వైసీపీ నేతలకు నో యాంటిసిపేటరీ బెయిల్
posted on Sep 4, 2024 @ 11:25AM
తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిలు దాఖలు చేసుకున్న వైసీపీ నేతలకు చుక్కెదురైంది. అలాగే చంద్రబాబు నివాసంపై దాడి కేసులోనూ నిందితులకు ముందస్తు బెయిలు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది.
ఈ కేసుల్లో నిందితులైన దేవినేని అవినాష్, నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాంలు తమను అరెస్టు చేయకుండా యాంటిసిపేటరీ బెయిలు కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వీరిలో చంద్రబాబు నివాసంపై దాడి కేసులో దేవినేని అవినాష్, నందిగం సురేష్ నిందితులు కాగా, తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాంలు నిందితులు.
వీరి యాంటిసిపేటరీ బెయిల్ పై హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఈ కేసుల్లో ముందస్తు బెయిలును హైకోర్టు నిరాకరించింది. దీంతో తాము సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామనీ, అంత వరకూ అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలనీ వైసీపీ నేతలు కోరారు. అయితే అందుకు ప్రభుత్వ తరఫు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. ఇరు పక్షాల వాదనలూ విన్న హైకోర్టు ఈ విషయంపై తన నిర్ణయాన్ని మధ్యాహ్నం ప్రకటించనున్నట్లు పేర్కొంది.