ఏ క్షణంలోనైనా జోగి రమేష్, దేవినేని అవినాష్ అరెస్టు?
posted on Sep 4, 2024 @ 5:15PM
తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిలు దాఖలు చేసుకున్న వైసీపీ నేతలకు చుక్కెదురైంది. అలాగే చంద్రబాబు నివాసంపై దాడి కేసులోనూ నిందితులకు ముందస్తు బెయిలు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ కేసుల్లో నిందితులైన దేవినేని అవినాష్, నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాంలు తమను అరెస్టు చేయకుండా యాంటిసిపేటరీ బెయిలు కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వీరిలో చంద్రబాబు నివాసంపై దాడి కేసులో దేవినేని అవినాష్, నందిగం సురేష్ నిందితులు కాగా, తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాంలు నిందితులు.
మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై దాడి ఘటనలో మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు.. నిందితుల విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత కోర్టులో వాదనలు జరిగాయి.. కొద్దిరోజుల పాటూ నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వుల్ని కోర్టు పొడిగించింది.
ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లు వేసిన వారిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రాఘురాం, వైసీపీ నేత దేవినేని అవినాష్, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ హైకోర్టును ఆశ్రయించారు. అలాగే చంద్రబాబు నివాసంపై దాడి వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీమంత్రి జోగిరమేష్ కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై వాదనలు పూర్తి కావడంతో కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.. ఇవాళ బెయిల్ పిటిషన్‌లను తిరస్కరిస్తున్నట్లు బుధవారం (సెప్టెంబర్ 4) తీర్పును ఇచ్చింది. దీంతో తాము సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామనీ, అంత వరకూ అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలనీ వైసీపీ నేతలు కోరారు. అయితే అందుకు ప్రభుత్వ తరఫు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. ఇరు పక్షాల వాదనలూ విన్న హైకోర్టు ఈ విషయంపై తన నిర్ణయాన్ని కొద్ది సేపు వాయిదా వేసిన హైకోర్టు అందకూ నిరాకరించింది. సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకునేంత వరకూ అరెస్టు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో చంద్రబాబు నివాసం, తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసుల్లో నిందితులను పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉంది.