వరద బాధితులకు సుజనా చౌదరి బాసట!

బెజవాడను వరదలు ముంచెత్తిన ఆపత్సమయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి బాధితులకు బాసటగా నిలిచారు.  విజయవాడ చిట్టినగర్ లోని కామాక్షి విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో  వరుసగా నాలుగు రోజుల పాటు బాధితులకోసం ఆహారాన్ని సిద్ధం చేయించి అందించారు.  బుధవారం (సెప్టెంర్ 4) వరకూ  80 వేల మందికి పైగా ఆహారాన్ని అందించారు. సుజనా ఫౌండేషన్ సిబ్బంది, ఎన్డీయే కూటమి , వాలంటీర్లు, ఎమ్మెల్యే కార్యాలయ  సిబ్బంది  సమన్వయంతో రేయింబవళ్లు పనిచేసి బాధితులకు సహాయ సహకారాలు అందించారు. నిర్విరామంగా పని చేసి బాధితులకు ఆకలి బాధ లేకుండా చేశారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది, వాలంటీర్లు ట్రాక్టర్లలో ముంపు ప్రాంతాలలో పర్యటించి ఆహారాన్ని అందించారు.  చిట్టినగర్, పాల ఫ్యాక్టరీ, రాజరాజేశ్వరి పేట, ఊర్మిళా నగర్, తదితర లోతట్టు ప్రాంతాలలో ముంపునకు గురైన ప్రజలకు ఆహార ప్యాకెట్లను, వాటర్ బాటిళ్లను, అందించారు, 20,000 వేల వాటర్ బాటిళ్లు   పంపిణీ చేశారు. ఇప్పటికే సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి ట్యాంకర్లు పలు డివిజన్ల లో  ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. చిట్టినగర్ లోని కామాక్షి విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో గత నాలుగు రోజులుగా నిరంతరాయంగా ఆహారాన్ని సిద్ధం చేస్తున్న వంటశాలను ఎమ్మెల్యే సుజనా బుధవారం పరిశీలించి పనులను పర్యవేక్షించారు.   

వైసీపీ నేత‌ల‌ను త‌రిమేస్తున్న ముంపు బాధితులు!

విజ‌య‌వాడ‌ను కనీవినీ ఎరుగని రీతిలో వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. కుండపోత వ‌ర్షానికి తోడు బుడ‌మేరు ఉధృతికి బెజవాడ న‌గ‌రం చిగురుటాకులా వ‌ణికిపోయింది. బుడమేరు ముంచెత్తడంతో ఐదు నుంచి ఎనిమిది అడుగుల వరద నీటిలో అజిత్‌ సింగ్‌నగర్‌, పాయకాపురంతోపాటు ప‌లు ప్రాంతాలు మునిగిపోయాయి. రాత్రివేళ‌ల్లో చిమ్మ‌చీక‌టిలో ప్రాణాలు కాపాడుకునేందుకు ప్ర‌జ‌లు ప‌డ‌రాని పాట్లు ప‌డ్డారు. అయితే, సీఎం చంద్ర‌బాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగి ముంపు ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు భ‌రోసా క‌ల్పించారు. వారికి ఆహారం, తాగునీరు అందేలా ఏర్పాట్లు చేశారు. రాత్రిప‌గ‌లు తేడా లేకుండా ముంపు ప్రాంతంలో బోటుపై ప్ర‌యాణిస్తూ నేనున్నా.. భ‌య‌ప‌డ‌కండి అంటూ బాధితుల్లో ధైర్యాన్ని నింపారు. చంద్ర‌బాబు స్వ‌యంగా రంగంలోకి దిగ‌డంతో మంత్రులు, అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు ఉరుకులు ప‌రుగులు పెట్టారు. దీంతో వ‌ర‌ద బాధితుల‌కు సకాలంలో ఆహారం, తాగునీరు అందింది. బోట్లు వెళ్ల‌లేని వ‌ర‌ద మంపు ప్రాంతాల్లో  జేసీబీ ఎక్కిమ‌రీ చంద్ర‌బాబు వెళ్లారు. అక్క‌డి బాధితుల‌కు ధైర్యం చెప్పారు. వరద బాధితులను ఆదుకోవడానికి 74ఏళ్ల వ‌య‌స్సులో కూడా చంద్ర‌బాబు  పడుతున్న తపనను, చేస్తున్న కృషిని, ప‌డుతున్న క‌ష్టాన్నిచూసి జనం జేజేలు పలుకుతున్నారు.  కొంద‌రు ముంపు బాధితుల‌యితే.. మా ప్రాణాలు కాపాడిన దేవుడు చంద్ర‌బాబు అంటూ క‌న్నీరు పెట్టుకున్నారు. చంద్ర‌బాబు నిద్ర‌మానుకొని రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతుంటే.. వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆ పార్టీ నేత‌లు చంద్ర‌బాబు, కూట‌మి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తుండ‌టం పట్ల జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుడమేరు వరద నుంచి విజయవాడ నగరం క్రమంగా తేరుకుంటోంది. అజిత్‌ సింగ్‌నగర్‌, పాయకాపురం తదితర ప్రాంతాల్లో దాదాపు 80శాతం ముంపు నుంచి బయటపడ్డాయి. సీఎం చంద్ర‌బాబు ఆదేశాల‌తో వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో అధికారులు ఎక్కడికక్కడ విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్య పనులు సాగుతున్నాయి. మంత్రులు, అధికార యంత్రాంగం స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొంటున్నది. అయితే, వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి బాధితుల‌కు ధైర్యం క‌ల్పించాల్సిందిపోయి.. చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేయ‌డానికే ప్రాధాన్య‌త నిచ్చారు. చంద్ర‌బాబు వ‌ల్లే విజ‌య‌వాడ‌కు ఈ దుస్థితి వ‌చ్చిందంటూ అర్థ‌ప‌ర్దం లేని లాజిక్కులు చెప్పాడు. బుడమేరు గేట్లు ఎత్తేశారని ఒక సారి, బుడమేరు నది అని మరోసారి మాట్లాడి తన అజ్ణానాన్ని బయటపెట్టుకున్నారు. దీంతో జ‌గ‌న్ తీరుపై ముంపు ప్రాంతాల ప్ర‌జ‌లే కాదు, వైసీపీ శ్రేణులు సైతం మండిప‌డుతున్నాయి. విజ‌య‌వాడ వ‌ర‌ద ముంపు నుంచి తేరుకుంటున్న స‌మ‌యంలో వైసీపీ నేత‌ల ప‌ర్య‌ట‌న‌లు మొద‌ల‌య్యాయి. ముంపు ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తూ అక్క‌డి వాస్త‌వాల‌ను గుర్తించ‌కుండా బాధితుల‌కు ఆహారం, తాగునీరు అంద‌డం లేద‌ని ఫేక్ ప్ర‌చారం చేస్తున్నారు. వాటిని వైసీపీ అనుకూల మీడియా, సోష‌ల్ మీడియాలో విస్తృత ప్ర‌చారం చేస్తున్నారు. ఒక‌ ప‌క్క ముంపు ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం అన్నిసౌక‌ర్యాలు క‌ల్పిస్తుంటే జ‌గ‌న్ అనుకూల సోష‌ల్‌మీడియాలో త‌ప్పుడు ప్ర‌చారంపై న‌గ‌ర వాసులు ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో త‌మ ప్రాంతాల్లోకి వ‌చ్చిన వైసీపీ నేత‌ల‌ను త‌రిమేస్తున్నారు.  న‌గ‌రంలోని రాజ‌రాజేశ్వ‌రి పేట‌లో బుధ‌వారం (సెప్టెంబర్ 4) సాయంత్రం మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్లారు. ఈ క్ర‌మంలో బొత్స‌కు నిర‌స‌న సెగ ఎదురైంది. తమ ప్రాంతంలో ఇళ్లు మునిగిన ఐదు రోజుల తర్వాత ఎందుకొచ్చారని బొత్సను బాధితులు నిలదీశారు. ప్రభుత్వం అందిస్తున్న సాయం తమకు అందకుండా అడ్డుపడుతున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితులకు ఇప్పటి వరకు వైసీపీ ఏం చేసిందని ప్రశ్నించారు. అధికారంలో లేనోళ్లం ఏటి సేత్తాం అంటూ.. స్థానికుల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక బొత్స అక్క‌డి నుంచి వెనుదిరిగాడు. బొత్స ప‌ర్య‌టించిన అన్ని ప్రాంతాల్లోనూ బాధితుల నుండి నిర‌స‌న వ్య‌క్త‌మైంది. మ‌రోవైపు.. ఎన్టీఆర్ జిల్లా కంచిక‌చ‌ర్ల‌లో వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన వైసీపీ నేత‌, నందిగామ‌ మాజీ ఎమ్మెల్యే  మొండితోక జ‌గ‌న్మోహ‌న్ రావుకు స్థానికుల నుంచి నిర‌స‌న వ్య‌క్త‌మైంది. బాధితుల‌కు స‌రిగా సాయం అందించ‌డం లేదంటూ అధికారుల‌పై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. ఈ క్ర‌మంలో స్థానికులు త‌మ‌కు అన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయ‌ని ఎమ్మెల్యేకు చెప్పే ప్ర‌య‌త్నం చేయ‌గా.. ఎమ్మెల్యే వారిప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించాడు. నాలుగు రోజులుగా కూట‌మి నాయ‌కులు అన్ని విధాలుగా స‌హాయం అందిస్తుంటే.. ఇప్పుడు వ‌చ్చి బుర‌ద రాజ‌కీయాలు చేయ‌డంపై స్థానికులు మండిప‌డ్డారు. మొండితోక గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ అత‌న్ని అక్క‌డి నుంచి త‌రిమేశారు. వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్ల‌డం త‌ప్పుకాదు. కానీ, ప‌రామ‌ర్శ‌ల పేరుతో ముంపు ప్రాంతాల్లోకి వెళ్లి రాజ‌కీయాలు చేయ‌డం చాలా త‌ప్పు. ఒక‌ప‌క్క సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ముంపు ప్రాంతాల్లో వేగంగా ఆహారం, తాగునీరు, పండ్లు, పాలు పంపిణీ జ‌రుగుతున్నది. ఇప్పుడిప్పుడే వ‌ర‌ద నుంచి తేరుకుంటున్న ప్రాంతాల్లో పారిశుద్ధ్య ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. హెల్త్ క్యాంప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో వైసీపీ నేత‌లు ప‌రామ‌ర్శ‌  పేరుతో వెళ్లి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయడాన్ని స్థానికులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇప్ప‌టికైనా వైసీపీ నేత‌లు తీరుమార్చుకోవాల‌ని, ముంపు ప్రాంతాల్లో ప‌ర్య‌టించి స‌హాయం చేస్తే ప‌ర్వాలేదు.. రాజ‌కీయాలు చేస్తే త‌రిమికొడ‌తామ‌ని ముంపు ప్రాంతాల్లోని ప్ర‌జ‌లు హెచ్చ‌రిస్తున్నారు.

వరద ప్రభావిత ప్రాంతాలలో నిత్యావసర కిట్ల పంపిణీ!

ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు, వరదలతో ముంపునకు గురైన ప్రాంతాలలో గురువారం (సెప్టెంబర్ 5) నుంచి నిత్యావరసర వస్తువులతో కూడిన కిట్ల పంపిణీ ప్రారంభమైంది. అలాగే ముంపు ప్రాంతాలలో ప్రజల కోసం రాయతీపై కూరగాయలను కూడా అందిస్తున్నారు. వరద ముంపు కారణంగా గత ఐదు రోజులుగా నానా యాతనలూ పడుతున్న ప్రజలకు ఆసరాగా ఉండేందుకు, భరోసా కల్పించేందుకు ధనిక, పేద అన్న తేడా లేకుండా ముంపు ప్రాంతాల ప్రజలందరికీ నిత్యావసరాల కిట్లను అందించనున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అలాగే రాయతీపై కూరగాయలు కూడా సరఫరా చేయనున్నట్లు తెలిపారు. అలాగే ముంపు ప్రభావిత ప్రాంతాలలోని ప్రతి కుటుంబానికీ పాలు, బిస్కెట్లు, మంచి నీరు అందిస్తామన్నారు. ఇక వరదల కారణంగా ఇళ్లు, దుకాణాలు పూర్తిగా మునిగిపోయి నష్టపోయిన బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.  ఇలా ఉండగా చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రి నారాయణ వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. చివరి బాధితుడి వరకూ సహాయం చేరాలన్న చంద్రబాబు ఆదేశాలు తు.చ.తప్పకుండా అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.  

ఏపీలో భారీ వర్షాలు

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో గురువారం (సెప్టెబర్ 5) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే గుంటూరు, బాపట్ల, కర్నూలు, అనంతపురం, అన్నమయ్యా, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో ఓ  మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దనీ హెచ్చరించింది. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇలా ఉండగా విజయవాడలో వరద తగ్గుముఖం పట్టడంతో సహాయక కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఇళ్లల్లో రోడ్లపై పేరుకు పోయిన బురద తొలగింపు చర్యలు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాలలోని ప్రజలకు రేషన్ పంపిణీ కి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 

కేసీఆర్ కనబడుట లేదు!

అధికారంలో వున్న పదేళ్ళు రాచరికం చెలాయించిన కేసీఆర్ అధికారం పోయిన తర్వాత జనంలోకి రాకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితం అయిపోయారు. ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ జనం సమస్యల్ని పట్టించుకోకుండా ఇలా అజ్ఞాతవాసం చేస్తున్నారు. ఫామ్ హౌస్‌లో కూర్చుని, మళ్ళీ అధికారంలోకి ఎలా రావాలా అని ఆలోచిస్తున్నారు. మామూలు రోజుల్లో జనంలోకి రావడం లేదు సరే.. కనీసం వరదల సమయంలో అయినా జనంలోకి వచ్చి పరామర్శించాలన్న కనీస బాధ్యత కూడా లేకుండా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారు. అందుకే కేసీఆర్ ‘కనబడుట లేదు’.. అంటూ హైదరాబాద్‌లో పోస్టర్లు వెలిశాయి. ‘‘రెండుసార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లో నానా ఇబ్బందులు పడుతుంటే పత్తాలేని ప్రతిపక్ష నేత కేసీఆర్’’ అని పోస్టర్‌పై రాసుకొచ్చారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో పలు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లా ఎన్నడూ చూడని వరదల అల్లకల్లోలాన్ని చవిచూసింది. అయినప్పటికీ కేసీఆర్ వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళలేదు. సరే, వెళ్ళకపోతే వెళ్ళకపోయారు.. కనీసం ‘అయ్యో వరదలు వచ్చాయా’ అనే మాట కూడా కేసీఆర్ వైపు నుంచి రాలేదు. కనీసం సోషల్ మీడియాలోనైనా ఒక ప్రకటన విడుదల చేయలేదు. అందుకేనేమో ‘కేసీఆర్ కనబడుట లేదు’ అంటూ పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లు ఎవరు అతికించారనే విషయం తెలియరాలేదు. కానీ, కేసీఆర్ వైఖరి మాత్రం చర్చనీయాంశంగా మారింది. 

ఆమ్రాపాలికి హైకోర్టు నోటీసులు 

వరంగల్ జిల్లాకు తొలి మహిళా కలెక్టర్ గా పని చేసిన ఐఏఎస్ అధికారిణి ఆమ్రాపాలి ఆ తర్వాత ప్రధానమంత్రి కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలో వచ్చిన  కాంగ్రెస్ పార్టీ ఆమ్రాపాలికి కీలక బాధ్యతలు అప్పగించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఆమ్రాపాలి మరో మారు వివాదంలో చిక్కుక్కున్నారు. తెలంగాణ హైకోర్టు ఆమ్రాపాలికి నోటీసులు జారీ చేసింది. ఆమ్రాపాలి ఆదేశాలమేరకు జూబ్లిహిల్స్ లో గ్రయినేట్ రాయి పేలుళ్లు జరుగుతున్నాయి. అత్యధిక డెసిబుల్స్ తో సౌండ్ వెదజల్లడంతో స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. రాత్రిపూట కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న జిహెచ్ ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. ఈ నేపథ్యంలో సదరు అధికారిణి ఆమ్రాపాలికి నోటీసులు జారి అయ్యాయి. ఆమెతో పాటు ప‌ర్యావ‌ర‌ణ‌, భూగ‌ర్భ గ‌నుల శాఖ‌ల ముఖ్యకార్య‌ద‌ర్శుల‌కు కూడా  న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.  మీడియాలో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. 

ఏ క్షణంలోనైనా జోగి రమేష్, దేవినేని అవినాష్ అరెస్టు?

తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిలు దాఖలు చేసుకున్న వైసీపీ నేతలకు చుక్కెదురైంది. అలాగే చంద్రబాబు నివాసంపై దాడి కేసులోనూ నిందితులకు ముందస్తు బెయిలు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ కేసుల్లో నిందితులైన దేవినేని అవినాష్‌, నందిగం సురేష్‌, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాంలు తమను అరెస్టు చేయకుండా యాంటిసిపేటరీ బెయిలు కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వీరిలో చంద్రబాబు నివాసంపై దాడి కేసులో దేవినేని అవినాష్‌, నందిగం సురేష్‌ నిందితులు కాగా, తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్‌, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాంలు నిందితులు.  మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై దాడి ఘటనలో మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు.. నిందితుల విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత కోర్టులో వాదనలు జరిగాయి.. కొద్దిరోజుల పాటూ నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వుల్ని కోర్టు పొడిగించింది. ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని పిటిషన్లు వేసిన వారిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రాఘురాం, వైసీపీ నేత దేవినేని అవినాష్‌, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ హైకోర్టును ఆశ్రయించారు. అలాగే చంద్రబాబు నివాసంపై దాడి వ్యవహారంలో ముందస్తు బెయిల్‌ కోరుతూ మాజీమంత్రి జోగిరమేష్‌ కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై వాదనలు పూర్తి కావడంతో కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.. ఇవాళ బెయిల్ పిటిషన్‌లను తిరస్కరిస్తున్నట్లు బుధవారం (సెప్టెంబర్ 4) తీర్పును ఇచ్చింది.   దీంతో తాము సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామనీ, అంత వరకూ అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలనీ వైసీపీ నేతలు కోరారు. అయితే అందుకు ప్రభుత్వ తరఫు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. ఇరు పక్షాల వాదనలూ విన్న హైకోర్టు ఈ విషయంపై తన నిర్ణయాన్ని కొద్ది సేపు వాయిదా వేసిన హైకోర్టు అందకూ నిరాకరించింది. సుప్రీం  కోర్టులో అప్పీలు చేసుకునేంత వరకూ అరెస్టు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో చంద్రబాబు నివాసం, తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసుల్లో నిందితులను పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉంది.  

విజయసాయి.. వైసీపీకి గుదిబండేనా?

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి భారీ షాక్ తగిలింది.  ఏకంగా విశాఖ బీచ్ కబ్జాకు ఆయన తెగబడిన వైనం వెలుగులోనికి రావడమే కాకుండా, ఆలా కబ్జాచేయడానికి భీమిలీలో బీచ్ కు అడ్డంగా రిటైనింగ్ వాల్ తరహాలో కట్టిన గోడను గ్రేటర్ విశాఖ అధికారులు కూల్చివేశారు.  వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొంత కాలం ఆయన పార్టీ ఉత్తరాంధ్రజిల్లాల ఇన్ చార్జిగా వెలగబెట్టారు. ఆ సమయంలో విజయసాయి పెద్ద ఎత్తున కబ్జాలకు తెగబడ్డారు. నిన్నమొన్నటి వరకూ ఆరోపణలుగానే ఉన్న ఆయన కబ్జాల పర్వం ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. విజయసాయి రెడ్డి  కుమార్తె నేహారెడ్డి భీమిలీ బీచ్ కు అడ్డంగా కట్టేసిన గోడను గ్రేటర్ విశాఖ అధికారులు కూల్చేశారు. వాస్తవానికి గత ఐదేళ్లలో విశాఖ పరిపాలనా రాజధాని అంటూ వైసీపీ నేతలు చేయని దందా లేదు. ముఖ్యంగా విజయసాయి రెడ్డి తన కుమార్తె, అల్లుడుకు విశాఖను రాసిచ్చేద్దామనుకున్నారా అన్నంతగా అడ్డగోలు కబ్జాలకూ, ఆక్రమణలకూ పల్పడ్డారు. తన కుమార్తె నేహారెడ్డి కోసం భీమిలీ బీచ్ ను ఆక్రమించేయడానికి ఏకంగా గోడకట్టేయగా దానినే బుధవారం (సెప్టెంబర్ 4) అధికారులు కూల్చేశారు. అయితే విశాఖలో విజయసాయి రెడ్డి దందాలు ఇంకా చాలా చాలా ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. విజయసాయిరెడ్డి తన అల్లుడు ఆయన కంపెనీల పేరుతో వందల ఎకరాలను అప్పట్లో ప్రభుత్వం నుంచి అప్పనంగా లాగేసుకున్నారు.  అలాగే అడ్డగోలు దందాలతో  వందల ఎకరాల భూములను కొనుగోలు చేశారు. అయితే ఈ అడ్డగోలు భూ దందాపై వచ్చిన ఆరోపణలను  తన అల్లుడు, కుమార్తె కొనుక్కుంటే తనకేం సంబంధం అంటూ  విజయసారి తేలిగ్గా ఖండించేశారు.   భీమిలి దగ్గర ఫైవ్ స్టార్ హోటల్ పేరు చెప్పి భూమిని కబ్జా చేయడమే కాకండా బీచ్ కు అడ్డంగా కట్టేశారు. సీఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధం గా కట్టిన కట్టడం కావడంతో కూల్చివేత భయంతో ముందుగానే కోర్టుకు వెళ్లారు. ఇప్పుడు ఆ గోడ నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చివేయా లంటూ తీర్పు వెలువరించడంతో అధికారులు కూల్చివేశారు.  ఈ కూల్చివేతల్ని అడ్డుకోవడానికి కానీ, విజయసాయికి మద్దతుగా కానీ ఒక్కరంటే ఒక్క వైసీపీ నేత కూడా ముందుకు రాలేదు.   ఒక్క విశాఖ అనేమిటి, మొత్తం ఉత్తరాంధ్రలో వైసీపీ ఉనికి మాత్రంగా కూడా మిగలకపోవడానికి విజయసాయి రెడ్డి నిర్వాకాలే కారణమని పార్టీ ఉత్తరాంధ్ర నేతలు, శ్రేణులలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఆ కారణంగానే విశాఖ నేతలెవరూ విజయసాయికి మద్దతు పలకడం లేదు. ముందు ముందు విశాఖలో విజయసాయి భూ దందాలు, కబ్జాలు, ఆక్రమణలకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  నేహారెడ్డి అక్రమకట్టడం కూల్చివేత విజయ సాయి విజయసాయికి పార్టీ నుంచి ఎలాంటి మద్దతూ రాకపోవడాన్ని చూస్తుంటే ఇక విజయసాయి రెడ్డి పార్టీలో పూర్తిగా ఒంటరి అయిపోయారన్న విషయం స్పష్టంగా అవగతమౌతోంది. ఆయన ఎంతగా చొక్కాలు చింపుకుని తాను వైసీపీని వీడే ప్రశక్తే లేదని చెప్పుకున్నా.. పార్టీ ఆయనను పట్టించుకునే అవకాశాలు లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వైసీపీ విజయసాయిని గుదిబండగా భావిస్తోందని అంటున్నారు. 

కాశ్మీర్ ఎన్నికలు.. కత్తిమీద సామే!

జమ్మూ కాశ్మీర్ అనగానే ఉగ్రవాదుల హింసాకాండ, ఎన్ కౌంటర్లు, కాల్పులు, బాంబు దాడులు, చొరబాట్లు, సీమాంతర ఉగ్రవాదం గుర్తుకు వస్తాయి. అటువంటి రాష్ట్రంలో పదేళ్ల తరువాత అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లూ చేసింది. ఎన్నికల ఎర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. పదేళ్ల తరువాత తొలి సారిగా జమ్మూ కాశ్మీర్ లో జరగనున్న ఎన్నికల పట్ల దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొని ఉంది.  చివరిసారిగా ప్రజాలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏర్పడి ఆరేళ్లు కావస్తోంది. జమ్మూ కాశ్మీర్ ఎన్నికలలో తొలి దశ నామినేషన్ల పర్వానికి చివరి రోజున దాదాపు 280 నామినేషన్లు దాఖలయ్యాయి.  ఇక్కడ మూడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. తొలి దశ పోలింగ్ సెప్టెంబర్ 18న, రెండో దశ పోలింగ్ సెప్టెంబర్ 25న, తుది దశ పోలింగ్ అక్టోబర్ 1న జరుగుతుంది. తొలి దశ ఎన్నికల ప్రచారం ఇప్పటికే జోరందుకుంది.  అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీచేస్తుండడం, ఆయా అభ్యర్థులనామినేషన్‌ పత్రాలను దాఖలు కార్యక్రమానికి వేల సంఖ్యలో  మద్దతు దారులు తరలి రావడాన్ని బట్టి ఎన్నికల పట్ల ప్రజలు ఎంత ఆత్రతగా, ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నది అవగతమౌతుంది.   మహబూబా ముఫ్తీకి చెందిన పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ (పి.డి.పి) ప్రభుత్వానికి బీజేపీ తన మద్దతును ఉపసంహరించే వరకూ, అంటే 2018 వరకూ ఇక్కడ ప్రజా ప్రభుత్వం కొనసాగింది. కాగా, 2019 ఆగస్టులో ఆర్టికల్‌ 370ను రద్దు చేయడం, జమ్మూ కాశ్మీర్‌ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడంతో ఇక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర ప్రతిపత్తి కల్పిస్తారా? కల్పిస్తే ఎప్పుడు అన్న విషయాలలో క్లారిటీ లేదు.   ఇప్పుడు ఎన్నికలు  కూడా సుప్రీం కోర్టు ఆదేశాల కారణంగానే జరుగుతున్నాయి. ఈ నెల  30లోగా శాసనసభ ఎన్నికలు నిర్వహించాలని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషన్‌కు సుప్రీంకోర్టు గడువును నిర్ణయించడంతో అనివార్యంగా ఎన్నికల నిర్వహణకు సీఈసీ సిద్ధమైంది.  వాస్తవానికి  2019 ఆగస్టు నుంచి ఈ ప్రాంతానికి అధికారాలు కుదించేశారు. ఇప్పుడు ఇది  కేంద్రపాలిత ప్రాంతం అయినందువల్ల అధికారాలన్నీ కేంద్రం చేతిలోనే ఉన్నాయి. ఏది ఏమైనా, కాశ్మీర్‌లోని రాజకీయ పక్షాలు ఈ ఎన్నికలకు ప్రాధాన్యం ఇవ్వడం, ఎన్నికల్లో పాల్గొనడం మాత్రం నిస్సందేహంగా ప్రజాస్వామ్యానికి మేలు జరిగే అంశమే. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌, ప్రాంతీయ పార్టీలైన పి.డి.పి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌.సి)లు ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీదార్లుగా ప్రచారాన్ని చేపట్టాయి. కాంగ్రెస్‌ మాజీ నాయకుడు గులాం నబీ ఆజాద్‌ ప్రారంభించిన డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ ఆజాద్‌ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. కొందరు మాజీ ఉగ్రవాదులు, నిషేధిత సంస్థల సభ్యులతో సహా పలువురు ఇండిపెండెంట్లుగా ఎన్నికల బరిలో నిలిచారు.  ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఏ పార్టీ, ఏ సంస్థా ఎన్నికల బహిష్కరణకు పిలుపు నివ్వలేదు. ఇక ఇండియా కూటమిలో భాగస్వాములైన నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌  సీట్ల పంపకం విషయంలో ఒప్పందానికి వచ్చాయి. ఇక బీజేపీ, ప్రొగ్రసివ్ డెమొక్రటిక్ పార్టీలు ఒంటరిగానే రంగంలోకి దిగాయి.  మొత్తం మీద రాష్ట్రంలో త్రిముఖ పోరు హోరాహోరీగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది.   అయితే జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికల నిర్వహణ కేంద్ర ఎన్నికల సంఘానికి కత్తిమీద సామే అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటికీ  ఇక్కడ  ఉగ్రవాదం, వేర్పాటువాదం సీరియస్ సమస్యలుగానే ఉన్నాయి. నేషనల్‌ కాన్ఫరెన్స్‌, ప్రొగ్రసివ్ డెమొక్రటిక్ పార్టీలు ఇప్పటికీ  పాకిస్థాన్‌  అనుకూల వైఖరినే అవలంబిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఈ రెండు పార్టీలకూ  జమ్మూ, కాశ్మీర్‌ లను అభివృద్ధి మీద పెద్దగా శ్రద్ధ లేదన్న ఆరోపణలు ఉన్నాయి.  రాజకీయలబ్ధి కోసమే ఇండియా కూటమిలో చేరాయని ఆ పార్టీలపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. నిజంగా కాశ్మీర్‌ రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటున్నది బీజేపీయే అంటూ ఆ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ఊదరగొట్టేస్తోంది. మొత్తం మీద జమ్మూ కాశ్మీర్ ఎన్నికల నిర్వహణ, ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. 

వైసీపీ నేతలకు నో యాంటిసిపేటరీ బెయిల్

తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిలు దాఖలు చేసుకున్న వైసీపీ నేతలకు చుక్కెదురైంది. అలాగే చంద్రబాబు నివాసంపై దాడి కేసులోనూ నిందితులకు ముందస్తు బెయిలు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ కేసుల్లో నిందితులైన దేవినేని అవినాష్‌, నందిగం సురేష్‌, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాంలు తమను అరెస్టు చేయకుండా యాంటిసిపేటరీ బెయిలు కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వీరిలో చంద్రబాబు నివాసంపై దాడి కేసులో దేవినేని అవినాష్‌, నందిగం సురేష్‌ నిందితులు కాగా, తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్‌, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాంలు నిందితులు. వీరి యాంటిసిపేటరీ బెయిల్ పై హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఈ కేసుల్లో ముందస్తు బెయిలును హైకోర్టు నిరాకరించింది. దీంతో తాము సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామనీ, అంత వరకూ అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలనీ వైసీపీ నేతలు కోరారు. అయితే అందుకు ప్రభుత్వ తరఫు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. ఇరు పక్షాల వాదనలూ విన్న హైకోర్టు ఈ విషయంపై తన నిర్ణయాన్ని మధ్యాహ్నం ప్రకటించనున్నట్లు పేర్కొంది. 

వరద బాధితుల కోసం విరాళాల వెల్లువ

భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో  3వేల కి.మీ.కు పైగా రహదారులు దెబ్బతిన్నాయి.  149 పశువులు, 59,848 కోళ్లు మరణించాయి. వరద బాధితులకు ఆహార పదార్థాలను అందించేందుకు ఆరు హెలికాప్టర్లను ప్రభుత్వం వినియోగించింది. వదర సహాయ, పునరావాల కార్యక్రమాలలో 48 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిమగ్నమై ఉన్నాయి.   ఇలా ఉండగా  ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానదీ వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ఇక్కడ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో సమానంగా ఉంది. వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద నీటి మట్టం 13.5 అడుగులు ఉంది.  అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను ఉప సంహరించుకున్నారు. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.  భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన వారిని అన్నివిధాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం సర్వ శక్తులూ ఒడ్డుతోంది. అదే సమయంలో  వరద బాధితుల కోసం  ఆంధ్రప్రదేశ్ కు భారీగా విరాళాలు అందుతున్నాయి. వరద బాధితులను ఆదుకోవడానికి సీఎం రిలీఫ్ ఫండ్ కు రాజకీయ, సినీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల వారూ తమ తమ స్థాయికి తగ్గట్టుగా సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు ఇస్తున్నారు.  వరద బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. అలాగే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, హీరోలు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ను ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ.50 లక్షలు చొప్పున విరాళం ప్రకటించారు.  అలాగు వైజయంతీ మూవీస్ సంస్థ సీఎం రిలీఫ్ ఫండ్ కుపాతిక లక్షల విరాళాన్ని  ప్రకటించగా, దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, ఎస్. నాగవంశీ కూడా సీఎం సహాయ నిధికి విరాళం అందించారు. ఇక యువ హీరో జోన్నలగడ్డ సిద్ధు ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు 15 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. మరో యువహీరో విశ్వక్షేన్ 5లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. ఇక హెరిటేజ్ తరఫున నారా భువనేశ్వరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. అలాగే తెలంగాణలో వరద బాధితుల కోసం తెలంగాణకు కోటి రూపాయలు విరాళం ప్రకటించారు.  

విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి షాక్... అక్రమ కట్టడాల కూల్చివేత

అవినీతి అక్రమాలను పెంచి పోషించిన గత వైసీపీ ప్రభుత్వం కర్మ ఫలాలను అనుభవించి మట్టికొట్టుకుపోయింది. అయితే పార్టీలో నెంబర్ టూ పొజిషన్ లో ఉన్న రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వ్యవహారాలు ఒక్కోటి బయటకు వస్తున్నాయి. ఎండోమెంట్ కమిషనర్ హోదాలో ఉన్న మహిళతో కొనసాగించిన అక్రమ సంబంధం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డి తానేం తక్కువ తినలేదన్నట్టు వైసీపీహాయంలో చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీకావు. ప్రభుత్వస్థలాలు కబ్జా చేసి అక్రమ కట్టడాలను నిర్మించారు. జనసేన కార్యకర్తలు కోర్టు గడపదొక్కడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నేహారెడ్డి అక్రమ కట్టడాలను కూల్చడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టునుంచి ఎలాంటి స్టే రాకపోవడంతో జీవీఎంసీ అధికారులు నేలమట్టం చేశారు. భీమిలి తీరంలో నేహారెడ్డి నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు చేపట్టింది. బీచ్ రోడ్ లో హోటల్ నిర్మాణం కోసం వేసిన కాంక్రీట్ పిల్లర్లు, గోడలు కూల్చివేయడంతో ప్రజాస్వామిక వాదులు హర్షం వెలిబుచ్చారు. 

గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి

ఆంధ్రప్రదేశ్ పై ప్రకృతి పగబట్టిందా? అన్నట్లుగా  వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని వెంటాడుతున్నాయి. ఓ వైపు మహోధృతంగా ప్రవహించిన కృష్ణా నది శాంతించి వరద తగ్గుముఖం పడుతుంటే మరో వైపు గోదావరికి వరద ఉదృతి పెరుగుతోంది. కృష్ణా నది వరదలు తగ్గుముఖం పడుతున్నాయని ఆనందించచే లోపే గోదావరి వదర ముప్పు తరుముకు వస్తోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా గోదావరిలో వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. భద్రాచలం వద్ద గంటగంటకూ ప్రవాహ ఉధృతి పెరుగుతోందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అంటే బుధవారం (సెప్టెంబర్ 4) భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 42.2 అడుగులు ఉంది. ఇక్కడ నీటిమట్టం 43 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఇక ధవళేశ్వరం వద్ద కూడా గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. ఇక్కడ ప్రవాహ ఉధృతి ఆందోళనకలిగిస్తోంది. ఇక్కడ ఇన్ ఫ్లో 3.05 లక్షల క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 3.12 క్యూసెక్కులు గా ఉంది. గోదావరి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందన్న అంచనాలతో పరీవాహక ప్రాంత జిల్లాల కలెక్టర్లను విపత్తుల నిర్వహణ శాఖ అలెర్ట్ చేసింది. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించింది.  

తెలుగు రాష్ట్రాలకు మరోమారు వాన గండం

తెలుగు రాష్ట్రాలను వర్షాలు ఇప్పట్లో వదిలేలా లేవు. ఇప్పటికే భారీ వర్షాలు వరదలతో ఉభయ తెలుగు రాష్ట్రాలూ అతలాకుతలమైపోయాయి. వర్షం తెరిపి ఇచ్చి, వరద తగ్గుముఖం పట్టిందనీ, సహాయ కార్యక్రమాలు జోరందుకుంటాయనీ భావిస్తున్న తరుణంలో మరో సారి భారీ వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.  బంగాళాఖాతంలో  ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలలో మరోసారి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ లో  గోదావరి జిల్లాలతో పాటు విజయవాడలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అటు తూర్పు, ఉత్తర తెలంగాణలోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.  ఇక ఇప్పుడిప్పుడే వరద ముంపు నుంచి తేరుకుంటున్న రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక గోరుచుట్టుపై రోకటి పోటులా మారింది. ఏపీలో విజయవాడ కనీవినీ ఎరుగని రీతిలో వరద ముంపునకు గురైంది. అలాగే తెలంగాణలో ఖమ్మం భారీ వర్షాలు వరదలకు అతలాకుతలమైంది. ఇప్పుడిప్పుడే వరద బాధితులు తేరుకుంటున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అంతలోనే మరో మారు ఉభయ తెలుగు రాష్ట్రాలకూ వానగడం పొంచి ఉందన్న వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి.  

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. భారీ వర్షాలు, వరదల కారణంగా రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం కావడం, ఏపీకి మరో వాయుగుండం పొంచి ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తిరుమలలో భక్తల రద్దీ తగ్గింది. బుధవారం (సెప్టెంబర్ 4)ఉదయం భక్తులు శ్రీవారి దర్శనం కోసం క్యైలైన్ లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా దర్శనానికి అనుమతిస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల కంటే తక్కువ సమయం పడుతోంది. ఇక మంగళవారం (సెప్టెబర్ 3) శ్రీవారిని మొత్తం 57 వేల 817 మంది దర్శించుకున్నారు. వారిలో 17 వేల 592 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 53లక్సల రూపాయలు వచ్చింది. 

నో బర్త్ డే... స్పీకర్ అయ్యన్నపాత్రుడు  కీలక నిర్ణయం 

పుట్టిన రోజు వేడుకను అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు రద్దు చేసుకున్నారు. సెప్టెంబర్ నాలుగో తేదీన స్పీకర్ జన్మదినోత్సవం. ఎపిలో భారీ వర్షాలవల్ల ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. బాధితులను ఆదుకోవడానికి ఎపి సిఎం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పుట్టిన రోజు వేడుక సబబు కాదని అయ్యన్న పాత్రుడు భావించారు.  వర్షాలు, వరదల వల్ల  9 మంది మృతి చెందారు. విజయవాడలో 2.76 లక్షల మంది నీళ్లలోనే ఉండిపోయారు.  ఏపీ అసెంబ్లీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు తీసుకున్న కీలక నిర్ణయాన్నిపలువురు ప్రశంసిస్తున్నారు. తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోరాదని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. అంతే కాదు తన నియోజకవర్గ ప్రజలు కూడా బర్త్ డే వేడుకలు   నిర్వహించకూడదని సూచించారు.   

చంద్రబాబుపై కేటీఆర్ ప్రశంసలు.. జగన్ విమర్శలను పట్టించుకునేదెవరు?

తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. రెండు రాష్ట్రాలలోనూ ప్రకృతి విలయతాండవం చేసింది. భారీ నష్టం వాటిల్లింది. జనం గూడు వదిలి  సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. అపార ఆస్తి, పంట నష్టం వాటిల్లింది. ప్రాణ నష్టం కూడా జరిగింది. రహదారులు జలమయమయ్యాయి. రోడ్లు తెగిపోయాయి. ఊళ్లకు ఊళ్లు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. గ్రామాలకు గ్రామాలు అంధకారంలో మునిగిపోయాయి. జనం నీరు, తిండి లేక అల్లాడిపోయారు. తెలంగాణలో ఖమ్మం జలవిలయంలో చిక్కుకుంటే.. విజయవాడ పూర్తిగా జలయమయమైంది. గ్రామాలకు గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి.   మానవతా దృక్ఫథంతో అందరూ సమష్టిగా ఈ విపత్తును ఎదుర్కొనేందుకు పని చేయాలి. అయితే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత రూటే సెపరేటు. ఆయనకు ప్రజల కష్టాల్లోనూ, కన్నీళ్లలోనూ రాజకీయ మైలేజీని వెతుక్కోవడం అలవాటు. అధికారంలో ఉన్న సమయంలోనూ, అంతకు ముందు అధికారం కోసం పాకులాడిన సమయంలోనూ కూడా ఆయన చేసింది అదే.  ఇప్పుడు బెజవాడను వరదలు ముంచెత్తిన సమయంలో కూడా జగన్ రాజకీయ ప్రయోజజనాల కోసమే వెంపర్లాడారు. జనం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి బాధితులను ఆదుకోవడానికి తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తుంటే.. జగన్ మాత్రం బెజవాడ వరద ముంపునకు కారణమే చంద్రబాబు అన్నట్లుగా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు క్షేత్ర స్థయిలో వరద ప్రభావిత ప్రాంతాలలో విరామమనేదే లేకుండా పర్యటనలు చేస్తూ బాధితులకు భరోసా ఇస్తుంటే.. జగన్ మాత్రం సోమవారం (ఆగస్టు 2) ఓ రెండు గంటల పాటు విజయవాడలో పర్యటించారు. అందులో ఓ అరగంటకు పైగా ఎన్నికల ప్రచార సభలలో చేసేలాంటి ప్రసంగంతో ఊదరగొట్టారు. ఆయన ప్రసంగం అంతా చంద్రబాబును విమర్శించడానికే సరిపోయింది. వరద సహాయక చర్యలలో ఎక్కడా వైసీపీ నేతలు కానీ, శ్రేణులు కానీ కనిపించలేదు. ఇక జగన్ తన ప్రసంగంలో చంద్రబాబు బాధితులను ఆదుకోవడంలో విఫలమయ్యారన్న విమర్శలు గుప్పించారు.  అయితే తెలంగాణలో విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ మాత్రం తెలంగాణలో వరద ముప్పును ఎదుర్కోవడంలో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శిస్తూనే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో సమర్థతతో వరద బాధితులకు అండగా నిలబడి వారిలో ధైర్యాన్ని నింపారంటూ ప్రశంసలు గుప్పించింది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వరద ముప్పును ఎదుర్కొనే విషయంలో చంద్రబాబు కృషిని పొగుడుతూ ట్వీట్ చేశారు. కేటీఆర్ చంద్రబాబును పొగడడాన్ని ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాలంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లకు జగన్ అత్యంత అనుంగు మిత్రుడు. 2019 ఎన్నికలలో జగన్ విజయం కోసం అప్పటికి తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ (తెరాస) తన వంతు సహకారం అందించింది. 2023 డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ విజయం కోసం జగన్ కూడా తన వంతు కృషి చేశారు. ఎన్నికలలో బీఆర్ఎస్ కు ప్రయోజనం చేకూర్చేందుకు తెలంగాణ సెంటిమెంట్ రగిల్చేందుకు సాగర్ వద్ద ఆంధ్రాపోలీసులను మోహరించి ఇరు రాష్ట్రాల మధ్యా చిచ్చు పెట్టేందుకు కూడా వెనుకాడలేదు. అయితే జగన్ ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైంది. ప్రతిపక్షానికి పరిమితమైంది. అయినా కూడా 2024 ఎన్నికలలో ఏపీలో జగన్ విజయం కోసం బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేయగలిగినంతా చేశారు. అవసరం ఉన్నా లేకపోయానా మీడియా సమావేశాలు పెట్టి మరీ ఏపీలో జగన్ మళ్లీ అధికారంలోకి రాబోతున్నారంటూ జోస్యాలు చెప్పారు. తమ సర్వేలలో అదే తేలిందని నమ్మబలికారు. తద్వారా తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రా ఓటర్లను ప్రభావితం చేసేందుకు తమ వంతు కృషి చేశారు. అయినా ఫలితం లేకపోయింది. జగన్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ తరువాత కూడా కేసీఆర్, కేటీఆర్, జగన్ తమ స్నేహాన్ని కొనసాగించారు. అవకాశం కుదిరిన ప్రతి సారీ పరస్పర అభిమానాన్ని చాటుకున్నారు.  అయితే వరద ముప్పును ఎదుర్కొని ప్రజలకు బాసటగా నిలిచే విషయంలో చంద్రబాబు భేష్ అంటూ కేటీఆర్ పొగడ్తల వర్షం కురిపించారు. అయితే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం తన మిత్రుడి మాటలకు భిన్నంగా కాదు కాదు పూర్తి వ్యతిరేకంగా స్పందించారు. వరద బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. అసలు వరద నివారించగలిగే అవకాశాలున్నా, పట్టించుకోకుండా విజయవాడ నగరం ముంపునకు గురి కావడానికి కారణమ య్యారంటూ నిందించారు.  చంద్రబాబు సమర్ధతను పొగుడుతూ  వరద బాధితులను రక్షించడానికి ఆరు హెలికాప్టర్ల, 150కి పైగా పవర్ బోట్లను చంద్రబాబు రంగగంలోకి దింపారనీ, అదే తెలంగాణ ముఖ్యమంత్రి ఆ విషయంలో చేతులెత్తేశారనీ కేటీఆర్ పేర్కొన్నారు. ముంపు బాధితులను ఆదుకోవడంలో  తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. చంద్రబాబు వంటి ముఖ్యమంత్రి ఉండటం ఆంధ్రప్రజల అదృష్టమన్నంతగా కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు.  కేటీఆర్ పొగడ్తలే జగన్ డొల్లతనాన్ని ఎత్తి చూపాయి. రాజకీయ లబ్ధి కోసం జగన్ చౌకబారు విమర్శలు చేశారని, చేస్తున్నారని నిర్ద్వంద్వంగా చాటాయి. వరద ముప్పును ఎదుర్కొని ముంపు బాధితులను ఆదుకోవడానికి చంద్రబాబు యవత్ యంత్రాంగాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చారు. వ్యక్తిగతంగా తాను సైతం క్షేత్ర స్థాయిలో పర్యటించారు. జగన్ విమర్శలను పూర్తిగగా విస్మరించి తన దృష్టిని పూర్తిగా సహాయ పునరావాస చర్యలపైనే కేంద్రీకరించారు. ఇదే ప్రజలలో జగన్ పట్ల తిరస్కారం కలిగేలా చేసింది. చంద్రబాబును జనాలకు మరింత చేరువ చేసింది.  

 జిల్లాల్లో కూడా హైడ్రా కూల్చివేతలు...అమీన్ పూర్ చెరువు 20 ఎకరాలు స్వాధీనం

హైదరాబాద్ లో చెరువులు, నాలాల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా ఇపుడు  జిల్లాలకు విస్తరించింది. హైడ్రా నోటీసులు అందుకున్నవారిలో వారు వీరు అని కాదు ఎవ్వరినైనా వదిలేది లేదన్నట్టు కమిషనర్ రంగనాథ్ వ్యవహరించారు. ఎఫ్ టి ఎల్ పరిధిలో ఎన్ కన్వెన్షన్ కట్టిన ప్రముఖ హీరో నాగార్జున కోర్టు గడప ఎక్కకముందే నిమిషాల వ్యవధిలో నేల మట్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వంత అన్నయ్య తిరుపతిరెడ్డికి హైడ్రా నోటీసులు ఇచ్చింది. మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజి చెరువులో కట్టిన ఆధారాలు రావడంతో రంగనాథ్ ఎమ్మెల్యేకు నోటీసులు పంపారు. ఒక్కసారిగా రేవంత్ రెడ్డి దూసుకుపోడంతో ప్రతిపక్షాలు రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తున్నాయి. పేదల ఇళ్లు కూలగొట్టడం అన్యాయమని నినదిస్తున్నాయి. భారీ వర్షాలతో హైడ్రా పనులకు విరామం ప్రకటించిన రంగనాథ్ జిల్లాలమీద కాన్సన్ ట్రేట్ చేశారు. సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ మండలంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలం  పరిరక్షణకు హైడ్రా నడుంబిగించింది. రాజకీయ పలుకుబడితో 20 ఎకరాలను కబ్జా చేసిన వారిపై హైడ్రా ఉక్కు పాదం మోపింది. తిరిగి స్వాధీనం చేసుకోవడానికి హైడ్రా రంగంలోకి దిగింది. ఆక్రమణలను తొలగించాలంటూ రెవెన్యూ అధికారులను  హైడ్రా ఆదేశించింది. దీంతో ఆక్రమణలు తొలగించిన అధికారులు స్వాధీనం చేసుకోబోతున్నారు.  స్సర్వే నంబర్‌ 119లో గుర్తుతెలియని వ్యక్తులు వేసిన ప్లాట్లను తొలగించారు. ఈ భూమిలో ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం 15 గుంటలు కబ్జా చేసింది.