తిరుమలలో సంప్రోక్షణకు సీఎం ఆదేశం!

తిరుమల పవిత్రతను పునరుద్ధరించే విషయంపై సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆగమ, వైదిక శాస్త్రాల ప్రకారం తిరుమలలో సంప్రోక్షణ చేపట్టాలని ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వ  హయాంలో శ్రీవారి లడ్డూ తయారీలో నాణ్యతా లోపాలపై సీఎం చంద్రబాబు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అత్యంత పవిత్రమైన లడ్డూ అపవిత్రం కావడాన్ని తీవ్రంగా  పరిగణించారు. లడ్డూలో వాడకూడని పదార్థాలను వినియోగించిన నేపథ్యంలో తిరుమల అపవిత్రం అయిందని భావించిన సీఎం క్షేత్రాన్ని పవిత్రం చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై దృష్టిపెట్టారు. ఈ నేపథ్యంలో తొలుత లడ్డూలు తయారు చేసే పోటుతో పాటు, నెయ్యి భద్రపరిచిన ప్రదేశాలను సంప్రోక్షణ చేయాలని ఆదేశించారు.

వర్షాలొస్తున్నాయ్.. జాగ్రత్త!

భారత వాతావరణ శాఖ తెలంగాణకు రెయిన్ ఎలర్ట్ జారీ చేసింది. వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కొత్తగూడెం, నిర్మల్, అసిఫీబాద్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఈ రోజు భారీ వర్ష సూచన ఉందని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక రేపు అంటే ఆదివారం నిర్మల్‌, జగిత్యాల, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, సంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌, ఆసిఫాబాద్‌, వికారాబాద్‌, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం కూడా రాష్ట్రంలో పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. 

గ్యాస్ పైప్ లైన్ లీక్!

యానాం వద్ద గోదావరి నదిలో ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. యానాం సమీపంలోని దరియాల తిప్ప, బలుసు తిప్ప మధ్య గోదావరి నదిలో ఈ గ్యాస్ లీక్ ను గుర్తించారు.  ఈ రోజు తెల్లవారు జామునుంచి గోదావరి నీటిని చీల్చుకుంటూ గ్యాస్ పైకి ఎగసి వస్తోంది. దీంతో చుట్టుపక్కల కిలో మీటర్ల మేర గ్యాస్ వ్యాపించింది. ఏ క్షణంలోనైనా మంటలు ఎగసిపడే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళలను వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ లీక్ ను అరికట్టేందుకు ఓఎన్జీసీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాగా  చుట్టుపక్కల కిలోమీటర్ల మేర ఈ గ్యాస్ వ్యాపించిందని, మంటలు ఎగసిపడే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.  ఉమ్మడి తూర్పుగోదావరి  జిల్లాలో   గ్యాస్ లీక్ ఘటనలు, గ్యాస్ లీక్ కారణంగా మంటలు చెలరేగిన ఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. 

లడ్డూ వివాదం.. అన్ని రాష్ట్రాలూ అలెర్ట్!

తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ అలర్ట్ అవుతున్నాయి. ఇప్పటికే కర్నాటక సర్కార్  రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ అధీనంలోని  అన్ని ఆలయాలలో నందినీ నెయ్యినే వాడాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక తమిళనాడు ప్రభుత్వం అయితే తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్ పై తనిఖీలు నిర్వహించి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపింది. మరో వైపు రాజస్థాన్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ప్రసాదం నాణ్యతను పరీక్షించాలని ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని ఆదేశించింది. దీంతో రాజస్థాన్ లోని అన్ని ఆలయాలను తనిఖీ చేయాని ఫుడ్ సేఫ్టీ విభాగం నిర్ణయించింది. ఈ నెల 23 నుంచి 26 వరకూ రాజస్థాన్ లోని అన్ని ఆలయాలలోనూ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి ప్రసాదం నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపుతారు.  

ఎన్ఐటీ పాట్నాలో ఏపీ విద్యార్థిని ఆత్మహత్య

పాట్నా ఎన్ఐటీ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో చదువుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ విద్యార్థిని శుక్రవారం రాత్రి తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని కన్పించింది. మృతురాలి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ లభించినట్లు పోలీసులు తెలిపారు. మృతికి గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. విద్యార్థిని మరణించడంతో తోటి విద్యార్థులు భారీ సంఖ్యలో క్యాంపస్ వెలుపల ఆందోళన చేపట్టారు. ఎన్ఐటీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉన్నత విద్యాసంస్థల్లో ఇలాంటి ఆత్మహత్యలు ఇటీవలి కాలంలో ఎక్కువ అవుతున్నాయి. 

తిరుమల లడ్డూ ఎఫెక్ట్.. ప్రసాదాల తయారీకి నందినీ నెయ్యే వాడాలి.. కర్నాటక సర్కార్ ఆదేశాలు

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి  వినియోగం ఎఫెక్ట్ తో కర్నాటక సర్కార్ అప్రమత్తమైంది. ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ అధీనంలో ఉన్న అన్ని ఆలయాల్లోనూ ప్రసాదం తయారీకి నందిని నెయ్యినే వాడాలంటూ ఆదేశాలు జారీ చేసింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీపై వివాదం తలెత్తిన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.   తిరుపతి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు అవశేషాలు వెలుగుచూశాయని, నాణ్యత తగ్గిపోయిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు, ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించడంతో కర్ణాటక తాజా ఆదేశాలిచ్చింది. ఇక తమిళనాడు ప్రభుత్వం సైతం తిరుమల లడ్డూ వివాదంతో అలర్ట్ అయ్యింది.   తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన  ఏఆర్ డెయిరీ ఫుడ్స్ కంపెనీలో తమిళనాడు ఫుడ్ సేప్టీ అధికారులు విస్తృతంగా తనీఖీలు నిర్వహించారు. దిండిగల్ లోని ఏఆర్ డైరీలో అధికారులు తనిఖీలు చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఆరోపణల నేపథ్యంలో.. శాంపిల్స్‌ సేకరిం సేకరించి ల్యాబ్‌కు పంపారు.  అధికారులు.   పళని ఆలయంలో ఏఆర్ డెయిరీ సరఫరా చేసే నెయ్యిని వాడుతున్నారని భక్తులు చెబుతున్నారు. పళణి సుబ్రమణ్యం ఆలయంలోని పంచామృతం ప్రసాదంలోనూ ఏఆర్ డెయిరీ నెయ్యినే వాడుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రచారంపై తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. ఇదంతా తప్పుడు ప్రచారమని.. ఇలాంటి వదంతులు నమ్మవద్దంటూ భక్తులకు విజ్ఞప్తి చేసింది. పళణి సుబ్రమణ్యం ఆలయం పంచామృతంలో ఆవిన్ నెయ్యి వాడుతున్నట్లు తెలిపింది. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించింది. కాగా టీటీడీ నెయ్యి వివాదంపై   ఏఆర్ డెయిరీ సంస్థ వివరణ ఇచ్చింది. కల్తీ నెయ్యి సరఫరాపై టీటీడీ వివరణ కోరిందన్నారు. నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని చెప్పామని ఏఆర్ డెయిరీ సంస్థ తెలిపింది. టీటీడీకి అన్ని వివరాలు అందించామంది. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి కల్తీ లేదని క్లారిటీ ఇచ్చింది.  

తిరుమల లడ్డూ వివాదం.. జగన్ హయాంలో దేవాలయాలపై దాడుల కొనసాగింపేనా?

జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ  నాణ్యత నాసిరకంగా ఉండటానికి కారణంపై ఎన్డీయే సమావేశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పెను సంచలనానికి తెరలేపాయి. లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు వాడినట్లుగా ఆయన చేసిన ఆరోపణలు పూర్తి విస్తవాలు అనడానికి నిదర్శనంగా ల్యాబ్ రిపోర్టులను తెలుగదేశం నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి బయటపెట్టారు. దీంతో ఈ అంశం జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది.   చంద్రబాబు లడ్డూ తయారీలో నాణ్యతపై చేసిన వ్యాఖ్యలపై జాతీయ మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. దీంతో తిరుమల లడ్డూ వ్యవహారం ఇప్పడు జాతీయ స్థాయిలో  అత్యంత ప్రధానమైన అంశంగా మారిపోయింది. జగన్ ప్రభుత్వ హయాంలో అరచకాలకు అంతే లేకుండా పోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐదు దశాబ్దాలకు పైగా కర్నాటక మిల్క్ ఫెడరేషన్  సరఫరా చేస్తున్న నాణ్యమైన నెయ్యిని పక్కన పెట్టి వేరే వ్యక్తులకు కాంట్రాక్టు ఇవ్వడం.. నెయ్యి నాణ్యతను పట్టించుకోవడం మానేయడం వల్లనే లడ్డూ క్వాలిటీ దెబ్బతిందంటూ జాతీయ చానెళ్ల పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. టీవీల్లో చర్చలు పెట్టడంతో ప్రస్తుతం తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.   సాయంత్రం నుంచే జాతీయ స్థాయిలో తిరుమల లడ్డు టాపిక్ ట్రెండ్ అయింది. ఒక దశలో ఇండియాలో నంబర్ వన్ టాపిక్‌గా మారింది. దీంతో పాటుగా జగన్ పేరు కూడా ట్రెండింగ్‌లోకి వచ్చింది. దేశ వ్యాప్తంగానే కాదు  ప్రపంచం నలుమూలల నుంచీ శ్రీవారి దర్శనం కోసం భక్తులు తిరుమలకు వస్తారు. తిరుమల దేవుడి ప్రసాదం అయిన లడ్డూను పరమ పవిత్రంగా భావిస్తారు. అటువంటి లడ్డూ ప్రసాదం విషయంలో తప్పు జరిగిందని వెల్లడి కావడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. వైసీపీపై మరీ ముఖ్యంగా జగన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  బీజేపీ, కేంద్రం కూడా ఈ విషయాన్ని యమా సీరియస్ గా తీసుకున్నాయి. హోంమంత్రి అమిత్ షా చంద్రబాబుతో ఫోన్ లో మాట్లాడారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన అపచారంపై, నెయ్యి కల్తీపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా కోరారు.  ఇక బీజేపీ ఫైర్ బ్రాండ్, ఆ పార్టీ తరఫున ఇటీవలి సార్వత్రిక ఎన్నకలలో హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలైన మాధవీలత ఏకంగా తిరుమలలో అత్యాచారం జరిగింది. ఇక హైందవ యుద్ధం మొదలౌతుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  ఒక తిరుమల లడ్డూ ప్రసాదమేనా లేక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతిష్ఠాత్మక దేవాలయాలలో ప్రసాదం విషయంలో కూడా ఇటువంటి అపచారాలు జరిగాయా అన్న అనుమానాలు భక్తుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. తిరపతి అలివేలు మంగాపురంలోని అమ్మవారి ఆలయం, బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం, చిన్న తిరుమతి, అన్నవరం సత్యనారాయణ స్వావి వారి దేవాలయం, సింహాచలం అప్పన్న ఆలయం.. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ అధీనంలోని దేవాలయాలలో కూడా ప్రసాదాల తయారీలో ఇటువంటి అపచారం జరిగి ఉంటుందా అన్న భక్తుల అనుమాలను నివృత్తి చేయడానికి అన్ని ఆలయాలలో ప్రసాదాల నాణ్యతపై పరీక్షలు జరపాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.  కలియుగ దైవంగా హిందువులు  విశ్వసించే తిరమల దేవుడి ప్రసాదం తయారీలోని జగన్ హయంలో ఇంతటి అపచారం జరిగిందంటే... రాష్ట్రంలోని ఇతర దేవాలయాలలో అందుకు భిన్నంగా ఉండే అవకాశం లేదని పలువురు అంటున్నారు. ఈ సందర్భంగా అన్నవరం దేవాలయంలో ప్రసాదం నాణ్యతపై గతంలో ఇటువంటి ఆరోపణలు వచ్చిన సంగతిని గుర్తు చేస్తున్నారు. . కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తిరుమలతో సహా రాష్ట్రంలో అన్ని ప్రధాన దేవాలయాలలో ప్రసాదాల తయారీపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ హయాంలో దేవాలయాలపై దాడులు, దేవుడి విగ్రహాల ధ్వంసం జరిగిన సంగతిని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖ అధీనంలో ఉన్న అన్ని ఆలయాలలో ప్రసాదం తయారీపై సమగ్ర విచారణ జరిపిస్తేనే జగన్‌ ప్రభుత్వం చేసిన తప్పులన్నీ వెలుగులోనికి వస్తాయని అంటున్నారు.      జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఏపీలో హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరిగిన సంగతి తెలిసిందే. జగన్ హయాంలో రాష్ట్రంలో దేవుడికే రక్షణ లేని పరిస్థితి ఉంది.   జగన్ అధికారంలో ఉండగా అంతర్వేది నరసింహ స్వామి రథం దగ్దం, విజయవాడ దుర్గమ్మ గుడిలో వెండి రథానికి ఉండే సింహాలు మాయం, విజయవాడలో సాయిబాబా విగ్రహం ధ్వంసం,  కర్నూల్ జిల్లాలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం.. వంటి ఎన్నో సంఘటనలు జరిగాయి. ఆ సమయంలో ప్రభుత్వం, పోలీసులు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో అప్పట్లోనే జగన్ సర్కార్ హిందూ దేవాలయాలపై దాడులకు ప్రోత్సహిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారం బయటకు రావడంతో జనం జగన్ హయాంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులను గుర్తు చేసుకుంటున్నారు.  జగన్‌ ప్రభుత్వం చేసిన తప్పులన్నీఎత్తి చూపుతూ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

తిరుమల లడ్డూ వివాదం.. బండి ఆందోళన!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగం తీవ్ర ఆందోళన గురి చేసిందంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు.  శ్రీవారి భక్త కోటిని, యావత్ ప్రపంచంలోని హిందువుల మనోభావాలను ఇది తీవ్రంగా కలిచి వేస్తోందన్నారు. శ్రీవారి పవిత్రతను దెబ్బతీశారని, అన్యమత ప్రచారం జరుగుతోందని గతంలో ఫిర్యాదులు వచ్చినా గత పాలకులు పట్టించుకోలేదన్నారు.  సీబీఐతో విచారణ జరిపిస్తేనే సమగ్ర దర్యాప్తు జరిగి వాస్తవాలు నిగ్గు తేలే అవకాశముందన్నారు.  తక్షణమే సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ ఆ లేఖలో చంద్రబాబును కోరారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో రెడ్ కార్నర్ నోటీసులు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో   ఏ1 ప్రభాకర్ రావు, ఏ6 శ్రవణ్ రావుపై  రెడ్ కార్నర్ నోటీసులు   జారీ చేయాలన్న హైదరాబాద్ పోలీసుల విజ్ణప్తికి సీబీఐ సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు ఇంటర్ పోల్కు సీబీఐ లేఖ రాసింది. దీంతో ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్ రావు, శ్రవణ్‌‌రావులకు   రెడ్ కార్నర్ నోటీసులు జారీ కానున్నాయి. కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు ప్రస్తుతం అమెరికాలో  ఉన్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావుపై   నాన్‌బెయిలబుల్ వారెంట్లు ఉన్నాయి. ప్రభాకర్‌రావు వర్చువల్‌గా విచారణకు హాజరవుతారని కోర్టు దృష్టికి దర్యాప్తు బృందం తీసుకెళ్లింది.  

ఓటుకు నోటు కేసులో రేవంత్‌కి భారీ ఊరట

ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసును తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ  మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డి దాఖ‌లు చేసిన పిటిష‌న్ ను సుప్రీం కోర్టు తొసిపుచ్చింది..  ప్ర‌స్తుతం జ‌రుగుతున్న కోర్టులోనే విచార‌ణ కొన‌సాగించాల‌ని ఆదేశించింది.  జ‌గ‌దీష్ పిటిష‌న్ పై  జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ద్విసభ్య ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది.  కేసులో రేవంత్‌రెడ్డి విచారణను ప్రభావితం చేస్తారన్నది కేవలం అపోహ మాత్రమేనని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. 

లడ్డూ తయారీపై సమగ్ర నివేదికకు ఆదేశం!

లడ్డూ తయారీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోను ఆదేశించారు.   శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు అవశేషాలపై  రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది.  తిరుమలలో జరిగిన ఈ అపచారంపై  చంద్రబాబు  ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.ఏ  తిరుమల పవిత్రత కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్లతో చర్చించి చర్యలు తీసుకుంటామని సీఎం ప్రకటించారు. భక్తుల విశ్వాసాలు, ఆలయ సాంప్రదాయాలను కాపాడతామని చంద్రబాబు అన్నారు. ఈ తిరుమ‌ల ప‌విత్ర ను కాపాడే విష‌యంలో రాజీ ప‌డ‌బోమ‌ని తేల్చిచెప్పారు. 

కుక్కల విద్యాసాగర్ అరెస్టు!

ముంబయి నటి కాదంబరీ జత్వానీని వేధించిన కేసులో  పోలీసులు తొలి అరెస్టు చేశారు. ఈ కేసులో కీలకమైన వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్‌ను ఏపీ పోలీసులు ఈ రోజు (శుక్రవారం) డెహ్రాడూన్‌లో అరెస్టు చేశారు.  ఇదే కేసులో ఇప్పటికే ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.  నటి జత్వానీని వేధించిన కేసులో సస్పెండైన కాంతి రాణా  యాంటిసిపేటరీ బెయిలు కోసం కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇదే కేసులో సస్పెండైన మరో ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని అప్రూవర్‌గా మారే అవకాశాలున్నాయని అంటున్నారు. తనకు సన్నిహితుడు, ముంబైకి చెందిన పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్‌కి లబ్ధి చేకూర్చడం కోసం వైసీపీ నాయకులు జత్వానీని టార్గెట్ చేశారు. దానికోసం గతంలో జెత్వానీతో పరిచయం వున్న వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ చేత ఆమె మీద కేసు పెట్టించారు. ఆ కేసును ఆధారంగా చేసుకుని కాదంబరి జెత్వానీని అరెస్టు చేశారు. ఆమె తల్లిదండ్రులతో సహా జెత్వానీని రిమాండ్‌కి పంపించారు.  ఈ అక్రమ వ్యవహారానికి ఆద్యుడైన కుక్కల విద్యాసాగర్‌ని పోలీసులు అరెస్టు చేశారు.

కొరియోగ్రాఫర్ జానీకి రిమాండ్!

తన దగ్గర పనిచేసే డాన్సర్ మీద అత్యాచారం జరిపిన నేరం మీద పోలీసులు అరెస్టు చేసిన కొరియోగ్రాఫర్ జానీకి ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ (అక్టోబర్ 3 వరకు) విధించింది. దీంతో పోలీసులు కొరియోగ్రాఫర్ జానీని చంచల్‌గూడ జైలుకు తరలించారు. కొరియోగ్రాఫర్ జానీ తన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. అత్యాచారానికి గురైన యువతిని జానీ దురుద్దేశంతోనే అసిస్టెంట్‌గా చేర్చుకున్నట్లు ఆ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. 2020 సంవత్సరంలో ముంబైలోని ఒక హోటల్‌లో జానీ బాధితురాలిపై అత్యాచారం చేశాడని, అప్పడు ఆమె వయసు పదహారేళ్ళని పేర్కొన్నారు. గత నాలుగేళ్ళుగా బాధితురాలిపై జానీ అనేకసార్లు లైంగిక దాడి చేశాడని ఆ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని బయటపెడితే సినిమా ఆఫర్స్ రాకుండా చేస్తానని బెదిరించినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో వుంది.   జానీ భార్య కూడా బాధితురాలిని బెదిరించిదని రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు. ఇదిలా వుంటే, ఈ కేసుకు సంబంధించి న్యాయ పోరాటం చేస్తామని, న్యాయస్థానంలో నిజానిజాలు తేలుతాయని జానీ మాస్టర్‌  భార్య అయేషా  చెప్పారు.

విడదల రజినిపై విచారణకు ఆదేశం

మాజీ మంత్రి విడదల రజనీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆమె తమను భయపెట్టి, బెదిరించి, కోట్లాది రూపాయపలు వసూలు చేశారంటూ పల్నాడు జిల్లా, ఎడ్లపాడుకు చెందిన బాలాజీ స్టోన్ క్రషర్ భాగస్వామి నల్లపనేని చలపతిరావు ఈ మేరకు హోంమంత్రి అనితకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.  తమ ప్రాణాలకు విడదల రజిని వల్ల హాని ఉందని, రక్షణ కల్పించాలని వారు వేడుకున్నారు. ఫిర్యాదును స్వీకరించిన హోం శాఖ మంత్రి అనిత విచారణకు ఆదేశించినట్లు సమాచారం. విడదల రజినిపై ఫిర్యాదు చేసిన చలపతిరావు మరో ముగ్గురు భాగస్వాములతో కలిసి 2010 సంవత్సరం నుంచి ఎడ్లపాడు గ్రామంలో స్టోన్ క్రషర్ వ్యాపార సంస్థను నడుపుతున్నారు. 2020 సెప్టెంబర్ 9న అప్పటి ఎమ్మెల్యే విడదల రజనీ పిఏ దొడ్డా రామకృష్ణ క్రషర్ వద్దకు వచ్చి మిమ్మల్ని ఎమ్మెల్యే కలవమంటున్నారు అని చెప్పారు. దీంతో వారు రజనీని ఆమె ఆఫీసులో కలిశారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీరు కలవలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు వ్యాపారం చేసుకోవాలంటే తనకు డబ్బు ఇవ్వాలని ఆమె చెప్పారు. తన పిఏ చెప్పినట్టుగా చేయాలని చెప్పి పంపేశారు.  వారు విడదల రజని పీఏతో కలిస్తే, ఆయన 5 కోట్లు డిమాండ్ చేశారు. అంత డబ్బు చెల్లించలేమని చెప్పిన క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించారు. వ్యాపారం ఎలా చేస్తారో.. మీ అంతు చూస్తామంటూ హెచ్చరించారు. ఈ అంశం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు విచారణకు ఆదేశించింది.