భారీ వర్షాలకు తెలంగాణలో 15 మంది మృతి...స్తంభించిపోయిన విజయవాడ హైవే

తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. వరుసగా వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల ప్రభావం నల్గొండ, వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఎక్కువగా ఉంది. నల్గొండ జిల్లా కోదాడ వరద ముంపుకు గురయ్యింది. పలు కాలనీ వసుల ఇళ్లలోకి నీరు చేరింది. ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఖమ్మం జిల్లాలో మున్నేరు పోటెత్తింది.. ఖమ్మం జిల్లాలో దాదాపు 100 గ్రామాలు ముంపుకు గురయ్యాయి.  మహబూబాబాద్, సూర్యపేటలలో రైల్వే ట్రాక్ లు వరదతాకిడికి కోతకు గురయ్యాయి. అనేక రైళ్లు రద్దయ్యాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం వాటిల్లుతుంది. ఇక్కడ  కిలో మీటర్లకు పైగా ట్రాఫిక్ పూర్తిగా స్థంభించిపోయాయి. ప్రత్యామ్నాయ మార్గాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. నాగార్జునాసాగర్ ఎడమకాల్వకు నాలుగు చోట్ల గండిపడింది. భక్త రామదాసు పంప్ హౌజ్ పూర్తిగా మునిగిపోయింది.  ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు చేరడంతో మూసీ, ఈసా నదులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలకు దాదాపు 15 మంది మృత్యువాతపడ్డారు. పదుల సంఖ్యలో అడ్రస్ లేకుండా పోయారు. 

కృష్ణానదికి భారీగా వరద.. వందేళ్ల రికార్డు బ్రేక్!

వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంత భారీగా ఈ సారి కృష్ణానదికి వరదలు వచ్చాయి. 121 ఏళ్ల చరిత్రలో ఇంత భారీ స్థాయిలో కృష్ణా నదికి వరదలు వచ్చిన దాఖలాలు లేవని అధికారులు చెబుతున్నారు. రికార్డుల మేరకు 1903లో, 2009లో కృష్ణా నదికి భారీగా వరదలు వచ్చాయి. అయితే ఆ రెండు సందర్భాలలోనూ కూడా వరద ప్రవాహం పది లక్షల క్యూసెక్కులకు మించలేదు. అయితే ఈ సారి మాత్రం ఇప్పటికే కృష్ణలో నీటి ప్రవాహం 11 లక్షల క్యూసెక్కులు దాటేసింది. వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. మరో  ముప్ఫై నుంచి 40 వేల క్యూసెక్కుల వరద వస్తే ప్రవాహం ప్రకాశం బ్యారేజి పెనుంచి వెడుతుందని అధికారులు చెబుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, గంటగంటకూ పెరుగుతున్న కృష్ణ వరద ప్రవాహం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. నిన్నటి నుంచీ నిర్విరామంగా వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తూ, అధికారులతో సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న చంద్రబాబు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  సహాయం కోసం ప్రజల నుంచి విజ్ణప్తులు వచ్చిన వెంటనే స్పందించాలని అధికారులను ఆదేశించారు.   కృష్ణా నదికి భారీ వరదల కారణంగా ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల  అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.  ప్రకాశం బ్యారేజీ రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఏ క్షణంలోనైనా మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం వరద ప్రవాహం 11 లక్షల క్యూసెక్కులకు చేరింది. ఇది మరింత పెరిగితే ప్రకాశం బ్యారేజీపై నుంచి వరద ప్రవాహం సాగే అవకాశం ఉంది.  ఎప్పటికప్పుడు కృష్ణా వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు ఎప్పటికప్పుడు సూచలను చేస్తున్నారు.    ఇలా ఉండగా ఆదివారం రాత్రి సమయానికి వివిధ ప్రాజెక్టులలో  వరద పరిస్థితి ఇలా ఉంది. శ్రీశైలం డ్యామ్ వద్ద ఇన్ ఫ్లో 3.92 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 5.55 లక్షల క్యూసెక్కులు ఉండగా,  నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో 4.73లక్షల క్యూసెక్కులు , ఔట్ ఫ్లో 4.89 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఇక పులిచింతల వద్ద   ఇన్ ఫ్లో 6.05లక్షల క్యూసెక్కులు , ఔట్ ఫ్లో 5.51లక్షల క్యూసెక్కులు, ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9.25 లక్షల క్యూసెక్కులుగా ఉంది. 

ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటిపోయిన హుస్సేన్ సాగర్ నీటిమట్టం

భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండిపోయింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరదతో పాటు బంజారాహిల్స్, పికెట్, కూకట్ పల్లి నాలాల నుంచీ కూడా భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో హుస్సేన్ సాగర్ నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటిపోయింది. దీంతో నీటిని మూసీలోనికి వదులుతున్నారు. దీంతో మూసీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హుస్సేన్ సాగర్ పూర్తి స్టాయి నీటి మట్టం 513.41 మీటర్లు కాగా ప్రస్తుతం హుస్సేన్ సాగర్ నీటిమట్టం ఆ స్థాయి దాటి 513. 43 మీటర్లుగా ఉంది. దీంతో హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ అలర్ట్ చేసింది. అధికార యంత్రాంగం ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  

ఏపీకి మరో తుఫాన్ ముప్పు!

ఆంధ్రప్రదేశ్ ను తుపాన్లు వెంటాడుతున్నాయా అనిపిస్తోంది. ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రాష్ట్రంలో ప్రజాజీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే విజయవాడ, గుంటూరు జిల్లాల ప్రజలు వరదలతో  అల్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో  ఆంద్రప్రుదేశ్ రాష్ట్రానికి మరో తుపాను ముప్పు పొంచి ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో ప్రజలు మరింత ఆందోళనకు గురౌతున్నారు. ఈ నెల 6, 7 తేదీలలో బంగాళా ఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆ అల్పపీడనం బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ తుపాను ఉత్తరాంధ్ర, ఒడిశా మధ్య తీరం దాటుతుందని, దాని ప్రభావంతో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ తుపాను తీవ్రత ఎంత ఉంటుందన్నది రానున్న రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.  

రోత పుట్టిస్తున్న వైైసీపీ బురద రాజకీయం!

ఒక పక్క భారీ వర్షాలు, వరదలతో జనం నానా ఇబ్బందులూ పడుతుంటే వారిని ఆదుకునేందుకు ఒక రాజకీయ పార్టీగా ఎటువంటి చొరవా తీసుకోవడం మానేసి బురద రాజకీయాలు చేస్తూ వైసీపీ ప్రజలలో తన ప్రతిష్ఠను తానే దిగజార్చుకుంటోంది. తన పరువు తానే తీసుకుంటోంది.  రాష్ట్రంలో భారీ వరదలతో ప్రజలు కష్టాలలో ఉంటే.. సహాయక చర్యలలో నిమగ్నమై ఉన్న అధికార యంత్రాంగానికి సహకారం అందించడం మాని రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతోంది. వైసీపీ అధినేత జగన్ రాష్ట్రంలో ప్రజల ఇబ్బందులను ఆధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎలాగూ పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా జనం కష్టాలపై కనీస స్పందన కూడా లేకుండా తన విదేశీ పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. యథారాజా తథా ప్రజ అన్నట్లుగా వైసీపీ అధినేత జగన్ జనం సమస్యలను విస్మరించి సొంత పనుల్లో నిమగ్నమై ఉంటే, ఆయన పార్టీ నేతలు కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలలో పత్తా లేకుండా పోయారు. ప్రకృతి విపత్తు సమయంలో సంయమనం పాటించి, ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడంపై దృష్టి పెట్టాల్సింది వైసీపీ సోషల్ మీడియా వేదికగా రాజధాని అమరావతిపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు.  భారీ వరదలకు ఒక్క విజయవాడ మాత్రమే కాదు, హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ వంటి  నగరాల ప్రజలు సైతం ఇబ్బందులకు గురయ్యారు. ఆ విషయాన్ని విస్మిరించి బెజవాడ మినహా ఇంకెక్కడా భారీ వర్షాలు, వరదల కారణంగా జనం ఇబ్బందులు పడలేదన్నట్లుగా వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న వికృత ప్రచారం ప్రజలకు వెగటుపుట్టిస్తోంది. ఈ తీరు వల్ల వైసీపీ పట్ల జనం మరింత విముఖత చూపుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఏడు పదుల పైబడిన వయస్సులో చంద్రబాబు వరద బాధితులకు భరోసా ఇస్తూ, వారికి అండగా ఉంటూ, వారిలో ధైర్యాన్ని నింపుతుంటే... అనుక్షణం వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ, స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తూ జనంలో ఉంటుంటే.. వైసీపీ నేతలు మాత్రం క్షత్ర స్థాయిలో ఎక్కడా కనిపించకుండా, సోషల్ మీడియా వేదికగా అమరావతిపై విషం చిమ్మడాన్ని జనం చీదరించుకుంటున్నారు.   వైసీపీ హయాంలోనూ వరదలు సంభవించాయి. అయితే ఆయా సందర్భాలలో జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఎక్కడైనా, ఎప్పుడైనా వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన దాఖలాలు లేవు. ఆయన పర్యటనలన్నీ విగంహ వీక్షణాలకే పరిమితమయ్యాయి.   అయితే అందుకు భిన్నంగా చంద్రబాబునాయుడు వరద బీభత్సంలో ఇబ్బందులు పడుతున్న బెజవాడ ప్రజలకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉంటున్నారు. రేయింబవళ్లు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ బాధితులలో ధైర్యం నింపుతూ ప్రభుత్వం అండగా ఉందన్న భరోసా ఇస్తున్నారు.  ఒక్క ఫోన్ కాల్ తో కేంద్రం నుంచి పవర్ బోట్లు, వేవీ హెలికాప్టర్ లను రప్పించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను వరద ప్రభావిత ప్రాంతాలకు రప్పించారు.  బుడమేరు పొంగి మెరుపు వరద నివాస ప్రాంతాలను ముంచెత్తినా సకాలంలో బాధితులకు సహాయ, పునరావాసాలను కల్పించి చంద్రబాబు సర్కార్ ఆదుకుంది.   రాష్ట్ర మంత్రులను, తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యేలు, నేతలు సకాలంలో  లోతట్టు ప్రాంతాల పర్యటించి సహాయక చర్యలలో భాగస్వాములయ్యారు. వీటన్నిటినీ విస్మరించి వైసీపీ తన బురద రాజకీయంతో మరో సారి రోత పార్టీగా నిరూపించుకుంది. 

ఏపీని ముంచెత్తిన వ‌ర్షం.. వైసీపీ చెత్త రాజ‌కీయం!

ఏపీలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. గ‌తంలో ఎప్పుడూలేని విధంగా..  పాల‌కులు, ప్ర‌జ‌లు ఊహించ‌ని రీతిలో కుండ‌పోత వ‌ర్షం కురిసింది.  రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు విజయవాడ చిగురుటాకులా వణుకుతోంది. ఎక్కడికక్కడ వరదతో జనజీవనం స్తంభించింది. నగరంలోని పలు కాలనీలు నీటమునిగాయి. అపార్టుమెంట్ల సెల్లార్లను  వరద ముంచెత్తింది. ఊహించ‌ని భారీ వ‌ర్షం, వ‌ర‌ద‌ల‌తో ప్ర‌భుత్వం అలెర్ట్ అయింది.  సీఎం చంద్ర‌బాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగారు. అధికారుల‌ను ఉరుకులు ప‌రుగులు పెట్టించారు. వ‌ర‌ద నీటిలో చిక్కుకున్న వారిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. వ‌ర‌ద బాధితుల‌కు ఆహారం, తాగునీరు పంపిణీకి చ‌క‌చ‌కా ఏర్పాట్లు చేశారు. ప్ర‌భుత్వం వేగంగా స్పందించ‌డంతో విజ‌య‌వాడ ప్ర‌జ‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే, వ‌ర‌ద నీరు ఊహించ‌ని విధంగా ఇళ్ల‌ను ముంచెత్త‌డంతో వారి బాధ వ‌ర్ణనాతీతం. దీంతో చంద్ర‌బాబు బాధితుల్లో మేమున్నామ‌ని భ‌రోసా నింపేందుకు బోటులో వ‌ర‌ద‌ నీటిలో ప్ర‌యాణించారు. బాధితుల‌ను ప‌రామ‌ర్శిస్తూ.. నేనున్నా.. భ‌య‌ప‌డ‌కండి అంటూ  భ‌రోసా క‌ల్పించారు.  ముఖ్యంగా బుడ‌మేరు ప్ర‌భావిత ప్రాంతాల్లో వ‌ర‌ద నీటిలో చిక్కుకున్న ప్ర‌జానీకాన్ని ఆదుకునేందుకు అక్క‌డే ఉండాల‌ని సీఎం చంద్ర‌బాబు నిర్ణ‌యించుకొని.. విజ‌య‌వాడ క‌లెక్ట‌రేట్ లోనే మ‌కాం వేశారు. భారీ వ‌ర్షాల‌కు తోడు, కృష్ణా న‌ది ప‌ర‌వ‌ళ్లు తొక్కుతుండ‌టంతో విజ‌య‌వాడ‌లో వ‌ర‌ద ఉధృతి త‌గ్గేవ‌ర‌కు చంద్ర‌బాబు, ప‌లువురు మంత్రులు అక్క‌డే ఉంటూ మానిట‌రింగ్ చేస్తున్నారు ఆదివారం రాత్రంతా క‌లెక్ట‌రేట్ నుంచి వ‌ర‌ద ప‌రిస్థితిపై ప్ర‌జా ప్ర‌తినిధులు, అధికారుల‌తో చంద్ర‌బాబు చ‌ర్చిస్తూ.. వారికి త‌గిన సూచ‌న‌లు చేశారు. మ‌రోవైపు విజ‌య‌వాడ ప్రాంతంలో వ‌ర‌ద ఉధృతిపై చంద్ర‌బాబుతో  కేంద్రం పెద్ద‌ల‌తో మాట్లాడారు. చంద్ర‌బాబు విజ్ఞ‌ప్తితో 10ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 40 పవర్‌ బోట్లు, ఆరు హెలికాప్టర్లును ఏపీకి కేంద్రం పంపించ‌నుంది.  విజ‌య‌వాడ‌లో వ‌ర‌ద ఉధృతి నుంచి ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు చంద్ర‌బాబే స్వ‌యంగా రంగంలోకి దిగ‌డంతోపాటు.. అధికారగణం అంతా సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటుంటే.. మ‌రోప‌క్క వైసీపీ నేత‌లు త‌ప్పుడు ప్ర‌చారాల‌తో త‌మ నీచ‌ బుద్దిని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఐదేళ్లు అధికార‌మిస్తే అరాచ‌క పాల‌న‌తో రాష్ట్రాన్ని బ్ర‌ష్టుప‌ట్టించిన వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆయ‌న బ్యాచ్‌.. వ‌ర‌ద స‌మ‌యంలో ప్ర‌భుత్వానికి, ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిల‌వ‌కుండా ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అంతేకాదు.. అమ‌రావ‌తి ప్రాంతం మొత్తం మునిగిపోయిందంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతూ   పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు.  రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా వ‌ర‌ద‌లు సంభ‌విస్తే ప్ర‌భుత్వంతో పాటు విప‌క్ష పార్టీల నేత‌లు కూడా స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మ‌వుతారు. వ‌ర‌ద‌ల్లో చిక్కుకుపోయిన ప్ర‌జ‌ల‌కు స‌హాయం అందించేలా పార్టీ శ్రేణుల‌ను అధిష్టానాలు ఆదేశిస్తాయి. కానీ, వైసీపీ రూటే స‌ప‌రేటు.. ఏపీలో మాదే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం అని చెప్పుకుంటున్న వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ప్ర‌జ‌ల‌కు ఏం జ‌రిగినా ప‌ట్ట‌దు. దీనికితోడు ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలుస్తున్న ప్ర‌భుత్వంపై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తూ ప్ర‌జ‌లను మ‌రింత భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తూ వైసీపీ బ్యాచ్ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంతం కృష్ణా న‌ది వ‌ర‌ద‌ల్లో మునిగిపోయింద‌ని, చంద్ర‌బాబు ఇల్లు మునిగిపోయిదంటూ ఫేక్ ప్ర‌చారంతో ప్ర‌జ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేసేలా సోష‌ల్ మీడియాలో వైసీపీ బ్యాచ్‌ పోస్టులు పెడుతున్నారు. పొల్లాల్లో నిలిచిన నీళ్లు చూపించి అమరావతి మునిగిపోయిదంటూ ఫొటోలు, వీడియోలు వైర‌ల్ చేస్తున్నారు. వైసీపీ త‌ప్పుడ ప్ర‌చారంపై సీఎం చంద్ర‌బాబు నాయుడు సీరియ‌స్ అయ్యారు. కొంత మంది త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తున్నారు. అమ‌రావ‌తి మునిగిపోయింది.. ఇక్క‌డెలా రాజ‌ధాని క‌డ‌తార‌ని అంటున్నారు. బుద్ది, జ్ఞానం ఉన్న‌వాళ్లు ఎవ‌రూ అలాంటి వ్యాఖ్య‌లు చేయ‌రు. వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న వారికి స‌హాయం చేయండి.. అలాకాకుండా త‌ప్పుడు ప్ర‌చారం చేసే వారిప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌ని చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. నేర‌స్తుల‌ పార్టీ రాష్ట్రంలో ఉంది. వారిప‌ని ఫేక్ న్యూస్ తో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతూ, ఆ ఫేక్ న్యూస్ ను దేశ‌వ్యాప్తంగా ప్ర‌చారం చేస్తున్నారు. వాస్త‌వాలు కాకుండా త‌ప్పుడు వార్త‌లు రాసే వారిప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తాం.. వ‌దిలిపెట్ట‌మ‌ని చంద్ర‌బాబు సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు.   ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత‌ సీఎం చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో అమ‌రావ‌తి రాజ‌ధానిలో వేగంగా అభివృద్ధి చేసేలా చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఆ ప్రాంతంలో ముళ్ల‌కంపను తొల‌గించే ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు అమరావ‌తిలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ప్ర‌ముఖ కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఈ ప‌రిణామాల‌నుచూసి వైసీపీ అధినేత జ‌గ‌న్, ఆ పార్టీ నేత‌లు త‌ట్టుకోలేక పోతున్నారు. దీంతో ఏదోర‌కంగా అమ‌రావ‌తిపై త‌ప్పుడు ప్ర‌చారం చేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో విజ‌య‌వాడ‌లో భారీ వ‌ర్షం కార‌ణంగా వ‌ర‌ద‌లు ముంచెత్త‌డంతో వైసీపీ బ్యాచ్ సంబురాలు చేసుకుంటున్నారు. ఇత‌ర ప్రాంతాల్లో వ‌ర‌ద‌నీటి వీడియోలు, ఫోటోల‌ను త‌మ సోష‌ల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేస్తూ.. ఒక్క‌ రాత్రి వ‌ర్షానికే అమ‌రావ‌తి ప్రాంతం మునిగిపోయిందంటూ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. ఈ వార్త‌ల‌ను వైసీపీ అనుకూల మీడియా  జాతీయ స్థాయిలో ప్ర‌చారం చేయ‌డం ప్రారంభించింది. త‌ద్వారా అమ‌రావ‌తిలో పెట్ట‌బ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌స్తున్న పారిశ్రామిక వేత్త‌ల్లో భ‌యాందోళ‌న రేపేలా వైసీపీ బ్యాచ్ కుట్ర చేస్తుంది. ఒక‌ప‌క్క వ‌ర్షాల‌తో విజ‌య‌వాడ‌, త‌దిత‌ర ప్రాంతాల ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతుంటే.. వారికి అండ‌గా నిల‌వాల్సిందిపోయి.. వైసీపీ నేత‌లు అమ‌రావ‌తిపై త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌డం, త‌ప్పుడు వార్త‌ల‌తో ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురిచేయ‌డం వంటి కార్య‌క్ర‌మాల‌కు ప్రాధాన్య‌త‌నిస్తున్నారు. దీంతో వైసీపీ అధినేత జ‌గ‌న్‌, వైసీపీ నేత‌ల‌పై ఏపీ ప్ర‌జ‌ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

చిమ్మచీకట్లోనే కృష్ణలంక పర్యటనకు చంద్రబాబు!

అర్ధరాత్రి వేళలో విజయవాడలోని సింగ్ నగర్‌కి బోటులో వెళ్ళి ముంపులో వున్న ప్రజలను పరామర్శించిన చంద్రబాబు, అర్ధరాత్రి వేళలోనే విజయవాడ నగరంలోని కృష్ణలంక ముంపు ప్రాంతాల్లో పర్యటనకు బయల్దేరి వెళ్ళారు. కృష్ణలంకలో రక్షణ గోడకు సమాంతరంగా వరద నీరు ప్రవహిస్తోంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని చంద్రబాబు అక్కడి ప్రజలకు ధైర్యం చెప్పారు. అంతకుముందు విజయవాడ కలెక్టరేట్‌లో చంద్రబాబు అధికారులతో సమావేశమయ్యారు. వరద సహాయక చర్యలను ఈ సందర్భంగా చంద్రబాబు సమీక్షించారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర పదిన్నర లక్షల క్యూసెక్కుల వరద నీటి ప్రవాహం వుందని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో వున్న ప్రజలను అప్రమత్తం చేయాలని చంద్రబాబు ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. బుడమేరు బాధితులు కట్టుబట్టలతో వస్తున్నారని, వారికి దుస్తులతోపాటు దుప్పట్లు కూడా ఇవ్వాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

చంద్రబాబుకు ప్రధాని మోడీ ఫోన్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారీ వర్షాలు, వరదల్లో చిక్కుకున్న నేపథ్యంలో, సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై వున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. వరద పరిస్థితుల గురించి మోడీ సీఎం చంద్రబాబును అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అన్నివిధాలుగా సహకారం అందిస్తామని ఈ సందర్భంగా మోడీ హామీ ఇచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న సహాయక కార్యక్రమాలను చంద్రబాబు ఈ సందర్భంగా ప్రధాని మోడీకి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరదల నుంచి ఆదుకోవడానికి ఆయా కేంద్ర శాఖలకు ఆదేశాలు ఇచ్చామని ప్రధాని మోడీ ఈ సందర్భంగా చంద్రబాబుకు తెలిపారు. రాష్ట్రానికి అవసరమైన సాయం అందించాలని, అవసరమైన సామగ్రి పంపపడానికి కూడా ఆదేశాలు ఇచ్చామని చంద్రబాబుకు మోడీ తెలిపారు.  కేంద్ర సాయంపై ప్రధానికి చంద్రబాబు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

అర్ధరాత్రి వేళ చంద్రబాబు మరోసారి బోటు ప్రయాణం!

వరద ముంపుకి గురైన విజయవాడలోని సింగ్ నగర్ ప్రాంతంలో అర్ధరాత్రి వేళలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి బోటులో ప్రయాణించారు. సెల్ ఫోన్, కెమెరా లైట్ల వెలుగులో నీటిలో మునిగిన ఇళ్ళలోని ప్రజలను చంద్రబాబు పరామర్శించారు. పలు కుటుంబాలకు చంద్రబాబు స్వయంగా ఆహారాన్ని అందించారు. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులు చెబుతున్న ఫిర్యాదులు చంద్రబాబు నోట్ చేసుకున్నారు. వరద ప్రవాహం ఎక్కువగా వుండటం వల్ల సహాయక చర్యలకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రజలకు ఓపికగా చంద్రబాబు వివరించారు. వ్యవస్థను సరిదిద్దడానికి ఈ ఒక్క రాత్రి తనకు పడుతుందని, తనకు ఈ అవకాశం ఇవ్వాలని చంద్రబాబు వారిని కోరారు. ఆరేడు గంటల్లోనే వ్యవస్థను చక్కదిద్దుతానని వారికి హామీ ఇచ్చారు. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, అందరికీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని, త్వరలోనే సాధారణ స్థితి నెలకొంటుందని, అంతవరకూ ప్రజలు ధైర్యంగా వుండాలని చంద్రబాబు సూచించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. కష్టాల్లో వున్న ప్రజలకు ధైర్యం చెప్పాలన్న ఉద్దేశంతోనే అర్ధరాత్రి మరోసారి సింగ్ నగర్‌కి వెళ్ళానని చెప్పారు. బాధితులలో ఆత్మస్థైర్యం దెబ్బతినకూడదని అన్నారు. కొంతమంది రోగులు, చాలామంది వృద్ధులు కూడా ముంపులో చిక్కుకుని వున్నారని, ప్రతి ఒక్కరినీ తప్పకుండా రక్షించి తీరుతామని, సోమవారం ఉదయానికల్లా బోట్లు, హెలికాప్టర్లు అందుబాటులోకి వస్తాయని చంద్రబాబు తెలిపారు.

పలు రైళ్ళు రద్దు.. వివరాలు ఇవిగో..!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా రహదారులన్నీ జలమయం కావడంతోపాటు వర్షపు నీరు రైల్వే ట్రాకులమీదకి చేరింది. కేసముద్రం సమీపంలో రైల్వే ట్రాక్ వరద ధాటికి కొట్టుకుపోయింది. దీంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ట్రాక్ మరమ్మతు పనులను ఇప్పటికే ప్రారంభమయ్యాయి. వీలైనంత త్వరగా ఈ మార్గాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి రైల్వే అధికారులు ప్రయత్నిస్తున్నారు. వర్షాలు తగ్గినట్టయితే సోమవారం సాయంత్రానికి ఈ మార్గం అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు ట్రాక్ మరమ్మతు పనులు జరుగుతూ వుండటంతో సోమ, మంగళ, బుధవారాల్లో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కొన్ని రైళ్లను దారి మళ్ళిస్తున్నట్లు తెలిపింది. సోమవారం నాడు ప్రయాణించాల్సిన మచిలీపట్నం - విశాఖపట్టణం మధ్య నడిచే 17219 నెంబర్ రైలును రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. రైలు నెంబర్ 17247 ధర్మవరం - మచిలీపట్నం, రైలు నెంబర్ 17256 లింగంపల్లి - నరసాపురం, రైలు నెంబర్ 17248 ధర్మవరం - నరసాపురం, రైలు నెంబర్ 17209 బెంగళూరు - కాకినాడ టౌన్ రైళ్ళను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. అలాగే ఇప్పుడు తెలిపే రైళ్ళను సోమవారంతోపాటు మంగళవారం నాడు కూడా రద్దు చేశారు. రైలు నెంబర్ 07788 గుంటూరు-విజయవాడ, రైలు నెంబర్ 07783 విజయవాడ - గుంటూరు, రైలు నెంబర్ 07580 మాచర్ల - నడికుడి, రైలు నెంబర్ 07779 గుంటూరు - మాచర్ల,  రైలు నెంబర్ 07579 నడికుడి - మాచర్ల, రైలు నెంబర్ 07780 మాచర్ల - గుంటూరు, రైలు నెంబర్ 07276 కాచిగూడ-మిర్యాలగూడ, రైలు నెంబర్ 07277 మిర్యాలగూడ - నడికుడి రైళ్ళను రెండు రోజులపాటు రద్దు చేశారు. అలాగే సోమ, మంగళ, బుధవారాలలో రైలు నెంబర్ 07974 మిర్యాలగూడ- నడికుడి, రైలు నెంబర్ 07973 నడికుడి - మిర్యాలగూడ రైళ్ళను రద్దు చేశారు.  మరికొన్ని వివరాలు ఇవిగో...

వరద బాధితులు రెండున్నర లక్షలమంది!

విజయవాడ నగరంలోని వివిధ ప్రాంతాల్లో 2.76 లక్షల మంది వరద బాధితులు ఉన్నారని, వీరందరికీ ఆహారం అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆదివారం రాత్రి విజయవాడ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ‘‘సింగ్‌నగర్‌లో వరద పరిస్థితిని పరిశీలించాను. బాధితులతో మాట్లాడాను. వరద నీరు మరింత పెరిగే ప్రమాదం ఉంది. యుద్ధ ప్రాతిపదికన నష్ట నివారణ చర్యలు చేపట్టాం. బుడమేరుకు గండ్లు పడి వరదనీరు పోటెత్తింది. 1998 తర్వాత మళ్లీ ఆ స్థాయిలోనే ఇప్పుడు భారీ వర్షాలు పడ్డాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల, మున్నేరు, బుడమేరు నుంచి కూడా భారీగా వరదనీరు ముంచుకొస్తోంది. బుడమేరు నుంచి కొల్లేరుకు వెళ్లాల్సిన నీరు విజయవాడకు చేరుతోంది. బుడమేరు నిర్వహణను జగన్ ప్రభుత్వం ఐదేళ్లపాటు పట్టించుకోలేదు. గండ్లు పడిన ప్రాంతాల్లో మరమ్మతులు ఎంతమాత్రం చేయలేదు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో మాట్లాడి వరద పరిస్థితిని వివరించాను. 6 హెలికాప్టర్లు, 40 పవర్‌ బోట్లు, 10 ఎన్డీఆర్‌ఎఫ్ టీమ్‌లను పంపిస్తామని అమిత్‌ షా చెప్పారు. అడిగిన వెంటనే సాయం చేయడానికి కేంద్రం ముందుకు వచ్చింది’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.

వరద బాధితులకు హెల్ప్ లైన్ నంబర్లివే!

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వరదలు జలప్రళయం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షాలు, వరదలకు సంబంధించి ఆపదలో చిక్కుకున్న వారి కోసం విజయవాడలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఆపదలో ఉన్నవారు కమాండ్ కంట్రోల్ నంబర్ 81819 60909కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి. వారికి వెంటనే సహాయం అందుతుంది. వీఎంసీ ల్యాండ్ లైన్ నంబర్లు 0866-2424172, 0866-2427485, కలెక్టరేట్ కంట్రోల్ రూమ్- 0866-2575833, టోల్ ఫ్రీ కలెక్టరేట్ 1800 4256029 నంబర్లకు కాల్ చేసి సమాచారం అందించవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.

ప్రజల ప్రాణాలు కాపాడిన చింతమనేని!

దెందులూరు నియోజకవర్గ పరిధిలో వున్న రామిలేరు అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో పొంగి పొర్లింది. ముంచుకొస్తున్న వరద ముప్పు నుంచి ప్రజలను కాపాడటానికి అర్థరాత్రి 2 గంటలకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా రంగంలోకి దిగారు. ‘‘అమ్మా వరద వచ్చేస్తోంది. నిద్ర లేవండి... నేను పడవలు తెప్పిస్తాను.... ఈలోగా డాబాల పైకి వెళ్ళండి’’  అని చింతమనేని ప్రభాకర్ రామిలేరువాగు వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. తాళ్ళమూడి సహా పలు గ్రామాల్లోకి వరద నీరు ముంచెత్తుతుండటంతో నిద్ర మత్తులో ఉన్న ప్రజలను వరద గురించి హెచ్చరిస్తూ చింతమనేని ప్రభాకర్ స్వయంగా అప్రమత్తం చేసారు. ఇతర గ్రామస్తులు సైతం ప్రజలను అప్రమత్తం చేసేలా సూచించారు. ఎమ్మెల్యే చింతమనేని హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తమై తమ ఇంటి డాబాలపైకి చేరుకున్నారు. ఈలోగా ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వీతో ఫోన్లో మాట్లాడిన చింతమనేని రామిలేరు వాగు వరద తీవ్రతను వివరించారు. ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా తక్షణమే అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  దిగువన ఉన్న లాకులు తెరవటం వంటి సత్వర చర్యల ద్వారా వరద ప్రవాహ తీవ్రతను జనావాసాల వైపు తగ్గించేలా చర్యలు చేపట్టాలని, పడవల ద్వారా లోతట్టు ప్రాంతాల్లో వున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని కోరారు. కలక్టర్ ఆదేశాలతో పలు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.

ముమ్మరంగా వరద సహాయక చర్యలు

ఆంధ్రప్రదేశ్‌లో వరద సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వరద సహాయక కార్యక్రమాలను స్వయంగా సమీక్షిస్తున్నారు. • కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడిన అనంతరం కేంద్ర హోం సెక్రటరీతో మాట్లాడిన సీఎం చంద్రబాబు. • వరద ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం అత్యవసరంగా పవర్ బోట్లు రాష్ట్రానికి తెప్పించే అంశంపై చర్చ.  • 6 ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లు ఇతర రాష్ట్రాల నుండి తక్షణమే ఏపీకి పంపుతున్నట్లు తెలిపిన హోం సెక్రటరీ. • ఒక్కో ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లో 25 మంది సిబ్బంది • ఒక్కో టీమ్ కు నాలుగు పవర్ బోట్లు..ఇవన్నీ రేపు ఉదయంలోపు విజయవాడకు చేరుకుంటాయని తెలిపిన హోం సెక్రటరీ.  • మొత్తం 40 పవర్ బోట్లు రాష్ట్రానికి పంపుతున్నట్లు తెలిపిన హోం సెక్రటరీ.  • వాయు మార్గంలో మరో నాలుగు ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లను రేపు రాష్ట్రానికి పంపుతున్నట్లు తెలిపిన హోం సెక్రటరీ.  • సహాయక చర్యలకు 6 హెలికాఫ్టర్లు పంపుతున్నట్లు తెలిపిన హోం సెక్రటరీ. రేపటి నుండి సహాయక చర్యల్లో హెలికాఫ్టర్లు. • విజయవాడ కలెక్టరేట్‌లో సీఎం చంద్రబాబు మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష. • పాలు, ఆహారం, నీళ్లు, కొవ్వొత్తులు, టార్చ్‌లు.. అన్ని ప్రాంతాల నుంచి వెంటనే తెప్పించాలన్న చంద్రబాబు. • లక్ష మందికి సరిపోయే ఆహారం సరఫరా చేయాలన్న సీఎం. • అదనపు బోట్లు, ట్రాక్టర్లు తక్షణం తెప్పించాలని  ఆదేశం. • సహాయక చర్యలు వేగవంతం కావాలని ఆదేశం.  • వృద్ధులు, పిల్లలను వరద ప్రాంతాల నుంచి తరలించాలని ఆదేశం. • అన్ని షాప్‌ల నుంచి వాటర్ బాటిల్స్, బిస్కట్లు, పాలు తెప్పిస్తు్న్నారు. • ప్రతి ఒక్క బాధితుడికి సాయం అందించడం లక్ష్యం. • ఖర్చు గురించి ఆలోచించకుండా పనిచేయాలని అధికారులకు సీఎం ఆదేశం • అప్పగించిన బాధ్యతలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశం.