తెలుగు రాష్ట్రాలకు మరోమారు వాన గండం
posted on Sep 4, 2024 @ 10:17AM
తెలుగు రాష్ట్రాలను వర్షాలు ఇప్పట్లో వదిలేలా లేవు. ఇప్పటికే భారీ వర్షాలు వరదలతో ఉభయ తెలుగు రాష్ట్రాలూ అతలాకుతలమైపోయాయి. వర్షం తెరిపి ఇచ్చి, వరద తగ్గుముఖం పట్టిందనీ, సహాయ కార్యక్రమాలు జోరందుకుంటాయనీ భావిస్తున్న తరుణంలో మరో సారి భారీ వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలలో మరోసారి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ లో గోదావరి జిల్లాలతో పాటు విజయవాడలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అటు తూర్పు, ఉత్తర తెలంగాణలోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇక ఇప్పుడిప్పుడే వరద ముంపు నుంచి తేరుకుంటున్న రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక గోరుచుట్టుపై రోకటి పోటులా మారింది. ఏపీలో విజయవాడ కనీవినీ ఎరుగని రీతిలో వరద ముంపునకు గురైంది. అలాగే తెలంగాణలో ఖమ్మం భారీ వర్షాలు వరదలకు అతలాకుతలమైంది. ఇప్పుడిప్పుడే వరద బాధితులు తేరుకుంటున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అంతలోనే మరో మారు ఉభయ తెలుగు రాష్ట్రాలకూ వానగడం పొంచి ఉందన్న వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి.