వరద ప్రభావిత ప్రాంతాలలో నిత్యావసర కిట్ల పంపిణీ!
posted on Sep 5, 2024 @ 10:07AM
ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు, వరదలతో ముంపునకు గురైన ప్రాంతాలలో గురువారం (సెప్టెంబర్ 5) నుంచి నిత్యావరసర వస్తువులతో కూడిన కిట్ల పంపిణీ ప్రారంభమైంది. అలాగే ముంపు ప్రాంతాలలో ప్రజల కోసం రాయతీపై కూరగాయలను కూడా అందిస్తున్నారు.
వరద ముంపు కారణంగా గత ఐదు రోజులుగా నానా యాతనలూ పడుతున్న ప్రజలకు ఆసరాగా ఉండేందుకు, భరోసా కల్పించేందుకు ధనిక, పేద అన్న తేడా లేకుండా ముంపు ప్రాంతాల ప్రజలందరికీ నిత్యావసరాల కిట్లను అందించనున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అలాగే రాయతీపై కూరగాయలు కూడా సరఫరా చేయనున్నట్లు తెలిపారు. అలాగే ముంపు ప్రభావిత ప్రాంతాలలోని ప్రతి కుటుంబానికీ పాలు, బిస్కెట్లు, మంచి నీరు అందిస్తామన్నారు. ఇక వరదల కారణంగా ఇళ్లు, దుకాణాలు పూర్తిగా మునిగిపోయి నష్టపోయిన బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఇలా ఉండగా చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రి నారాయణ వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. చివరి బాధితుడి వరకూ సహాయం చేరాలన్న చంద్రబాబు ఆదేశాలు తు.చ.తప్పకుండా అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.