ఏపీలో భారీ వర్షాలు
posted on Sep 5, 2024 @ 9:54AM
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో గురువారం (సెప్టెబర్ 5) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
అలాగే గుంటూరు, బాపట్ల, కర్నూలు, అనంతపురం, అన్నమయ్యా, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దనీ హెచ్చరించింది.
అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇలా ఉండగా విజయవాడలో వరద తగ్గుముఖం పట్టడంతో సహాయక కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఇళ్లల్లో రోడ్లపై పేరుకు పోయిన బురద తొలగింపు చర్యలు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాలలోని ప్రజలకు రేషన్ పంపిణీ కి ఏర్పాట్లు పూర్తయ్యాయి.