విజయసాయి.. వైసీపీకి గుదిబండేనా?
posted on Sep 4, 2024 @ 2:20PM
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి భారీ షాక్ తగిలింది. ఏకంగా విశాఖ బీచ్ కబ్జాకు ఆయన తెగబడిన వైనం వెలుగులోనికి రావడమే కాకుండా, ఆలా కబ్జాచేయడానికి భీమిలీలో బీచ్ కు అడ్డంగా రిటైనింగ్ వాల్ తరహాలో కట్టిన గోడను గ్రేటర్ విశాఖ అధికారులు కూల్చివేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొంత కాలం ఆయన పార్టీ ఉత్తరాంధ్రజిల్లాల ఇన్ చార్జిగా వెలగబెట్టారు.
ఆ సమయంలో విజయసాయి పెద్ద ఎత్తున కబ్జాలకు తెగబడ్డారు. నిన్నమొన్నటి వరకూ ఆరోపణలుగానే ఉన్న ఆయన కబ్జాల పర్వం ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డి భీమిలీ బీచ్ కు అడ్డంగా కట్టేసిన గోడను గ్రేటర్ విశాఖ అధికారులు కూల్చేశారు. వాస్తవానికి గత ఐదేళ్లలో విశాఖ పరిపాలనా రాజధాని అంటూ వైసీపీ నేతలు చేయని దందా లేదు. ముఖ్యంగా విజయసాయి రెడ్డి తన కుమార్తె, అల్లుడుకు విశాఖను రాసిచ్చేద్దామనుకున్నారా అన్నంతగా అడ్డగోలు కబ్జాలకూ, ఆక్రమణలకూ పల్పడ్డారు. తన కుమార్తె నేహారెడ్డి కోసం భీమిలీ బీచ్ ను ఆక్రమించేయడానికి ఏకంగా గోడకట్టేయగా దానినే బుధవారం (సెప్టెంబర్ 4) అధికారులు కూల్చేశారు.
అయితే విశాఖలో విజయసాయి రెడ్డి దందాలు ఇంకా చాలా చాలా ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. విజయసాయిరెడ్డి తన అల్లుడు ఆయన కంపెనీల పేరుతో వందల ఎకరాలను అప్పట్లో ప్రభుత్వం నుంచి అప్పనంగా లాగేసుకున్నారు. అలాగే అడ్డగోలు దందాలతో వందల ఎకరాల భూములను కొనుగోలు చేశారు. అయితే ఈ అడ్డగోలు భూ దందాపై వచ్చిన ఆరోపణలను తన అల్లుడు, కుమార్తె కొనుక్కుంటే తనకేం సంబంధం అంటూ విజయసారి తేలిగ్గా ఖండించేశారు.
భీమిలి దగ్గర ఫైవ్ స్టార్ హోటల్ పేరు చెప్పి భూమిని కబ్జా చేయడమే కాకండా బీచ్ కు అడ్డంగా కట్టేశారు. సీఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధం గా కట్టిన కట్టడం కావడంతో కూల్చివేత భయంతో ముందుగానే కోర్టుకు వెళ్లారు. ఇప్పుడు ఆ గోడ నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చివేయా లంటూ తీర్పు వెలువరించడంతో అధికారులు కూల్చివేశారు. ఈ కూల్చివేతల్ని అడ్డుకోవడానికి కానీ, విజయసాయికి మద్దతుగా కానీ ఒక్కరంటే ఒక్క వైసీపీ నేత కూడా ముందుకు రాలేదు. ఒక్క విశాఖ అనేమిటి, మొత్తం ఉత్తరాంధ్రలో వైసీపీ ఉనికి మాత్రంగా కూడా మిగలకపోవడానికి విజయసాయి రెడ్డి నిర్వాకాలే కారణమని పార్టీ ఉత్తరాంధ్ర నేతలు, శ్రేణులలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
ఆ కారణంగానే విశాఖ నేతలెవరూ విజయసాయికి మద్దతు పలకడం లేదు. ముందు ముందు విశాఖలో విజయసాయి భూ దందాలు, కబ్జాలు, ఆక్రమణలకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నేహారెడ్డి అక్రమకట్టడం కూల్చివేత విజయ సాయి విజయసాయికి పార్టీ నుంచి ఎలాంటి మద్దతూ రాకపోవడాన్ని చూస్తుంటే ఇక విజయసాయి రెడ్డి పార్టీలో పూర్తిగా ఒంటరి అయిపోయారన్న విషయం స్పష్టంగా అవగతమౌతోంది. ఆయన ఎంతగా చొక్కాలు చింపుకుని తాను వైసీపీని వీడే ప్రశక్తే లేదని చెప్పుకున్నా.. పార్టీ ఆయనను పట్టించుకునే అవకాశాలు లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వైసీపీ విజయసాయిని గుదిబండగా భావిస్తోందని అంటున్నారు.