చంద్రబాబుపై కేటీఆర్ ప్రశంసలు.. జగన్ విమర్శలను పట్టించుకునేదెవరు?
posted on Sep 3, 2024 @ 4:26PM
తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. రెండు రాష్ట్రాలలోనూ ప్రకృతి విలయతాండవం చేసింది. భారీ నష్టం వాటిల్లింది. జనం గూడు వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. అపార ఆస్తి, పంట నష్టం వాటిల్లింది. ప్రాణ నష్టం కూడా జరిగింది. రహదారులు జలమయమయ్యాయి. రోడ్లు తెగిపోయాయి. ఊళ్లకు ఊళ్లు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. గ్రామాలకు గ్రామాలు అంధకారంలో మునిగిపోయాయి. జనం నీరు, తిండి లేక అల్లాడిపోయారు. తెలంగాణలో ఖమ్మం జలవిలయంలో చిక్కుకుంటే.. విజయవాడ పూర్తిగా జలయమయమైంది. గ్రామాలకు గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. మానవతా దృక్ఫథంతో అందరూ సమష్టిగా ఈ విపత్తును ఎదుర్కొనేందుకు పని చేయాలి. అయితే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత రూటే సెపరేటు. ఆయనకు ప్రజల కష్టాల్లోనూ, కన్నీళ్లలోనూ రాజకీయ మైలేజీని వెతుక్కోవడం అలవాటు. అధికారంలో ఉన్న సమయంలోనూ, అంతకు ముందు అధికారం కోసం పాకులాడిన సమయంలోనూ కూడా ఆయన చేసింది అదే.
ఇప్పుడు బెజవాడను వరదలు ముంచెత్తిన సమయంలో కూడా జగన్ రాజకీయ ప్రయోజజనాల కోసమే వెంపర్లాడారు. జనం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి బాధితులను ఆదుకోవడానికి తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తుంటే.. జగన్ మాత్రం బెజవాడ వరద ముంపునకు కారణమే చంద్రబాబు అన్నట్లుగా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు క్షేత్ర స్థయిలో వరద ప్రభావిత ప్రాంతాలలో విరామమనేదే లేకుండా పర్యటనలు చేస్తూ బాధితులకు భరోసా ఇస్తుంటే.. జగన్ మాత్రం సోమవారం (ఆగస్టు 2) ఓ రెండు గంటల పాటు విజయవాడలో పర్యటించారు. అందులో ఓ అరగంటకు పైగా ఎన్నికల ప్రచార సభలలో చేసేలాంటి ప్రసంగంతో ఊదరగొట్టారు. ఆయన ప్రసంగం అంతా చంద్రబాబును విమర్శించడానికే సరిపోయింది. వరద సహాయక చర్యలలో ఎక్కడా వైసీపీ నేతలు కానీ, శ్రేణులు కానీ కనిపించలేదు. ఇక జగన్ తన ప్రసంగంలో చంద్రబాబు బాధితులను ఆదుకోవడంలో విఫలమయ్యారన్న విమర్శలు గుప్పించారు.
అయితే తెలంగాణలో విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ మాత్రం తెలంగాణలో వరద ముప్పును ఎదుర్కోవడంలో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శిస్తూనే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో సమర్థతతో వరద బాధితులకు అండగా నిలబడి వారిలో ధైర్యాన్ని నింపారంటూ ప్రశంసలు గుప్పించింది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వరద ముప్పును ఎదుర్కొనే విషయంలో చంద్రబాబు కృషిని పొగుడుతూ ట్వీట్ చేశారు. కేటీఆర్ చంద్రబాబును పొగడడాన్ని ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాలంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లకు జగన్ అత్యంత అనుంగు మిత్రుడు. 2019 ఎన్నికలలో జగన్ విజయం కోసం అప్పటికి తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ (తెరాస) తన వంతు సహకారం అందించింది. 2023 డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ విజయం కోసం జగన్ కూడా తన వంతు కృషి చేశారు. ఎన్నికలలో బీఆర్ఎస్ కు ప్రయోజనం చేకూర్చేందుకు తెలంగాణ సెంటిమెంట్ రగిల్చేందుకు సాగర్ వద్ద ఆంధ్రాపోలీసులను మోహరించి ఇరు రాష్ట్రాల మధ్యా చిచ్చు పెట్టేందుకు కూడా వెనుకాడలేదు. అయితే జగన్ ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైంది. ప్రతిపక్షానికి పరిమితమైంది. అయినా కూడా 2024 ఎన్నికలలో ఏపీలో జగన్ విజయం కోసం బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేయగలిగినంతా చేశారు. అవసరం ఉన్నా లేకపోయానా మీడియా సమావేశాలు పెట్టి మరీ ఏపీలో జగన్ మళ్లీ అధికారంలోకి రాబోతున్నారంటూ జోస్యాలు చెప్పారు. తమ సర్వేలలో అదే తేలిందని నమ్మబలికారు. తద్వారా తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రా ఓటర్లను ప్రభావితం చేసేందుకు తమ వంతు కృషి చేశారు. అయినా ఫలితం లేకపోయింది. జగన్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ తరువాత కూడా కేసీఆర్, కేటీఆర్, జగన్ తమ స్నేహాన్ని కొనసాగించారు. అవకాశం కుదిరిన ప్రతి సారీ పరస్పర అభిమానాన్ని చాటుకున్నారు.
అయితే వరద ముప్పును ఎదుర్కొని ప్రజలకు బాసటగా నిలిచే విషయంలో చంద్రబాబు భేష్ అంటూ కేటీఆర్ పొగడ్తల వర్షం కురిపించారు. అయితే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం తన మిత్రుడి మాటలకు భిన్నంగా కాదు కాదు పూర్తి వ్యతిరేకంగా స్పందించారు. వరద బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. అసలు వరద నివారించగలిగే అవకాశాలున్నా, పట్టించుకోకుండా విజయవాడ నగరం ముంపునకు గురి కావడానికి కారణమ య్యారంటూ నిందించారు.
చంద్రబాబు సమర్ధతను పొగుడుతూ వరద బాధితులను రక్షించడానికి ఆరు హెలికాప్టర్ల, 150కి పైగా పవర్ బోట్లను చంద్రబాబు రంగగంలోకి దింపారనీ, అదే తెలంగాణ ముఖ్యమంత్రి ఆ విషయంలో చేతులెత్తేశారనీ కేటీఆర్ పేర్కొన్నారు. ముంపు బాధితులను ఆదుకోవడంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. చంద్రబాబు వంటి ముఖ్యమంత్రి ఉండటం ఆంధ్రప్రజల అదృష్టమన్నంతగా కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. కేటీఆర్ పొగడ్తలే జగన్ డొల్లతనాన్ని ఎత్తి చూపాయి. రాజకీయ లబ్ధి కోసం జగన్ చౌకబారు విమర్శలు చేశారని, చేస్తున్నారని నిర్ద్వంద్వంగా చాటాయి. వరద ముప్పును ఎదుర్కొని ముంపు బాధితులను ఆదుకోవడానికి చంద్రబాబు యవత్ యంత్రాంగాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చారు. వ్యక్తిగతంగా తాను సైతం క్షేత్ర స్థాయిలో పర్యటించారు. జగన్ విమర్శలను పూర్తిగగా విస్మరించి తన దృష్టిని పూర్తిగా సహాయ పునరావాస చర్యలపైనే కేంద్రీకరించారు. ఇదే ప్రజలలో జగన్ పట్ల తిరస్కారం కలిగేలా చేసింది. చంద్రబాబును జనాలకు మరింత చేరువ చేసింది.