ఆ ఖర్చులు నేహారెడ్డి నుంచే వసూలు చేయండి.. హైకోర్టు

అధికారం ఉందన్న అండతో ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు చేపడితే తగు మూల్యం చెల్లించక తప్పదని ఇప్పుడు వైసీపీ నేత విజయసాయిరెడ్డికి అవగతమౌతోంది. వైసీపీ హయాంలో కొద్ది కాలం ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ చార్జిగా వెలగబెట్టిన విజయసాయి అడ్డగోలుగా ఆక్రమలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఆ ఆరోపణల సంగతి అలా ఉంచితే..  విజయసాయి రెడ్డి  కుమార్తె నేహారెడ్డి భీమిలీ బీచ్ కు అడ్డంగా కట్టేసిన గోడను గ్రేటర్ విశాఖ అధికారులు కూల్చేశారు. వాస్తవానికి గత ఐదేళ్లలో విశాఖ పరిపాలనా రాజధాని అంటూ వైసీపీ నేతలు చేయని దందా లేదు. ముఖ్యంగా విజయసాయి రెడ్డి తన కుమార్తె, అల్లుడుకు విశాఖను రాసిచ్చేద్దామనుకున్నారా అన్నంతగా అడ్డగోలు కబ్జాలకూ, ఆక్రమణలకూ పల్పడ్డారు. ఇప్పుడు అవన్నీ ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.   ఇప్పటికే   విశాఖ జిల్లా  భీమిలి బీచ్​ వద్ద సముద్రానికి అతి సమీపంలో నిర్మించిన కాంక్రీట్ ప్రహారీగోడ కూల్చివేత విషయంలో స్టేటస్​ కో ఇవ్వాలంటూ విజయసాయి కుమార్తె దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది.   అక్కడి నిర్మాణాలను నిలుపుదల చేస్తూ, అక్రమ కట్టడాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో నేహారెడ్డి  భీమిలీ బీచ్ వద్ద నిర్మించిన గోడను జీవీఎంసీ కూల్చివేసింది.   దీనిపై తదుపరి విచారణలో  ఆ కూల్చివేతకు అయిన ఖర్చు కూడా నేహారెడ్డి నుంచే వసూలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అలాగే అందుకు సంబంధించిన వివరాలు కూడా కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా మొత్తం నిర్మాణం విషయంలో వివరణ కోరుతూ నేహారెడ్డికి తాజాగా షోకాజ్‌ నోటీసు ఇచ్చామని  నేహారెడ్డి నుంచి ఇంకా స్పందన రాలేదనీ  ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కొర్టుకు తెలియజేశారు. దీంతో ఇప్పటి వరకూ తీసున్న చర్యలకు సంబంధించి నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ కోర్టు విచారణను వారం రోజులు వాయిదా వేసింది.  

బాలినేని, జగన్ టామ్ అండ్ జెర్రీ ఆటకు ఫుల్ స్టాప్?!

వైసీపీలో బాలినేని ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పడిపోయినట్లేనా? ఆయన వద్దనుకున్నారా? జగనే వద్దన్నారా అన్న విషయంలో సందేహాలు ఉంటే ఉండొచ్చు కానీ బాలినేని వైసీపీకి గుడ్ బై చెప్పడం మాత్రం ఖాయమైపోయింది. తాను వైసీపీని వీడేందుకు నిర్ణయించుకున్న విషయాన్ని స్వయంగా బాలినేనే తన అనుచరులకు చెప్పేశారు. దీంతో ఇహనో ఇప్పుడో ఆయన వైసీపీకి రాజీనామా చేయడం ఖాయం. అ సలు వైసీపీలో బాలినేని గత మూడేళ్లుగా హాఫ్ రెబల్ గానే కొనసాగుతున్నారు. ఇటు బాలినేనికీ, అటు వైసీపీ అధినేతకూ కూడా పరస్పర అవసరాలు ఉన్నాయి. పైపెచ్చు ఇరువురూ బంధువులు కూడా. అయినా బాలినేనికి పొమ్మనకుండా పార్టీలో పొగపెట్టడం అన్నది గత కొన్నేళ్లుగా నిరాటంకంగా సాగుతూ వస్తోంది. ఇది ఎప్పుడు మొదలైందంటే.. జగన్ తాను అధికారం చేపట్టిన తరువాత దాదాపు మూడేళ్లకు మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఆ పునర్వ్యవస్థీకరణలో బాలినేని మంత్రి పదవినుంచి తొలగించారు. అదే సమయంలో ఆయన జిల్లాకే చెందిన మంత్రిని మాత్రం కొనసాగించారు. ఇది బాలినేనిలో అసంతృప్తికి బీజం వేసింది. అప్పటి నుంచీ  ఆయన పార్టీకి, పార్టీ అధినేత జగన్ కు పంటికింద రాయిలా, చెవిలో జోరీగలా ఇబ్బందులు పెడుతూ వచ్చారు. అయితే జగన్ పొమ్మన్న ప్రతి సారీ బాలినేని చూరుపట్టుకు వెళాడారు. అలాగే బాలినేని పార్టీకి గుడ్ బై చెబుతానంటే అల్టిమేటం ఇచ్చిన ప్రతి సారీ జగన్ తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకుని బుజ్జగించారు. ఎందుకంటే బాలినేనికి ప్రకాశం జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఇక బాలినేని ఎందుకు పార్టీని వదలకుండా వేళాడారంటే.. ఆయనను మరే రాజకీయ పార్టీ చేర్చుకునే అవకాశాలు లేవు. దీంతో బాలినేని జగన్ మధ్య ఇన్నేళ్లూ టామ్ అండ్ జెర్రీ ఆట సాగుతూనే వచ్చింది. అయితే 2024 ఎన్నికలలో వైసీపీ, బాలినేని కూడా పరాజయం పాలవ్వడంతో ఇక ఒకరి అవసరం ఒకరికి లేకుండా పోయింది. మరో ఐదేళ్ల వరకూ ఎన్నికలు లేకపోవడంతో బాలినేనికి వెంటనే రాజకీయ ఆశ్రయం దొరికి తీరాల్సిన పరిస్థితి కూడా లేకపోవడంతో ఆయన ఇక వైసీపీకి గుడ్ బై చెప్పడమే మేలన్న నిర్ణయానికి వచ్చేశారు. అందుకే సమయం చూసుకుని జగన్ కు షాక్ ఇచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే పార్టీలోనే ఉంటూ రోజుకో విమర్శ, పూటకో డిమాండ్ తో  ఉక్కిరిబిక్కిరి చేస్తు న్న బాలినేని పార్టీ నుంచి ఎగ్జిట్ అవ్వడంతో జగన్ కూడా హమ్మయ్యా అనుకునే పరిస్థితి ఉందని వైసీపీ వర్గాలు అంటున్నాయి.  

కేంద్రమంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుకి మరో కీలక పదవి

ప్రతిభ, సామర్ధ్యం ఉంటే పదవులు హోదాలు వాటంతట అవే వచ్చి చేరతాయనడానికి నిలువెత్తు నిదర్శనంగా కేంద్ర మంత్రి కింజారపు రామ్మెహన్ నాయుడు నిలుస్తారు. తండ్రి కింజరపు ఎర్రన్నాయుడి మరణంతో తండ్రివారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన రామ్మోహన్ నాయుడు  అనతి కాలంలోనే తండ్రికి మించిన తనయుడిగా తనదైన ముద్ర వేశారు.   2014, 2019, 2024లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో   వరుసగా శ్రీకాకుళం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. అత్యంత పిన్న వయస్సులోనే కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అదీ పౌరవిమానయాన శాఖ మంత్రిగా తనదైన ముద్ర వేస్తున్నారు.  లోక్ సభలో తన అనర్గళ ప్రసంగాలతో అందరి దృష్టీ ఆకర్షిస్తున్నారు.  పార్లమెంట్లో రామ్మోహన్నాయుడి పనితీరు  ఆధారంగా 2020లో సంసద్ రత్న 'జ్యూరీ కమిటీ స్పెషల్ అవార్డు’ అందుకున్నారు.  అతి చిన్న వయస్సులోనే సంసద్ రత్న అవార్డు అందుకున్న రికార్డును సొంతం చేసుకున్నారు. తాజాగా ఢిల్లీలో జరుగుతున్న  2వ ఆసియా-పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్‌లో సభ్య దేశాల ఛైర్మన్ ఎన్నిక బుధవారం (సెప్టెంబర్ 11) జరిగింది. ఆ ఎన్నికలో  ఆసియా ఫసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్  ఛైర్మన్‌గా కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  అంటే 40 సభ్య దేశాల ప్రతినిధులు రామ్మోహన్ నాయుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారన్న మాట. దేశం తరఫున తనకు దక్కిన ఈ గౌరవాన్ని బాధ్యతతో స్వీకరిస్తున్నట్లు పేర్కొన్న కింజారపు విమానయాన రంగాన్ని ప్రజలకు చేరువగా తీసుకురావడంతో పాటు ఆసియా ఫసిఫిక్ దేశాల మధ్య రవాణాను సులభతరం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.   

మధ్య ప్రదేశ్ లో అరాచకపర్వం.. పట్టపగలే ఆర్మీ ఆఫీసర్లపై దాడి!

మధ్యప్రదేశ్ లో అరాచకం రాజ్యమేలుతోందా? చట్టం, శాంతి భద్రతల ఆనవాలే కనిపించడం లేదా? అంటే ఆ రాష్ట్రంలో  పెరుగుతున్న హింసాత్మక ఘటనలు, దాడులు, దౌర్జన్యాలు అరాచకాలు, అత్యాచార ఘటనలను చూస్తే ఔనని అనక తప్పదు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనిపించేలా, అడుగు తీసి బయటకు వెడితే క్షేమంగా తిరిగి ఇంటికి చేరుతామా అని జనం భయపడే పరిస్థితులు ఉన్నాయనడానికి తాజాగా ఇండోర్ లో  జరిగిన దారుణ ఘటనే నిదర్శనం. సరదాగా తమ స్నేహితురాళ్లతో విహార యాత్రకు వెళ్లిన ఇద్దరు శిక్షణలో ఉన్న ఆర్మీ అధికారులపై కొందరు దుండగులు దాడి చేశారు. సాయుధులైన ఎనిమిది మంది ముఠా తుపాకులతో బెదరించి వారి వద్ద ఉన్న సొత్తు దోచుకున్నారు.  ఆర్మీ ట్రైనీ ఆఫీసర్ల స్నేహితురాళ్లలో ఒకరిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతే కాకుండా ఒక ఆర్మీ ట్రైనీ ఆఫీసర్ ను, ఒక మహిళను బందీగా పట్టుకుని మిగిలిన ఇద్దర్నీ పది లక్షల రూపాయలు ఇచ్చి విడిపించుకు వెళ్లాలంటూ పంపించారు. ఈ సంఘటన జరిగింది ఎక్కడో మారుమూల ప్రదేశంలో కాదు. ఇండోర్ లో ని  మావు ఆర్మీ కాలేజీకి కూతవేటు దూరంలో జరిగింది. తమ స్నేహితురాళ్లతో సరదాగా కాలేజీకి సమీపంలోని  ఫైరింగ్ రేంజ్ వద్దకు వెళ్లిన ట్రైనీ ఆర్మీ ఆఫీసర్లను సాయుధులైన ఎనిమిది మంది దుండగులు  చుట్టుముట్టి తుపాకులతో బెదరించారు. దారుణంగా దాడికి పాల్పడ్డారు. ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఇద్దరిని బందీలుగా పట్టుకుని వారిని విడిచిపెట్టడానికి సొమ్ములు డిమాండ్ చేశారు. ఇదంతా ఆర్మీ ట్రైనింగ్ కాలేజీకి కేత వేటు దూరంలో జరిగిందంటే దుండగులు ఎంతగా బరితెగించారో అర్ధమౌతుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకునేలోగానే దుండగులు తప్పించుకున్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఇద్దరిని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. అరెస్టైన వారికి నేర చరిత్ర ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ సంఘటన మంగళవారం (సెప్టెంబర్ 10) సాయంత్రం జరిగింది. సాయుధులు యథేచ్ఛగా తుపాకులు, మారణాయుధాలతో అదీ ఆర్మీ కాలేజీకి సమీపంలోనే సంచరిస్తోందంటే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంత సుందరముదనష్టంగా ఉందో అవగతమౌతోంది. 

కూల్చివేతలతో ఆగమాగం.. బెడిసికొడుతున్న రేవంత్ దూకుడు!

హైదరాబాద్ లో చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడిన హైడ్రా  దూకుడు  కొన‌సాగిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సూచ‌న‌ల‌తో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వ‌ర్యంలో సిబ్బంది అక్ర‌మ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. రెండు గ‌దుల ఇళ్ల ద‌గ్గ‌ర నుంచి ఖ‌రీదైన విల్లాలు.. ఏవైనా స‌రే.. చెరువు బఫర్ జోన్‌, ఎఫ్‌టీఎల్‌లో ఉంటే నిర్దాక్షిణ్యంగా నేల‌మ‌ట్టం చేస్తున్నారు. దీంతో గ‌త రెండు నెల‌లుగా రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రాపైనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఉద‌యం నిద్ర‌మ‌త్తు వ‌ద‌ల‌క‌ముందే బుల్డోజ‌ర్లు వ‌స్తుండ‌టంతో అక్ర‌మ నిర్మాణ‌దారుల గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయి. ఎన్నోఏళ్లుగా ప్ర‌భుత్వ అనుమ‌తుల‌తో నివాసం ఉంటున్న భ‌వ‌నాల‌ను సైతం హైడ్రా కూల్చివేస్తుండ‌టంతో బాధితులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. కూల్చివేత‌ల ప్ర‌క్రియ కొన‌సాగుతున్న స‌మ‌యంలోనే ఆత్మ‌హ‌త్యాయ‌త్నాల‌కు పాల్ప‌డుతున్నారు. హైడ్రా దూకుడుతో సీఎం రేవంత్ స‌ర్కార్‌పై తొలుత ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిసిన‌ప్ప‌టికీ.. కూల్చివేత‌ల ప్ర‌క్రియ కొన‌సాగుతున్న కొద్దీ వ్య‌తిరేక‌ గ‌ళం పెరుగుతోంది. అయినా రేవంత్ ఏమాత్రం ప‌ట్టించుకోకుండా.. హైడ్రా విష‌యంలో వెన‌క్కు త‌గ్గేది లేద‌ని ఖ‌రాఖండీగా చెప్ప‌స్తున్నాడు. రేవంత్ మొండి ప‌ట్టుద‌లతో కాంగ్రెస్ నేత‌ల్లోనూ వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతుండ‌టం గ‌మ‌నార్హం. ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురైన ప్ర‌భుత్వ భూముల‌ను, చెరువుల‌ను ప‌రిర‌క్షించేందుకు రంగంలోకి దిగిన హైడ్రా.. గ‌త రెండు నెల‌లుగా చెరువులు, ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్ జోన్ల‌లో అక్ర‌మ నిర్మాణాల‌ను కూల్చివేస్తోంది. తాజాగా ప్ర‌భుత్వానికి ఇచ్చిన నివేదిక ప్ర‌కారం.. జీహెచ్ఎంసీ ప‌రిధిలో మొత్తం 23 ప్రాంతాల్లో 262 అక్ర‌మ నిర్మాణాల‌ను కూల్చివేసి.. 111.72 ఎక‌రాల భూమిని స్వాధీనం చేసుకున్న‌ట్లు హైడ్రా పేర్కొంది. రామ్‌న‌గ‌ర్ మ‌ణెమ్మ గ‌ల్లీలో మూడు, గ‌గ‌న్ ప‌హాడ్ అప్పాచెరువులో 14, అమీన్ పూర్ పెద్ద చెరువు ప‌రిధిలో 24, మాధాపూర్ సున్నం చెరువులో 42, దుండిగ‌ల్ క‌త్వా చెరువు ప‌రిధిలో 13 అక్ర‌మ నిర్మాణాలను తొల‌గించిన‌ట్లు హైడ్రా వెల్ల‌డించింది. అత్య‌ధికంగా అమీన్ పూర్‌లో 51 ఎక‌రాలు, మాదాపూర్ సున్నం చెరువు ప‌రిధిలో 10 ఎక‌రాల ప్ర‌భుత్వ స్థ‌లాన్ని స్వాధీనం చేసుకున్న‌ట్లు హైడ్రా ప్ర‌భుత్వానికి ఇచ్చిన నివేదిక‌లో పేర్కొంది. హైడ్రా విష‌యంలో తాజాగా రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. డ‌బ్బున్న వాళ్లు చెరువుల‌ను ఆక్ర‌మించి అక్ర‌మ నిర్మాణాలు చేయ‌డం వ‌ల్ల‌నే న‌గ‌రంలో చిన్న వ‌ర్షం వ‌చ్చినా వ‌ర‌ద‌లు ముంచెత్తుతున్నాయ‌ని పేర్కొన్నారు. పేద‌ల‌కు హైడ్రా వ‌ల్ల ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని చెప్పిన రేవంత్‌.. బ‌డాబాబుల‌ను ఎట్టిప‌రిస్థితుల్లోనూ వ‌దిలేని లేద‌ని తేల్చిచెప్పారు. రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో జీహెచ్ఎంసీ ప‌రిధిలోని కాంగ్రెస్ నేత‌ల్లోనూ అసంతృప్తి క‌నిపిస్తోంది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హైద‌రాబాద్ ప‌రిధిలో కాంగ్రెస్ ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా గెలుచుకోలేక‌పోయింది. బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ స్థానాల్లో గెల‌వ‌డంతో కాంగ్రెస్‌ అధికారంలోకి వ‌చ్చింది. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత హైద‌రాబాద్ న‌గ‌రంలో కాంగ్రెస్ బ‌లోపేతంపై దృష్టిసారించారు. హైద‌రాబాద్ ప‌రిధిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప‌లువురు ఎమ్మెల్యేల‌ను, న‌గ‌ర మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్‌తో స‌హా ప‌లువురు కార్పొరేట‌ర్ల‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. త‌ద్వారా న‌గ‌రంలో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల నాటికి కాంగ్రెస్ పూర్తిస్థాయిలో బ‌లోపేతం అయ్యేలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ఇదే స‌మ‌యంలో రేవంత్‌రెడ్డి తెర‌పైకి తెచ్చిన హైడ్రా కాంగ్రెస్ వ్యూహానికి అడ్డుగా మారుతుంద‌న్న ఆందోళ‌న ఆ పార్టీ నేత‌ల నుంచి వ్య‌క్త‌మ‌వుతుంది. న‌గ‌రంలో రాజ‌కీయంగా, ఇత‌ర రంగాల్లో ప‌లుకుబ‌డి క‌లిగిన వారి ఇళ్ల‌ను అక్ర‌మ క‌ట్ట‌డాలుగా గుర్తించి హైడ్రా కూల్చివేస్తోంది. వీరిలో చాలా మంది కాంగ్రెస్ పార్టీ సానుభూతి ప‌రులు ఉన్నారు. గత ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపున‌కు వీరు స‌హ‌కారం అందించారు. అయితే, పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అలాంటి వారికి ర‌క్ష‌ణ‌గా నిల‌వాల్సింది పోయి.. హైడ్రా పేరుతో వారికి న‌ష్టం జ‌రిగేలా ప్ర‌వ‌ర్తిస్తే ఎలాఅంటూ కాంగ్రెస్ పార్టీలోని కొంద‌రు నేత‌లు ప్ర‌శ్నిస్తున్నార‌ట‌. దీంతో హైడ్రా విష‌యంలో కాంగ్రెస్ పార్టీ రెండు వ‌ర్గాలు విడిపోయింద‌న్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది.  హైద‌రాబాద్ న‌గ‌రం దేశంలోనే కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో సీఎ చంద్ర‌బాబు నాయుడు హైటెక్ సిటీ నిర్మాణం చేసి ప్ర‌పంచ దేశాల్లోని ప్ర‌ముఖ ఐటీ, ఫార్మా కంపెనీలు హైద‌రాబాద్ లో పెట్టుబ‌డులు పెట్టేలా కృషి చేశారు. అప్ప‌టి నుంచి ప‌లు రంగాల్లోని ప్ర‌ముఖ కంపెనీల‌కు పెట్టుబ‌డులు పెట్టేందుకు హైద‌రాబాద్ కేంద్రంగా మారింది. అప్ప‌టి నుంచి  వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, కిర‌ణ్ కుమార్‌రెడ్డి, కేసీఆర్‌.. ఇప్పుడు రేవంత్‌రెడ్డి.. ముఖ్య‌మంత్రి ఎవ‌రైనా హైద‌రాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతుంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ లో ఫోర్త్ సిటీ  నిర్మాణం చేసేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. ఇదే స‌మ‌యంలో హైడ్రా పేరుతో న‌గ‌రంలోని అక్ర‌మ క‌ట్ట‌డాల‌పై కొర‌డా ఝుళిపిస్తున్నారు. అయితే, చెరువు, పార్కు స్థ‌లాల్లో చేప‌ట్టిన ప‌లు నిర్మాణాల‌కు గ‌తంలోని ప్ర‌భుత్వాలు అన్ని అనుమ‌తులు ఇచ్చాయి. కొంద‌రైతే తాము ఇల్లు నిర్మించుకున్న స్థ‌లం బ‌ఫ‌ర్ జోన్‌, ఎఫ్‌టీఎల్‌లో ఉంద‌ని తెలియ‌ద‌ని, అధికారులు కూడా అభ్యంత‌రం చెప్ప‌లేద‌ని చెప్ప‌కొస్తున్నారు. అన్ని అనుమ‌తులు ఉండ‌టంతోనే మేము నిర్మాణాలు చేప‌ట్టామ‌ని వాపోతున్నారు. అయినా, అలాంటి భ‌వ‌నాల‌ను కూడా రేవంత్ స‌ర్కార్ కూల్చివేస్తుండ‌టంతో న‌గ‌ర వాసుల్లో ఆగ్ర‌హాన్ని తెప్పిస్తోంది.  మ‌రోవైపు కొన్ని ప్రాంతాల్లో పేద‌లు రూపాయిరూపాయి పోగుచేసుకొని క‌ట్టుకున్న ఇల్లు సైతం బ‌ఫ‌ర్ జోన్‌, ఎఫ్‌టీఎల్‌లో ఉందంటూ హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. దీంతో అటు బ‌డాబాబుల‌తో పాటు పేద వ‌ర్గాల ప్ర‌జ‌లుసైతం హైడ్రాపై ఆగ్ర‌హంతో ఉన్నారు. హైడ్రా ప్రారంభంలో ప్ర‌తిప‌క్ష పార్టీలు రేవంత్ నిర్ణ‌యానికి కాస్తా సానుకూలంగానే స్పందించాయి. కానీ, రానురాను హైడ్రా తీరుపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌స్తుండ‌టంతో ప్ర‌తిప‌క్షాలు సైతం కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశాయి. అన్ని వైపుల నుంచి విమ‌ర్శ‌ల దాడి పెరుగుతుండంతో కాంగ్రెస్ నేత‌ల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్నది. రేవంత్ తీరులో ఇప్ప‌టికైనా మార్పు రాకుంటే రాబోయే కాలంలో హైద‌రాబాద్ న‌గ‌రంలో కాంగ్రెస్ పార్టీ బ‌లోపేతం కావ‌టం క‌ష్ట‌మ‌న్న భావ‌న‌ను ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

అవినీతి మరక అంటని ఆణిముత్యం చంద్రబాబు!

చంద్రబాబు నిప్పు.. ఆ నిప్పుకు చెదలు పట్టాయంటూ ప్రత్యర్థులు ఎంతగా దుష్ప్రచారం చేసినా ఫలితం లేకపోయింది. రెండు దశాబ్దాలకు పైగా చంద్రబాబుపై అవినీతి మరక అంటించాలని ప్రత్యర్థులు శతథా చేసిన ప్రయత్నాలన్నీ వీగిపోయాయి. కోర్టులు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చేశాయి. వాస్తవానికి చంద్రబాబునాయుడి జీవితంలో నేర చరిత్ర లేదని, ఆయన తప్పు చేయరు, ఎవరినీ చేయనీయరు అని ప్రతిపక్ష నేతలే  ప్రైవేటు సంభాషణల్లో అంగీకరిస్తారంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. అయినా రాజకీయ కారణాలలో ఆయనకు అవినీతి మరక అంటించేందుకు రాజకీయ ప్రత్యర్థులు చేసిన ప్రయత్నాలన్నీ నీరుగారిపోయాయి. న్యాయస్థానాలు చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చేశాయి.  తాజాగా తెలంగాణ హైకోర్టు ఆయనకు ఐఎంజీ భూముల విషయంలో  క్లీన్ చిట్ ఇచ్చింది. ఇంతకీ ఐఎంజీ భూముల వ్యవహారం ఏమిటంటే.. అమెరికాకు చెందిన ఐఎంజీ సంస్థకు  నేఅత్యున్నత క్రీడా సౌకర్యాల కల్పన కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు 2003లో భూములు కేటాయించారు. అయితే ఆ సంస్థ పనులు మొదలు పెట్టడానికి ముందే  చంద్రబాబు ప్రభుత్వం గద్దెదిగింది. 2004 ఎన్నికలలో విజయం సాధించిన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరింది. అప్పటి వైఎస్ ప్రభుత్వం ఐఎంజీకి భూములు స్వాధీనం చేయలేదు సరికదా, వాటిని రద్దు చేసింది.    అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఐఎంజీ భూముల కేటాయింపులో అక్రమాలు అంటూ సీనియర్ జర్నలిస్టు ఏబీకే ప్రసాద్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబుపై హైకోర్టులో కేసులు వేసారు.   అంతకు ముందు వైఎస్ విజయమ్మ కూడా చంద్రబాబుపై విచారణ జరిపించాలంటూ కోర్టులో కేసు వేశారు. సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ కోరారు. అయితే రాజకీయ కక్షలతో ఆధారాలు లేని కేసులు నమోదు చేశారని వ్యాఖ్యానించిన కోర్టు విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. ఆ తరువాత విజయమ్మ సుప్రీం కోర్టుకు వెళ్లారు. అక్కడా విజయమ్మ పిటిషన్ తిరస్కరణకు గురైంది.   ఆ తరువాత ఐఎంజీ భూముల కేటాయింపులో కుంభకోణం జరిగింది, సీబీఐ విచారణకు ఆదేశించాల్సిందే అంటూ విజయసాయిరెడ్డి కోర్టును ఆశ్రయించారు. దానిపై తాజాగా తెలంగాణ హైకోర్టు సీబీఐ విచారణ అవసరం లేదంటూ తీర్పు ఇచ్చింది. ఐఎంజీ భూముల కేటాయింపులో ఎలాంటి కుంభకోణం లేదనీ, ఎలాంటి అవకతవకలూ లేవనీ విస్ఫంష్టంగా తేల్చేసింది.  దీంతో చంద్రబాబు నిజాయితీ మరో సారి రుజువైంది.   వాస్తవానికి నాలుగుదశాబ్దాలకు పైగా మచ్చలేని చంద్రబాబు రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమే. ఇంత కీలకమైన బాధ్యతలు నిర్వర్తించిన వారిపై ఆరోపణలు రావడం.. కేసులు నమోదవడం సహజం. అయితే చంద్రబాబునాయుడు పై జగనమోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెట్టిన కేసులు తప్ప.. అంతకు ముందు కేసులు లేవు. నేర చరిత్ర ఇసుమంతైనా లేని ప్రజాజీవితం ఆయనది. కానీ ఆయనపై లెక్కేలేన్ని కోర్టుల్లో మాత్రం పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి.  కానీ ఏమీ తేల్చలేకపోయాయి. తాజాగా ఐఎంజీ పిటిషన్లోనూ ప్రాథమిక ఆధారాలు లేవని హైకోర్టు తేల్చింది.  

ఎమ్మెల్యే  కౌషిక్ రెడ్డి హౌజ్ అరెస్ట్ 

బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జంప్ అయిన నేతలకు బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఇరు పార్టీల మధ్య   మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. బిఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడిగాంధీని మరో  బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి  కౌషిక్ రెడ్డి   ఆరోపణలు చేయడం గత కొన్ని రోజులుగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. బిఆర్ ఎస్ గుర్తుపై గెలిచిన అరికెపూడిగాంధీ వెంటనే రాజీనామా చేయాలని కౌషిక్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.కౌషిక్ రెడ్డిపై  కూడా అరికెపూడి కూడ ఇవ్వాళ అగ్రహం వ్యక్తం చేశారు. కౌషిక్  రెడ్డి నా ఇంటికి వస్తానని అన్నారు. నా ఇంటిపై గులాబీ జెండా ఎగరవేస్తానని అన్నారు. దమ్ముంటే ఉదయం పదకొండు గంటలకు రావాలని  అరికెపూడి ఘాటుగా స్పందించారు.  నువ్వో నేనే తేల్చుకుందామన్నారు.  నా ఇంటికి కౌషిక్ రెడ్డి రాకుంటే నేనే నీ ఇంటికి వస్తానని అరికెపూడి అన్నారు. ఈ నేపథ్యంలో కౌషిక్ రెడ్డిని  హౌజ్ అరెస్ట్ చేశారు.   నా మాటలను అరికెపూడి వక్రీకరించాడని కౌశిక్ రెడ్డి అంటున్నారు. హౌజ్ అరెస్ట్ చేయడం వల్లే అరికెపూడి ఇంటికి వెళ్లలేకపోతును అని  కౌషిక్ రెడ్డి అన్నారు. కెసీఆర్ తో నాకు మధ్య ఎలాంటి విభేధాలు లేవని మరో వైపు అరికెపూడి వివరణ ఇచ్చారు.   

ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో బాధితురాలికి వైద్య పరీక్షలు

సత్యవేడు తెలుగుదేశం ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆదిమూలం  ఆదిమూలం తనను లైంగికంగా వేధించారు, అత్యాచారం చేశారని ఆరోపించి, ఆయన మీద అత్యాచారం కేసు పెట్టిన మహిళ  ఎట్టకేలకు వైద్య పరీక్షలకు ముందుకొచ్చారు.  తొలుత  మీడియా ముందుకు వచ్చిన ఆమె తనకు రాజకీయంగా ఎలాంటి మద్దతూలేదని, తనకు భయమేస్తోందని చెప్పిన ఆ మహిళ ఈ తరువాత వైద్య పరీక్షలకు నిరాకరించారు. దీంతో ఆమెకు బెదరింపులు వచ్చాయా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. సరిగ్గా అదే సమయంలో ఆదిమూలం మీద అత్యాచారం కేసు పెట్టిన మహిళ మీద సత్యవేడు ప్రాంతంలోని దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా ఎదుగుతున్న ఆదిమూలం లాంటి దళిత నాయకుడిని బదనాం చేయడానికే ఆ మహిళ ఇలాంటి ఆరోపణలు చేస్తూ, కేసు పెట్టిందని మండిపడుతూ, ఆ మహిళ మీద తిరుపతి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో వారు కేసులు నమోదు చేశారు.   ఇక తాజాగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందిన ఆదిమూలం డిశ్చార్జ్ అయ్యి పుత్తూరులోని తన నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే బంధువులు, గన్ మెన్లు ఆయనను కలవడానికి ఎవరినీ అనుమతించడం లేదు. ఆదిమూలం అత్యాచారం కేసుకు  సంబంధించి తిరుపతి ఇంటెలిజెన్స్ డిఎస్పి కనజక్షన్ నేతృత్వంలో విచారించి ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మరోవైపు తపపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించారు.   తనపై నమోదైన కేసును కొట్టివేయాలని మంగళవారం (సెప్టెంబర్ 9)క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి దర్యాప్తూ చేయకుండానే పోలీసులు తనపై కేసు నమోదు చేశారని ఆదిమూలం పిటిషన్ లో పేర్కొన్నారు. అదలా ఉండగా ఇంత కాలం వైద్యపరీక్షలకు నిరాకరించిన బాధితురాలు ఆదిమూలం క్యాష్ పిటిషన్ దాఖలు చేసిన అనంతరం వైద్య పరీక్షలకు ముందుకొచ్చారు.  తిరుపతి మెటర్నరీ హాస్పిటల్లో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు, మరో రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని సూచించారు.  ఇక ఆ వైద్య పరీక్షల రిపోర్టు ఆధారంగా పోలీసులు ఎమ్మెల్యేను విచారించనున్నారు. ఇలా ఉండగా ఎమ్మెల్యే ఆదిమూలం తరఫుర న్యాయవాది శేషకుమారి వాదించనుండగా, ప్రభుత్వం తరఫు న్యాయవాదిగా వరలక్ష్మి వాదించనున్నారు. 

కేజ్రీవాల్ కు దక్కని బెయిలు

మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట లభించలేదు. కోర్టు ఆయనకు మరోసారి రిమాండ్ పొడిగించింది. మద్యం కుంభకోణం కేసులో అరెస్టై ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కు బుధవారం (సెప్టెంబర్ 11)తో జ్యుడీషియల్ గడువు ముగియడంతో ఆయనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పెషల్ జడ్జి జస్టిస్ కావేరీ బవేజా ముందు ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 25 వరకూ పొడిగించారు.  ఇలా ఉండగా తన  అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు తీర్పు రిజర్వ చేసింది. కేజ్రీవాల్ పిటిషన్ పై ఈ నెల 5 సుప్రీం కోర్టు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్ తో కూడిన ధర్మాసనం ముందు కేజ్రీ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలూ విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ చేసింది. ఇదే మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పటికే బెయిలుపై విడుదలయ్యారు. 

కడుపు మండి రెండు రాళ్లేస్తే తప్పేంటి?.. జగన్ షాకింగ్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టారు. బుధవారం ఆయన ఏపీకి వచ్చింది వరద బాధితులను పరామర్శించడానికి కాదు. వారికి సహాయం అందించడానికి కాదు. తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో పరారైపోవడానికి ప్రయత్నించి విఫలమై అరెస్టయిన వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను జైలులో పరామర్శించడానికి. పది రోజులుగా వరద బాధితులు కష్టాల్లో ఉంటే పరామర్శించడానికి ఆయనకు సమయం లేకపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవిశ్రాంతంగా వరద బాధితుల సహాయ, పునరావాస కార్యక్రమాలలో తలమునకలై జనం చెంతన నిలిస్తే.. దాడి కేసులో అరెస్టైన నిందితుడికి మద్దతుగా జగన్ జైలుకెళ్లి పరామర్శించారు. ఇద్దరికీ అదీ తేడా.  సరే జైల్లో నందిగం సురేష్ ను పరామర్శించి బయటకు వచ్చిన జగన్ మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం కార్యాలయంపై నందిగం సురేష్ దాడికి పాల్పడ్డాడు నిజమే. అయితే అందులో తప్పేముంది? అని ప్రశ్నించారు. నాటి ఆ దాడికి కారణం తెలుగుదేశం అధికార ప్రతినిథి పఠాభి అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్న తనను బోసడీకే అనడమే అని చెప్పుకొచ్చారు. తనను దూషించడంతో కడుపు మండిన జనం   తెలుగుదేశం కార్యాలయంపై రాళ్లేశారని జగన్ అన్నారు.  అందులో తప్పేముందని అమాయకత్వం ప్రదర్శించారు. తనను ప్రేమించే, అభిమానించే వాళ్లకు పఠాభి తనను బోసడీకే అనడం వల్లనే కడుపు మండి దాడికి పాల్పడ్డారని జగన్ చెబుతున్నారు.   తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి జరిగినప్పుడు కూడా జగన్  దాదాపు ఇలాగే మాట్లాడారు. అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ, ఇప్పుడు అధికారం కోల్పోయి కేవలం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ కూడా జగన్ బాధ్యత లేకుండానే వ్యవహరిస్తున్నారని చెప్పాలి.  తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి జరిగి రెండేళ్లు దాటింది. అయితే అప్పట్లో అప్పటికి అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎవరినీ అరె స్టు చేయలేదు. సీసీ ఫుటేజీ ఆధారాలను పరిగణనలోనకి తీసుకోలేదు. పైపెచ్చు అప్పటి పోలీసు బాస్   ఆ దాడిని  భావప్రకటనా స్వేచ్ఛగా అభివర్ణించారు. ఈ న్యూస్ కూడా తప్పకుండా చదవండి.... బోసడీకే అంటే అర్థం తెలుసా? బూతా? కాదా? అంత అడ్డగోలుగా, అవధులులేని అహంకారంతో ఐదేళ్లు పాలించిన జగన్ కు ప్రజలు ఓటుతో గట్టిగా బుద్ధి చెప్పారు. చరిత్రలో ఇంత వరకూ ఎవరికీ ఎదురుకానంతటి ఘోర పరాజయాన్ని అందించారు. అయినా జగన్ లో మార్పు రాలేదు.  నిజానికి ఇలా దాడిని సమర్ధిస్తూ మాట్లాడినందుకు జగన్ పై కూడా కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. పార్టీ అధినేత స్థాయి వ్యక్తి ఇలా దాడిని సమర్ధిస్తూ మాట్లాడటమంటే పార్టీ శ్రేణులకు హింసాకాండకు దిగమని సంకేతాలిచ్చినట్లే భావించాల్సి ఉంటుంది. ఇంత నిస్సిగ్గుగా, బాధ్యతా రహితంగా తెలుగుదేశం కార్యాలయంపై దాడిని, దాడికి పాల్పడిన వారినీ వెనకేసుకొస్తున్న జగన్ కు రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింసాకాండ గురించి మాట్లాడే నైతిక అర్హత ఇసుమంతైనా లేదు.  ఇలా ఉండగా తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, దేవినేని అవినాష్ లు ఇంకా పోలీసులకు చిక్కకుండా పరారీలోనే ఉన్నారు. వాళ్లు అరెస్టయిన తరువాత కూడా జగన్ వాళ్లని పరామర్శించడానికి జైలుకువెళ్లి ఇవే మాటలు చెబుతారు.  సందేహం లేదు.  

రాజ్యసభ అభ్యర్థిగా గల్లా జయదేవ్ కు తెలుగుదేశం టికెట్?

గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ను రాజ్యసభకు పంపించాలని చంద్రబాబు యోచిస్తున్నారా? అంటే తెలుగుదేశం వర్గీయుల నుంచి ఔననే సమాధానమే వస్తున్నది. వైసీపీ హయాంలో కక్షసాధింపు రాజకీయాలతో విసిగివేసారిపోయిన గల్లా జయదేవ్ రాజకీయాలకు విరామం ఇస్తున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి వందల, వేల కోట్ల పన్ను చెల్లిస్తూ కూడా ప్రభుత్వాల వేధింపులకు గురికావలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే జగన్ సర్కార్ రాజకీయ వేధింపుల కారణంగా గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పడంతో ఆగలేదు. తన ఆధ్వర్యంలో నడుస్తున్న అమరరాజా బ్యాటరీస్ సంస్థను కూడా రాష్ట్రం నుంచి తరలించేశారు.  కేవలం రాజకీయ కక్ష సాధింపు, వేధింపులు తప్ప మరోటి తెలియని జగన్ కు ఏపీకి బ్రాండ్ ఇమేజ్ గా నిలిచి, రాష్ట్ర, దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు చోద‌క శ‌క్తిగా గుర్తింపు పొందిన అమరరాజా బ్యాటరీస్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడి కంపెనీని రాష్ట్రం నుంచి తరిమేయడమంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నిలువులోతు గొయ్యి తీసి కప్పెట్టేయడమేనని తెలిసినా, రాష్ట్రం కంటే, రాష్ట్ర ప్రయోజనాల కంటే వ్యక్తిగత కక్ష సాధింపులే ముఖ్యంగా భావించారు. అందుకే అధికారంలో ఉన్నామన్న అహంతో   ట్యాక్స్‌ రూపంలో   ఏపీ ప్ర‌భుత్వానికి ఏటా సుమారు 1200 కోట్ల మేర ప‌న్నులు క‌డుతున్న అక్ష‌య పాత్ర‌లాంటి కంపెనీ రాష్ట్రం తరిలిపోయేలా చేశారు. అసలా కంపెనీని మూయించడమే లక్ష్యంగా జగన్ తాను అధికారంలో ఉండగా పావులు కదిపారు. ఆ పని చేసేసే వారే అయితే కంపెనీ యాజమాన్యం కోర్టుకు వెళ్లి మరీ జగన్ యత్నాలను అడ్డుకుంది.  నిబంధ‌న‌లన్నీ పక్కాగా ఫాలో అవుతున్న అంతర్జాతీయ స్థాయి కంపెనీ అయిన అమరరాజా బ్యాటరీస్ పై అప్పట్లో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కాలుష్యం పేరుతో  మూయించాలని చూడటం వెనుక ఉన్నది రాజకీయమేనని అప్పట్లోనే పారిశ్రామికవర్గాలు గగ్గోలు పెట్టాయి. అయినా అధికార అహంతో కన్నూమిన్నూగాకుండా వ్యవహరించిన జగన్ సర్కార్ కంపెనీ మూసివేయించేయాలన్న పట్టుదలతో అడుగులు వేసింది. అయితే అమరరాజా సర్కర్ కోర్టును ఆశ్రయించి ప్రభుత్వ దుష్టయత్నాన్ని చట్టపరంగా ఎదుర్కొంది. అయితే ప్రభుత్వం కక్షగట్టి వ్యవహరిస్తున్న తీరుతో విసిపిపోయిన అమరరాజా బ్యాటరీస్ యాజమాన్యం ఏపీకి గుడ్ బై చెప్పేసి పొరుగు రాష్ట్రం తెలంగాణకు తరలిపోయింది. ఇక్కడి సర్కార్ బంగారుబాతు లాంటి అమరరాజా బ్యాటరీస్ ను తరిమిగొడితే తెలంగాణ సర్కార్ రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానించింది.   వాస్తవానికి గల్లా జయదేవ్ కు అమరరాజా బ్యాటరీస్ కు ఉన్న అనుబంధం అంతా ఇంత అని చెప్పలేం. రాష్ట్ర విభజన తరువాత తాము చెల్లించే పన్నులు.. త‌మ సొంత‌ రాష్ట్రానికే దక్కాలనే కార‌ణంతో  అమరరాజా బ్యాటరీస్ తన కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి తిరుపతికి తరలించింది. అలాంటి కంపెనీని జగన్ సర్కార్ రాష్ట్రం నుంచి తరిమేసింది.  ఇలా ఏపీ ఆర్థిక వ్య‌వ‌స్థ‌, ఉద్యోగ‌, ఉపాధి, సామాజిక సేవ‌లో ఎంతో తోడ్పాటు అందిస్తున్న అమ‌ర‌రాజా కంపెనీని గల్లా జయదేవ్ తెలుగుదేశం ఎంపీ అన్న ఏకైక కారణంతో  వేధించి రాష్ట్రం నుంచి తరిమేసింది.  జగన్ సర్కార్ వేధింపులతో విసిగిపోయిన గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు రాష్ట్రంలో  తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువు దీరిన తరువాత ఒకింత చురుకుగా రాజకీయ కార్యకలాపాలలో పాల్గొంటున్నారు.  ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో గల్లా జయదేవ్ కు సముచిత స్థానం ఇచ్చి, రాజ్యసభ సభ్యుడిగా పంపి ఆయన సేవలు వినియోగించుకోవాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. వైసీపీ నుంచి ఇటీవల ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయడంతో ఆ స్థానాలకు  ఉప ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీకీ, రాజ్యసభ సభ్యత్వానికి మెపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో వారిరువురిలో మోపిదేవి వెంకటరమణ స్థానంలో గల్లా జయదేవ్ ను రాజ్యసభక పంపాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. మంచి వక్త అయిన గల్లా జయదేవ్ ను రాజ్యసభ సభ్యుడిగా పంపిస్తే తెలుగుదేశం తరఫున రాజ్యసభలో బలంగా గొంతెత్తగలరన్న భావన తెలుగుదేశం వర్గాలలో కూడా వ్యక్తం అవుతోంది.  

యూట్యూబ్ జర్నలిస్ట్ ల నియంత్రణకు చట్టం దిశగా రేవంత్ సర్కార్ ? 

పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయి కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. గతంలో కెసీఆర్  ప్రభుత్వం మీడియాను అణచి వేసింది. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచే మీడియా గొంతు నొక్కేయడానికి బిఆర్ఎస్ చేసిన పాపాలు అన్నీ ఇన్నీ కావు. వైఎస్ ఆర్ రాజశేఖరరెడ్డి హాయంలో జర్నలిస్ట్ లకు  70 ఎకరాల కేటాయింపు  జరిగింది. న్యాయవివాదాల్లో చిక్కుకుని గత రెండేళ్ల క్రితం తుది తీర్పు వచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తుది తీర్పును అధికారం కోల్పోయే వరకు  కెసీఆర్  అమలు చేయలేదు. జర్నలిస్ట్ లకు అన్యాయం జరిగిందని అప్పటి పిసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గొంతెత్తి మాట్లాడారు. మేనిఫెస్టోలో  కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ఆ భూములను అప్పగిస్తుందన్నారు.  గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రయ్యారు. ఇచ్చిన హామీ ప్రకారం జర్నలిస్ట్ లకు భూమి అప్పగించే కార్యక్రమం రవీంద్రభారతిలో జరిగింది. తన చేతుల మీదుగా జవహార్ హౌజింగ్ సొసైటీకి మెమో అంద జేసిన రేవంత్ రెడ్డి  సందర్బంలేకుండానే యూట్యూబ్ చానల్స్ పై మండిపడ్డారు.  రేవంత్ రెడ్డి స్వగ్రామంలో ఇటీవలె ఇద్దరు మహిళా జర్నలిస్ట్ లు ప్రజాపాలన అమలు తీరుతెన్నులను తెలుసుకోవడానికి వెళ్లారు. వారిని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ ఇద్దరు మహిళా జర్నలిస్టు ల్లో ఒక యూ ట్యూబర్ ఉన్నారు. చెరువుల పరిరక్షణ కోసం  హైడ్రా చేపట్టిన  కూల్చివేతలు ముఖ్యమంత్రికి వర్తించవా అని మరో యూట్యూబర్ రేవంత్ స్వగ్రామానికి వెళ్లారు. ఎఫ్ టిఎల్ , బఫర్ జోన్ లో ఉన్న రేవంత్ ఇల్లును ఆ యూట్యూబర్ షూట్ చేశారు.ఈ ఇల్లును హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎందుకు కూల్చడం లేదని ఆ యూట్యూబర్ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో  వైరల్ కావడం రేవంత్ రెడ్డికి అగ్రహం కలిగించింది.   మహిళా జర్నలిస్ట్ అని చూడకుండా ఇక్కడ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు. ఈ యూట్యూబర్ గత ఎన్నికల్లో కెసీఆర్ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తూ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు.  మహిళా జర్నలిస్ట్ ల టార్గెట్ గా రేవంత్ రెడ్డి రవీంద్రభారతిలో మాట్లాడినట్టు పరిశీలకులు చెబుతున్నారు. అంతకు క్రితం రోజు ఈ యూట్యబర్ రేవంత్ ను ఏకిపారేయడం గమనార్హం. రేవంత్ ఇల్లు బఫర్ జోన్ లో ఉందని ఇంతవరకు ఏ మీడియా సంస్థ ప్రచారం చేయలేదు. కానీ ఈ యూట్యూబర్ రేవంత్ టార్గెట్ గా ప్రచారం చేయడం ముఖ్యమంత్రికి మిగుడు పడలేదు.  యూట్యూబర్ల సహాకారంతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ అవే యూట్యూబ్ లను కట్టడి చేయాలని చూస్తోంది. ఏరుదాటకముందు వీరమల్లన్న ఏరుదాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టు తయారయ్యింది అని నెటిజన్లు అంటున్నారు. ఈ యూట్యూబ్ లను కట్టడి చేయడానికి  జర్నలిస్ట్ లకు  భూమి అప్పగంచే కార్యక్రమమే వేదిక అయింది. పేట్ బషీర్ బాద్ లోని 38 ఎకరాల భూమి అప్పగించే మెమో అందజేత కార్యక్రమంలో యూట్యూబ్ ల నియంత్రణకు  శ్రీకారం చుట్టారు. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి  ప్రసంగంలో కూడా యూట్యూబర్లు టార్గెట్ అయ్యారు. అక్రిడేషన్ కార్డు, హెల్త్ కార్డులు యూ ట్యూబ్ జర్నలిస్ట్ లకు ఇచ్చే విషయం చర్చ జరుగుతుందన్నారు.    యూట్యూబర్లను పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేయనుందని తెలుస్తోంది. ప్రస్తుతం లబ్దిదారులైన జర్నలిస్ట్ లు, యూ ట్యూబ్ జర్నలిస్ట్ లకు మధ్య చిచ్చు రాజేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం  చూస్తోంది. గతంలో కెసీఆర్ ప్రభుత్వం కూడా ఇదే వైఖరి అవలంబించింది.  జవహార్ సొసైటీ జర్నలిస్ట్ లకు కొత్తగా జర్నలిజంలో వచ్చిన జర్నలిస్ట్ లకు ఈ భూమిని ముడిపెట్టారు. అందరికీ ఒకే సారి అంటూ వాయిదాలు వేశారు. సతీలీలావతి సినిమాలో కమల్ హసన్ దగ్గరికి ఫ్రెండ్ భార్య వచ్చి నా భర్త ఎప్పుడొస్తాడు అని అడిగితే దసరాకు వస్తాడు అని చెబుతాడు. దసరాకు రాకపోయే సరికి ఫ్రెండ్ భార్య మళ్లీ కమల్ హసన్ ను అడిగితే దీపావళికి వస్తాడు అని చెబుతాడు. దీపావళికి రాకపోయేసరికి మళ్లీ ఫ్రెండ్ భార్య అడుగుతుంది. ఈ సారి సంక్రాతికి తప్పకుండా వస్తాడని కమల్ హాసన్ చెబుతాడు. ఇలా కెసీఆర్ కూడా ఆ పండుగ ఈ పండుగ అని జర్నలిస్ట్ లకు మభ్యపెట్టాడు.రెండు దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన భూమిని కానీ రేవంత్ రెడ్డి యూట్యూబర్లను కించపరిచేలా మాట్లాడి చర్చనీయాంశమయ్యారు. రెండుదశాబ్దాల నుంచి పెండింగ్ లో ఉన్న భూమిని లబ్దిదారులకు అందించే కార్యక్రమంలో కేవలం యూట్యూబర్లను టార్గెట్ చేయడం వివాదాస్పదమైంది.   యూట్యూబ్ పెట్టుకున్న జర్నలిస్ట్ లకు  ఎమర్జెన్సీ తలపించేలా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.  ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే  మీడియా ముఖ్యభూమిక వహిస్తుంది. నాలుగో మూలస్థంభమైన మీడియా పాత్రను యూట్యూబ్ జర్నలిస్ట్ లు చక్కగా పోషిస్తున్నారు. ఆయా పార్టీలకు వత్తాసుపలికే యూట్యూబర్లు ఉండనే ఉన్నారు. వారిని అడ్డం పెట్టుకుని యూట్యూబ్ జర్నలిస్ట్ లను ఒకే గాటన కట్టడం సబబు కాదని ప్రజాస్వామిక వాదులు అంటున్నారు. పత్రికలు, టీవీ చానల్స్  కూడా పార్టీలవారిగా మీడియా సంస్థలను నిర్వర్తిస్తున్నాయి. అంతమాత్రాన వారికి ఇచ్చే అక్రిడేషన్, హెల్త్ కార్డులను  బిఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆపలేదు కానీ  సోషల్ మీడియాపై నియంత్రణ  రేఖ పెట్టాలని రేవంత్ సర్కార్ కుట్ర చేస్తోందని వినిపిస్తోంది. 

జగన్ పాస్ పోర్టు రెన్యువల్ కు హైకోర్టు అనుమతి

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు హై కోర్టులో ఊరట లభించింది. ఆయన పాస్ పోర్టు రెన్యువల్ విషయంలో జగను అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. జగన్ పాస్ పోర్టు రెన్యువల్ చేయాలని అధికారులను ఆదేశించింది. అలాగే జగన్ కోరిన విధంగా ఐదేళ్ల రెన్యువల్ కు ఆమోదం తెలిపింది. దీంతో జగన్ లండన్ యానానికి అడ్డంకులు తొలగిపోయినట్లైంది. దీంతో ఆయన ఏ క్షణంలోనైనా లండన్ యాత్రకు బయలుదేరే అవకాశం ఉంది.   ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం జగన్ కు ఉన్న డిప్లమేటిక్ పాస్ పోర్టు ఆయన అధికారం కోల్పోగానే ఆటోమేటిక్ గా రద్దైంది. దీంతో ఆయన సాధారణ పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు.  ఆయన ఐదేళ్ల జనరల్ పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చినా ప్రజాప్రతినిథుల కోర్టు మాత్రం జగన్  పాస్ పోర్టు కాల పరిమితిని ఏడాదికి కుదించింది. దీంతో ప్రజాప్రతినిథుల కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆయనకు ఐదేళ్ల గడువుతో పాస్ పోర్టు జారీ చేయాలని అధికారులను ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.  

ఆ బోట్ల వెనుక కుట్రకోణం..కన్ఫర్మ్!?

కృష్ణానదిలో వరద ప్రవాహం ఉధృతంగా ఉన్నసమయంలో నదిలో కొట్టుకు వచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొనడం వెనుక కుట్ర కోణం ఉన్నదన్న సంగతి దాదాపు కన్ ఫర్మ్ అయిపోయింది. ఈ విషయంలో దోషులను వదిలేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత ఇప్పటికే కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.   బోటు యజమానులు ఇప్పటి వరకూ ఆ బోట్లన క్లెయిమ్ చేసుకోవడానికి రాకపోవడంతో ఆ బోట్లను ఉద్దేశ పూర్వకంగానే ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద వరద ప్రవాహాన్ని అడ్డుకునే లక్ష్యంగా వదిలారన్న అనుమానాలు ధృవపడుతున్నాయి. అంతకంటే ముఖ్యంగా వరద ఉధృతికి సంబంధించిన హెచ్చరికలను కూడా లెక్క చేయకుండా అత్యంత నిర్లక్ష్యంగా వాటిని బలహీనమైన ప్లాస్టిక్ తాడుతో లంగరు వేయడం కూడా కుట్ర కోణాన్ని ఎత్తి చూపుతోంది. పైగా ఒక్కొక్కటీ 20 టన్నుల బరువు ఉన్న మూడు బోట్లను బలమైన ఇనుప గొలుసులతో ఒకదానికి ఒకటి కట్టేసి, అవి కొట్టుకుపోకుండా ఉండటానికి మాత్రం ప్లాస్టిక్ తాడుతో లంగరు వేసిన తీరే  కుట్ర కోణాన్ని ఎత్తి చూపుతోంది.  కృష్ణనది ఉదృతంగా ప్రవహిస్తున్నప్పుడు నదిలో 5 మరబోట్లు కొట్టుకురాగా వాటిలో రెండు, గేట్ల గుండా దిగువకు వెళ్ళిపోయాయి. అయితే ఇనుప గొలుసులతో ఒకదానికి ఒకటి కట్టేసి ఇసుకతో నింపేసి ఉన్న మూడు బోట్లు గేట్లని ఢీకొని అక్కడే ప్రవాహానికి అడ్డంగా నిలిచిపోయాయి. అవి ఢీకొనడం వలన బ్యారేజీ రెండు గేట్ల కౌంటర్ వెయిట్స్ దెబ్బ తిన్నాయి. అవి లేకుండా గేట్లు ఆపరేట్ చేయడం సాధ్యపడదు. కనుక అప్పటికప్పుడు కన్నయ్య నాయుడు అధ్వర్యంలో రెండు కౌంటర్ వెయిట్స్ తయారు చేయించి, నది ఉదృతంగా ప్రవహిస్తున్నప్పుడే వాటిని అమర్చారు. ఇప్పుడు ప్రవాహానికి అడ్డంగా గేట్ల వద్ద ఉన్న బోట్లను తీయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మూడు బోట్లు కలిపి దాదాపు 60 టన్నలు బరువు ఉంటాయి. వీటిని తొలగించడం కోసం ఒక్కొక్కటీ 50 టన్నుల సామర్ధ్యం ఉన్న రెండు భారీ క్రేన్లను ఉపయోగించినా ఫలతం లేకపోయింది. వంద టన్నుల బరువును లేపగల రెండు భారీ క్రేన్లను ఉపయోగించినా ఆ బోట్లు ఇంచు కూడా కదలలేదు. ఇసుకతో నింపి ఉండటంతో వాటిని కదిలించడం సాధ్యం కాలేదని క్రేన్ ఆపరేటర్లు చెబుతున్నారు. దీంతో ఇక ఇప్పుడు ఆ బోట్లను కత్తిరించి వాటిని తొలగించాలని నిర్ణయానికి వచ్చారు. ఇందు కోసం డైవింగ్ టీమ్ లు రంగంలోకి దిగనున్నాయి. అనుభవజ్ణులైన డైవర్లు నదిలోకి వెళ్లి కట్టర్లతో బోట్లను కత్తిరిస్తారు. ఆ తరువాత పరిస్థితిని బట్టి ఆ ముక్కలను ప్రవాహం దిగువకు వదిలేయడమా, లేకా క్రేన్ల ద్వారా బయటకు తీయడమా అన్నది నిర్ణయిస్తారు.  ఇక ఇప్పుడు కుట్ర కోణం వద్దకు వస్తే ఇప్పటికే ఆ బోట్ల యజమానులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఆ బోటు యజమానులకు వైసీపీ నేతలతో ఉన్న సంబంధాలు ఉండటంతో దీని వెనుక ఉన్నది వైసీపీయే అన్న అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే అరెస్టై ఉన్న వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్, తలశిల రఘురాం వాట్సాప్ కాల్స్ మెసేజెస్ ద్వారా వైసీపీ అగ్రనేతల ఆదేశాల మేరకే ఉద్దేశపూర్వకంగా  వరద నీటిలో బోట్లను వదిలారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నందునే హోంమంత్రి వంగలపూడి అనిత దేశ ద్రోహం కేసు గురించి ప్రస్తావించారని పరిశీలకులు అంటున్నారు.  

వైసీపీ నుంచి వలసల వరద.. గట్లు తెగిపోవడం ఖాయం!

వైసీపీ ఖాళీ అయిపోతుందా? ఆ పార్టీ నుంచి వలసలను ఆపడం జగన్ వల్ల కావడం లేదా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. వైసీపీ అధికారం ఉన్నంత కాలం పెత్తనం చెలాయించిన నేతలు సైలెంట్ అయిపోయారు. ఒకరిద్దరు ఇప్పటికీ తెలుగుదేశం కూటమి సర్కార్ పై నోరు పారేసుకుంటున్నా.. వారిని జనం పట్టించుకోవడం లేదు. ఇక వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఇష్టారీతిగా వ్యవహరించిన ఆ పార్టీ నేతలు పలువురు రాజకీయాలకు దూరంగా మౌనంగా ఉంటున్నారు. మారదామన్నా వారికి చోటిచ్చే పార్టీ లేకపోవడంతో ప్రస్తుతానికి మౌనమే మేలని మిన్నకుంటున్నారు. ఇక పలువురు ఇప్పటికే పార్టీని వీడి అవకాశమున్న పార్టీల్లో సర్దుకున్నారు. పదవులు, హోదా గురించి మాట్లాడకుండా చోటిస్తే చాలన్నట్లుగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ గూటికి చేరడానికి రెడీ అయిపోతున్నవారు మరి కొందరు ఉన్నారు.  రాజ్యసభలో బలం ఉందంటూ భుజాలెగరేస్తున్న జగన్ కు అక్కడా గండి పడింది. ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ, బీదమస్తాన్ రావులు రాజీనామా చేయగా, ఇంకా పలువురు అదే బాటలో ఉన్నారనీ, ఇప్పటికే తెలుగుదేశం, జనసేన, బీజేపీలతో టచ్ లోకి వెళ్లారనీ వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. అలాగే  శాసనమండలిలో కూడా వైసీపీకి ఉన్నది బలం కాదు వాపు అని తేలిపోయింది. జగన్ ను ధిక్కరించేందుకు పలువురు ఎమ్మెల్సీలు రెడీగా ఉన్నారని తెలుస్తోంది. జగన్ ఢిల్లీ ధర్నాకు డుమ్మా కొట్టి ఇద్దరు ఎమ్మెల్సీలు మండలికి హాజరయ్యరని, ముందు ముందు పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు కూడా జగన్ కు ఝలక్ ఇవ్వడం ఖాయమన్న చర్చ వైసీపీలోనే జరుగుతోంది.  ఇక తాజాగా జగన్ పార్టీకి దూరం అవుతున్న వారి జాబితాలో జగన్ కు సన్నిహితుడిగా గుర్తింపు ఉన్న మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను చేరిపోయారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరడానికి రెడీ అయిపోయారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం నిజమే అనడానికి గత కొద్ది కాలంగా సామినేని ఉదయభాను పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండటమే తార్కాణమంటున్నారు పరిశీలకులు.      అయితే ఉదయభానుకు వైసీపీ అధికారంలో ఉండగా జనసేనకు వ్యతిరేకంగా ఆయన చేసిన ప్రచారం ఇప్పుడు అవరోధంగా మారుతోంది. జనసేన శ్రేణులు ఉదయభానును పార్టీలో చేర్చుకోవద్దంటూ పవన్ కల్యాణ్ పై ఒత్తిడి తీసుకువస్తున్నారంటున్నారు.  గతంలో జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో జనసేన ఏర్పాటు చేసిన జెండా దిమ్మెను ఉదయభాను ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ధ్వసం విషయాన్ని జనసేన కార్యకర్తలు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.  నాడు దిమ్మె ధ్వంసంపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన జనసేన నాయకులు, కార్యకర్తలపైనే కేసులు నమోదు చేయించిన ఉదయభానును పార్టీలో ఎలా చేర్చుకుంటారని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు.   వీటన్నిటికీ తోడు జనసేనలో చేరడానికి ఉదయభాను కొన్ని కండీషన్లు పెట్టారనీ, వాటిలో ప్రధానంగా  తనకు జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షపదవి ఇవ్వాలనీ కోరుతున్నారని అంటున్నారు. దీనిని కూడా జనసైనికులు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు.  మొత్తం మీద సామినేని ఉదయభానుకు జనసేనలో ఎంట్రీ వచ్చినా రాకున్నా ఆయన మాత్రం వైసీపీని వీడడం ఖాయమైందని పరిశీలకులు చెబుతున్నారు.   

గోదావరి జిల్లాల్లో బాబు పర్యటన.. కొల్లేరు ముంపు ప్రాంతాలలో ఏరియల్ సర్వే

పది రోజుల పాటు ఇంటికి కూడా వెళ్లకుండా బెజవాడ ముంపు బాధితులకు అండగా నిలిచిన చంద్రబాబు.. కనీసం ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా ఉభయగోదావరి జిల్లాల్లో ముంపు ప్రాంతాల పర్యటనకు బయలుదేరారు. బుధవారం (సెప్టెంబర్ 11) ఉదయం పదిగంటలకు విజయవాడ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరిన చంద్రబాబు ఏలూరు జిల్లా కైకలూరు, కొల్లేరు ప్రాంతాలలో వరద ప్రభావిత ప్రాంతాలలో ఏరియల్ సర్వే చేశారు. అనంతరం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం దుంపగడప గ్రామంలో కొల్లేరు ప్రాంతంలోని ఉప్పుటేరు వంతెన వద్ద వరద పరిస్థితిని పరిశీలించి రైతులతో ముఖాముఖీ మాట్లాడనున్నారు.  బుడమేరు పోటెత్తి విజయవాడ నగరాన్ని ముంచెత్తిన నీరంతా దిగువున ఉన్న కొల్లేరుకు చేరింది. కొల్లేటి సరస్సులో నీటి నిల్వ సామర్థ్యం మూడు టీఎంసీలు ఉండగా.. దీనికి మించి వరద కొల్లేరులోకి చేరడం, పెద్ద సంఖ్యలో లంక గ్రామాలు ముంపులో చిక్కుకున్నాయి. భారీ నష్టం వాటిల్లింది.  చేపల చెరువులు ముంపునకు గురయ్యాయి. ఆయా గ్రామాలకు ప్రజలు పడవల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ తరుణంలో కైకలూరు పరిధిలో నష్టపోయిన కొల్లేరు ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు నాయుడు   ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించనున్నారు. ఆ తరువాత మధ్యాహ్నం కాకినాడ జిల్లా సామర్ల కోట చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్లంలో కిర్లంపూడి మండలంలోని ముంపు ప్రాంతాలలో పర్యటిస్తారు. ముంపు బాధితులతో మాట్లాడి నష్టం వివరాలు తెలుసుకుంటారు. అనంతరం సామర్లకోటకు తిరిగి వచ్చి అధికారులతో వరద పరిస్థితి, సహాయ చర్యలపై చర్చించి వారికి దిశా నిర్దేశం చేస్తారు. సాయంత్రం బయలుదేరి వెలగపూడి చేరుకుంటారు.  

నీవు నేర్పిన విద్యయే.. కేసీఆర్ కు రేవంత్ షాక్!

ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి దిమ్మ‌తిరిగే షాకిచ్చారా? గ‌తంలో కేసీఆర్ ప్ర‌యోగించిన ఫార్ములానే ప్ర‌స్తుతం బీఆర్ఎస్ పై రేవంత్ ప్ర‌యోగించారా..?  అంటే తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు విష‌యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బీఆర్ఎస్ శ్రేణులు సంతోషంగా ఉన్నారు. హైకోర్టు తీర్పు వ‌చ్చిన కొద్ది గంట‌ల్లోనే పీఏసీ (ప‌బ్లిక్ అకౌంట్స్ క‌మిటీ) చైర్మ‌న్ ఎంపిక విష‌యంపై కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌ద్వారా బీఆర్ఎస్ నేత‌ల‌కు హైకోర్టు తీర్పు సంతోషం గంటల సేపు కూడా మిగలకుండా ఆవిరైపోయింది.  శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీఆర్ఎస్  త‌ర‌పున విజ‌యం సాధించిన అరెక‌పూడి గాంధీని కాంగ్రెస్ ప్రభుత్వం పీఏసీ చైర్మ‌న్ గా నియమించింది. ఈ నియామకం సరికొత్త చర్చకు దారితీసింది. ఇటీవ‌ల అరెక‌పూడి గాంధీ సీఎం రేవంత్ రెడ్డిని క‌లిశారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న‌ట్లు అంద‌రూ భావించారు. దీంతో బీఆర్ఎస్ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన అరెక‌పూడి గాంధీకి పీఏసీ చైర్మ‌న్ ప‌ద‌వి ఎలా ఇస్తారంటూ బీఆర్ఎస్ నేత‌లు రేవంత్ స‌ర్కార్ ను ఇరుకుపెట్టే ప్ర‌య‌త్నం చేశారు.  తాజాగా అరికపూడి గాంధీ బీఆర్ఎస్ నేత‌ల‌కు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నాననీ,  కాంగ్రెస్  లో చేర‌లేద‌ని క్లారిటీ ఇచ్చాడు. హరీష్ రావుకు పీఏసీ చైర్మన్ పదవి ఇస్తేనే ప్రతిపక్షంగా భావిస్తారా? వేరే వాళ్లకు ఇస్తే ఒప్పుకోరా..? అంటూ ప్రశ్నించారు. అసెంబ్లీ నిబంధనల ప్ర‌కారం ప్ర‌తిప‌క్ష‌  బీఆర్ఎస్ పార్టీ నుంచి ముగ్గురు స‌భ్యుల‌ను పీఏసీకి ఎన్నుకోవాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ నుంచి హ‌రీశ్ రావు, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, గంగుల క‌మ‌లాక‌ర్ పేర్ల‌ను సూచించారు. అయితే,  కాంగ్రెస్ పార్టీ ముగ్గురు స‌భ్యుల‌ను ఎన్నుకుంది. వారిలో వేముల ప్ర‌శాంత్ రెడ్డి, గంగుల క‌మ‌లాక‌ర్ తోపాటు అరెక‌పూడి గాంధీల‌ను ఎన్నుకుంది. గాంధీని పీఏసీ చైర్మ‌న్ గా ఎంపిక చేయ‌డంపై బీఆర్ఎస్ నేత‌లు తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు. ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో చేరారనీ..ఆయనకు పీఏసీ చైర్మ‌న్ ప‌ద‌వి ఎలా ఇస్తారంటూ గ‌గ్గోలు పెడుతున్నారు. నిజానికి పీఏసీ చైర్మ‌న్ ప‌ద‌వి ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల‌కే ఇవ్వ‌టం ఆన‌వాయితీగా వ‌స్తుంది. టెక్నిక‌ల్ గా అరెక‌పూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నారు. రూల్స్ ప్ర‌కార‌మే గాంధీకి పీఏసీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇవ్వ‌టం జ‌రిగింద‌ని కాంగ్రెస్ చెబుతోంది. బీఆర్ఎస్ పార్టీకి ఇది బిగ్ షాక్ అనే చెప్పొచ్చు. పీఏసీ చైర్మ‌న్ ప‌ద‌వికోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్ రావు పేరును ఇచ్చిన‌ప్ప‌టికీ.. అరెక‌పూడి గాంధీ నామినేష‌న్ వేయ‌డంతో కాంగ్రెస్ ఆయ‌నకే ప‌ద‌విని క‌ట్ట‌బెట్టింది.  పీఏసీ చైర్మ‌న్ ఎంపిక విష‌యంలో కాంగ్రెస్ పార్టీ గ‌తంలో కేసీఆర్ అనుస‌రించిన విధానాన్నే అమ‌లు చేసిన‌ట్లు క‌నిపిస్తోంది. 2 018 ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ రెండో సారి విజ‌యం సాధించిన త‌రువాత కేసీఆర్ ప్ర‌తిప‌క్షానికే పీఏసీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చే ఆన‌వాయితీకి ఫుల్‌స్టాప్ పెట్టారు. పీఏసీ చైర్మ‌న్ ప‌ద‌వి కాంగ్రెస్ లోనే కొన‌సాగుతున్న ఎమ్మెల్యేల‌కు ఇవ్వాల‌ని అప్ప‌ట్లో కాంగ్రెస్ విజ్ఞ‌ప్తి చేసింది. కానీ, కేసీఆర్ కాంగ్రెస్ విజ్ఞ‌ప్తులు ప‌ట్టించుకోలేదు. మిత్ర‌ప‌క్షమైన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఒవైసీకి పీఏసీ చైర్మ‌న్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేల‌ను బీఆర్ఎస్ పార్టీలో చేర‌డం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిప‌క్ష హోదా కోల్పోయింద‌ని, అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌కు పీఏసీ చైర్మ‌న్ విష‌యంలో అవ‌కాశం క‌ల్పించ‌లేద‌ని అప్ప‌ట్లో బీఆర్ఎస్ నేత‌లు పేర్కొన్నారు. ఇప్పుడు అదే విష‌యాన్ని కాంగ్రెస్ నేత‌లు గుర్తు చేస్తున్నారు. పీఏసీ చైర్మ‌న్ ఎంపిక‌కు కావాల్సిన ప‌ద‌మూడు మంది బ‌లం ఉంద‌ని కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నారు.  మ‌రోవైపు అరెక‌పూడి గాంధీ మాట్లాడుతూ.. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాన‌ని చెబుతున్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో హైకోర్టు ఆదేశాలతో అనర్హత వేటు ఎదుర్కొనే అవకాశం ఉందన్న సూచనలతోనే అరికపూడి గాంధీ తెలివిగా ఈ వాదనను తెరపైకి తీసుకొచ్చారు. దీంతో బీఆర్ఎస్ పరిస్థితి మింగలేక..కక్కలేక అన్నట్లుగా తయారైంది. అరెక‌పూడి గాంధీ వివాదరహితుడు. ఆయన తెలుగుదేశంలో ఉన్న సమయంలో కానీ, ఆ తరువాత బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కానీ  ఎలాంటి వివాదాల జోలికీ వెళ్ల‌కుండా  పార్టీ ఆదేశాల మేరకే నడుచుకున్నారన్న పేరుంది.  అయితే, రెండో ద‌ఫా బీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని గాంధీ ఆశించారు. మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న గాంధీ.. తన సామాజిక వర్గం కోటాలో త‌న‌ను కాద‌ని జూనియర్‌కు మంత్రిగా అవకాశం ఇవ్వడం జీర్ణించుకోలేక పోయార‌ని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆ స‌మ‌యంలో అధిష్టానం తీరుపై అల‌క‌బూన‌డంతో కేటీఆర్ రంగంలోకిదిగి బుజ్జ‌గించిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. అన్ని అర్హ‌త‌లూ ఉన్నా.. త‌న‌కు బీఆర్ఎస్ పార్టీలో త‌గిన ప్రాధాన్య‌త ద‌క్క‌లేద‌ని గాంధీ అసంతృప్తిగా ఉంటూ వ‌చ్చారు. ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబు నాయుడు అరెస్టు విష‌యంలో కేటీఆర్ వ్యాఖ్య‌ల‌ను పార్టీ నేత‌ల వ‌ద్ద గాంధీ త‌ప్పుబ‌ట్టార‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి మ‌రోసారి ఎమ్మెల్యేగా గాంధీ విజ‌యం సాధించారు. త‌న‌కు స‌న్నిహితుడైన రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డంతో గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాడ‌ని మొద‌టి నుంచి ప్ర‌చారం జ‌రిగింది. ఇటీవ‌ల ఆయ‌న రేవంత్‌రెడ్డిని క‌ల‌వ‌డంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే, తాజాగా గాంధీ మాట్లాడుతూ.. అభివృద్ధిలో భాగ‌స్వాముడిని అయ్యేందుకు, రేవంత్ పిలుపు మేర‌కు ఆయ‌న్ను క‌లిసి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం జ‌రిగింద‌ని, కానీ, కాంగ్రెస్ పార్టీలో చేర‌లేద‌ని గాంధీ చెప్ప‌డం తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.