్రత్యక్ష రాజకీయాలపై గడచిన అయిదేళ్లుగా అనాసక్తి ప్రదర్శిస్తున్న ధర్మాన ప్రసాదరావు రాజకీయాల నుండి తప్పుకుంటారా..? తన తనయుడిని మెయిన్ స్క్రీన్ పైకి తెచ్చి కధ నడిపిస్తారా..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు సిక్కోలులో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపధ్యంలోనే ధర్మాన ప్రసాదరావు తనయుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు ప్రత్యక్ష రాజకీయ ప్రస్థానం ఘనంగా మొదలు పెట్టడానికి మరో పార్టీలోకి వెళతారు అన్న వార్తలు కూడా హల్ చల్ చేస్తున్నాయి. దానికి సంబంధించి తెరవెనుక ఏర్పాట్లు కూడా చక చకా జరిగిపోతున్నట్టు భోగట్టా.. ఈ నేపధ్యంలో ధర్మాన భవిష్యత్ నిర్ణయం ఏమిటి.. తన తనయుడి పొలిటికల్ జర్నీని ధర్మాన ఎలా డిజైన్ చేశారు అనే సస్పెన్స్ మరి కొన్ని రోజుల్లోనే వీడనుంది.